Friday, November 4, 2011

వేపకాయంత వెర్రి (అమ్మ మార్కు పాలన -2)

ఎక్కడైనా రాజు బలవంతుడే (మన సింగ్ గారు తప్ప), కానీ నాకు తెలిసిన సామెత ప్రకారం మొండి వాడు రాజు కంటే బలవంతుడు. మరి రాజే మొండివాడు అయితే, ఇంక చెప్పడానికి ఏముంది, ఆయన పట్టుకున్న కుందేలుకి మూడు కాళ్ళన్నా, ఏడు కళ్ళన్నా మనం ఒప్పుకుని తప్పుకోవాల్సిందే. సరిగ్గా మా తమిళ రాజకీయాలు అలానే ఉన్నాయి, అవినీతిలో ఎవరికి ఎవరూ తీసిపోరు, కానీ మొండిగా ప్రవర్తించడం లో అమ్మకి ఎవరూ సాటి లేరు. అయితే గియితే మాయావతి ఎమైన దగ్గర్లో ఉంటుందేమో కానీ, జయ లలిత మొండితనానికి కాస్త అహంకారం కూడా కలిపి వొదుల్తుంది మన పైకి. ఇప్పుడు ఈ విశ్లేషణ అంతా ఎందుకంటే.. మీకు ఆమధ్య ఎప్పుడో చెప్పినట్టు, కరుణానిధి ఎంతో మక్కువతో ఆర్భాటంగా కట్టుకున్న సెక్రటేరియేట్ ని జయ ప్రభుత్వ ఆసుపత్రి గా మార్చేసింది. (అంటే నా వరకూ నేను అక్కడ ఏ డాక్టరినీ, నర్సమ్మనీ ఇంతవకూ చూడలేదు) ఇంతా తగలేసి మళ్ళీ పాత భవనం లో పాలన ఏంటి అని ఎవరో కోర్టులో కేసు కూడా వేసారు. పోనీ అదేదో కరుణ ముద్దుల ప్రాజెక్ట్ సో అమ్మ తన మార్కు రివెంజ్ తీర్చుకుంది అని సద్దుకుపోయాం. మెత్తగా ఉంటే మొత్త బుద్దేసిందని, ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది అమ్మ. DMK పాలనలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అన్నా గ్రంథాలయాన్ని పిల్లల ఆసుపత్రి చేస్తుందిట.. నాకెందుకో ఇది మరీ వెర్రిలా తోస్తోంది. కరుణానిధి సొంత ఆస్తులేవైనా పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలగానో, ఆసుపత్రులగానో మారిస్తే బావుంటుంది, కానీ ఇలా ఒక నిర్ధిష్టమైన ప్రయోజనం కోసం నిర్మింపబడిన సదుపాయాల్ని వాళ్ళ వాళ్ళ రాజకీయ కారణాలకోసం, ప్రతీకారాల కోసం తగలెట్టడం ఎంత వరకూ సమంజసం. ఏ పార్టీ మోజు పడి కట్టించినా, డబ్బు ప్రజలదే కదా.. ఇక్కడ ఇంకో ఇబ్బంది ఏంటంటే, DMK పాలనలో అందరూ ప్రభువులే, (తాతగారి కుటుంబం అంత పెద్దది మరి), అదే జయ పద్దతి చూస్తే, ఆవిడ ఏంచెప్తే అదే వేదం. మరో మాట అడిగే వాడూ, అడ్డు తగిలే వాడూ ఎవరూ లేరు. పొరపాటున ఎవడైన తగిలేడా, వాడు మళ్ళీ మనకి పార్టీలో ఎక్కడా కనిపించడు. ప్రతి పక్షం అంటారా, సగం జైల్లోనే ఉంది. సరిగ్గ్గా రెండ్రోజుల క్రితమే మా ఆఫీసు అద్దాల కిటికి లోంచి దూరంగా, ఠీవిగా కనిపిస్తున్న ఆ గ్రంథాలయాన్ని చూసి, తెగ ముచ్చట పడిపోయి, ఈ వారాంతంలో అయినా వెళ్ళి ఒ లుక్కు వేయాలి అని డిసైడ్ అయ్యా (మా ఆవిడ చాన్నాళ్ళ క్రితమే వెళ్ళి, గ్రంథాలయం బావుంది, పుస్తకాలుంటే ఇంకా బావుంటుంది అని సర్టిఫికేట్ కూడా ఇచ్చింది), వెంటనే మరుసటి రోజు పేపర్ లో ఈ వార్త. నాకైతే చిర్రెత్తుకొచ్చింది. జయలలిత కి భారత రత్న డిమాండ్ చేసినా ఇంత బాధపడేవాణ్ణి కాను.. ;-) పిల్లల ఆసుపత్రి పెట్టడం వరకూ మంచి ఆలోచనే, ఎవరు కాదంటారు (ఆవిడకి పిల్లల మీద ఉన్న మమకారం అలాంటిది మరి, దత్త పుత్రుని పెళ్ళికి అమ్మ ఖర్చు చేసిన వందకోట్లు ఎవరూ మర్చిపోలేదు.. ), కానీ దానికి ఈ గ్రంథాలయం తప్ప మరే భవంతీ దొరకలేదా ? తాతగారి పరిపాలనలో ఏదో పొరపాటున చేసిన మంచి పనుల్లో ఈ లైబ్రరీ ఒకటి, దాన్ని చూసినప్పుడల్లా అమ్మకి కడుపులో వికారం గా ఉంటోందేమో మరి తెలీదు నాకు. పొట్టలో తిప్పితే తిప్పింది, కావాలంటే లైబ్రరీ పేరు మార్చేయమనండి, కాదు కూడదు అంటే ముఖ ద్వారాన్ని మరో వైపుకి మార్చుకోవచ్చు, లేక ముగ్గురు భార్యలు, ముప్పై మంది సంతానం ఉన్న వృద్దులకి "ప్రవేశం లేదు" అని బోర్డు పెట్టమనండి.. కానీ అసలుకే ఎసరు పెట్టెస్తే ఎలా .. ఇప్పుడు పార్టీలు మారినప్పుడు ఏవో బస్సు/ఆటో రంగులు, అఫీసు గోడల మీద ఫొటోలు, వగైరాలు మార్చుకోవచ్చు, మనం కాదన్నామా ? కానీ మరీ ఆర్టీసీ బస్సుని చూపించి, రేపటినుంచి ఇది ఏనుగు, ఎక్కి వూరేగు అంటే ఎలా ? ఆటో ని విమానం అంటే, "అయితే ఓ.కే" అంటూ వైజాగ్ ఎగిరిపోలేం కదా.. కొంచం అయినా లాజిక్ ఉండాలా అక్కర్లేదా ?

