Saturday, October 15, 2011

"సూపర్" - కాదు కాదు.. "థూ..పర్'

ఓంకార్ అనే ఒక "జీవి" టీవీ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ, నాకు రియాలిటీ షోల పేరు వింటేనే పొట్టలో ఒక లాంటి వికారం మొదలౌతోంది. పాడుతా తీయగా తప్ప నేను పెద్దగా ఇంకే కార్యక్రమాన్ని ఈ మధ్య చూడడమే లేదు. (వార్తా చానళ్ళు తప్పవు లెండి). ఎప్పుడైనా మరీ ఖాళీగా ఉంటే సాయికుమర్ వావ్ చూసే వాణ్ణి. కానీ "ఒదలను బొమ్మాళీ" చూసినప్పుడల్లా "మానవాతీతుడైన సుమన్ బాబు" ఎపిసోడ్ గుర్తొచ్చి ఈ మధ్య వావ్ కి కూడ వావ్ చెప్పేసాను. ఇప్పుడు ఈ ఉపోధ్ఘాతం అంతా ఎందుకంటే,.. మొన్నెప్పుడో చిన్న పని మీద బయటకు వెళ్ళి తిరువాన్మయూర్ (మీకు నోరు తిరగకపోతే అడయార్ అని సులువుగా చెప్పేసుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు) సమీపంలో "అభిరుచి" రెస్టారంట్ లో మాంచి ఆంధ్రా (అమ్మో ఈ మాటే బూతు అయిపోయింది ఈ మధ్య) భోజనం లాగించి ఇంటికి వచ్చామా, నిద్రకు ఉపక్రమించే సమయం ఇంకా అవ్వక టీవీ చానళ్ళ మధ్య మేరథాన్ చేస్తుంటే, మధ్యలో ఈ-టీవీ లో సూపర్ తగిలింది. పాపం సినిమాల్లేని సెలబ్రిటీలు ఇలా పావలాకి అర్థకీ అష్ట కష్టాలూ పడుతున్నారే అని జాలితో కూడిన ఆసక్తితో అయిదే అయిదు నిమషాలు ఆ ప్రోగ్రాం చూడడం జరిగింది. మీరు నమ్మరు ఆ కాస్త కనికరానికే కడుపులో సునామి వచ్చినంత పనయ్యింది. నేను హీరోగా పరిగణించక పోయినా హీరో గా పిలవబడే నవదీప్ తిక్క తిక్క యాంకరింగు.. ముందే అనుకున్నట్టు ఎలాగోలా నాలుగు రాళ్ళు సంపాదించుకోడానికి సిద్ధపడ్డ ఓ అరడజను మంది అమ్మాయిలు. ఒకరిద్దరి పేర్లు తెలుసు.. మరికొందరి మొహాలు చూసిన గుర్తు. ఆ రోజు వాళ్ళు చెయ్యాల్సిన సాహసం ఏంటయ్యా అంటే - ఓ గ్లాస్ పెట్టెలో పడుకోవాలి, (వాళ్ళు వేసుకున్న కురచ డ్రెస్సులతోనే అని నేను మీకు వేరేగా చెప్పనక్కర్లేదు) వాళ్ళమీదా, అటూ-ఇటూ, ఏదో అహారన్ని పడేసి, ఆ డబ్బాలోకి ఎలుకల్ని వదిలారు.. వాళ్ళు కదలకుండా ఎంతసేపు ఉంటే అన్ని పాయింట్లో మరొకటో.. దానికీ ఏవో లెక్కలు. అంటే ఎన్ని ఎలుకల్ని భరిస్తే అన్ని మార్కులు. ఇది ఆ ఎపిసోడ్ యొక్క సారాంశం. దానికితోడు నవదీప్ సెటైర్లు, పోజు (దాన్నే ఈ మధ్య షోల్లో యాటిట్యూడ్ అని ఏదో గొప్పగా చెప్తున్నారు లెండి, తెలుగులో అయితే బలుపు అని అనే వాళ్ళం), అమ్మాయిల భావోద్వేగాలు, ఎలుకల ఎక్స్ ప్రెషన్స్...

