Friday, December 30, 2011

థానే తుఫాను

(దీన్ని కవితగా కాక, కేవలం నా స్పందనగా చూడగలరు. అక్షరాలు ఎన్నో చెప్పాలనుకుంటాయి, కొన్నే చెప్పగల్గుతాయి..)

థానే తుఫాను

వర్షం జోరు తగ్గనే లేదు..
ఈదురుగాలి హోరు ఆగనే లేదు.
తుఫాను తాకిడికి రేయి పాపం బెదిరిపోయింది.
కానీ ఉదయభానుడు విశ్రమిస్తాడా ?
అంధకారాన్ని అలానే ఉండిపోనిస్తాడా.. ?
లేదు..
ఉధృతి మీదున్న సాగరాన్ని చీలుస్తూ..
కానరాని వినీలంపై తనదైన సంతకం చేస్తూ..
లోకాన్ని తెల్లని వెలుగుతో నింపేందుకు ఉదయిస్తాడు.
మేఘ ఘర్జనలు రవికిరణాన్ని అడ్డగించాయేమో..
కాల గమనాన్ని కాదు..

ప్రకృతి చేసిన భీభత్సానికి బ్రతుకు భయపడిందేమో..
కానీ తెలవారే సరికి గడ్డిపోచ లేచి నిటారుగా నిలబడింది..
ఆగలేని జీవన పయనానికి మార్గదర్శనం చేస్తానంది.

Sunday, December 25, 2011

కవరు స్టోరీ లో ఎందుకీ కల్తీ ?

ఈనాడు నిబద్దతనీ, నిజాయితీనీ ప్రక్కన పెడితే, తెలుగు దిన పత్రికగా అది అంతో ఇంతో ప్రమాణాలు పాటిస్తూనే ఉంది. ముఖ్యంగా, భాషా పరంగా, వార్తల విస్తృతి మరియు ముద్రణ విషయంలో. ఈనాడు మార్కు వార్తా విహారానికి నేను ఎప్పటినుంచో అలవాటు పడిపోయాను, అందుకే మరే పత్రిక తిరగేసిన ఏదో అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ ఈ రోజు "ఆదివారం అనుబంధం" లోని కవర్ స్టోరీ - "ఆర్థిక" ఆరోగ్యం జాగ్రత్త, చాలా నిరాశ పరచింది, చిరాకు తెప్పించింది కూడా. విషయం సముచితమైనదే, విశ్లేషణా పర్వలేదు అనిపించేలానే ఉంది, కానీ కథనంతో పాటూ ముద్రించిన ఆ చిత్రాలు అస్సలు బాగోలేవు. కొన్ని ఫొటోలు అయితే ఏదో విదేశీ మ్యాగజైన్ నుంచి కాపీ చేసారా అన్నట్టున్నాయి. ఫ్యామిలీ ఫొటో కావాలంటే, ఒక తెలుగు/భారతీయ కుటుంబపు ఫొటోయే దొరకలేదా ఈనాడు కి ? ఒక వేళ అంత సందర్భోచితమైన ఫొటో దొరక్కపోయినా, మంచి చిత్రాన్ని తామే గీయించుకోవచ్చు కదా. ఆమాత్రం అటెన్షన్, ప్రాముఖ్యత ఇవ్వలేనప్పుడు దాన్ని కవర్ స్టోరీ గా వేయనేకూడదు. ఇది ఒక రకమైన నిర్లక్ష్యాన్నే సూచిస్తోంది. భవిష్యత్ లోనైనా ఇలాంటి విషయాల్లో ఇంకాస్త శ్రధ్ధ పెడతారని ఆశిద్దాం. (పుస్తకం వెనుక మాత్రం సుమన్ బాబుతో నలుగురి ఆడవాళ్ళ ఫొటోని మాంచి నేటివిటీతో ముద్రించారు. మన ఖర్మ అలా ఉంది, ఏంచేస్తాం..)Saturday, December 24, 2011

అబద్దాలు.. నిజాలు..