మళ్ళీ మొదటి మాటకొస్తే, మాకు రాజు లేడు కానీ.. ఒక జగ మొండి రాణీ మాత్రం ఉంది.. ఆవిడకి వేపకాయంత వెర్రి కూడా.. (అంటే మా తమిళ నాడులో వేపకాయలు కొంచం పెద్దగా ఉంటాయి లెండి) ఏదో ఒక మంచి రోజు చూసి ఆవిడ సెంట్రల్ రైల్వే స్టేషన్ని విమానాశ్రయం గానూ, వండలూరు జూనేమో అసెంబ్లీగానూ మార్చేస్తుంది. నాకు ఏ అనుమానం లేదు. ఈవిడ తిక్క తింగరి పనులతో, నేను ఫుల్లుగా హర్టెడ్... ఐ వాంట్ ఓదార్పు రైట్ నౌ.

(ఈ విషయాన్ని నేను అంత తేలిగ్గా వదలను.. ఏదో ఒక రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచీ రాత్రి ఎనిమిదిన్నర వరకూ, మా ఆవిడ భాషలో చెప్పాలంటే అభిషేకం నుంచీ మొగలి రేకుల వరకూ, నిరాహార దీక్ష చేసి నా నిరసనని మా ఆవిడకీ మరియు ఈ మొండి ప్రభుత్వానికీ తెలియ చెయాలని గాట్టిగా నిశ్చయించుకున్నాను)

2 comments:

  1. ఓహో మీకు ఓదార్పు కావాలా ? మా జగన్ రెడీ

    ReplyDelete
  2. Flashback lo ipatti library vunna place lo ma AMMA secretrait plan chesindi...avida ala velamgane villochi danni library chesaru...lekapote city lo antha place ekkadidi library ki....
    danni ala vadileste ivvida guaravam em megulutundi ani bayapadutondemo...

    ReplyDelete