రాయడానికీ.. చదవడానికే ఇంత ఘోరం గా ఉంటే చూసినప్పుడు నా పరిస్థితి మీరు పెద్ద మనసుతో అర్థంచేసుకోవాలి. (అది కూడా కడుపునిండా భోజనం చేసాక)అంటే మరి ఓంకార్ అన్నయ్య ప్రోగ్రాములకి అలవాటు పడి, సుమన్ బాబు ఫాన్స్ గా ఎవరైనా ఇప్పటికే మారిపోయుంటే, అలాంటి రియల్ ప్రేక్షకులకి ఈ ప్రోగ్రాం లో పెద్ద అన్యాయం ఏమీ కనిపించకపోవచ్చు. నేను కాదనలేను. వాళ్ళకి నా పూర్తి సానుభూతి. కానీ నాలాంటి ఓ సామాన్య పౌరుడికి మాత్రం ఇది క్రితం సంవత్సరం తిన్న కాకినాడ కాజాని కూడా బయటకు తెచ్చేస్తుంది. అనుమానమే లేదు.

అసలు ఇలాంటి అపురూపమైన దిక్కుమాలిన ఆలోచనలు మన టీవీ చానళ్ళకి ఎలా వస్తున్నాయో, ఏ AXN నుంచో కాపీ చేసారేమో తెలీదు. ఇందులో నాకు ధైర్య సాహసాలకంటే, సాడిజం, అసహ్యం, జుగుప్సే కనిపించాయి. మరి ఇప్పుడు ఆ ఫీలింగ్సే TRP కి బాగా ముఖ్యం ఏమో లెండి, మనకేం తెలుసు మనకేం కావాలో. పోనీ అలాంటి భావాలతోనే ప్రోగ్రాం చెయ్యాలనుకున్నా, ఈ ఎలుకల్నీ, పాముల్నీ ఇబ్బంది పెట్టడానికి బదులు, ఇంద్రనాగ్ దర్శకత్వంలో (బహుశా దర్శకత్వ పర్యవేక్షణలో) వచ్చిన ఏ ఈ-టీవీ ప్రీమియర్ షోనో పూర్తిగా చూస్తే ఇన్ని మార్కులు, మళ్ళీ చూస్తే ఇన్ని బహుమతులు.. ఇలాంటివి ఏవో పెట్టుకోవచ్చు. లేక, సాక్షి టీవీ లో దివంగత నేత, ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి.. అయ్యో సారీ.. రాజశేఖర్ రెడ్డి పేరు ఒక రోజులో ఎన్ని సార్లు నెమరు వేస్తారో లెక్కపెట్టడం... మరీ కాకపోతే, సుబ్బరామి రెడ్డి అవార్డు ఫంక్షన్ పూర్తిగా చూడ్డం.. ఇలాంటి క్లిష్టమైన పరీక్షలు పెట్టచ్చు. ఎవరు కాదన్నారు ? మనసుంటే మంట పుట్టించే మార్గాలెన్నో. అవన్నీ వదిలేసి మూగప్రాణుల వెంట పడడం ఎంతవరకు అవసరం..


నన్నడిగితే వీటన్నింటికంటే గొప్ప అవిడియాలు చెప్తాను,సంక్రాంతి పండక్కి రైలు టిక్కెట్టు సంపాదించడం, రైతు సోదరులకోసం ఎరువు, విత్తనాలు లైన్లో నిలబడి సాధించడం, KCR గారి మనవడు బడికి వెళ్ళాడో లేదో రహస్యంగా పసిగట్టడం.. ఇలాంటి పోటీలు ఎన్నైనా పెట్టచ్చు. మనకి మంచి ఎంటర్ టైన్మెంటు, అంతకు మించిన సామజిక స్పృహ, చైతన్యం. మన సో కాల్డ్ రియాలిటీ షోలకి ఇలాంటి విలక్షణమైన కాన్సెప్ట్లు ఎందుకు తట్టడం లేదంటారు, అందుకే మరి కిడ్నీ తో ఆలోచించాలి అంటాను.. ;-)

Sunday, October 9, 2011

మంత్రిగారి పదోతరగతి కష్టాలు!!

