Sunday, December 11, 2011

చెన్నైలో అద్దె ఇల్లు

ఆరోగ్య పరంగా కొంచం మెరుగ్గానే ఉన్నా, ఇంకా పూర్తి స్థాయి ఎనర్జీ లేకపోవడం వల్ల, బ్లాగు కి కాస్త దూరంగానే ఉంటున్నాను. అప్పుడప్పుడు నా ఆసక్తి మీద నాకే అనుమానంగా ఉంది కూడా. కానీ ఈ మధ్య నా మనసుని తెగ బాధించేస్తున్న అద్దె ఇళ్ళ విషయం మీ అందరితోనూ పంచుకోవాలని మొదలుపెట్టాను. కొన్ని కారణాల వల్ల, ఇంకొంత కాలం (మీరు మరికొన్ని ఏళ్ళు అని చదువుకున్నా నేను అభ్యంతరం పెట్టను) మద్రాసు మహానగరాన్నే ఉధ్ధరించాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతానికి మేము ఉన్న ఇల్లు ఆఫీసుకి దగ్గర్లోనే ఉన్నా, అది మరీ నేను పుట్టినప్పుడు కట్టింది కావడం వల్ల, ప్రతీ రోజు ఉదయమే లేచి, ఇంకా రెండవ అంతస్థులోనే ఉన్నామా ? లేక క్రిందకి వచ్చేసామా అని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. అసలే 2012 యుంగాంతం అంటున్నారు, మరీ నేడో రేపో లా ఉన్న ఇంట్లో ఎందుకు, పొనీ ఇంకొంచం గట్టిగా ఉన్న ఇంట్లోకి మారదాం అనుకుని అద్దె ఇల్లు కోసం వేట మొదలు పెట్టాం. ఈ కార్యక్రమం మరీ యుద్ధ ప్రాతిపథికన జరగకున్నా, జగన్ ఓదార్పు యాత్రలా నడుస్తొంది. ఈ ప్రక్రియలో నేను తెలుసుకున్న కొన్ని నిష్టూరమైన నిజాలు మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.

మందవేలి, ఆర్.ఏ పురం, మైలాపూర్, మొదలైనవి నాకు కాస్త అనుకూలంగా ఉండే ప్రాంతాలు. అంటే మొదటి నుంచీ మనకి మధ్యాహ్న భోజన పథకం మరి ఇంట్లోనే అలవాటు. ఈ ముఖ్య కారణం వల్ల ముందు చెప్పిన ఏరియాల్లోనే నా అన్వేషణ కొనసాగుతోంది. బ్రోకర్ వ్యవహారాలకి నేను కొంచం వ్యతిరేకం కాబట్టి, ఏదో వెబ్సైట్స్ మీదానూ, మరియు చెన్నైలో వారాంతాల్లో ఇంటికొచ్చే పొట్టి పత్రికల (మైలాపూర్ టైంస్ లాంటివి) మీదాను ఆధారపడుతున్నాం. మొన్నెప్పుడో ఒకటి రెండు ప్రకటనల్లో అద్దె మొత్తాలు చూసి, అయ్యా మేము ఇల్లు కొనడానికి కాదు, అద్దెకి మాత్రమే అడుగుతున్నాం అని గొంతు చించుకుని అరవాలనిపించింది. మన తెలుగు గొంతు ఇక్కడ ఎవడికి కావాలి అని ఆగిపోయా. ఏ హాడావిడి హంగులూ లేకుండా, మనం మామోలుగా కాలక్షేపం చేసే సో కాల్డ్ 2BHK (సుమారు 900SFT) ఇల్లుకి కూడా ఇరవై వేలకు మించి అడుగుతున్నారు అంటే నమ్మండి. దానికి తోడు పదినెలల అడ్వాన్స్. పదిహేనుకి తక్కువగా మీకు ఏదైన ఫ్లాట్ ప్రకటన కనిపించిందా, అది బహుశా ఏ రైలు ట్రాకు క్రిందనో ఉండచ్చు, టికెట్ కొనుక్కుని మరీ వెళ్ళండి. ఇంత అద్దే కడుతూ, మన గోత్రనామాలతో సహా ఓనరుగారికి అప్పజెప్పాలి. మీరు వెజిటేరియనా, ఎగ్టేరియనా, మాంసాహారులా.. అయితే, అది హలాల్ మాంసమేనా.. ఈ రేంజ్ లో మీకు ఒక ప్రశ్నావళి ఇవ్వబడుతుంది. ఇదివరకొక టపాలో నేను చెప్పినట్టు, నా స్నేహితుడొకాయనకి ఇలాంటి ప్రశ్నలే పడితే, ఈయనకి చిర్రెత్తి, అయ్యా నేను అడుగుతున్నది అద్దిల్లు ని, మీ అమ్మాయిని కాదు అని చెప్పాట్ట. పరిస్థితి చాలా విషమంగానే కనిపిస్తోంది, ఒకప్రక్క ప్రణబ్ ముఖర్జీ ధరలు దిగిపోయాయి అని మైకు వంచి మరీ చెప్తున్నా, ఇక్కడ అద్దెలు మాత్రం ఆకాశం కూడా తలెత్తి చూసే ఎత్తులో ఉన్నాయి. అవి క్రిందకు దిగాలంటే ఏ అపర భగీరధుడో కావాలేమో. (మార్పు రావాలి.. మార్పు కావాలి.. అని మాత్రం అనకండి, ఆ మాట వింటేనే నాకు కడుపులో తిప్పుతోంది)

