Saturday, December 24, 2011

అబద్దాలు.. నిజాలు..

ఎవడైనా "నేను ఎప్పుడూ అబద్దమే చెప్తాను" అని సూటిగా సెలవిస్తే, మనం ఆ మాటా మరి నమ్మలేం. కానీ ఈరోజుల్లో, మనిషన్నవాడికి అబద్దాలు నిత్యావసర వస్తువుల్లాంటివి, కాస్త కష్టమైనా/ఖరీదైనా కొనుక్కోవలిసిందే, ఒద్దికగా వాడుకోవాల్సిందే. అసలు అబద్దం చెప్పలేని వాడు మగాడే కాదు అంటూ తేల్చేసాడు మిత్రుడొకడు, నిజమేనేమో. ముఖ్యం గా శ్రీమతి కళ్ళల్లోకి చూసి ఓ నిఖార్సైన అబద్దం చెప్పలేకపోతే, అది ఏం మగతనం చెప్పండి. అసలే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోందంటున్నారు, మరి మనం అబద్దాలూ చెప్పడం మానేస్తే అది ఇంకా పతనం అయిపోదూ ? మరీ ఎప్పుడైనా అడ్డంగానో, నిలువుగానో దొరికిపొయినా, మహేష్ బాబులా, "నేను అబద్దమే చెప్పాను, మోసం చెయ్యలేదు" అని డవిలాగ్ కొట్టేయచ్చు. ఇప్పుడు ఆకాశం లో సగాన్ని తక్కువ చెయ్యాలని కాదు, వాళ్ళు కూడా అడపాదడపా చెప్తూ ఉంటారు, కానీ ఈ కళలో మొగవారిదే పై చేయి అని మీకు నిజంగా చెప్పేస్తున్నాను. అసలు చాలామంది తల్లులు వాళ్ళ భర్తలు చెప్పే అబద్దాలనే పిల్లలకి కాశీ మజిలీ కథలుగా చెప్పేస్తున్నారేమో అని నా ప్రగాఢ విశ్వాసం. మొన్న వారాంతంలో వైజాగ్ వెళ్ళినప్పుడు, మా అన్నయ్య కొడుకు, అయిదేళ్ళవాడు ఇట్టే నన్ను బురిడీ కొట్టించేసాడు, చాలా నిజాయితీగా విజ్జి బాబాయ్.. విజ్జి బాబాయ్.. మా స్కూల్ పేరు మారిపోయింది, అంటే, నేను అంతకంటే నిజాయితీగా నమ్మేసా. (వాడు, వాడి US ఇంగ్లీష్ స్లాంగ్ లొనే అన్నాడండోయ్) అదో సరదా అబద్దం అన్నమాట. ఏదైనా, ఈ పువ్వు అన్నది ఏదైతే ఉందో, అది అర్బన్ అయినా సరే, రూరల్ అయినా సరే, అది పుట్టగానే పరిమళిస్తుంది. (ఈ మాట అన్నది మన CM కిరణ్ అని మీరు ఇట్టే పట్టేస్తారు, నాకు తెలుసు)

ఓకే ఈ ఉపోధ్ఘాతం చాలు, ఇంక అసలు విషయం లోకి వచ్చేద్దాం. ఇంతకీ నేను ఈ టపా లో చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం చూసినవి, విన్నవి, చదివినవి, వగైరాలు.. అన్నీ నిజాలైపోనక్కర్లేదు, అందువల్ల మనం కేర్ఫుల్ గా ఉండకపోతే అబాసు పాలైపోతాం. చూసిందంతా నిజం కాదని మనకి తెలుగు సినిమాల దయ వల్ల ఎప్పుడో తెలిసిపోయింది, విన్నవి అసలే కాదు, మన నాయకుల పుణ్యమా అని ఆ విషయంలో నాకు బాగా క్లారిటీ వచ్చేసింది. (ఆ గొంతు అంబటి రాంబాబుది కాదంటే నమ్మరేం.. మీరు మరీ మొండి ఘఠం లా ఉన్నారు) ఒకటి మాత్రం గుర్తు పెట్టేసుకోండి, నిజమన్నది నీరా రాడియా గొంతులా క్లియర్ గా ఉంటుంది, మనకి వీజీ గా తెలిసిపోతుంది. ఇంక చదివే అబద్దాల విషయానికొస్తే, నాకు చిన్నప్పటినుంచి ఉన్న ఒక అనర్ధపు అలవాటు, చదివిందంతా నిజం అని నమ్మేయడం. పుస్తకాల్లో, పత్రికల్లో, ప్రింట్లో ఉన్నది అంతా నూరుపాళ్ళు సత్యమే అనీ, సత్యమేవ జయతే అని గుడ్డిగా ఫిక్స్ అయిపోతుంటాను. అది ఎంత రిస్కో చూడండి మరి. మల్లాది చెప్పాడని ఆత్మలు కోకోకోలా తాగవు కదా, యండమూరి అన్నాడని ఆరో మెట్టు తరువాత క్రిందకి దూకేయ్యలేం కదా. ఇంక పత్రికలు గురించి నేను మీకు చెప్పాలా.. ఎప్పుడో పొరపాటున ఒకటి అరా అసలు వార్తలు రాస్తాయి, మిగతావన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు, లేక ప్రచారం చెయ్యడానికి కంకణం కట్టుకున్న అబద్దాలు. ఏంచెప్తాం, రాసే వాడికి చదివే వాడు ఎప్పుడూ లోకువే. ఈ వివరణలో టీవీ చానల్స్ జోలుకి కావాలనే వెళ్ళడం లేదు, వెళ్తే ఈ రోజంతా నేను టైపు చేస్తూనే కూర్చోవాలి.