కష్టాలన్నవి రకరకాలు. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేవి పగవాడికి, పక్కింటివాడికి కూడా రాకూడనివి. పాండిచ్చేరి లో ఓ మంత్రిగారు, పెళ్ళి శుభలేఖ లో తన పేరు చివర BA అని రాసుకున్నారని ఈనాడు పేపర్లో ఈ రోజు వార్త. దాంట్లో అంత విషయం ఏముంది, రాఘవేంద్ర రావు గారు నుంచి రాహుల్ గాంధీ వరకూ అందరూ ఎక్కడో దగ్గర ఇలా తోకలు తగిలించుకుని మురిసే వారేగా. కొంతమందికి అదో సెంటిమెంటు.. మరికొందరికి అది ఆయింటుమెంటు. ఇక్కడ విడ్డూరమల్లా, ఆ మంత్రిగారు మొన్నామధ్యే పదో తరగతి పరీక్షలు రాసారు. (బహుశా, రాయించారు) పది పరీక్షలు రాసిన నాలుగు రొజులకే BA అని పెట్టేసుకోవడం మరి కొంచం అసమంజసమే లెండి. పోనీ పది పరీక్షలైన ఏదో పద్ధతిగా రాసాడా అంటే (ఈయన ప్రావీణ్యానికి మెచ్చి స్కూల్ వాళ్ళే BA పట్టా ఇచ్చేసారు అని మనం సరిపెట్టుకోడానికి..), అదీ లేదు, ధరఖాస్తులో ఆయన ఇచ్చిన తమిళనాడు దిండివనం అడ్రెస్ ఈయంది కాదు, ఎవరో ఉపాధ్యాయుడిది, పరీక్ష రాసింది కూడ మంత్రిగారు కాదు అని అన్ని పక్షాలూ ఇప్పటికే హడావిడి మొదలు పెట్టాయి. దొంగ చిరునామా ఇచ్చి విద్యాశాఖని మోసం చెసినందుకు సంబంధిత DEO గారు కేసు నమోదు చెయ్యమని పోలీసులకి సూచించారు కూడా. ఇక్కడో రాజకీయ కోణం కూడా ఉంది, తెలకపల్లి రవి గారి పుణ్యమా అని ఈమధ్య నాకు ఈ కోణం బాగా అర్థమైపోతోంది సుమండీ!!, పాండీ అధికార పార్టీకీ ఇక్కడ మా అమ్మ ప్రభుత్వానికి ఈ మధ్య ఏ గడ్డీ వేయకుండానే భగ్గుమంటోంది. మరి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ పాండీ మంత్రి అయినా లేక కనీసం మంత్రి బామ్మర్ది అయినా ఇలాంటి గడ్డి తినే పనులు అదీ ముఖ్యంగా మా గడ్డ మీదే చెస్తే అమ్మ వూరుకుంటుందా.. ? ఆ ప్రశ్నకి సమాధనమే ఇది. ఇప్పుడు ఏ విలేకరి అయినా ఊసుపోక మంత్రిగారి సమాధాన పత్రాలని స.హ.చట్టం క్రింద సాధించాడనుకోండి, (పొరపాటున మన మంత్రిగారే రాసుంటే),వాళ్ళావిడ అవి చదివితే ఆయన ఆయన వైవాహిక జీవితం అతలాకుతలం అయిపోదూ. ఇందులో ఇందులో మనకో నీతి ఉంది, ఏ దిక్కుమాలినిన విశ్వవిద్యాలయపు BA (డాక్టరేటు ? ) అయినా కొనుక్కోవచ్చు గానీ, పదోతరగతి మాత్రం మనం రాయల్సిందే. బ్రమ్మి చెప్పినట్టు నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఎంత తాగితే అంత బలం, అందుకే మరి తాగాల్సిన యేజులోనే అది తాగాలి.

ఇదంతా చదివాక మీకో అనుమానం వచ్చే అవకాశం ఉంది, ఇన్ని చిక్కుల్లో బుక్కు అయిన ఆ మంత్రిగారు పుదుచ్చేరిలో వెలగబెడుతున్న శాఖ ఏంటా అని ? ఇంకేదో అయితే అసలు ఇంత పోస్ట్ ఎందుకు.., మీకీ టైం వేస్టెందుకు... విద్యా శాఖే.. ;-)(దీన్నే ఏడ్వలేక నవ్వడం అంటారు)

అయ్యయ్యో, ఇంతారాసి ఆయన పేరు రాయడం మరచిపోయానే. అమాత్యుని పేరు - "కళ్యాణ సుందరం". (ఎంత సందర్భోచితంగా ఉందో... )