Sunday, September 23, 2012

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ?


చాలా రోజులకి మళ్ళీ బ్లాగు వంక చూసాను. నిన్న సాయంత్రమే కాసినోలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూసాం. కొన్ని సన్నివేశాల్లో కళ్ళు చమర్చాయి కనుక సినిమా బావుందనే అనేవాణ్ణేమో కానీ, శేఖర్ కమ్ముల స్థాయి లో లెదనే చెప్పాలి. ప్రకటనల్లోనే ఉన్న కాస్త కథా చెప్పేసినట్టనిపించింది. మధ్య తరగతి, ధనిక వర్గాలు ప్రక్క ప్రక్కనే ఉన్న ఒక కాలనీలో జరిగే కథ ఇది. శ్రేయ/ అంజల జవేరీ లను ప్రక్కన పెడితే మామోలు తెలుగుసినిమాకి ఉండే హంగులేవీ లేని చిత్రం. కథలో అంతర్లీనం గా భావోద్వేగాలు ఉన్నా, పాత్రలు మరీ ఎక్కువ అవ్వడం వల్ల కాబోలు, ఏ పాత్రా మన మనసుకి హత్తుకోదు. చాలా సీన్లూ, టేకింగ్ మనం ఇదివరకే చూసిన శేఖర్ సినిమాలను గుర్తు చేస్తాయి.
విషయం చిన్నదే అయినా, కథనం బావుంది. సెకండ్ హాఫ్ లో కొంచం సేపు మినహా, మిగతా సినిమా అంతా బోర్ కొట్టకుండానే సాగిపోతుంది. హీరో, హీరోయిన్ వగైరా రొటీన్ టెంప్లేట్ కాదు కనుక, కాస్త ఫ్రెష్ గానే అనిపించింది. పదికి తొమ్మిది మంది మనం ఎప్పుడూ చూడని నటీనటులే కావడం తో, కొన్ని సీన్లలో పాత్రలను గుర్తుపట్టడం మనకి పజిల్ గా మారే ప్రమాదముంది. ముఖ్యం గా నెగెటివ్ షేడ్ ఉన్న యువకులు అందరూ ఒక్కలానే ఉన్నారేమో అనిపించింది. కొన్ని మాటలు పెదాల కదలిక లేకుండానే వినిపిస్తాయి, ఇది ఆనంద్ నుంచి మనకి అలవాటైన సంగతే లెండి. ఎంతో ఆర్భాటం తో నటించిన అమల ఈ సినిమాకి చేసిన మేలు ఏంటో నాకైతే తెలియరాలేదు. పట్టుమని పది సీన్లున్న ఆ పాత్ర, తెలుగు లో కాస్త డైలాగ్లు సరిగ్గా చెప్పగలిగే ఏ నటి పోషించినా ఇంకా మెరుగైన ఫలితం వచ్చేదేమో.
కథ పెద్దగా లేదు, అందుకే చెప్పే ధైర్యం చెయ్యడం లేదు. హ్యాపీ డేస్ - 2 అని తీసినా సరిపోయేదేమో. అనుభూతులున్నాయి, కానీ హృదయమే మిస్ అయ్యిందేమో అనిపించింది. నిజానికి సినిమా నిడివి ఆరుగంటలు వుండి, దాన్ని రెండున్నర గంటలకు ఎడిట్ చేసారేమో పాపం. దర్శకుడు తనకి తెల్సిన అంశాలనే తన సినిమాల్లో మళ్ళీ మళ్ళీ చూపిస్తే, సినిమా అందరికీ అనుకున్న విధంగా రీచ్ కాలేదు. ఈ విషయం లో శంకర్ లాంటి దర్శకుడి నుంచి శేఖర్ కమ్ముల నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.  సినిమా అయ్యాక ప్రేక్షకులు హ్యాపీ డేస్ లో పాటలు హమ్ చేసుకుంటూ వెళ్ళడం కనిపించింది, నా వరకూ ఒక్క పాట కూడా గుర్తు లేదు. హ్యాపీ ఎండింగ్ ఫార్ములాని మాత్రం వదలకుండా తీసిన ఈ చిత్రం, సరదాగా చూడాలనుకునే వాళ్ళని ఆట్టే ఇబ్బంది పెట్టదు. ఆనంద్, హ్యాపీ డేస్ లను మించి ఉంటుందని అంచనాలతో వెళ్తే మాత్రం, నాలా నిరాశపడతారు.
మాంచి రుచికరమైన భోజనం పెడతామని పిలిచి, ప్లేట్లో ప్లాస్టిక్ వంటకాలు పెడితే కడుపు నిండుతుందా ?

Thursday, June 28, 2012

కొత్త పరీక్షలు.. పాత ప్రశ్నా పత్రాలు..

మొన్నెప్పుడో JNTU కాకినాడ వాళ్ళు ఈ-కామర్స్ పరీక్షకి పాత ప్రశ్నా పత్రాన్నే యధాతథంగా ఇచ్చేసారనే వార్త చదివినప్పటి నుంచీ ఒక పోస్ట్ రాద్దామనే అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది(ఏంటో ఈ మధ్య బ్లాగు రాయలనే ఆసక్తే బాగా సన్నగిల్లిపోయింది. కారణాలు ఏమైనా.. )


IT ఉద్యోగానికి రాక ముందు, ఓ యేడాది నేనూ లెక్చరర్ నౌకరీ వెలగపెట్టాను.విశాఖలో కాస్త పేరున్న కళాశాలలోని MCA విభాగం లో. నేను జాయిన్ అయిన రోజునే మా డైరెక్టర్ గారు భుజం మీద చెయ్యేసి, బాబూ ఈ సబ్జెక్ట్ లో గత సంవత్సరం సగం మంది కూడా ప్యాస్ కాలేదు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పు అని సూచించారు. కొత్త వ్యాపకం,ఉత్సాహం... సో ఒళ్ళే కాదు, ఓ నాలుగు పుస్తకాలూ దగ్గర పెట్టుకుని చాలా కష్టపడి సిలబస్ పూర్తిచేసాను. స్టూడెంట్సూ.. కాస్తో కూస్తో ప్రసన్నులయ్యారనే చెప్పాలి, పాఠం కంటే.. నేను పడుతున్న కష్టానికి. మధ్య మధ్యలో మోడల్ పరీక్షలు, క్విజ్జులు, చివర్లో ఒక పూర్తి పరీక్ష పెట్టి వాళ్ళని బానే సన్నిధ్ధం చేసాను. పాత ప్రశ్నా పత్రాల్లోని కష్టమైన ప్రశ్నలకి సమాధానాలు తయారు చేసి మరీ ఇచ్చాను. పరీక్షకి వాళ్ళెంత టెన్షన్ పడ్డారో కానీ,నేను మాత్రం కాళ్ళ గోళ్ళు కూడా తినేసే అంత ఆతృత పడ్డాను. పరీక్ష రోజు వేరే రూం లో ఇన్విజిలేషన్ లో ఉన్నా, ప్రక్క రూం కి వెళ్ళి వీళ్ళ ప్రశ్నా పాత్రం చూసానా, నోట మాట రాలేదు, పండూ గాడు కొట్టకుండానే మైండ్ బ్లాక్ అయ్యింది.. సరిగ్గా అంతకు ముందరి సంవత్సరం ఇచ్చిన పేపరే.. ముద్రా రాక్షసాలతో సహా. మా వాళ్ళు గట్టెక్కుతారని ఆనందించాలో, నా కష్టం.. వాళ్ళ కష్టం వృధా పోయాయని బాధ పడాలో తెలీలేదు. వెంటనే మా HOD గారి దగ్గరకి వెళ్ళి ఇదేం ఘోరం అని వాపోయాను, ఆవిడ తనదైన వేదాంత ధోరణిలో నా వైపు చూసి, పాఠం చెప్పడం వరకే మన పని అని తేల్చారు. ఇంకేమంటాం. నోరు మూసుకుని,జోరు తగ్గించుకుని నెక్స్ట్ సెమిస్టెర్ ముందు పాత ప్రశ్నా పత్రంతోనే మొదలు పెట్టాను. (ఇంతకీ మా వాళ్ళు అందరూ ప్యాసయ్యారా లేదా అనే కదా మీ ప్రశ్న, పాత పేపరే ఇచ్చినా, తెల్ల కాగితాలు మనమే నింపాలి కదా, ఒకరిద్దరు సాగిల పడ్డారు.. నిట్టూర్చి వదిలేసాను లెండి)


ఇది జరిగిన ఏడాదికి, నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో M.Tech జాయన్ కావడమూ. ఒక పేరుమోసిన ప్రొఫెసర్ గారి దగ్గర తప్పక, శిష్యరికం చెయ్యడం తటస్తించింది. అప్పుడు అర్థం అయ్యింది, ఈ కాపీ పేపర్ల వెనుక అసలు కమామిషు.ప్రతీ సబ్జెక్ట్ కీ యూనివెర్సిటీ ఎరుకున వున్న ఏ ఆచార్యుడికో పేపర్ సెట్టింగ్ బాధ్యత అప్పగిస్తారు, డీను గారి వియ్యంకుడి స్నేహితులో, లేదా హెడ్డు గారి పూర్వ విద్యార్థులో..ఇలా అన్న మాట. వాళ్ళకీ, ఈ సబ్జెక్ట్ కీ అసలు ఏ కాస్తైనా రక్త సంబంధం/అభిషేకం ఉందా లేదా అన్నది ఎవడికీ పట్టదు. ఓ రెండు పాత ప్రశ్నా పత్రాలూ, సిలబస్సు, ఓ నాలుగు పుస్తకాల పేర్లూ, పంపి చేతులు దులుపుకుంటారు.ఆ ఫలానా ప్రొఫెసర్ గారు మంచి వాడైతే ఆ పాత పేపర్లు ఒకసారి చూసి, పుస్తకాలు ఏ లైబ్రరీ లోనో తెరచి ఓ నాలుగు ప్రశ్నలు యూనివెర్సిటీ మొహాన కొడతాడు. అదే మా గురువుగారి లాంటి బిజీ పెర్సన్ అయితే, దగ్గర్లో ఉన్న స్కాలర్ కి (నా లాంటి అభాగ్యుడు కి) ఆ భాద్యత పెడతాడు. స్కాలర్ గారి హాస్టల్లో భోజనం బాగోగుల బట్టి మనకి పేపర్ వస్తుంది. ఇంకా, మూడోరకం మహానుభావులున్నారు, వీళ్ళు పుస్తకాలు తెరిచే రిస్క్ తీసుకోరు, అలా అని మరొకడిని నమ్మరు..పంపిన పేపర్లనే అటు తిప్పి, ఇటు తిప్పి ఓ పేపర్ తయారు చేస్తారు, ఈ హడావిడి లో ఒక్కోసారి ఒకే ప్రశ్న మొదట పేజీలోనూ.. రెండో పేజీలోనూ ప్రత్యక్షం అవుతుంది. (మొదటి దానికేమో మూడు మార్కులు.. రెండోదానికేమో ముప్ఫై.. రాసేవాడి/దిద్దేవాడి ఖర్మ చూడండి ఇంక) వీళ్ళంతా ఒక ఎత్తయితే, ఇంకో రకం.. అసలు ఆ వ్యవహారమే మరచిపోతారు, ఒకటి రెండు, అయిదు పది సార్లు యూనివెర్సిటీ అధికారులు గుర్తు చేసాక, చిరాకు వచ్చి, వాళ్ళు పంపిన పేపర్ నే తిరిగి పంపేస్తుంటారు.. అది డైరెక్ట్టు గా ప్రింటింగ్ కి వెళ్ళిపోవడమూ, విద్యార్థులను పరీక్ష రోజు వెక్కిరించడమూ సర్వ సాధారణం. ఇదే తంతు, వరసగా రెండు మూడేళ్ళు జరిగిన సందర్భాలూ ఉంటాయి. పేపర్ సెట్టర్స్ కి అసలు పాత పేపర్లు పంపడం మానస్తే అంటారా, అప్పుడు మరో సబ్జెక్ట్ ప్రశ్నా పత్రం తిరుగు టపాలో వచ్చే ప్రమాదముంది, దానికంటే కొత్త సీసాలో పాత మందే బెటర్ కదా.. మీరు ముక్కు మీద వేళ్ళు,కాళ్ళూ వేసుకోకపోతే, ఒక్కోసారి అసలు పరీక్ష పెట్టాలనే సంగతే యూనివెర్సిటీ మర్చిపోతుంటుంది, అలాంటప్పుడూ చివరి నిమషం లో ఆదుకునేవి పాత పేపర్లే మరి.. .


కొత్తగా వచ్చిన తెలుగు మెలోడి, ఆ పాత ఇంగ్లీషు పాటలా ఉండడం, ఇద్దరు మేధావులు ఒకేలా ఆలోచిస్తారన్నదానికి నిదర్శనం అని మీరు అనుకుంటే, మిమ్మల్ని ఆర్కే నాయుడు కూడా కాపాడలేడు. ;-)

Tuesday, May 29, 2012

మూలిగే నక్క మీద..