ఎవడైనా "నేను ఎప్పుడూ అబద్దమే చెప్తాను" అని సూటిగా సెలవిస్తే, మనం ఆ మాటా మరి నమ్మలేం. కానీ ఈరోజుల్లో, మనిషన్నవాడికి అబద్దాలు నిత్యావసర వస్తువుల్లాంటివి, కాస్త కష్టమైనా/ఖరీదైనా కొనుక్కోవలిసిందే, ఒద్దికగా వాడుకోవాల్సిందే. అసలు అబద్దం చెప్పలేని వాడు మగాడే కాదు అంటూ తేల్చేసాడు మిత్రుడొకడు, నిజమేనేమో. ముఖ్యం గా శ్రీమతి కళ్ళల్లోకి చూసి ఓ నిఖార్సైన అబద్దం చెప్పలేకపోతే, అది ఏం మగతనం చెప్పండి. అసలే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోందంటున్నారు, మరి మనం అబద్దాలూ చెప్పడం మానేస్తే అది ఇంకా పతనం అయిపోదూ ? మరీ ఎప్పుడైనా అడ్డంగానో, నిలువుగానో దొరికిపొయినా, మహేష్ బాబులా, "నేను అబద్దమే చెప్పాను, మోసం చెయ్యలేదు" అని డవిలాగ్ కొట్టేయచ్చు. ఇప్పుడు ఆకాశం లో సగాన్ని తక్కువ చెయ్యాలని కాదు, వాళ్ళు కూడా అడపాదడపా చెప్తూ ఉంటారు, కానీ ఈ కళలో మొగవారిదే పై చేయి అని మీకు నిజంగా చెప్పేస్తున్నాను. అసలు చాలామంది తల్లులు వాళ్ళ భర్తలు చెప్పే అబద్దాలనే పిల్లలకి కాశీ మజిలీ కథలుగా చెప్పేస్తున్నారేమో అని నా ప్రగాఢ విశ్వాసం. మొన్న వారాంతంలో వైజాగ్ వెళ్ళినప్పుడు, మా అన్నయ్య కొడుకు, అయిదేళ్ళవాడు ఇట్టే నన్ను బురిడీ కొట్టించేసాడు, చాలా నిజాయితీగా విజ్జి బాబాయ్.. విజ్జి బాబాయ్.. మా స్కూల్ పేరు మారిపోయింది, అంటే, నేను అంతకంటే నిజాయితీగా నమ్మేసా. (వాడు, వాడి US ఇంగ్లీష్ స్లాంగ్ లొనే అన్నాడండోయ్) అదో సరదా అబద్దం అన్నమాట. ఏదైనా, ఈ పువ్వు అన్నది ఏదైతే ఉందో, అది అర్బన్ అయినా సరే, రూరల్ అయినా సరే, అది పుట్టగానే పరిమళిస్తుంది. (ఈ మాట అన్నది మన CM కిరణ్ అని మీరు ఇట్టే పట్టేస్తారు, నాకు తెలుసు)

ఓకే ఈ ఉపోధ్ఘాతం చాలు, ఇంక అసలు విషయం లోకి వచ్చేద్దాం. ఇంతకీ నేను ఈ టపా లో చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం చూసినవి, విన్నవి, చదివినవి, వగైరాలు.. అన్నీ నిజాలైపోనక్కర్లేదు, అందువల్ల మనం కేర్ఫుల్ గా ఉండకపోతే అబాసు పాలైపోతాం. చూసిందంతా నిజం కాదని మనకి తెలుగు సినిమాల దయ వల్ల ఎప్పుడో తెలిసిపోయింది, విన్నవి అసలే కాదు, మన నాయకుల పుణ్యమా అని ఆ విషయంలో నాకు బాగా క్లారిటీ వచ్చేసింది. (ఆ గొంతు అంబటి రాంబాబుది కాదంటే నమ్మరేం.. మీరు మరీ మొండి ఘఠం లా ఉన్నారు) ఒకటి మాత్రం గుర్తు పెట్టేసుకోండి, నిజమన్నది నీరా రాడియా గొంతులా క్లియర్ గా ఉంటుంది, మనకి వీజీ గా తెలిసిపోతుంది. ఇంక చదివే అబద్దాల విషయానికొస్తే, నాకు చిన్నప్పటినుంచి ఉన్న ఒక అనర్ధపు అలవాటు, చదివిందంతా నిజం అని నమ్మేయడం. పుస్తకాల్లో, పత్రికల్లో, ప్రింట్లో ఉన్నది అంతా నూరుపాళ్ళు సత్యమే అనీ, సత్యమేవ జయతే అని గుడ్డిగా ఫిక్స్ అయిపోతుంటాను. అది ఎంత రిస్కో చూడండి మరి. మల్లాది చెప్పాడని ఆత్మలు కోకోకోలా తాగవు కదా, యండమూరి అన్నాడని ఆరో మెట్టు తరువాత క్రిందకి దూకేయ్యలేం కదా. ఇంక పత్రికలు గురించి నేను మీకు చెప్పాలా.. ఎప్పుడో పొరపాటున ఒకటి అరా అసలు వార్తలు రాస్తాయి, మిగతావన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు, లేక ప్రచారం చెయ్యడానికి కంకణం కట్టుకున్న అబద్దాలు. ఏంచెప్తాం, రాసే వాడికి చదివే వాడు ఎప్పుడూ లోకువే. ఈ వివరణలో టీవీ చానల్స్ జోలుకి కావాలనే వెళ్ళడం లేదు, వెళ్తే ఈ రోజంతా నేను టైపు చేస్తూనే కూర్చోవాలి.