మైలాపూరు లో ఇంకో సదుపాయం కూడా ఉంది, ఇది మన పాత బస్తీకి ఏమాత్రం తగ్గని ప్రదేశం. జన సాంద్రతని మనకి తెలిసిన సంఖ్యల్లో కొలవలేం. మీరు ఇంటిలోంచి బయటకి మరీ ఫోర్స్ గా వచ్చేస్తే, (ఏ బెండ కాయ కూర విషయంలోనో మీకూ, మీ సతీమణికీ చిన్న అభిప్రాయ బేధం వచ్చి), మీరు నేరు గా ఎదురింట్లోకి ల్యాండ్ అయ్యే ప్రమాదముంది. అంత పేద్దగా ఉంటుందనమాట రోడ్డు. ఇక్కడే ఇంకో గమ్మత్తు, ఆ ఉన్న రోడ్డు కూడా ఖాళీగా ఉంటుందని పొరపాటున కూడా అనుకోకండి, దాని నిండా రెండు నుంచీ పది చక్రాల వాహనాలు కనిపిస్తాయి. (ఈ రోడ్డు పార్కింగ్ సదుపాయాన్నే మా వాళ్ళు ప్రకటనలో ఓపెన్ పార్కింగ్ అని చెప్పుకొస్తారు) ఇంత అద్దెలూ పోస్తూ ఏమిటీ బాధ అంటారా, అప్పుడు మీరు ఏ తాంబరం కి అవతలో, కేళంబాక్కం ప్రక్కనో కనుక్కోండి (సరిగ్గా చెన్నై 35KM అని ఉన్న బోర్ద్ ప్రక్కన అన్నమాట), మీ అంచనాలకి తగ్గట్టు దొరకచ్చు. కానీ ఏ పండక్కో మీరు వూరు వెళ్ళాలనుకుంటే మాత్రం, మీ ప్రయాణానికి ముందు రోజే సెంట్రల్ కి బయలుదేరాలి మరి చూసుకోండి. మొన్నామధ్య నాకు ఇంకో గొప్ప అనుభవం అయ్యింది,మేమూ వెజ్జే అంటూ వోనర్స్ కి చెప్పాక, వాళ్ళింట్లో మాత్రం మాంచి శ్రేష్టమైన మసాలా వాసన ముక్కుకు తగిలింది.. ఇదేం విడ్డూరం అంటూ నేను ఆశ్చర్యపడబోతే, బాబూ పై పోర్షన్ మాత్రం మేము శాఖాహారులకే ఇస్తాం అని తేల్చాడాయన. ఆవిషయమై మనకి ఇబ్బంది లేకపోయినా, ఇదేదో ఉగ్రవాదం మీద పాకిస్తాన్ చేసే పోరులా ఉందే అనుకుని సైలెంట్ గా బయటపడ్డాం. గత కొన్నేళ్ళగా ఇంకో కొత్త పద్ధతి కనిపెట్టారు ఇక్కడ, ఏ పెద్దాయనో టపాకట్టేక పిల్లలేమో అమెరికాలోనో, సింగపూర్ లోనో, లేక కనీసం సిలోన్ లోనో ఉంటారాయే, ఆ పాత ఫర్నిచర్ అంతా పారేయలేరు, అలా అని అమ్మనూ లేరు. అందుకని ఇప్పుడు కొత్త బేరం, అది కూడా మనకే.. ఫర్నిషెడ్ ఇల్లు అంటారన్నమాట. అందులో మనకి పనికొచ్చేది ఏదీ ఉండదు, వాళ్ళకి పనికి రాని సరుకు తప్ప. ఈ అదనపు తలనొప్పికి మనం అద్దె మాత్రం రెండింతలు ఇచ్చుకొవాలి. మన ఫర్నిచర్ మరి ఏంచెయ్యాలి అని అంటే, ఏముంది ఏ మెరీనా తీరంలోనో వొదిలేసి రావడమే.