మూలిగే నక్క మీద తాటిపండు పడిందని సామెత. నిజం గానే ఒక్కోసారి కష్టాలు కోంబో ఆఫర్ లాగ కలిసి వచ్చేస్తుంటాయి. అలాంటి సమయం లోనే మనం పెద్ద పెద్ద వాళ్ళు పడుతున్న అష్ట కష్టాలు గుర్తుకు తెచ్చుకుని, వాటితో పోల్చుకుంటే మనవెంత వీజీవో గుర్తెరిగి, మనల్ని మనమే ఓదార్చేసుకోవాలి. (ఇప్పుడు ఓదార్పు యాత్రకి రమ్మంటే మాత్రం ఎవరొస్తారండి.. అడగడానికయినా ఒక సమయం, సందర్భం ఉండద్దూ)

ఇంతకీ నాకొచ్చిన ఆ జాయింటు కష్టాలేంటనే కదా మీ డౌటు.. చెప్తానుండండి మరి. బ్లాగరన్నవాడెవడైనా విషయం ఇదీ అని డైరెక్ట్ గా చెప్తాడా..

మొన్నీమధ్యే పెట్రోల్ ధరలు మూడొందల ముప్పై మూడో సారి పెరిగాయా, ఆఫీసులో ఒకటే డిస్కషన్.. ఇంట్లో కూడా అదే చర్చ.. ఎలా ఈ పెట్రోల్ మోతని ఎదుర్కోవడం అని. కళ్ళూ, కిడ్నీలూ, కాలేయాలు (ఒకటే ఉంటుంది కదా.. ) అమ్ముకున్నా లీటర్ పెట్రోల్ రాని పరిస్థితి. ఓల్ద్ ఏజ్ తప్ప మైలేజు అంటే అసలే తెలీని నా పల్సర్ నడుస్తుంటే, ఏంటో నాకు నా నెల జీతం అలా పై జేబులోంచి రాలిపోయి, ఎండలో ఆవిరైపోతున్న ఫీలింగ్ వస్తోంది. ఆఫీసు పెద్ద దూరం కాకపోయినా నాలుగు సార్లు తిరిగితే పెట్రోల్ అవ్వదూ. మరియు, ఏ వారాంతం లోనో మనం అలా ఫ్యామిలీ తో చేసే షికార్ల మాటేమిటి మరి. వీటికి తోడు దింపడాలూ, రిసీవ్ చేసుకోడాలూ ఎలానో తప్పవు. మరి ఇవన్నీ భరించి బ్రతుకు నెట్టుకురావాలంటే ఏడాది జీతం ప్రతీ నెల ఒకసారి ఇస్తే సౌకర్యం గా ఉంటుందని నా అభిప్రాయం. (మీ ఎరుకన అలాంటి మాంచి ఉద్యోగాలేమైనా ఉంటే నా చెవిలో వేయండి)

పరి పరివిధాల ఈ పై భాధలతో, మూలుగుతూ ఉంటే,,.. తాటిపండు పడనే పడింది. రెండ్రోజులుగా చెన్న పట్నం అలియాస్ చెన్నై లో చుక్క పెట్రోల్ దొరికితే ఒట్టు. సగం బంకులు మూసే ఉన్నాయి.. మా ఆఫీసు ఎదురుగా ఉన్న బంకు పరిస్థితి అయితే చెప్పనలవి కాదు.. కార్ల లైన్లు అదేదో ఫాక్షన్ సినిమాలో క్లైమక్స్ సీన్లో లా ఉన్నాయి.. ద్విచక్ర వాహనాలైతే లెక్కే పెట్టలేం. ఇంతా చేసి బంకు లో స్టాకు లేనే లేదంట, ఒక వేళ వస్తే పోయించుకోడానికి అన్న మాట ఈ ముచ్చట. ఉన్న అవయవాలు అన్నీ అమ్ముకుని ఓ లీటర్ పెట్రోల్ కొట్టిద్దామంటే ఇదీ సిట్యూయేషన్. నా బండి లో ఉన్న ఆ నాలుగు చుక్కల పెట్రోల్ ని గుట్టుగా, మూడో బండి వాడికి తెలీకుండా వాడుకుంటున్నానా, అదేమో మన సింగు గారి ప్రభుత్వం లా ఎప్పుడు చేతులూ. కాళ్ళూ ఎత్తేస్తుందో తెలీడం లేదు. నేడో రేపో సెలవు తీసుకుని, ఓ పది మిల్లీ లీటర్ల ఇంధనాన్ని ఎంత ధనం వెచ్చించైనా కొనుక్కోవాల్సి వచ్చేలా ఉంది. లైన్లలో నిలబడడానికి ఖాళీ లేక, బళ్ళని ఎక్కడో నిలిపి, కూల్ డ్రింక్స్ బాటిల్స్ తో జనాలు బంకుల చుట్టూ తిరుగుతున్నారు.. మా బాస్ అయితే అయిదొందలు సమర్పించుకుని డ్రైవర్ని తెచ్చుకున్నాడు, ఊర్లో తిరగడనికి కాదు, ట్యాంకు నిండా పెట్రోల్ పోయించడానికి. ఏంచెప్పమంటారు, ట్యాంకు చించుకుంటే, కాళ్ళ మీద పెట్రోల్ పడిందనీ, సరఫరా లోపమో, లేక ఇంకో పెద్ద స్కామో, మన దుంపలు మాత్రం తెంచుతున్నారు. అధికారుల తప్పేం లేదంట, బంకు ఓనర్స్ ది అసలే ఉండదు.. ఇంకా రేటు పెరిగినా, లైను పెరిగినా.. భాధ, భాద్యత మనదే అన్నమాట.

అసలే, పైనా క్రిందా కాలుతున్న ఎండలు.. దానికి తోడు ఈ కోంబో వాతలు.. సగటు ప్రాణి గాడికి నరకం వేరే ఎక్కడో లేదు సుమండీ..

Saturday, May 19, 2012

199 నాటవుట్..


సచిన్ వందవ సెంచరీ కి అంత టైం ఎందుకు పట్టిందని విమర్శకులు తెగ నోళ్ళు పారేసుకున్న విషయం మనకు తెల్సిందే. ఆ ఆలస్యానికి కర్ణుడి చావుకు ఉన్నట్టే సవాలక్ష కారణాలు ఉండి ఉండవచ్చు.. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకూ అనే కదా మీ అనుమానం, ఏం చెప్పమంటారు, అడపాదడపా రాస్తూనే 199 టపాలు రాసిన నేను, ఆ డబుల్ సెంచరీ టపా మాత్రం ఏభైరోజులు అయిపోతున్నా రాయలేకపోయాను. నా బ్లాగుని ఏ ద్రవిడ పార్టీ కార్పోరేటరో ఆక్రమించుకుని తనది అని బోర్డు పెట్టేసుకున్నట్టు పీడ కలలు కూడా వచ్చేస్తున్నాయి. వొంట్లో బాగోలేకపోవడం.. ఆఫీసులో పని.. గోరుచుట్టు మీద రోకలి పోటులా, నా ల్యాప్ టాప్ వయో భారంతో బకెట్ తన్నేయడం. వెరసి, నేను ఆన్ లైన్ కి అందనంత దూరం లో ఉండిపోయాను. గత కొద్ది రొజులు గా, ఆలోచించి.. విశ్లేషించి.. ఒప్పించి.. మెప్పించి.. (జగన్ కేసులో CBI కూడా ఇంత అనాలసిస్ చెయ్యలేదు అంటే మీరు నమ్మాలి) మొత్తానికి ఒక కొత్త ల్యాప్ టాప్ కొనేసాను. సో మళ్ళీ యధాశక్థి.. టపాలు.. ట్వీట్లు చెయ్యగల్గుతానని ఆశిస్తున్నాను.
డబుల్ సెంచరీ టపాని మరీ ఇంత వీజీగా తేల్చేస్తున్నానని నాకూ బాధగానే ఉన్నా, మీరు నన్ను మీ జ్ఞాపకాల ఆర్కైవ్ ల నుంచి కూడా తీసేసాక, నేను ఎన్ని సెంచరీలు చేస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. అందుకని, ప్రస్తుతానికి, "నేను ఇంకా ఉన్నానండోయ్" అని మీకు గుర్తు చెయ్యడానికే ఈ టపా. మళ్ళీ వచ్చే పోస్ట్ లో కొత్త విషయం తో కలుద్దాం. (ఇంతకీ మున్నా దుబాయి నుంచీ క్షేమంగా వస్తాడంటారా ? ;-) )

Sunday, April 1, 2012

మిస్సవ్వకూడని కహానీ..

ఆదివారం ఆఫీసులో ఇంటర్వ్యూ ల పని పడడటం తో ఈ సారి మా వీకెండ్ కాస్త హడావిడి గానే మొదలయ్యింది. సగటు గృహస్థు గాడికి ఆటోమేటిక్ గా వచ్చే ప్లానింగ్ తో ఓ రెండ్రోజుల ముందే శనివారం సాయంత్రానికి సినిమా టికెట్లు తీసి పెట్టా (అబ్బా మీరు మరీ పొగిడేయకండీ.. :-) ). ఆఫ్ బీట్ సినిమాలు రావడమే అరుదు కనుక, ఈమధ్యే రిలీజ్ అయ్యి, మంచి రివ్యూస్ ని సొంతం చేసుకున్న "కహానీ" ని కవర్ చేసాం, చెన్నై ఈగా థియేటర్లో (హాలుకి ఆ పేరు ఎందుకు పెట్టారో మీకు చనువుంటే రాజ మౌళి ని అడగండి, నేనేం చెప్పగలను). కాస్త వైవిధ్యం ఉన్న చిత్రాలను ఆస్వాదించే వాళ్ళెవరూ అస్సలు మిస్ అవ్వకూడని చిత్రమిది. మా సినిమా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అని మైకులూ/మూతులూ గుద్ది చెప్పడమే కానీ, కండలు లేకున్నా బండలు ముక్కలు చేసే హీరో - అన్నీ ఉన్నా పప్పులోనే కాలేసే విలన్ - అడపాదడపా కనిపించి అందాలు ఆరబోసే హీరోయిన్ - ఓ నాలుగు అనవసరపు పాటలు - ఎడిటింగ్ లో అంటుకున్న కామిడీ, తప్ప మన రొటీన్ సినిమాల్లో ఏదీ వైవిధ్యం ?. సినిమా పరమార్థం వినోదమే కానీ ఒకే మార్కు సినిమాలు ఎన్నని చూస్తాం, శరవణా భవన్ లో సాంబార్ వడ ఎంత బావున్నా రోజూ అదే తింటే మొహం మొత్తదూ.. మరో రుచీ ప్రయత్నం చెయ్యాలి మరి. ఒక్కోసారి కంట్లో నీళ్ళు రావచ్చు, మరోసారి కడుపు కోయంబేడు మార్కెట్ కావచ్చు, పర్వాలేదు, అదీ ఒక అనుభవమే కదా. మన ఆఫ్ బీట్ సినిమాల సంగతీ అంతే.. నేను (మా ఆవిడతోనే లెండి) మూడు చిత్రాలు దాదాపుగా ఒకే హాల్లో చూసాను. ఉడాన్, దోభీఘాట్, నిన్న చూసిన కహానీ. మూడూ వైవిధ్యమైన చిత్రాలే. నా వరకూ ఉడాన్ కాస్త నిరాశ పరిచింది, దోభీఘాట్ ఓ.కే అనిపించిది, బానే వెంటాడింది కూడా. కానీ కహాని నిజమైన ఎంటెర్ టైన్మెంట్ ఇచ్చింది. అంటే పాప్ కార్న్ క్రింద పడేలా పడి పడి నవ్వడం కాదండోయి, ఊపిరి బిగ పెట్టి సాంతం చూసేలా చేసింది. ఈ మధ్య నేను ఏ చిత్రాన్ని ఇంత సీరియస్ గా ఫాలో అవ్వలేదు అంటే నమ్మండి.