ఫ్రెండ్ షిప్ కొద్దీ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మీకు ఈ-మెయిలు ఖాతా ఉంటే, జాగ్రత్తగా ఉండండి, ఫార్వార్డ్స్ పేరుతో మీకు వచ్చే మెయిల్స్ లో (మీ స్నేహితులో, బంధువులో పంపినవి కూడా) సగానికి సగం అబద్దాలే, అవన్నీ నిక్కచ్చిగా నమ్మేసి బుర్ర పాడు చేసుకోకండి. ముఖ్యం గా అఫీసుల్లో ఖాళీగా కూర్చునే IT జనాలు ఇలా మెయిల్స్ ఫార్వార్డ్ చేస్తూనే ఉంటారు, అది వాళ్ళ వ్యసనం, ఆ కార్యక్రమం లోక కళ్యాణం కొసమే అని వాళ్ళ ఫీలింగ్. ఏంచెప్పగలం. కానీ విషయం నిజానిజాలు కొంచం చెక్ చేసి పంపడం మంచిది. మీకు కొన్ని ఈ-మెయిలు ఉదాహరణలు చెప్తాను, మీ కంటపడే కొన్ని నిజాలు (అసలు సిసలు అబద్దాలు) ఎలా ఉంటాయో..

మీరు కాగితం కప్పులో టీ తాగుతున్నారా, అంతే.. మీ ఆరోగ్యం ఇంక హాంఫట్టే.. (అసలు ఇన్నాళ్ళూ ఎలా బ్రతికి బట్టకట్టేమా అని నా అనుమానం)

మొన్న నాసా తీసిన ఫొటోల్లో బుధగ్రహం మీద ఒక ఆవిడ కనిపించింది,.. (బహుశా ఇంటి ముందు ముగ్గేస్తూ ?)

మీరు ఈ ఈ-మెయిలు ఎంతమందికి ఫార్వార్డ్ చేస్తే ఫలానా కంపెనీ (మైక్రోసాఫ్ట్, AT&T, వగైరాలు) మీకు అంత డబ్బిస్తుంది. (ఆ డబ్బుతోనే నేను మా పిల్లకి పెళ్ళి చేసా.. ;-))

మొన్న సునామి తరువాత ఒక సాగర కన్య ఎగ్మోర్ మ్యూజియం లో కొలువు తీరింది, ఇదీ ఫొటో. (ప్రక్కనే వెంకటేష్ కూడా ఉండాలే.. )

మరో వారంలో ఆకాశం లో వింత, సూర్యుడి ప్రక్కనే మరో సూర్యుడు కనిపిస్తాడు. (రాహుల్ గాంధీ కాదు కదా.. )

ఈ క్రింది ఫొటోలోని ఇల్లు రజినీ కాంత్ ది, లేక 2G రాజాది.. లేక జగన్ ది.. (రేపు సాక్షి లో అది రామోజీది)

స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్ల ధనం వివరాలు. సోనియా గాంధీ అకౌంట్ నంబరు తో సహా.. (నామినీ మీరే.. ;-))

KFC లో వాడేది చికెనే కాదు

WTC కూలిపోతున్నప్పుడో, ఈ మధ్యే జరిగిన విమన ప్రమాదం లోనో తీసిన ఫొటోలు. (బాగా చూస్తే మీకు ఒకరిద్దరు ఇంగ్లీషు సీరియల్ నటులు కనిపిస్తారు)

లాటరీలు, వారసులు లేని ఆస్థులు, వ్యాపార ప్రపోజల్స్, ఇవన్నీ మామోలే.