అప్పోసొప్పో చేసి, వెంకటేష్ బంగారాన్ని తాకట్టుపెట్టైనా, చెన్నై లోనే సొంత ఇల్లు కొనుక్కోవచ్చు కదా అంటారా.. ఇలాంటి ఆలోచనే వచ్చి మా ఆవిడ ఆమధ్య, ప్రక్కనే కడుతున్న ఓ చిన్న అపార్టుమెంట్ సముదాయానికి కి వెళ్ళి రేటు కనుక్కుంది, చదరపు అడుగ్కి కేవలం తొమ్మిది వేలు అన్నారంట.. పెద్దగా లెక్కలు వేయడం ఇష్టం లేని మా ఆవిడ ఆ కబురు నాకు చల్లగా ఫోన్లో చెప్పింది. అంటే 1000 SFT ఫ్లాటుకి 90 లక్షలన్నమాట, అంత సొమ్మే ఉంటే, ఈ ఉద్యోగం ఎందుకు, చెన్నైలో అద్దె కొంప ఎందుకు.. ఎప్పుడో టీవీ9 కి పొటీగా ఒక చానల్ పెట్టేసేవాణ్ణి. (మెరుగైన సమాజం కోసమే ;-))

ఓకే లెండి, ఈ అద్దె కష్టాలు ఇప్పట్లో తీరేవి కాదు, తీరాక ఎలానో మీకు విన్నవిస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈనాడు ఆదివారంలో సిల్లీ పాయింట్లు చదువుకుంటాను, మీరు కూడా వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేసేయ్యండి. ఒక్కటే లోటు, ఈరోజు మా టీవీ లో అతడు సినిమా రావడం లేదు.. :-(

7 comments:

 1. హ్మ్. ఇంచుమించు అన్నిచోట్లా ఇలాగే ఉన్నాయండీ అద్దె ఇళ్ళ కష్టాలు. విషయమేదైనా మీ రచనా శైలి బాగుంటుంది. మాటీవీలో అతడు రావడం లేదా? అయ్యేపాపం.. పోనీ ఒక్కసారి సోనీటివి పెట్టి చూడండి. రోబో డబ్బింగ్ సినిమా నలభై అయిదు లక్షల తొంభై ఆరువేల నూటపదహారోసారి ఇస్తున్నాడు.

  ReplyDelete
 2. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్! నేను కూడా చెన్నై లో ఉంటున్న ఒక వలస జీవినే!

  ReplyDelete
 3. మీ ఇబ్బందుల్ని హాస్యంతో జోడించి బాగా చెప్పారు.
  "ఒక్కటే లోటు, ఈరోజు మా టీవీ లో అతడు సినిమా రావడం లేదు". :):)

  ReplyDelete
 4. స‌మ‌స్య‌ను కూడా చెణుకులతో ర‌క్తి క‌ట్టించారు.

  ReplyDelete
 5. ఈ పొస్ట్ ను రీయల్ అడ్వైజర్ పత్రికలో ప్రచురించు కోవచ్చా?
  అంగీకరిస్తే యెస్సెమెస్ ఇవ్వగలరా? మీ ఫొటొ పంపగలరు.
  కావూరి

  ReplyDelete
 6. ఓదార్పు యాత్రకి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ;-)

  కావూరి గారు, నాకెందుకండీ అభ్యంతరం.. :-) బ్లాగు పేరుతోనే ప్రచురించగలిగితే మరీ సంతోషం. ఇంకా వివరాలు కావాలంటే నా ఈ-మెయిల్ ని కాంటాక్ట్ చేయగలరు. (naaharivillu@gmail.com)

  ReplyDelete