కథ విషయానికి వస్తే, అదృశ్యం అయిన తన భర్తను వెతుక్కుంటూ, నిండు గర్భంతో లండన్ నుంచి కోల్కతా వచ్చిన ఒక యువతి కథ ఇది. తన భర్త ఆచూకీ తెలుసుకోడానికి ఆవిడ పడ్డ అగచాట్లు, పోలీసులు, గుఢాచారులు, చట్ట వ్యతిరేక శక్తులూ, వగైరా వగైరా.. మిమ్మల్ని సినిమా చూడమని చెప్తూ, నేను ఉన్న కాస్త కథా చెప్పడం మరీ ఘోరం కనుక ఇంతకంటే నేను కథని రాయబోవడం లేదు. మీరు ఏమీ ఊహించుకోకుండా వెళ్ళండి, ఖచ్చితంగా మీకు సినిమా బానే అనిపిస్తుంది. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన అంశం, టేకింగ్. ఫిల్మ్ సిటీలు, కృత్రిమమైన వాణిజ్య సముదాయాలు మీకు ఎక్కడా కనిపించవు. నిజంగా కోల్కతా వీధుల్లో తీసారో, లేక అంత బాగా సెట్లు వేసారో కానీ, ఆ సంఘటన నిజంగా జరిగితే ఇలానే ఉంటుంది కదా అని అనిపించేలా ఉన్నాయి దాదాపుగా అన్ని సన్నివేశాలు. విద్యా బాలన్ నటన గురించీ వేరే చెప్పుకోనక్కర్లేదు. పాత్ర తప్ప మీకు ఆమె ఎక్కడా కనిపించదు. అనుకున్న స్క్రిప్ట్ మీద పూర్తి పట్టుతో దర్శకుడు సెట్స్ మీదకు వెళ్తే చిత్రం ఎలా ఉంటుందో సరిగ్గా అలానే ఉంది. ఇంటెర్వెల్ ఎప్పుడొచ్చిందో తెలీనే లేదు, వాచీ చూసుకుంటే అప్పటికే గంట దాటింది. మొత్తం సినిమాలో ఒక్క సీన్ కూడా అక్కర్లేనిది లేదు.. పాటలు లేవు.. అవసరానికి మించిన నేపథ్య సంగీతం కూడా లేదు.. మీరు స్క్రీన్ వైపు తప్ప మరెటు వైపూ చూసే సాహసం చెయరు. అలా అని మిమ్మల్ని ఏమీ ఊహాలోకంలోకి తీసుకువెళ్ళదు సినిమా. కానీ మనకు తెలీకుండానే మనం విద్యా పాత్రకి అట్టాచ్ అయిపోతాం. ఇంక ఆ తరువాత సినిమా బహుశా మనం ఆవిడ కోణంలోంచే చూస్తాం. కథ చిన్నదే, కానీ కథనం లో ఎక్కడా బిగువ సడలదు. మేమైతే సినిమా అయ్యాక కూడా ఒక హ్యాంగ్ ఓవర్ లోనే ఉండిపోయాం, రాత్రి నిద్రపోయాక కూడా అవే ఆలోచనలు. దర్శకుడి పూర్తి కష్టం అర్థం చేస్కోవాలంటే మరోసారి చూడాలేమో. సినిమా అంతా ఒక సస్పెన్స్ మనల్ని వెంటాడుతుంది, దాన్ని చివర్లో బట్టబయలు చేసిన తీరు అసలైన హైలైట్. (కొన్ని సస్పెన్స్ సినిమాల ఎండింగ్లు మనల్ని మరీ వెర్రి వెంగళప్పల్ని చేస్తుంటాయి, ఇది అలా లేదు)

కొన్ని సన్నివేశాలు కాస్త నాటకీయంగానే అనిపించినా, టేకింగ్ లో ఉన్న సహజత్వం మనల్ని కన్విన్స్ చేసేస్తుంది. మంచి సినిమా అని ఖచ్చితంగా చెప్పగలను, అయినా చూసిన అందరికీ నచ్చాలని గ్యారంటీ ఏమీ లేదు, కానీ ఓ రాయి వేయడంలో పోయేదేముంది.. పోతే రాయే కదా.. ఎన్నని పోగొట్టుకోలేదు చెప్పండి.. ;-)

(ఈ మధ్య ఎప్పుడు చూడని ఒక వింత, సినిమా అయ్యాక, చాలా వరుసల్లో ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. నేనూ వంత కలిపాననుకోండీ, మా ఆవిడ నా వైపో చూపు చూసిందీ అని నేను మీకు వేరే చెప్పాలా.. ;-). )

Thursday, March 29, 2012

రాజకీయ క్షమాభిక్ష

అభిలాష సినిమాలో, హీరో ఉరిశిక్ష రద్దు కోసమని తన ప్రాణాలనే పణంగా పెడతాడు. అలా అని ఉరిశిక్ష పడ్డవాళ్ళందరూ హీరోలనుకుంటే మనంత అమాయకుడు మరోడు లేడు. స్వతంత్ర భారతంలో ఉరి ఆషామాషీ నేరాల్లో పడదు, ఘోరాతి ఘోరమైన కేసుల్లోనే విషయం మరణశిక్ష వరకూ వెళ్తుంది. కానీ మన కోర్టుల్లో తీర్పులు వచ్చి, శిక్షలు అమలు చెయ్యాల్సిన టైం కి మనం అసలు నేరం మరచిపోతాం. అయ్యో పాపం మరణ శిక్షా అని దీర్ఘాలు తీసి, నేరస్థుడిపై సానుభూతి చూపిస్తాం. ఈ సానుభూతి నేరస్థులకి శ్రీరామ రక్ష.. శిక్షలు, వాటి అమలు, జరిగిన నేరానికే కాదు, అలాంటి నేరాన్ని చేద్దామనుకునే మరెవడికైనా ఒక హెచ్చరిక గా ఉండాలి. ఒక ప్రక్క దొరికిన దొంగలను దొరికన చోటన కాల్చిపడేస్తున్న పోలీసు వ్యవస్థ.. మరో వైపు ఉరిశిక్ష పడిన నేరస్థులని కూడా రాజకీయ ప్రయోజనాలకోసం వెనకేసుకొచ్చే పార్టీలు. అఫ్జల్ గురూని కాశ్మీరు ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటే, రాజీవ్ హత్యలో నేరస్థుల్ని ద్రవిడ పార్టీలు భుజానెత్తుకుంటాయి. ( వాటికి దేశంలో మగ్గుతున్న తమిళుల కంటే లంకలోని తమిళులే ముద్దు మరి ). ఇప్పుడు పంజాబ్ లోనూ అదే జరుగుతోంది. ఒకప్పటి ముఖ్యమంత్రి మరణానికి కారణమైన నేరస్థుణ్ణి క్షమించమంటూ ఇప్పటి ముఖ్యమంత్రి ఆఘమేఘాల మీద రాష్ట్రపతిని కలిసి మరీ వేడుకున్నారు.. ఏమనగలం.. ఏళ్ళ తరబడి క్షమాబిక్ష పిటిషన్లను ఎటూ తేల్చకుండా తమదగ్గర అట్టేపెట్టడం, రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకోవడం.. ఎంతవరకూ సమంజసం ?

ఈ ప్రహసనంలో పార్టీలు తమ స్వార్థానికి వాడుకునే బూచి, శాంతిభధ్రతలు. నేరస్థులకి శిక్షను అమలుపరచలేని పరిస్థితిలో ఉన్నామా మనం ? ప్రజలు కోరుకుంటే వెంటనే కాల్చిపారేయడం. అదే ప్రజలు (బహుశా వాళ్ళని ప్రాతినిధ్యం వహిస్తున్న కొద్ది మంది) సానుభూతి చూపిస్తే, క్షమించేయడం. ఇంక న్యాయం, చట్టం, కోర్టులు, శిక్షలు.. ఇవన్నీ ఎందుకు ? నేరస్థుల్ని ఒక బహిరంగ ప్రదేశం లో నిలబెట్టి జనాల్ని తీర్పులు చెప్పమంటే సరి. ఎవడి గొంతు పెద్దదో, ఎవడి మాట చెల్లుతుందో వాడే న్యాయమూర్తి. ఉరిశిక్ష వేసే హక్కు మనకుందా లేదా అన్నది వేరే ప్రశ్న, నిజంగా మరణశిక్షే అమానుషం అనుకుంటే, దాన్ని సమూలంగా రద్దు చేసుకోవచ్చు. కానీ వేసిన శిక్షల అమలుని శాంతి భధ్రతల పేరుతో ప్రభావితం చేయడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు. ఒక వర్గం ప్రయోజనాలకోసమో, ప్రతీకారేచ్చతోనో జరిగే నేరాల్లో మరణ శిక్ష ఇంక అమలు చెయ్యడం సాధ్యం కాదు అనే సంకేతాన్ని ఇచ్చేలా ఉన్నాయి ఈ సంఘటనలు. జరిగిన నేరంలో అశువులు బాసిన అమాయకులు, చిన్నాభిన్నం అయిన కుటుంబాలు ఈ సందర్భం లో ఎవరికి గుర్తు ?. ఎంత దారుణం. ప్రియాంక గాంధీ క్షమించేస్తుంది.. లండన్ లో చదువుకుంటున్న నళిని, మురుగన్ల కూతురు లైవ్ లో కృతజ్ఞతలు చెప్పేస్తుంది. తమిళ ఈలం తో కానీ, శాంతి సేన తో కానీ ఏ సంబంధం లేకపోయిన ఆ రోజు అక్కడ ఉన్న పాపానికి ప్రాణాలు కొల్పోయిన మనలాంటి జనాలు ఎవరికీ అక్కరకు రారు. మన ఔదార్యం ఎంత గొప్పది అంటే మన సానుభూతి ప్రియాంక గాంధీకీ ఉంది, హరిత్ర మురుగన్ కీ ఉంది. ఇంక నేరం/శిక్ష ఏవి ?

రేపో మాపో కసబ్ కి ఉరి తీయాలంటే కూడా, పెద్దయెత్తున సానుభూతి కదిలి వస్తుంది. బహుశా క్రొవ్వొత్తుల ప్రదర్శనలు కూడా జరుగుతాయేమో. లండన్ లో ఒక సర్వమత ర్యాలీ.. పాకిస్తాను లోనూ, ఢాకాలోనూ బందు.. వీటన్నింటినీ చూసి మనం ఆ కిరాతకుడు చేసిన మారణకాండను బుర్రల్లోంచి తొలగించి, క్షమాభిక్ష ప్రసాదిస్తాం. మన క్షమాగుణం చరిత్రలో నిలచిపోతుంది.

నిజానికి కొన్ని నేరాలకి ఉరిశిక్ష కూడా సరిపోదు అని నా అభిప్రాయం.

Tuesday, March 27, 2012

14 కోట్లూ ఒక లంచమేనా..

చిన్నప్పుడు, బహుశా ఒకటో తరగతిలో అయ్యుంటుంది, నాకు ఎన్ని అంకెలు వచ్చు అని ఎవరైనా అడిగితే నేను గుక్క తిప్పుకోకుండా వందో, రెండొందలో చెప్పేసే వాణ్ణి. ఆ వయసులో అదో అచీవ్ మెంట్. కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయో చూడాల్సిన అవసరం ఎప్పుడూ రానే లేదు. కానీ 2G రాజా గారి పుణ్యామా అని హఠాత్తుగా కోటి అతి చిన్న సంఖ్య అయిపోయింది. పేపర్లో లంచాలు, కుంభకోణాలు.. కనీసం ఓ పదివేల కోట్లైనా లేకపోతే కంటికి ఆనడం లేదు. అసలు అలాంటి వార్తలు మెయిన్ పేపర్ లో రాయకూడదని నా ఫీలింగ్. మొన్నెప్పుడో బొగ్గు కుంభకోణం అన్నారు, బావుంది, 2G సరసన నిలచేలా ఉంది. కానీ నిన్నటికి నిన్న మన ఆర్మీ చీఫ్ మరీ చీపు గా 14 కోట్ల లంచం తనకు ఇవ్వచూపారని వాపోయారు. ఆయన బాధను మనం మానవీయ కోణం లో చూడాలి. అది కూడా పదవీ విరమణ కి కాస్త దూరం లో మరీ 14 కోట్లంటే.. అవమానమే. దానికి మన కేంద్ర రక్షణ మంత్రే సాక్ష్యం అన్నారు వీ కే సింగ్ గారు. ఇవే ఆరోపణలు ఏ సిబల్ పైనో, పవార్ పైనో వస్తే అసలు గొడవే లేదు, వాళ్ళు డైరెక్ట్ గా ఇలాంటి చిన్న స్కాముల్లో తలదూర్చరు అని మనం వీజీ గా నమ్మేసే వాళ్ళం. కానీ అంటోనీ గారికి కాస్తో కూస్తో మంచి పేరుందాయే. ఆయనేమో ఈ రోజు ప్రకటన చేస్తూ, నేనూ నిజమే, ఆయనా నిజమే, 14 కోట్లూ నిజమే.. ఇస్తానన్నది ఫలానా ఫలానా.. ( కానీ ఎందుకు ఇవ్వలేదో నాకు తెలీదు.. ) ఈయన ఎందుకు కేసు పెట్టలేదో అంతకంటే తెలీదు అన్నారు.