ఇవి కాకుండా, కొన్ని సగం నిజాలు కూడా ఉంటాయి, అదేదో పండు తింటే కేన్సర్ రాదనీ, దగ్గితే గుండె ఇంక ఆగమన్నా ఆగదని, మంచినీళ్ళతోనే/నిమ్మరసంతోనే అన్ని వ్యాధులూ తగ్గిపోతాయనీ.. ఇలాంటివి కూడా. ఇవి పూర్తిగా అబద్దాలూ కాదు, అలా అని నిజాలూ కాదు. ఇవి ఇంకా ప్రమాదకరం, విషయం మీద పూర్తి అవగాహన లేకుండా పాటిస్తే.

మీకు అనుమానం వచ్చినపుడు, ఒకసారి గూగుల్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది అసలు విషయం. మీకు మరీ ఎక్కువ వివరాలు కావాలంటే ఈ వెబ్సైట్స్ కూడా చూడచ్చు, ఇలాంటి అబద్దాల్లోని నిజాలు చెప్పే సైట్స్ ఇవి -
http://urbanlegends.about.com/
http://www.hoax-slayer.com/

మరి అవి కూడా అబద్దమే చెప్తే, మనల్ని ఆ లోక్పాల్ బిల్లు కూడా కాపాడలేదు. మళ్ళీ మొదట చెప్పిన విషయానికి వస్తే, గడచిన నాలుగేళ్ళలో (పెళ్ళయ్యాక అని చదువుకోండి) నేను తెలుసుకున్న నిజం ఏంటంటే, అబద్దాన్ని నిజం అని చెప్పడం కన్నా, ఒక్కోసారి నిజాన్ని నిజం అని నిరూపించడమే కష్టం అని. ఏంచేస్తాం జగన్ కాలం.

Sunday, December 11, 2011

చెన్నైలో అద్దె ఇల్లు

ఆరోగ్య పరంగా కొంచం మెరుగ్గానే ఉన్నా, ఇంకా పూర్తి స్థాయి ఎనర్జీ లేకపోవడం వల్ల, బ్లాగు కి కాస్త దూరంగానే ఉంటున్నాను. అప్పుడప్పుడు నా ఆసక్తి మీద నాకే అనుమానంగా ఉంది కూడా. కానీ ఈ మధ్య నా మనసుని తెగ బాధించేస్తున్న అద్దె ఇళ్ళ విషయం మీ అందరితోనూ పంచుకోవాలని మొదలుపెట్టాను. కొన్ని కారణాల వల్ల, ఇంకొంత కాలం (మీరు మరికొన్ని ఏళ్ళు అని చదువుకున్నా నేను అభ్యంతరం పెట్టను) మద్రాసు మహానగరాన్నే ఉధ్ధరించాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతానికి మేము ఉన్న ఇల్లు ఆఫీసుకి దగ్గర్లోనే ఉన్నా, అది మరీ నేను పుట్టినప్పుడు కట్టింది కావడం వల్ల, ప్రతీ రోజు ఉదయమే లేచి, ఇంకా రెండవ అంతస్థులోనే ఉన్నామా ? లేక క్రిందకి వచ్చేసామా అని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. అసలే 2012 యుంగాంతం అంటున్నారు, మరీ నేడో రేపో లా ఉన్న ఇంట్లో ఎందుకు, పొనీ ఇంకొంచం గట్టిగా ఉన్న ఇంట్లోకి మారదాం అనుకుని అద్దె ఇల్లు కోసం వేట మొదలు పెట్టాం. ఈ కార్యక్రమం మరీ యుద్ధ ప్రాతిపథికన జరగకున్నా, జగన్ ఓదార్పు యాత్రలా నడుస్తొంది. ఈ ప్రక్రియలో నేను తెలుసుకున్న కొన్ని నిష్టూరమైన నిజాలు మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.