ఫ్రెండ్ షిప్ కొద్దీ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మీకు ఈ-మెయిలు ఖాతా ఉంటే, జాగ్రత్తగా ఉండండి, ఫార్వార్డ్స్ పేరుతో మీకు వచ్చే మెయిల్స్ లో (మీ స్నేహితులో, బంధువులో పంపినవి కూడా) సగానికి సగం అబద్దాలే, అవన్నీ నిక్కచ్చిగా నమ్మేసి బుర్ర పాడు చేసుకోకండి. ముఖ్యం గా అఫీసుల్లో ఖాళీగా కూర్చునే IT జనాలు ఇలా మెయిల్స్ ఫార్వార్డ్ చేస్తూనే ఉంటారు, అది వాళ్ళ వ్యసనం, ఆ కార్యక్రమం లోక కళ్యాణం కొసమే అని వాళ్ళ ఫీలింగ్. ఏంచెప్పగలం. కానీ విషయం నిజానిజాలు కొంచం చెక్ చేసి పంపడం మంచిది. మీకు కొన్ని ఈ-మెయిలు ఉదాహరణలు చెప్తాను, మీ కంటపడే కొన్ని నిజాలు (అసలు సిసలు అబద్దాలు) ఎలా ఉంటాయో..

మీరు కాగితం కప్పులో టీ తాగుతున్నారా, అంతే.. మీ ఆరోగ్యం ఇంక హాంఫట్టే.. (అసలు ఇన్నాళ్ళూ ఎలా బ్రతికి బట్టకట్టేమా అని నా అనుమానం)

మొన్న నాసా తీసిన ఫొటోల్లో బుధగ్రహం మీద ఒక ఆవిడ కనిపించింది,.. (బహుశా ఇంటి ముందు ముగ్గేస్తూ ?)

మీరు ఈ ఈ-మెయిలు ఎంతమందికి ఫార్వార్డ్ చేస్తే ఫలానా కంపెనీ (మైక్రోసాఫ్ట్, AT&T, వగైరాలు) మీకు అంత డబ్బిస్తుంది. (ఆ డబ్బుతోనే నేను మా పిల్లకి పెళ్ళి చేసా.. ;-))

మొన్న సునామి తరువాత ఒక సాగర కన్య ఎగ్మోర్ మ్యూజియం లో కొలువు తీరింది, ఇదీ ఫొటో. (ప్రక్కనే వెంకటేష్ కూడా ఉండాలే.. )

మరో వారంలో ఆకాశం లో వింత, సూర్యుడి ప్రక్కనే మరో సూర్యుడు కనిపిస్తాడు. (రాహుల్ గాంధీ కాదు కదా.. )

ఈ క్రింది ఫొటోలోని ఇల్లు రజినీ కాంత్ ది, లేక 2G రాజాది.. లేక జగన్ ది.. (రేపు సాక్షి లో అది రామోజీది)

స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్ల ధనం వివరాలు. సోనియా గాంధీ అకౌంట్ నంబరు తో సహా.. (నామినీ మీరే.. ;-))

KFC లో వాడేది చికెనే కాదు

WTC కూలిపోతున్నప్పుడో, ఈ మధ్యే జరిగిన విమన ప్రమాదం లోనో తీసిన ఫొటోలు. (బాగా చూస్తే మీకు ఒకరిద్దరు ఇంగ్లీషు సీరియల్ నటులు కనిపిస్తారు)

లాటరీలు, వారసులు లేని ఆస్థులు, వ్యాపార ప్రపోజల్స్, ఇవన్నీ మామోలే.


ఇవి కాకుండా, కొన్ని సగం నిజాలు కూడా ఉంటాయి, అదేదో పండు తింటే కేన్సర్ రాదనీ, దగ్గితే గుండె ఇంక ఆగమన్నా ఆగదని, మంచినీళ్ళతోనే/నిమ్మరసంతోనే అన్ని వ్యాధులూ తగ్గిపోతాయనీ.. ఇలాంటివి కూడా. ఇవి పూర్తిగా అబద్దాలూ కాదు, అలా అని నిజాలూ కాదు. ఇవి ఇంకా ప్రమాదకరం, విషయం మీద పూర్తి అవగాహన లేకుండా పాటిస్తే.

మీకు అనుమానం వచ్చినపుడు, ఒకసారి గూగుల్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది అసలు విషయం. మీకు మరీ ఎక్కువ వివరాలు కావాలంటే ఈ వెబ్సైట్స్ కూడా చూడచ్చు, ఇలాంటి అబద్దాల్లోని నిజాలు చెప్పే సైట్స్ ఇవి -
http://urbanlegends.about.com/
http://www.hoax-slayer.com/

మరి అవి కూడా అబద్దమే చెప్తే, మనల్ని ఆ లోక్పాల్ బిల్లు కూడా కాపాడలేదు. మళ్ళీ మొదట చెప్పిన విషయానికి వస్తే, గడచిన నాలుగేళ్ళలో (పెళ్ళయ్యాక అని చదువుకోండి) నేను తెలుసుకున్న నిజం ఏంటంటే, అబద్దాన్ని నిజం అని చెప్పడం కన్నా, ఒక్కోసారి నిజాన్ని నిజం అని నిరూపించడమే కష్టం అని. ఏంచేస్తాం జగన్ కాలం.

No comments:

Post a Comment