ఇదంతా చూస్తుంటే, నాకు నవ్వాలో.. ఏడ్వాలో.. తెలీడం లేదు. ఒకాయనేమో సైన్యానికి అధిపతి.. మరొకాయన రక్షణ శాఖకి కేబినట్ మంత్రి. ఇద్దరిలో ఒకరు చెప్పేది అబద్దం అని తెలుస్తూనే ఉంది. మంత్రి గారు కిమ్మనలేదు అంటాడు ఈయన, అయ్యో నేను ఆ రోజు కేరళ వెళ్ళడానికి రైలు రిజర్వేషన్ పనిలో బిజీ గా ఉన్నాను, అందుకే దర్యాప్తు ఆదేశించలేదు అంటారు మంత్రి గారు. ఎవరిని నమ్మడం. ఇంతా చేసి పోనీ ఆ లంచం ఆఫర్ చేసిన వ్యక్తి ఏమైనా తెహల్కా వాడా అంటే, ( చీకట్లో ఇద్దర మనుషుల నీడలైనా చూసి మనం గుర్తుపట్టేయడానికి ) కనీసం TV9 వాడు కూడా కాదు. ఆయనో మాజీ సైన్యాధికారి. అయ్యా నా పెన్షన్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు, ఈ తిరుగుడులో 14 పేరగాన్ జోళ్ళు మార్చాను అంటే, అసలే రిటైర్మెంట్ టెన్షన్ లో ఉన్న మన పెద్దాయనికి, 14 కోట్లని అర్థం అయ్యిందేమో.. అసలు తమాషా, విపక్షం తరపున మన జైట్లీ గారు ప్రభుత్వానికే తమ మద్దతు అని రాజ్యసభలో ప్రకటించడం. కరక్టే లెండి, ఫ్రీగా దొరికాయని తీగలు లాగితే, ఎవరి డొంకలు కదులుతాయో, ఎవరి పీకలు తెగుతాయో ఎవరికి తెలుసు. (బంగారు లక్ష్మణ్ గారు కుళ్ళు నవ్వుతో డబ్బు కట్టలని తన డ్రా లో పెట్టుకోవడం మరచిపోవడానికి మనం సంజయ్ రామసామీలం కాదు కదా)

నాలాంటి సగటు పొరుడికి, సైన్యం, దాని బాగోగులు గురించి ఏంతెలుసు అంటే, సన్నీ డియోల్ సినిమాల్లో చూపించినంత. ఎంత బడ్జెట్ ఇస్తున్నారో, ఎంత ఖర్చు చేస్తున్నారో, దేనికి/ఎలా ఖర్చు చేస్తున్నారో, ఎవరిది భాధ్యతో.. ఇవన్ని మనకి చిదంబర (సారీ... ఆంటోనీ) రహస్యాలు. ప్రజాస్వామ్యం లో ప్రజలే ప్రభువులు అని చెప్పుకుని, మురిసిపోయి, ముసుగేసుకుని పడుకోవడమే కానీ, పారదర్శకత ఏది. ఇంకా మన రాష్ట్రమే నయ్యం, బురద పోసుకునే బృహత్తర కార్యక్రమం లో అయినా మనకీ కాస్త ఉప్పందిస్తూ ఉంటారు. సైన్యం అంటే ఇప్పటికీ సమాజం లో ఒక తరగని గౌరవం, ప్రతిష్ఠ ఉన్నాయి, కానీ అది కూడా మన క్రికెట్ బోర్డు లాంటిదే అనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయి ఈ వివాదాలు. స్కాములూ. ఏది ఏమైనా మొన్నటి వరకూ తన పుట్టిన తేదీ విషయం లో వార్తలకెక్కిన మన చీఫ్ గారు, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ 14 కోట్ల అంశం ఎందుకు తిరగతోడుతున్నారో ఆయనకే తెలియాలి. UPA-2 కి మధ్యంతరం కళ వచ్చేసిందంటారా ?

Sunday, March 25, 2012

అయ్యో పాపం స్పెన్సర్ ప్లాజా (చెన్నై నుంచి రికార్డెడ్ లైవ్)

వారాంతం లో భార్యను బయటకు తీసుకెళ్ళనివాడు వచ్చే జన్మలో మన్మోహన్ సింగ్ గా పుడతాడని ఏదో సామెత ఉందంట. నిజమో కాదు, ఇప్పుడు మనకి అప్రస్తుతం. ఎందుకైనా మంచిదని, నేను మా ఆవిడని నా డొక్కు పల్సర్ మీద నిన్న సాయంత్రం అలా స్పెన్సర్ ప్లాజా కి తీసుకెళ్ళాను. కొత్తగా పెట్టిన ఎన్నో మాల్స్ ఉండగా అవన్నీ వొదిలేసి ఎప్పుడో క్రీస్తు పూర్వం కట్టిన స్పెన్సర్ కి ఎందుకెళ్ళేమా అనే కాదా మీ అణుమానం, ఏంచెప్పమంటారు, నాకూ స్పెన్సర్ కి ఒక అవినాభావ సంబంధం మరి. ఎక్కడికో దగ్గరికి అని బయలు దేరితే, ఆటోమేటిక్ గా నేను స్పెన్సర్ లోనే ల్యాండ్ అవుతాను. ఈ బంధం ఇప్పటిది కాదు సుమండీ, ఎప్పుడో పదమూడేళ్ళ క్రితం ఒకసారి అన్నా యూనివెర్సిటీ ప్రవేశ పరీక్షకని చెన్నై వచ్చాను, అప్పుడు చూసాను మొదటిసారి ఈ మాల్ ని. వైజాగ్ లో చందనా బ్రదర్స్ ని, ఆసియా లో అతి పెద్దది అని ప్రచారం చేసుకున్న బొమ్మనా బ్రదర్స్ ని, తప్ప మరే పెద్ద దుకాణం దూరం నుంచీ కూడా చూడని నాకు స్పెన్సర్ తెగ నచ్చేసింది. మౌంట్ రోడ్డు మీద (దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే,, విజయవాడ లో బందరు రోడ్డు లేదూ అలానే మరి.. ) ఠీవిగా, దర్జాగా కనిపించే స్పెన్సర్ అంటే నాకో పిచ్చి ప్రేమ. (దీన్ని మీరు ఆకర్షణ అని అన్నా, నేను పట్టించుకోను) ఆరేళ్ళ క్రితం ఉద్యోగ రీత్యా చెన్నై వచ్చాక, వీలు దొరికినప్పుడల్లా స్పెన్సర్ ని సందర్శిస్తూనే ఉన్నాను. ఏ దిక్కూ/కిక్కూ లేని బ్రహ్మచారి గాళ్ళకి మరి ఆ రోజుల్లో స్పెన్సరే పెద్ద దిక్కు. ఆఫీసు పని మీద విదేశం వెళ్ళాల్సి వచ్చినా, నా పెళ్ళి షాపింగ్, మిత్రుల పెళ్ళిళ్ళ షాపింగులూ.. వగైరాలన్నీ స్పెన్సర్ లోనే. మా ఫ్రెంచ్ కొలీగ్స్ ఎవరైనా వచ్చి చెన్నై లో మంచి మాల్ చెప్పమన్నా, నేను తడుముకోకుండా స్పెన్సర్ అంటాను. నేను మెచ్చే మరో అంశమేంటంటే స్పెన్సర్ లో బ్రెడ్ ఆమ్లెట్ నుంచీ బెంజి కారు వరకూ అన్నీ దొరికేవి.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, నిన్నటి రోజు స్పెన్సర్ కి వెళ్ళి చూస్తే గుండె తరుక్కుపోయింది. ఒకప్పుడు పార్కింగ్ ప్లేసు లోపలికి వెళ్ళడానికి మెయిన్ రోడ్డు మీద వరకూ చాంతాడంత లైను ఉండేది.. సైకిల్ గ్యాప్ కాదు కదా, సైకిల్ చైను గ్యాప్ కనిపించినా, టూ వీలర్స్ పెట్టేసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు పార్కింగ్ అంతా ఖాళీ, టోకెన్ ఇచ్చేవాడు సరదాగా జోకులువేస్తూ, మీరు వచ్చారు అదే మహాభాగ్యం అన్నట్టు ఉన్నాడు. మన తొక్కలో బైకుని లారీ రేంజ్ లో పార్క్ చేసినా అడిగే నాధుడు కనిపించలేదు. కొన్ని వాహనాలు అయితే వీళ్ళే మరీ బోసిపోకుండా ఉండటానికి పెట్టారేమో అని డౌటు వచ్చేలా ఉన్నాయి. పార్కింగ్ మాట అలా ఉంచండి, లోనికి వెళ్ళి చూస్తే, మాల్ అంతా నిర్మానుష్యం. ఒకప్పుడు బయట మెట్ల మీద ప్రేమ జంటలు స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ, పాప్ కార్న్ ప్యాకెట్లతో కనిపించేవి. మాల్ లోపలి చల్లదనం డోరు తెరుచుకున్నప్పుడల్ల్లా బయట మెట్లవరకూ వచ్చేది. ఇప్పుడు అసలు డోరూ లేదు. ఏ.సీ లేదు.. లోపాలంతా ఏ సహారా ఎడారిలోనో మార్గ మధ్యంలో గుడారాలు వేసుకుని ఉన్నట్టు జనాలు. అక్కడక్కడ, చమట్లు కక్కుకుంటూ. సందడి చెవిటి మెషీను పెట్టుకుని విన్నా మీకు వినిపించదు. ఎక్కడైనా ATM బయట లైను చూస్తాం, ఇక్కడ ATM లే క్యూలో నిలబడి ఎదురుచూస్తున్నాయి.

ఎస్కలేటర్స్ మీద నేను కుటుంబ సమేతంగా ఎక్కితే, మర్యాద రామన్నలో సునీల్ సైకిల్ లా ఆర్తనాదాలు చేసుకుంటూ కదిలాయి. మా ఆవిడ హర్ట్ అయ్యి, దిగేటప్పుడు మెట్లే అని ఆర్డరు వేసింది. (ఎస్కలేటర్ ఎక్కడం వరకూ ఓ.కే కానీ దిగడం తనకి భయమన్న నిజం నేను మీరు ఎంతబలవంతం చేసినా చెప్పను కాక చెప్పను) ఒకప్పుడు తెల్లవాళ్ళే కనిపించేవారు అంతటా, ఇప్పుడు అక్కడక్కడ నల్ల బురఖాలు తప్ప కొత్తమొహాలు ఏవీ లేవు. వచ్చిన వాళ్ళూ నాలా ఏదో గత జన్మ రుణం తీర్చుకుంటున్నట్టే మొహాలు పెట్టుకుని వచ్చారు. బహుదూరపు బాటసారుల్లా ఓ రెండు రౌండ్లు వేసి, బాటా షాపులోకి దూరాం. ఒక్క సేల్స్ మ్యాన్ పలకరిస్తే ఒట్టు, (బాటా లో ఇది మామోలే లెండి, మా అన్నయ్యకి ఒకసారి చిర్రెత్తి, మీది ప్రభుత్వ రంగ సంస్థా అని అడగనే అడిగాడు), కొత్తల్లా, అసలు కనుచూపు మేర ఎవడూ కనిపించలేదు. నేనే నాకు కావల్సిన చెప్పులూ, సైజూ వెతుక్కుని, ఆపై మా ఆవిడని సంప్రదించి, మొత్తం మీద తనూ నేనూ ఓ రెండు జతలు ఫైనల్ అనుకుని, బిల్లు కూడా వేసుకుందామనుకునే టైం లో ఒకాయనెవడో వచ్చి ఆ తంతుని మాత్రం పద్దతి గా చేసి చిల్లర చేతిలో పెట్టాడు. జేబు రుమాలుతో చమట తుడుచుకుని, షాపు బయటకు వచ్చాం. ఎదురుగా పైన సబ్ వే ఉండాలి, మూసేసి ఉంది. ప్రక్కనే ఉన్న జూస్ షాపు నేడో రేపో అన్నట్టుంది. రేనాల్డ్స్ పెన్నులు మాత్రం పెద్ద దుకాణం పెట్టి అమ్ముతున్నారు, వాళ్ళ రికార్డుల ప్రకారం లాస్ట్ కస్టమర్ గత సంవత్సరరం అన్నా హజారే దీక్ష అప్పుడు వచ్చాడంట. అదీ పరిస్థితి. అలా ఫుడ్ కోర్టువైపు నడిచామా, అక్కడ ఇంకా ఘోరం. షాపులు నడిపే జనాలే తప్ప కస్టమర్స్ కాన రారే.. KFC, శరవణా భవన్ ఇంకే గ్రహం మీదా ఇంత ఖాళీగా ఉండవంటే నమ్మాలి. ఏదో కాస్త పొట్టలో పడేసుకుని, ఓ లెమన్ సోడాతో (విత్ సాల్ట్.. ;-)) గొంతు తడుపుకుని మాల్ బయటకి వచ్చాం. నాకైతే మనసు మనసులో, హెల్మెట్ చేతిలోనూ లేదు.. ఎమిటీ దారుణం, ఎందుకీ వివక్ష.. ఓ ప్రక్క ఎక్స్ ప్రెస్ అవెన్యూ, స్కై వాక్.. ఆఖరికి ఆరడుగులు ఉండే సిటీ సెంటర్ కూడా అసలు ఇసుక వేసినా రాలనంత హడావిడి గా ఉంటే, పాపం స్పెన్సర్ కి మాత్రం ఎందుకీ కష్టం. మన వాళ్ళకెప్పుడూ కొత్త వింతే, తెలిసిందే, కానీ అడుగడుగునా మనకు తోడొచ్చిన స్పెన్సర్ ని ఇలా ఎలా వదిలేయగలం. VLCC ప్రకటనలో కుడివైపు ఫొటో లా ఇలా చిక్కి శల్యమైన మన అభిమాన మాలు ని మనం కాక మరెవరు ఉధ్ధరిస్తారు, ఆదుకుంటారు.. తప్పదు. అందుకే నేను బ్లాగు ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, చెన్నై లో ఉన్న వాళ్ళందరూ స్పెన్సర్ కి అప్పుడప్పుడైనా వెళ్తూ ఉండండి, మీరు ఏమీ కొనకపోయినా పర్వాలేదు, స్పెన్సర్ కి మనం ఉన్నాం అనే భరోసా ఇవ్వాల్సిన తరుణం ఇది. ప్రక్క వూళ్ళ నుంచి టాక్సీలు కట్టించుకుని కేజీల లెక్కన బంగారం కొనడానికి వచ్చేవాళ్ళూ ఈసారి షాపింగ్ మరి కొంతైనా స్పెన్సర్ లో చెయ్యగలరు. (చిప్స్ ప్యాకట్లు కాదు). కొత్త మాల్స్ కి వెళ్ళి గంటకో ఏభై పార్కింగ్ కి సమర్పించుకుంటే కానీ మీకు థ్రిల్ రాదా ? స్పెన్సర్ లో రెండుగంటలకి పది రూపాయాలే, అది కూడా రద్దయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకుని, మెత్తటి తెల్లటి తువ్వాల్లాంటి జేబు రుమాలు పట్టుకుని వెళ్ళారంటే, మీకు స్పెన్సర్ ఏమాత్రం తక్కువ చెయ్యదు. మీ షాపింగ్ అనంతరం, బయటకు వచ్చాక ఆటో కావాల్సి వచ్చినా, రోడ్డు మీద మీకోసమే ఎదురుచూస్తున్నట్టు ఉన్న ఆటో ని మాత్రం పొరపాటున కూడా బేరమాడకండి.. మీ ఇల్లు అమ్ముకుని మరీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. నాలుగు అడుగులు స్టైల్ గా నడిచి, అప్పుడు బేరమాడుకోండి. ఏంపర్వాలేదు, ఈమధ్య మా ఆటో వాళ్ళు సులభ వాయిదా ఆప్షన్ కూడా ఇస్తున్నారు.