మందవేలి, ఆర్.ఏ పురం, మైలాపూర్, మొదలైనవి నాకు కాస్త అనుకూలంగా ఉండే ప్రాంతాలు. అంటే మొదటి నుంచీ మనకి మధ్యాహ్న భోజన పథకం మరి ఇంట్లోనే అలవాటు. ఈ ముఖ్య కారణం వల్ల ముందు చెప్పిన ఏరియాల్లోనే నా అన్వేషణ కొనసాగుతోంది. బ్రోకర్ వ్యవహారాలకి నేను కొంచం వ్యతిరేకం కాబట్టి, ఏదో వెబ్సైట్స్ మీదానూ, మరియు చెన్నైలో వారాంతాల్లో ఇంటికొచ్చే పొట్టి పత్రికల (మైలాపూర్ టైంస్ లాంటివి) మీదాను ఆధారపడుతున్నాం. మొన్నెప్పుడో ఒకటి రెండు ప్రకటనల్లో అద్దె మొత్తాలు చూసి, అయ్యా మేము ఇల్లు కొనడానికి కాదు, అద్దెకి మాత్రమే అడుగుతున్నాం అని గొంతు చించుకుని అరవాలనిపించింది. మన తెలుగు గొంతు ఇక్కడ ఎవడికి కావాలి అని ఆగిపోయా. ఏ హాడావిడి హంగులూ లేకుండా, మనం మామోలుగా కాలక్షేపం చేసే సో కాల్డ్ 2BHK (సుమారు 900SFT) ఇల్లుకి కూడా ఇరవై వేలకు మించి అడుగుతున్నారు అంటే నమ్మండి. దానికి తోడు పదినెలల అడ్వాన్స్. పదిహేనుకి తక్కువగా మీకు ఏదైన ఫ్లాట్ ప్రకటన కనిపించిందా, అది బహుశా ఏ రైలు ట్రాకు క్రిందనో ఉండచ్చు, టికెట్ కొనుక్కుని మరీ వెళ్ళండి. ఇంత అద్దే కడుతూ, మన గోత్రనామాలతో సహా ఓనరుగారికి అప్పజెప్పాలి. మీరు వెజిటేరియనా, ఎగ్టేరియనా, మాంసాహారులా.. అయితే, అది హలాల్ మాంసమేనా.. ఈ రేంజ్ లో మీకు ఒక ప్రశ్నావళి ఇవ్వబడుతుంది. ఇదివరకొక టపాలో నేను చెప్పినట్టు, నా స్నేహితుడొకాయనకి ఇలాంటి ప్రశ్నలే పడితే, ఈయనకి చిర్రెత్తి, అయ్యా నేను అడుగుతున్నది అద్దిల్లు ని, మీ అమ్మాయిని కాదు అని చెప్పాట్ట. పరిస్థితి చాలా విషమంగానే కనిపిస్తోంది, ఒకప్రక్క ప్రణబ్ ముఖర్జీ ధరలు దిగిపోయాయి అని మైకు వంచి మరీ చెప్తున్నా, ఇక్కడ అద్దెలు మాత్రం ఆకాశం కూడా తలెత్తి చూసే ఎత్తులో ఉన్నాయి. అవి క్రిందకు దిగాలంటే ఏ అపర భగీరధుడో కావాలేమో. (మార్పు రావాలి.. మార్పు కావాలి.. అని మాత్రం అనకండి, ఆ మాట వింటేనే నాకు కడుపులో తిప్పుతోంది)