కామెడిగా చెప్పినా, విషయం లోని సీరియస్ నెస్ మీకు అర్థమయ్యే ఉంటుంది లెండి. స్పెన్సర్ ని పాల ముంచే బాధ్యత మనందరిదీ, గుర్తుపెట్టేసుకోండి.

హమ్మయ్యా.. ఇప్పుడు గుండె కాస్త తేలిక పడింది. ఏదైనా చెప్పుకుంటేనే కదా బ్లాగుకి.. మనకీ అందం. ఇంకో విషయమండోయ్, అంతటి ఎడారి నిశ్శబ్ధంలోనూ అడపాదడపా మన అచ్చ తెలుగు గొంతులే వినిపించాయి. నా భ్రమ అని కొట్టిపారేయకండి, మన వాళ్ళకి మిగాత కొత్త మాల్స్ చిరునామాలు ఇంకా సరిగ్గా తెలీవేమో అని నా నమ్మకం.. ;-)

Friday, March 23, 2012

నందనానికి నా విన్నపాలు

శ్రీ ఖర నామ సంవత్సరం కటువుగా, కఠినంగానే కదిలినా, మూసుకుపోయిన కళ్ళను కాస్త తెరిపించి మరీ వెళ్ళింది. మండుటెండలతో ముందుకొచ్చిన నందనం మనలో మరింత చైతన్యం నింపి, సుఖసంతోషాలతో, పండగ సంబరాలతో అలరించాలనీ ఆశిద్దాం.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు

నందనమా, ఇవిగో నా విన్నపాలు.. కాసుకో...

'కాగ్' అక్షింతలతో సరిపుచ్చక, ఈసారి కారం జల్లాలని..
వచ్చే ఎన్నికల్లో అయినా, ఓటరు గెలవాలని..
చిందు, విందు లేకపోయినా ఓకే..
బందులు బందవ్వాలని,
బస్సు టికెట్లు దొరక్కపోయినా పర్వాలేదు..
అవి రోడ్డుమీదే నడవాలని,
పెట్రోలు ధరలు ఎలానో మండుతాయి..
కనీసం శరవణా భవన్ కాఫీ రేటు కుదురుగా ఉండాలని,
ప్యాకప్పో, ప్యాకేజో, ఎవరికి తెలుసు..
చెన్నై లోని తెలుగోళ్ళని తరమకుంటే చాలు,
ప్రమోషన్ మాటేమో గానీ..
మాంద్యం పేరుతో ఉన్నది ఊడకుంటే అదే పదివేలు,
కార్లు.. షికార్లు.. వికార్లు.. వద్దే, వద్దు..
నా నల్ల (మంచి) పల్సర్ పంచరవ్వకపోతే అదే ముద్దు.

(మనలో మన మాట, ఈ ఉపగ్రహ ఛానళ్ళు లేని రోజుల్లో, ఈ సంస్థలన్నీ మనకి శుభాకాంక్షలు ఎలా చెప్పేవో మరి.. ఉదయం నుంచీ టీవీ లో వినీ వినీ చిరాకొస్తోంది)

Monday, March 19, 2012

సచిన్ సచిన్ సచిన్

సచిన్ వంద సెంచరీలు.. లేక వందవ సెంచరీని విశదీకరించి మిమ్మల్ని మెప్పించడానికి నేను క్రీడా విశ్లేషకుణ్ణి కాను. ఏదో నేలబారు క్రికెట్ అభిమానిని. ఈ మధ్య నా బ్లాగు ప్రయాణం మరీ నత్త నడకన (అంటే మన UPA పాలనలా) సాగుతున్నా, సచిన్ సెంచరీ తరువాత నాలుగు మాటలు రాసుకుని నేనూ చరిత్ర పుటల్లో (అదేనండీ బ్లాగు పుటల్లో) ఎక్కిపోదాం అని మొదలు పెట్టా. ఇందులో మీరు హర్ట్ అయ్యి చిర్రుబుర్రులాడటానికి ఏమీ లేదు, ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే (అది కూడా ప్రస్తుతానికి).

కొన్ని రోజుల క్రితం స్నేహితుడొకరు అబ్బాయి పుడితే సచిన్ అని పెరు పెట్టాడు, ఇదేం చోద్యం అనుకుని అడిగిచూసా. (వాళ్ళ నాన్నగారి/తాతగారి పేరు సత్యనారాయణ ఏమో అని అనుమానం కూడా కలిగింది ఎక్కడో ఓ మూల... ) కానీ వాడిచ్చిన వివరణ విన్నాక క్లారిటీ వచ్చింది. వాడికి సచిన్ అంటే వల్లమానిన ఇష్టంట.. జీవితం లో ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పుడల్లా సచిన్ నే తలచుకునే స్పూర్తి పొందుతాట్ట, (అంటే మన్మోహన్ రాహుల్ గాంధీ ని తలచుకున్నట్టు అన్నమాట) అందుకే దానికి గుర్తు గా పిల్లాడికి సచిన్ అని పేరు పెట్టుకున్నానని తేల్చాడు. ఇంకేమంటాం. ఎవడి ఓటు వాడిది కదా. ఒరేయ్, మరి ఆ వందో సెంచరీ కొట్టకపోతేనో అని నా మనసులో ఉన్న భయాన్ని కక్కేసా.. వాడు నిదానంగా నేను ఆ ముందు 99 సెంచరీలూ చూసి పెట్టారా అన్నాడు. అమ్మో వీడి అభిమానం ముందు మన కుప్పిగెంతులు రిస్కేమో అనిపించి ఇంక ఆగిపోయా.

నిజానికి ఫిక్సింగ్, IPL/లలిత్ మోడీ, వగైరాల పుణ్యమా అని నేను క్రికెట్ కి తెలీకుండానే దూరమైపోయాను. ఈ మధ్య అయితే మన టీం లో కన్నా ప్రక్క టీముల్లోనే తెలిసిన పేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైనల్ కి వెళ్ళాలంటే ఎన్ని పాయింట్లు.. వెళ్ళకూడదంటే ఎలా ఓడిపోవాలి.. ఇలాంటి చర్చలు అర్థం చేసుకోవడం ఎప్పుడో మానేసాను. కానీ ఇప్పటికీ సచిన్ అంటే అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. భారతీయ క్రికెట్ ని రెండు భాగాలుగా వర్ణించవచ్చు.. ఎందుకంటే ఒక భాగం మొత్తం సచిన్ కే కేటాయించాలి. కనీసం మా తరం వరకూ (అంటే ఎంసెట్ లో సీట్ల కన్నా అభ్యర్థులు ఎక్కువ ఉన్న తరం) సచిన్ దారిచూపే శిఖరం. దాని మెరుగులు.. ఎత్తులు లెక్కపెట్టడం ఎప్పుడో ఆపేసాను, అతని నుంచి నేను ఏం నేర్చుకున్నానా అన్నది మాత్రమే అసలు విషయం.. నా వరకూ. కొన్ని విజయాలు జాతిని ఏకతాటిపై తెస్తాయి, సచిన్ కెరీరు కూడా అలాంటిదే. మొన్న మా మామయ్య ఫోను లో మాట్లాడుతూ ఒక మాటన్నాడు, సచిన్ సెంచరీలు జట్టు గెలుపుకి ఎంత దోహదపడ్డాయి అని లెక్క పెడుతున్నారు, మరి 90 లో అవుటయిన ఇన్నింగ్స్ మాటేమిటి అని. సచిన్ ని ఎవరైన విమర్శిస్తే, ఆ విమర్శలోనూ, నాకు దాగున్న అభిమానమే కనిపిస్తుంది. యువతరం యేభైలకి చేరువులో ఉన్న షారుఖ్ నీ అమీర్ నీ ఎంత ఫాలో అవుతోందో తెలీదు కానీ, సచిన్ అనే వెలుగు కిరణం మరికొన్ని తరాల వరకూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. నిశ్శబ్ధంగా.

అత్యుత్తమ స్థాయి పరిశ్రమ, నైపుణ్యం, క్రమశిక్షణ, ప్రదర్శన.. అంతకు మించిన మాడెస్టీ, హ్యుమిలిటీ.. అన్నీ కలిపి సచిన్. కొందరు దేశం కోసం బ్రతుకుతారు.. మరికొందరు దేశాన్ని తమతోపాటూ నడిపిస్తారు. కానీ చాలా కొద్దిమంది జాతిని చైతన్యంతో నింపి తమలా తయారు చేస్తారు. వారిలో నేను సచిన్ ని ముందు నిలబెడతాను. (ఇది కేవలం నా అభిప్రాయం, వ్యక్తుల ప్రభావం, వాళ్ళలో మనం ఏంచూస్తున్నాం అనే దాని మీద కూడా ఆధారపడుతుంది)

సచిన్ క్రీడా నైపుణ్యాన్ని ఈ సంఖ్యలు కొలవగలవో.. లేదో.. నాకు అనుమానమే. కానీ వాటితో అతని వ్యక్తిత్వాన్ని మాత్రం ఖచ్చితంగా సరితూచలేం.. అది కొన్ని తరాలని జీవితాంతం ప్రభావితం చేసిన వ్యక్తిది.. అంతమాత్రం చెప్పగలం. సచిన్ లో ఉన్న ఆటగాడికి ఏదో ఒక రోజు విరమణ తప్పదు, కానీ అది సచిన్ కి కాదు.. అతని దీక్ష కీ కాదు.. అతని ప్రభావానికి అంతకంటే కాదు.

చివరిగా ఒక మాట, భారతరత్న అన్నది నిజంగా జనం హృదయాల్లోంచీ వచ్చేదే అయితే, అది సచిన్ కి ఎప్పుడో వచ్చింది. కొత్తగా అవార్డు ఇచ్చి మనం సాధించేది ఏముంది ?

(సచిన్లో నాకు నచ్చనిదీ ఒకటుందండోయ్.. ఆ ల్యూమినస్ ఇన్వర్టర్ వ్యాపర ప్రకటన.. దానికి తోడు తెలుగు డబ్బింగ్ మరీ ఘోరం, ఎవరో గుజరాతీ వాళ్ళు చెప్పినట్టున్నారు.. ;-) )

Friday, February 24, 2012

పందుల దొడ్డా.. లేక బందెల దొడ్డా..

ఎవడైనా మనల్ని వెధవన్నర వెధవా అన్నాడనుకోండి, మనం హర్ట్ అవుతామా లేదా. మరి అలా నొచ్చుకున్న తరుణంలో, తిట్టిన వాడు నాలిక కరుచుకుని, అయ్యో సారీ.. నేను వెధవన్నర వెధవా అనలేదు.. కేవలం వెధవా అని మాత్రమే అన్నాను.. అంటే ఎంత రిలీఫ్.. మరియు ఓదార్పు.. నువ్వు పందివి కాదురా, దున్నపోతువు మాత్రమే అంటే అంతకు మించిన పొగడ్త ఉందా ?

సేం టూ సేం అదే ఫీలింగ్ మన శాసన సభకి ఈ రోజు. ఎర్ర బుస్కోటు వేసుకుని కోడి కూర తింటూ వీధి పోరాటాల్లో దర్శనమిచ్చే నారాయణ గారు, శాసన సభని పందుల దొడ్డి తో పోల్చారని మీడియా అంతా కోడై కూసింది. ఇంతలోనే పశ్చాత్తాపంతో (సభా హక్కుల ఉల్లంఘన వల్ల కాదేమో లెండి) ఆయన, నేను అన్నది బందెల దొడ్డి అని.. పందుల దొడ్డి కాదని వివరణ ఇచ్చారు. ఇందులో మనం మన శాసన సభ గౌరవం ఎంత ఇనుమడించిందో తెలుసుకోవాలని మనవి. ప్రజాస్వామ్యం విలువలు అత్యున్నత స్థాయికి చేరుకున్నందుకు మనం గర్వపడాలి. సంతోషించాలి. కానీ మీతో నాకున్న చనువు కొద్దీ చెప్తున్నాను, మన శాసన సభ్యులు పశువుల (లేక పందుల) నుంచీ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. వాటి క్రమశిక్షణ వీళ్ళకేది ? అవి వాటిలో అవి అర్థం లేకుండా తన్నుకోవు, ఒకవేళ లోక కల్యాణం కోసం తన్నుకున్నా మనల్ని లైవ్ లో చూడమనవు. జట్టుకట్టి ఆ జట్టుని మరొకడి దగ్గర తాకట్టు పెట్టవు.. మేత లేదని ఊరి మీద పడి ఇళ్ళు దోచుకోవు.. ఫోనుల్లో బూతు వీడియోలు చూడవు.. అన్నిటికన్నా ముఖ్యం గా మన మొహాన పేడ కొట్టవు, అంతో ఇంతో సాయమే చేస్తాయి. ఈ లక్షణాల్లో ఒక్కటైనా ఉందా మన MLA లకి ?

అయినా.. నాకు తెలీక అడుగుతున్నాను.. అసెంబ్లీ ని పందుల దొడ్డితో పోలిస్తే, ఇబ్బంది ఉంటే గింటే పందులకుండాలి కానీ, మన సభ్యులకు ఏంటంట అవమానం ? నా బ్లాగు వరకూ మాత్రం నేను నారాయణ గారి వివరణని గౌరవిస్తున్నాను. మరి ఏ ఏభైయేళ్ళకో ఇది చారిత్రక తప్పిదం అని ఒప్పుకుని మాట మారిస్తే చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి మాత్రం బందెల దొడ్డే ఫైనల్. లాక్ చేసేద్దాం.

Tuesday, February 14, 2012

అమ్మ అంటే కేవలం త్యాగమేనా ?

ఆదివారం వైజాగ్ నుంచి అమ్మతో చెన్నై వస్తూంటే, ఏవో ఆలోచనలు మెదిలాయి మనసులో. మీతో పంచుకోవాలని అనిపించి ఈ టపా మొదలుపెట్టాను. (కొన్ని వాక్యాలు పరస్పర విరుద్ధం గా తోచచ్చు.. మరికొన్ని అసంపూర్ణంగా.. తప్పు మనసుదే అయ్యుంటుంది మరి. ;-) )

అసలు ప్రయాణం అంతా మాటల్లోనే అయిపోతుందేమో అనుకున్నాను, కానీ ఆలోచనలు అలసి ఆగితే కదా భావాలు భాషగా బయట పడడానికి. నాకు తెలీకుండానే ఒక్కోసారి గతం వర్తమానం అయిపోతుంటుంది. నేనూ మళ్ళీ బ్రతికేస్తుంటాను.. ఒకే అనుభవం గుర్తొచ్చిన ప్రతీసారీ నిత్య నూతనంగా కనిపిస్తుంది.. అయినా అమ్మకి నేను కొత్తగా ఏంచెప్పను ? నా నిశ్శబ్ధాన్ని నాకంటే బాగా అర్థం చేసుకోగలిగేది ఆమె తప్ప మరెవరు ?

ఎందుకో సడన్ గా ఒక వాక్యం తట్టింది నాకు.. "అమ్మ లేకపోతే నేను లేను.. కానీ నేను లేకపోయినా ఆమె ఉంది.. ఆమెకంటూ ఒక జీవితం ఉంది".. లోతుగా ఆలోచించాను. అమ్మే నా అస్తిత్వం. నాకు జన్మనిచ్చింది. ఆమె లేకపోతే నేను లేనే లేను. కానీ ఆమె జీవితం లో నా పాత్ర ఎంత ?

మార్గ మధ్యంలో అమ్మ కూడా ఏవో గుర్తు చేసుకుంది, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా కలిసి ప్రయాణించాం.. ఇలాంటి వివరాలు.. అమ్మకు జ్ఞాపకాలే ఊపిరి. నేను టచ్ లోనే లేని నా స్నేహితుల పేర్లు అమ్మకు ఇంకా గుర్తే.. అమ్మకి నా గతం జీవితం కాబోలు. అందుకే నేను మర్చిపోయిన సంఘటనలూ అమ్మకి కంటికి కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి నేటికీ.. ఆ గతం ఆమెకి ఒక గర్వాన్నీ/సంతృప్తినీ ఇస్తుంది. దాన్ని నేను గౌరవిస్తాను మనసారా. బిడ్డకి అయిన గాయాలు కాలంతో పాటూ మానిపోతాయి, కానీ ఆ కన్నీళ్ళు తనవిగా చేసుకున్న తల్లి ఎలా మరువగలదు ?

ఏవో ఆలోచనలు.. వ్యక్తిగా అమ్మని నేను అర్థం చేసుకున్నాను, ప్రేమించాను. గౌరవించాను. ఆమె జీవితంతో పోరాడింది, మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టడానికి.. అవి గుర్తొస్తే కళ్ళు చమరుస్తాయి.. కలలోనైనా.. అంతకు మించి ఆమె వ్యక్తిత్వం నాకు స్పూర్తి. ఆదర్శం. కానీ అమ్మ అంటే త్యాగమేనా.. కాదేమో. ఆమె తనదైన జీవితాన్ని, తనకు నచ్చినట్టు గడపాలి అని నా కోరిక. అందులో నేనూ భాగం అవ్వాలని ఆశ పడతాను, అంతేకానీ దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చెయ్యను. అమ్మలో ఉన్న మామోలు మనిషి ని తన బలహీనతలతో సహా నేను అంగీకరించాలనుకుంటాను. ఎందుకంటే ఆ మనిషి నాకు ప్రాణ మిత్రుడు.. ఆత్మ బంధువు.

పురాణాల నుంచీ నేటి తరం కథల వరకూ అమ్మ పాత్ర అంటేనే ఒక ఔచిత్యం.. పిల్లల కోసం గుండెనే కోసి ఇచ్చేసే అంతటి త్యాగం, ఎన్ని తప్పిదాలైనా చిరునవ్వుతో క్షమించేసే సహనం.. కానీ అమ్మ కూడా ఒక సాధారణ వ్యక్తే కదా ? ఆమె జీవితాంతం త్యాగాలు చేస్తూనే ఉండిపోవాలా ? తనకంటూ కోరికలు, ఆశలూ ఉండవా ? బాధ్యతలు నెరవేర్చాక అమ్మకి జీవితం ఏమిచ్చింది ? ఆ జీవితం నుంచి ఆమె ఏం ఆశిస్తోంది ?

ఈ ప్రశ్నలన్నిటికీ నాకు నేను సమాధానాలు చెప్పుకునే ప్రయతం చేస్తున్నాను.. నిజాయితీగా.

"అమ్మ నా తప్పటడుగులని భరించి.. సరిదిద్ది.. నడక నేర్పింది.. పరుగులో పడిపోయి ఏడ్చినప్పుడల్లా.. ఓదార్చి, వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఆమెకు ఆసరాగా నేను నిలిచే క్షణాన... నా చేతికి ఆమె గుండె బరువు మోసే సత్తువని ఇవ్వమని.. ఆమె మనసుకు గాయమైతే నా కంట నీటినొలికించమని ఆ దైవాన్ని ప్రార్ధిస్తున్నాను"

మొన్నెప్పుడో రాసుకున్న వాక్యాలు ఇవి..

"అమ్మతో మాట్లాడని రోజు అసంపూర్ణం గా అనిపిస్తుంది..
పంచుకోని ఆనందానికి అర్థమే లేదనిపిస్తుంది..
ఆమె అంతరంగం అంతేలేని సాగరం..
ఆమె జీవితం.. తరచి చూసుకోవాల్సిన పుస్తకం.
దేవుడు ఎప్పుడూ నాకు ఎదురుపడనేలేదు...
అమ్మ నా చేయి ఎప్పుడూ వదలనేలేదు. "


(ఈ రోజు అమ్మ గురించి రాయడం యాధృచ్చికమే కావచ్చు, కానీ నాకు ఎంతో అర్థవంతం గా అనిపించింది. మనిషి జీవితంలో తల్లి ప్రేమను మించినదేముంది ? )

Wednesday, January 25, 2012

లేఖిని తో వచ్చిన కష్టాలు.. మరియు "టా".. లు :-)

తెలుగు బ్లాగర్లందరి లానే నేను కూడా నా ఓనమాలు లేఖిని లోనే దిద్దాను. అందుకే నాకు లేఖిని అంటే అమిత మైన అభిమానం. మిత్రులెవరైనా ఇంకో టూల్ వాడితే నాకు వొళ్ళు మండుతూ ఉంటుంది. అమ్మ చేతి వంటని ఎంచితే ఊరుకుంటామా.. కానీ ఈ అనురాగం నాకు చిక్కులు తెచ్చిపెడుతుందనీ, నన్ను అబాసు పాలు చేస్తుందని.. మధ్యాహ్నం నిద్రలో కూడా ఎప్పుడూ కల కనలేదు. నా వ్యథని మీకు చెప్పుకోకపోతే ఇంక ఆ వ్యథకి.. మన బంధానికి అర్థమే లేదు కదా అందుకే మొదలు పెట్టా.. ఈ టపా..

లేఖిని నిర్వాహకులు నొచ్చుకోకుండా, నా బాధల్ని మానవతా దృక్పథం తో చూసి, ఓదార్పు యాత్రకి వస్తారని కోరుకుంటున్నాను.

ఈ మెయిలు అన్నది పుట్టినప్పటి నుంచీ నాకు తెలుగు లో మెయిల్స్ రాయడం అలవాటే, (మనకి వచ్చిన నాలుగు ఇంగ్లీషు ముక్కలతో ఎదుట వారిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని ). ఈ క్రమం లో నేను తెలుగు ని ఇంగ్లీషులో రాయడం బానే అలవాటు చేసుకున్నాను. ఎంతంటే కొన్ని పదాలు తెలుగు లో రాయడమే మరచిపోయానంటే నమ్మండి... ఇలా ఏదో గుట్టు చప్పుడు కాకుండా నెట్టుకొస్తున్న నాదైన టెంగ్లిష్ నావకి లేఖిని పరిచయం (మా ఆవిడ చదువుతూ ఎవరో అమ్మాయి పేరు అనుకోదు కదా.. :-)) ఒక్క కుదుపు కుదిపింది. నాన్నా, భాస్కర్ అని రాయడం అంటే, "bhaaskar" అని రాయాలి అని మొదటి రోజే ఓ జెర్క్ ఇచ్చింది. ఇదేదో బానే ఉంది కదా, రెండు రెళ్ళు ఆరే కదా అని అనుకుని, తెగ సంబర పడి, మెల్లగా, మెల్లగా లేఖిని ఒరవడికి అలవాటు పడిపోయాను. పడ్డవాడెవ్వడూ చెడ్డవాడు కాదని, ఏదో నాలుగు మాటలు అచ్చ తెలుగు ఫాంటు లో చూసుకుని, దేవులపల్లి, శ్రీశ్రీ తరువాత నేనే అని ఫీల్ అయిపోవడం మొదలెట్టాను. అడపదడపా రాసే బ్లాగు పోస్టు తెలుగు లోనే రాసుకుంటూ, ఇద్దరే ఇద్దరికి దాని గురించి చెప్పుకుంటూ.. (ఆసక్తి ఉన్నవాడికి.. లేని వాడికి) ఏదో నా బ్లాగు ప్రయాణం కొనసాగిస్తున్నాను. ఇంతలోనే నేను అనుకోని ప్రమాదం ముంచుకొచ్చింది. మామోలు ఈమెయిల్స్ లో ఎప్పటిలానే నేను టెంగ్లిష్ మాటలు రాయలేకపోతున్నాను అని కొంచం లేట్ గా... లేటెస్టు గా గ్రహించుకున్నాను. ఇంతకు మునుపు హ్యాపీ గా "happy" అని రాసుకునే వాణ్ణా, ఇప్పుడు "hyaapii" అని రాయడం మొదలు పెట్టాను. (చూడ్డానికి అదేదో పెంపుడు పిల్లి పేరు లా లేదూ.. ? ) "tha" లన్నీ "ta" ల గా మారిపోయాయి.. "dha" లేమో పాపం "da" లగా.. ఎన్ని తప్పులో.. తిప్పలో చూడండి. "chetallo" (చేతల్లో) చూపిస్తానని రాస్తే, మొన్నెవరో అది చేటల్లో అనుకుని అపార్థం పడిపోయారు. "neekuu" ( నీకూ ) అని రాస్తే, అదేదో కావాలనే "యూ" అని నొక్కి వక్కాణిస్తున్నానని మిత్రుడు ఫీల్ అయ్యాడు. "కొత్తగా" అనడానికి బదులు "కొట్టగా" అంటే.. ఎవరూరుకుంటారు.. ఆంగ్ల మాటలని తెలుగు లో ఖూనీ చేసేస్తున్నానండీ చేసేస్తున్నాను.. తెలుగు నేమో నాదైన టెంగ్లిష్ లో.. అలా అని పొనీ క్యాపిటల్ లెటర్స్ అయినా వాడుతున్నానా అంటే ఆ సోకూ లేదు. సో మొత్తానికి నా వాక్యాల్లో అదేదో జాంబియా జుంబో భాష లాగ బోలుడన్ని సౌండ్లకి ఒకేలా అక్షరాలు కనిపిస్తున్నాయి. చదివే వాళ్ళకి ఎలా వినిపిస్తోందో.. ఎవరికి తెలుసు..