మైలాపూరు లో ఇంకో సదుపాయం కూడా ఉంది, ఇది మన పాత బస్తీకి ఏమాత్రం తగ్గని ప్రదేశం. జన సాంద్రతని మనకి తెలిసిన సంఖ్యల్లో కొలవలేం. మీరు ఇంటిలోంచి బయటకి మరీ ఫోర్స్ గా వచ్చేస్తే, (ఏ బెండ కాయ కూర విషయంలోనో మీకూ, మీ సతీమణికీ చిన్న అభిప్రాయ బేధం వచ్చి), మీరు నేరు గా ఎదురింట్లోకి ల్యాండ్ అయ్యే ప్రమాదముంది. అంత పేద్దగా ఉంటుందనమాట రోడ్డు. ఇక్కడే ఇంకో గమ్మత్తు, ఆ ఉన్న రోడ్డు కూడా ఖాళీగా ఉంటుందని పొరపాటున కూడా అనుకోకండి, దాని నిండా రెండు నుంచీ పది చక్రాల వాహనాలు కనిపిస్తాయి. (ఈ రోడ్డు పార్కింగ్ సదుపాయాన్నే మా వాళ్ళు ప్రకటనలో ఓపెన్ పార్కింగ్ అని చెప్పుకొస్తారు) ఇంత అద్దెలూ పోస్తూ ఏమిటీ బాధ అంటారా, అప్పుడు మీరు ఏ తాంబరం కి అవతలో, కేళంబాక్కం ప్రక్కనో కనుక్కోండి (సరిగ్గా చెన్నై 35KM అని ఉన్న బోర్ద్ ప్రక్కన అన్నమాట), మీ అంచనాలకి తగ్గట్టు దొరకచ్చు. కానీ ఏ పండక్కో మీరు వూరు వెళ్ళాలనుకుంటే మాత్రం, మీ ప్రయాణానికి ముందు రోజే సెంట్రల్ కి బయలుదేరాలి మరి చూసుకోండి. మొన్నామధ్య నాకు ఇంకో గొప్ప అనుభవం అయ్యింది,మేమూ వెజ్జే అంటూ వోనర్స్ కి చెప్పాక, వాళ్ళింట్లో మాత్రం మాంచి శ్రేష్టమైన మసాలా వాసన ముక్కుకు తగిలింది.. ఇదేం విడ్డూరం అంటూ నేను ఆశ్చర్యపడబోతే, బాబూ పై పోర్షన్ మాత్రం మేము శాఖాహారులకే ఇస్తాం అని తేల్చాడాయన. ఆవిషయమై మనకి ఇబ్బంది లేకపోయినా, ఇదేదో ఉగ్రవాదం మీద పాకిస్తాన్ చేసే పోరులా ఉందే అనుకుని సైలెంట్ గా బయటపడ్డాం. గత కొన్నేళ్ళగా ఇంకో కొత్త పద్ధతి కనిపెట్టారు ఇక్కడ, ఏ పెద్దాయనో టపాకట్టేక పిల్లలేమో అమెరికాలోనో, సింగపూర్ లోనో, లేక కనీసం సిలోన్ లోనో ఉంటారాయే, ఆ పాత ఫర్నిచర్ అంతా పారేయలేరు, అలా అని అమ్మనూ లేరు. అందుకని ఇప్పుడు కొత్త బేరం, అది కూడా మనకే.. ఫర్నిషెడ్ ఇల్లు అంటారన్నమాట. అందులో మనకి పనికొచ్చేది ఏదీ ఉండదు, వాళ్ళకి పనికి రాని సరుకు తప్ప. ఈ అదనపు తలనొప్పికి మనం అద్దె మాత్రం రెండింతలు ఇచ్చుకొవాలి. మన ఫర్నిచర్ మరి ఏంచెయ్యాలి అని అంటే, ఏముంది ఏ మెరీనా తీరంలోనో వొదిలేసి రావడమే.

అప్పోసొప్పో చేసి, వెంకటేష్ బంగారాన్ని తాకట్టుపెట్టైనా, చెన్నై లోనే సొంత ఇల్లు కొనుక్కోవచ్చు కదా అంటారా.. ఇలాంటి ఆలోచనే వచ్చి మా ఆవిడ ఆమధ్య, ప్రక్కనే కడుతున్న ఓ చిన్న అపార్టుమెంట్ సముదాయానికి కి వెళ్ళి రేటు కనుక్కుంది, చదరపు అడుగ్కి కేవలం తొమ్మిది వేలు అన్నారంట.. పెద్దగా లెక్కలు వేయడం ఇష్టం లేని మా ఆవిడ ఆ కబురు నాకు చల్లగా ఫోన్లో చెప్పింది. అంటే 1000 SFT ఫ్లాటుకి 90 లక్షలన్నమాట, అంత సొమ్మే ఉంటే, ఈ ఉద్యోగం ఎందుకు, చెన్నైలో అద్దె కొంప ఎందుకు.. ఎప్పుడో టీవీ9 కి పొటీగా ఒక చానల్ పెట్టేసేవాణ్ణి. (మెరుగైన సమాజం కోసమే ;-))

ఓకే లెండి, ఈ అద్దె కష్టాలు ఇప్పట్లో తీరేవి కాదు, తీరాక ఎలానో మీకు విన్నవిస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈనాడు ఆదివారంలో సిల్లీ పాయింట్లు చదువుకుంటాను, మీరు కూడా వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేసేయ్యండి. ఒక్కటే లోటు, ఈరోజు మా టీవీ లో అతడు సినిమా రావడం లేదు.. :-(

Saturday, December 3, 2011

why this kolaveri kolaveri kolaveri di ;-)

yo boys i am singing song
blaag song
flop song
why this kolaveri kolaveri kolaveri di
why this kolaveri kolaveri kolaveri di
thought correct
why this kolaveri kolaveri kolaveri di
staart blaag
why this kolaveri..di

name la naaharivillu-u vill-u
vill-u colour-u sevenu-u
white background feel-u feel-u
faantu-u colour-u black-u

why this kolaveri kolaveri kolaveri di
why this kolaveri kolaveri kolaveri di

bright looks-u blaagu-u blaagu-u
blaagu-u clicks-u phull-u
days-u days-u dallu-u dallu-u
kaamenta la nillu

why this kolaveri kolaveri kolaveri di
why this kolaveri kolaveri kolaveri di