నా మానాన నేనేదో గుంపులొ గోవిందు గాడి లా లాక్కొచ్చేస్తుంటే, ఈ లేఖిని చూడండి నా తాట ఎలా తీసిందో. ఇప్పుడు తెలుగూ లేక.. టెంగ్లీషూ లేక.. ఒంటరిని అయిపోయాను.. ఇంక ఈ-మెయిలు కు ఏమని పోను ? నిన్నటికి నిన్న ఒక ఇంగ్లీష్ పదాన్ని తెలుగు పదం అని వాదిస్తుంటే, ఫ్రెండ్ ఒక అమ్మాయి తన సానుభూతిని చూపింది నా మీద. ఇప్పుడు ఇదే ఊపులో నేను రేపు ఏ C++ ప్రొగ్రాం లోనో ఇలా రాయడం మొదలు పెడితే కంపైలర్ ఏమైపోవాలి.. మీరే చెప్పండి. అసలే ఆర్థిక సంక్షోభం.. ఆపైన ఇంటికోసం తీసుకున్న లోను.. మనసున్న వాళ్ళు.. ఓ మార్గం చెప్పండి మరి.

పొనీ ఇంత లేఖిని హ్యాంగ్ ఓవర్ లో, తెలుగు బ్లాగు ఏమైనా స్పీడు గా రాస్తున్నానా అంటే అ ముచ్చటా లేదు.. రాద్దామనుకున్న నాలుగు లైన్లు కొద్దిపాటి తప్పులతో పోస్ట్ చెయ్యడానికి గంటలు పట్టేస్తోంది.. ఇప్పుడు ఏమిటి తక్షణ కర్తవ్యం.. మెయిల్స్ కూడా అచ్చ తెలుగు లో ఇచ్చేద్దామా అంటే, ఈ ఇంగ్లీషు చదువు గాళ్ళకి తెలుగు చదవడమే రాదాయే.. మన "ప్రేమ" వాళ్ళకి "దోమ" లా కనిపించచ్చు.. పర్వాలేదు అనుకున్నా.. "దోమ".. "ప్రేమ" అయిపోతే కొంప కొల్లేరైపోదూ.. లేని పోని రిస్క్ కదా...

ఏదో లెండీ.. సీత కష్టాలు సీతవి.. నా కష్టాలు నావి.. సెల్వ స్వామి కష్టాలు.. మా ఆవిడవి.. (మీరు మొగలి రేకులు చూడకపోతే అది నా తప్పు కాదు) అందుకని మీ బుర్రలు పాడు చేసుకోకండి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. పది మైళ్ళవతల మీ ఆఫీసు ఉంటే రోజూ పదకొండు మైళ్ళు వెళ్తూ ఉండండి.. ఏదో ఒకరోజు మీరు సొంత బిజినెస్సు పెట్టుకోవాల్సి వస్తుంది.

Sunday, January 15, 2012

మాఫియా మాన్

గాడ్ ఫాదర్ నుంచీ డాన్ వరకూ, నాయకుడు నుంచీ సర్కార్ వరకూ.. నేర సామ్రజ్యాన్ని ఒక స్టైల్ తో సెలెబ్రేట్ చేస్తూ తీసిన చిత్రాలు చాలా ఉన్నాయి. మరీ ఎక్కువ ఆలోచించకుండా చూస్తే అవో కిక్ ఇస్తాయి. ఆ ధోరణిలోనే మరో సినిమా బిజినెస్ మాన్. మాఫియా కథాంశమే అయినా, పూరీ తనదైన పంచ్ డైలాగ్స్ తో కొంచం వింతగా తీసాడు. మిగతా మాఫియా చిత్రాల్లో ఉండే సీరియస్ నెస్ కానీ, కన్విక్షన్ కానీ ఈ చిత్రం లో మీకు ఎక్కడా కనిపించవు. ఇదీ కథ అని చెప్పడానికీ, ఈ పాత్ర నచ్చింది అని మురిసిపోడానికీ, హాలు బయటకు వచ్చాక ఓ రెండు పాటలు గుర్తుకు తెచ్చుకోడానికీ అవకాశం లేదు కాబట్టి, సమీక్ష రాసే ధైర్యం చెయ్యడం లేదు. మహేష్ బదులు పూరీ జగనే హీరో పాత్ర చేసినా నాకు ఏ అభ్యంతరం లేదు. అక్కడక్కడ దూకుడు షేడ్ కనిపించినా, ఇది మొత్తం మీద పూరీ మార్కు సినిమా. వర్మా చిత్రాలకు ఒక ట్రిబ్యూట్ అని కూడా చెప్పుకోవచ్చేమో. సన్నివేశాల తీరు పూరీ ఆ మధ్య తీసిన "అమితాబ్' బుడ్ఢా" ని గుర్తు చేస్తాయి. హీరో తప్ప మిగతా అన్ని పాత్రలకీ సీన్లూ తక్కువే, సీనూ తక్కువే. కానీ సంక్రాంతి మూడ్ లో చూసొస్తే మిమ్మల్ని ఆట్టే ఇబ్బంది పెట్టని చిత్రమిది. దూకుడు కామెడీనీ నమ్ముకుంటే, ఇది పూర్తిగా హీరోనే నమ్ముకుంది. ఇలాంటివి మరో రెండు సినిమాలు చేస్తే ఇంక మహేష్ బోరుకొట్టడం ఖాయం.. అప్పుడు మళ్ళీ ఏ అల్లూరి సీతారామరాజో తీసుకోవాలి.

మరో మాటండోయ్, సినిమాకి "A" సెర్టిఫికేట్ ఇచ్చారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళకండి. హీరో పాత్ర అలా బూతుల్ని వల్లిస్తూనే ఉంటుంది (మన టైం బావుండి కొన్ని మనకి వినిపించవు), హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర చేత తెలుగు ని కనీసం ఓ వందసార్లు హత్య చేయించారు, అతి దారుణంగా. ఒకటి రెండు చోట్ల మీకు చాచి ఒక్కటివ్వాలనిపిస్తుంది. ఈ సినిమాలో అసలు సస్పెన్స్ విషయం ఏంటా అంటే, హీరో హీరోయిన్లు ఎప్పుడు ప్రేమలో పడ్డారన్నదే. ఈసారి వోల్వో బస్సు లో చూసినప్పుడు నోట్ చేసుకుని మీకు మళ్ళీ విన్నవించుకుంటాను. (అయినా హీరో హీరోయిన్లు ప్రత్యేకంగా మళ్ళీ ప్రేమలో పడాలా ఏంటి.. మరీ చాదస్తం కాకపోతే.. ) తెలుగు చిత్రాల్లో "దూకుడు" ఒక బెంచ్ మార్క్ అవ్వగల్గినప్పుడు, బిజినస్ మాన్ భారీ హిట్టు కొడితే మనం ఏమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నేటి యువ తరం ప్రేక్షకులకి కావాల్సింది కేవలం ఎంటర్టైన్ మెంట్, అది న్యూస్ లో అయినా.. సినిమాలో అయినా. (బహుశా సొంత జీవితంలో అయినా..)

సరదాగా ఒకసారి చూడదగిన చిత్రమే, మరీ మీ ఊర్లో చొక్కాలు చింపుకుని వెళ్ళే పరిస్థితి ఉంటే, ఓ రెండ్రోజులు ఆగి వెళ్ళండి, ఏంపర్వాలేదు. చెన్నైలో అయితే తేలిగ్గానే దొరుకుతున్నాయి టికెట్లు. మీరు ఎవరితోనూ అనరనే నమ్మకంతో చెప్తున్నాను, ఈ సినిమాకు టైటిల్ నన్ను పెట్టమని ఏ తలమాసిన వాడైన అడిగి ఉంటే "బలుపు" అని పెట్టేవాణ్ణి.

ఓ.కే మరి.. మరొక టపాలో కలుద్దాం,.. అన్నట్లు.. "సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ"..

Friday, January 13, 2012

ఒక జత బాటా జోళ్ళ కథ (ముగింపు.. ముక్తాయింపు)

నేను జరిగిన కథ చెప్పేలోపు మీరు మీకు తెలిసిన సీరియల్ టైటిల్ సాంగ్ పాడుకోగలరు. ఉదా : "ఎందుకో నాకు ఈ చెప్పులూ.. ఎందుకో నాకు ఈ తిప్పలూ", "విరిసే విరిసే బాటా చెప్పులు.. విరిసే విరిసే బాటా చెప్పులు"..
ఓ.కే.. అయిపోయింది జరిగిన కథ. మీరంతా ఈ సస్పెన్సు ని భరించలేక, ప్రక్కవాళ్ళ గోళ్ళు/వేళ్ళూ కూడా కొరికేస్తున్నారని తెలిసింది.. ఇంక ముగింపు విషయానికి వస్తాను. కొన్ని రోజుల వ్యథ తరువాత నేను ఆ పోయిన చెప్పుల సంగతి మరచేపోయాను. పాపం ఆడవాళ్ళకి మరుపు దేవుడు బై బర్త్ ఇవ్వలేదు కాబట్టి మా ఆవిడ అప్పుడప్పుడు తలుస్తూనే ఉంది. ఇంతకీ నేను మీకు గత టపా లో చెప్పినట్టు ఒళ్ళు గగుర్పాటు పొడిచే సంఘటనలు ఏమీ జరగలేదు కానీ, దాదాపు గా అంత షాకూ తగిలింది. ఉదయం అఫీసుకు బయలుదేరుతుంటే బాల్కనీ బయట రెండో మెట్టు మీద నా పాద రక్షలు ఠీవిగా దర్శనమిచ్చాయి. చెప్పో రక్షతి రక్షితః అన్నారు కదా, అని వాటిని రక్షించాను మళ్ళీ. (ఎటువంటి అగ్నిపరీక్షలు చేయకుండానే) అప్పుడే తలుపు వేస్తున్న మా అవిడకి ఈ విడ్డూరాన్ని విశదీకరించి, అంత కంగారు పడాల్సింది ఏమీ లేదు అని భరోశా ఇచ్చి, ఆ నల్లటి మెత్తటి జోళ్ళ జతను లోపల పడేసి బయలు దేరాను. (ఇంతటి విపత్కర కాలం లోనూ నేను ఫ్రెంచ్ లీవు పెట్టలేదు చూసారా.., అయినా మీకు ఇంటి కన్నా గుడి పదిలం అని ఎవరు చెప్పారండీ.. నేను ఒప్పుకోను.. ) ఆఫీసుకు వచ్చి నేనూ, ఇంట్లో ఉండి మా ఆవిడా మొత్తం పరిస్థితిని ని బాగా క్లోజ్ గా గమనించీ, విశ్లేషించీ ఏమీ తేల్చుకోలేకపోయాం. నేనేమో -- "తలచినదే జరిగినదా" అని పాడుకుంటే.. మా ఆవిడ తన కోకిల కంఠం తో (ఈ రోజు నాకు అరటికాయి బజ్జీలు గారంటీ.. ;-) ) "విధి చేయు వింతలన్నీ" అని ఎత్తుకుంది. (ఆ జోళ్ళ జత దగ్గర్లో "నువ్వేమీ చేసావు నేరం.. " అంటూ ఏదో యేసుదాసు వాయిస్ వినిపించింది అని టాకు.. నేను నమ్మలేదు లెండి.. ) ఇంక కోడ్ బ్రేకింగ్ విషయానికొస్తే, ఏ పేరుమోసిన గజదొంగో పశ్చాత్తాపంతోనో, సైజు సరిపోకో, వెనక్కి తెచ్చి ఇచ్చాడనుకున్నా, UP లో ఎన్నికలు పెట్టుకుని ఎవడైనా చెన్నైలో తిరుగుతాడా, సిట్టింగు నియోజకవర్గం చూసుకోవాలా అక్కర్లేదా ? పోనీ మా ఎదురింటి చంద్రముఖి హస్తం ఏమైనా ఉందా అంటే (ఆవిడ గురించి ఎప్పుడో బాగా ఓపిక ఉన్నప్పుడు ఒక పది టపాలు రాస్తాను), ఆవిడకి మన జత బాటా చెప్పులు చేసిన అవమానం ఏదీ లేదే.. (అంటే ఆ మధ్య మా పనిమనిషి తన జోళ్ళు వాళ్ళింటిముందు పెట్టిందని, ఆవిడ ఓ బాల్చీడు నీళ్ళు వాటిమీద పోసి తన సంఘీభావాన్ని తెలియచేసింది లెండి)

ఏది అయితేనేం.. విషయం మా లాజిక్కుకి, మాకు తెలిసిన మ్యాజిక్కుకు మించి ఉండడం తో CBI JD గారికి నివేదించాలని నిర్ణయించుకున్నాం. (ఇంకెవరూ, మన లక్ష్మీ నారాయణ గారే) ఆయనికి తీరిక అయిన వెంటనే తీరిగ్గా దర్యాప్తు చెయ్యమని మా విజ్ఞప్తి. మన పేదరికం అంతా చూసి మన దగ్గర ఆదాయానికి ఉండాల్సిన ఆస్థి కూడా లేదని కేసు పెడతారేమో అని భయపడుతోంది మా ఆవిడ, మీకు తెలిసి అలాంటి చట్టాలేమైనా ఉన్నాయా ?. నా వరకూ అయితే పోయినవి, వచ్చేయన్న ఆనందం కన్నా, ఏ రాజకీయ నాయకుడి చెంపలు పగలు గొట్టి వచ్చాయో అని టెన్షన్ గా ఉంది. ఏది చక్కబెట్టి వచ్చినా, చెప్పు చెప్పే అని మీరు ఎంత చెప్పినా, అంత ఘనకార్యం చేసాక ఎలా దాన్ని మరీ చెప్పుగా వాడడం చెప్పండి.. అందుకని సంగతి సద్దుమణిగే వరకూ నా పాత కొత్త చెప్పులకు కాస్త దూరంగానే ఉండాలని నిశ్చయించుకున్నాను. అసలే నేను కూడా ఫ్లాష్ బ్యాకులో తులసి, తులసి దళం, అష్టావక్ర.. అలాంటివి అన్నీ చదివి భయపడిన వాణ్ణే, తరువాత కదా విజయానికి అయిదు మెట్లు చదివి విజయం సాధించింది. ;-) కోరి చెప్పు తో ఎందుకు తల గోక్కోడం చెప్పండి...

ఇంతకీ బాదం చెట్టు నీడకీ, పోయి దొరికిన బాటా చెప్పుకీ ఏమిటా సంబంధం అనే గా మీ 'అణు'మానం.. ఓల్డ్ మహాబలిపురం రోడ్డు కీ.. సెంట్రల్ స్టేషన్ కీ ఉన్న అనుబంధమే.. ఏమీ లేదు. రెండూ చెన్నై లోనే ఉన్నాయి. ;-)

Wednesday, January 11, 2012

ఒక జత బాటా జోళ్ళ కథ

ఎవరైనా చెప్పులు గురించి ఒక టపా రాస్తారా ? మీరేమనుకోండి ఇప్పుడు రాయాల్సిన అవసరం, సందర్భం వచ్చాయి కనుక రాస్తున్నా... అయినా అంబటి రాంబాబు గురించీ, మన్మోహన్ సింగ్ గురించీ రాసినప్పుడు తప్పులేనిది నాతో పాటూ అడుగు అడుగులో తోడొస్తున్న బాటా చెప్పులు గురించి రాస్తే మీకు తప్పొచ్చిందా.. మరీ విడ్డూరం కాకపోతే.

ఓ.కే, పోస్ట్ ఆఫీసులో రాస్తున్నాను కాబట్టి, డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళిపోతా, నాకు ఆట్టే ఉపోద్ఘాతాలు నచ్చవు, మా బాసుకి అసలే నచ్చవు. ఆ మధ్య మా నాలుగో పెళ్ళిరోజు (అయిదోదా ? ;-) ) శుభముహూర్తాన మా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. TV9 మరియు ABN కీ తెలిసేలోపే, మా ఆవిడా నేనూ ఈ విషయానికి మరీ పబ్లిసిటీ వద్దని ఒక నిర్ణయానికి వచ్చి ఆ వార్తని మూడో చెవి వాడికి కూడా తెలీకుండా నోళ్ళు నొక్కేసుకున్నాం. ఇంతకీ ఏంటా ఆ పోయిన వస్తువు అంటారా, మధ్య తరగతి వాణ్ణి, మా ఇంట్లో ఏంపోతాయండీ, ఓ జత బాటా చెప్పులు పోయాయి. ఆ పుణ్య కార్యానికి పూనుకున్న వాడెవడో నా కంటే మిడిల్ క్లాసు గాడనుకుంటా పాపం.. బాల్కనీ లో ప్రక్కనే, కాస్త ఖరీదైన స్పోర్ట్స్ షూసూ, మా ఆవిడవి ఓ నాలుగైదారు జతల తెగిపోయిన జోళ్ళూ పెట్టుకుని, కక్కుర్తిగా ఈతొక్కలో వాడేసిన చెప్పులు పట్టుకెళ్ళాడు. బుర్రా బుద్ధీ ఉన్నవాడెవడైనా ఈ పని చేస్తాడా ?. పట్టుకెళ్ళాడే అనుకోండి, మా పెళ్ళి రోజున ఇంతటి ఘోరానికి పాల్పడతాడా అని నేను ప్రశ్నిస్తున్నాను. జరిగిందేదో జరిగింది, లోతైన దర్యాప్తు తరువాత, అంత ఉపయోగపడే ఆధారాలు (వేలిముద్రలు, గోళ్ళ గుర్తులు వగైరాలు) ఏవీ లభించక, మిగిలి లేసుకట్టిన ("బ్రతికి బట్టకట్టిన" కి వచ్చిన పాట్లన్నమట) షూస్ లోపలపెట్టుకుని ఓ రెండు రోజులు ఇంటి తలుపుకు ఉన్న గడియలన్నీ బిడాయించాం. తర్వాత మళ్ళీ మామోలే అనుకోండి

"కాలం ఏదో గాయం చేసిందీ.. నిన్నే మాయం చేసానంటోందీ.. ", అంటూ అప్పుడప్పుడు నేను పాడుకున్నా, మన ప్రియతమ నాయకుడు, దివంగత మహానేత వై.ఎస్.ఆర్ సుపుత్రిడిలా, మా ఆవిడ నన్ను ఒదార్చి మళ్ళీ మనిషిని చేసింది. (మన వివాహ బంధం గొప్పతనం ఇక్కడే నేను నొక్కి వక్కాణిస్తున్నాను అని గ్రహించగలరు) ఇది జరిగి నెల దాటింది, (సంవత్సరం కూడా మారినట్టుంది, నా జోళ్ళు పోయాయని కాలం ఆగిపోవాలని నేనూ ఆశించలేదు.. ). కొత్త జోళ్ళు కొనుక్కుందాం అనుకుంటూనే నేను ఒద్దికగా ఏవో పాత వాటితో కాలక్షేపం చేస్తున్నా, అది స్వతహాగా నాలో ఉన్న బద్దకం వల్ల లెండి, పొదుపు అని పొరపడేరు. పోయిన చెప్పులు గురించి పోస్ట్ రాద్దామనుకునే, పోయేవి ఎలానో పోయాయి, కడుపు చించుకుంటే జోళ్ళమీద పడుతుంది అని విశ్లేషించి , ఈసారి ఇంకేదైనా పోయినప్పుడు రాద్దాంలే అనుకుని ఆగిపోయా.. ;-) ఇంతలోనే మనమంతా షాక్ అయిపోయే సంఘటన జరిగింది ఈ రోజు ఉదయం. కలలోకూడా కలవరించనిది అది.. రాసి నీట్టూర్చడం నా వంతైతే, చదివి నిర్ఘాంతపోవడం మీ వంతు. (జయా - శశీ విడిపోయాకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయేమో అని నా అనుమానం)

ఇంతకీ ఏంజరిగింది ? పోయినా చెప్పులు అటక మీద ప్రత్యక్షమయ్యాయ ? లేక పదేళ్ళ బట్టీ వాడుతున్న నల్లని, మెత్తని హెల్మెట్ కూడా మాయమయ్యిందా ? ఏం జరిగింది.. ఏం జరగబోతోంది.. ఇంటి ముందర ఉన్న బాదం చెట్టు చీకటి నీడలు బాల్కనీ లో పడినప్పుడు ఏ ఆకారాలు కనిపిస్తున్నాయి.. ఆ చెట్టుకూ.. పోయిన చెప్పుకూ ఏంటా అర్థం లేని సంబంధం...

(ఆఖరి రెండు లైన్లూ "నేరాలు ఘోరాలు" స్టైల్ లో చదువుకోండి.. ప్లీజ్.. ప్లీజ్.. బావుంటుంది.. ;-) )

అవన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇంక థ్రిల్ ఏముంది.. తదుపరి టపాలో చెప్తా.. ;-).

Saturday, January 7, 2012

రుద్రవీణ

జెమిని మువీస్ లో నాకు ఎంతగానో ఇష్టమైన రుద్రవీణ సినిమా వస్తుంటే నేను ఈ పోస్ట్ రాయడం మొదలు పెట్టాను. ఏడు గంటలకు ఆ సినిమా ని రిమైండర్ పెట్టుకుని మరీ చూడ్డం మొదలు పెట్టి, ఒకరిద్దరు స్నేహితులకు మెసేజులు కూడా పంపి, వ్యాపార ప్రకటనల బాధ భరించలేక వేరే గదిలోకి వచ్చేసాను. (టీవీ రిమోట్ ని లాంఛనాలతో సహా మా ఆవిడకి ఇచ్చేసాను అని మీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా ? ) ఎంత మంచి/నచ్చుకున్న చిత్రమైనా ఈ యాడ్స్ ధాటికి తట్టుకుని నిలబడాలంటే కష్టమే. పావుగంటకోసారి పదినిమషాల బ్రేకు, ఈ రాత్రి తెలవారదేమో అనిపిస్తోంది.

ఇంక రుద్రవీణ విషయానికొస్తే, చిరంజీవి కెరీర్లోనే ఒక ఉత్తమమైన చిత్రం అది. కథా పరంగా చూసినా, నటన పరంగా చూసినా ఇప్పటికీ అది మనసుకు హత్తుకుని, ఆలోచింప చేసేలానే ఉంది, వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలానే ఉంది. చిరు సొంత బేనరు అంజనా ప్రోడక్షన్స్ మీద నిర్మించిన చిత్రం అది. ఈ మధ్య కాలం లో అలాంటి సినిమా పొరపాటున కూడా చూసిన గుర్తు లేదు. కథలో ఒక సామాజిక స్పృహ, నాటకీయత లేని కథనం, వ్యక్తిత్వం మరియు జీవం ఉన్న పాత్రలూ. ఎంత చైతన్య వంతమైన చిత్రం.. అలాంటి సినిమాలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకులు (అంటే వేరే గ్రహం నుంచి రారుగా, నేను, మీరు,.. మనమే) ఖచ్చితంగా ఆదరిస్తారు, ఒక వేళ పోనీ వాణిజ్యపరంగా రిస్క్ అని అనుకున్నా, ఇప్పుడు మన మీద బలవంతంగా రుద్దుతున్న చెత్త ఏమైనా గారంటీగా ఆడుతోందా ? (బద్రీనాథ్ బడ్జెట్ తో రుద్రవీణ లాంటి సినిమాలు ఓ పది తీయొచ్చేమో. ) తప్పో రైటో సినిమా మందిలోకి చొచ్చుకుని పోతుంది, చూస్తోంది నిజమా.. అబద్దమా అని జనం ఆలోచించుకునేలోపే వాళ్ళ బుర్రల్లోకి విషయం వెళ్ళిపోతుంది. అలాంటి మీడియం ని ఉపయోగించుకుని ఎంత మంచి చెయ్యొచ్చు ? రుద్రవీణ లాంటి సినిమాలు నేటికీ అవసరమే. ఇప్పటికీ మన స్వర్ణ భారతంలో సగం బాధలకి కారణం మద్యమే. కాదనగలమా ? సినిమాలో చూపించినవి అన్నీ ఆచరణ సాధ్యం కాకపోవచ్చు కానీ నిజంగానే అలాంటి గ్రామ స్వరాజ్యమే తేగల్గితే, ఎంతో మెరుగైన సమాజాన్ని నిర్మించగలం. సందేహమే లేదు.

మద్యం టెండర్లు, బెల్టు షాపులు, సిండికేట్లు, MRP లు.. ఇవే ప్రజాస్వామ్యన్ని నియంత్రిస్తుంటే, మార్పు ఎలా సాధ్యం ? పేదోడి బ్రతుకు ముక్కలు చేసి, కుటుంబాలని రోడ్డున పడేసే మద్యాన్ని ఆదాయ వనరు చేసుకున్న రాజకీయాలు, ప్రభుత్వాలు ఆ మార్పుని ఎలా రానిస్తాయి. ?

ఏదో ఈ నాలుగు మాటలూ పంచుకోవాలనిపించి మొదలుపెట్టాను, యాడ్స్ మధ్య రుద్రవీణను వెతుక్కునే ప్రయత్నం మళ్ళీ చేస్తాను. తిరిగి ఇంకో టపాలో కలుద్దాం.

మనలో మన మాట, మద్య నిషేదం కాకపోయినా కనీసం బెల్టు షాపులన్నీ మూయిస్తేనే ప్రభుత్వాన్ని సమర్ధిస్తామని చిరు అనగలడా, కనీసం పదిశాతం సూర్యం అయినా కాగలడా ?