Wednesday, January 25, 2012

లేఖిని తో వచ్చిన కష్టాలు.. మరియు "టా".. లు :-)

తెలుగు బ్లాగర్లందరి లానే నేను కూడా నా ఓనమాలు లేఖిని లోనే దిద్దాను. అందుకే నాకు లేఖిని అంటే అమిత మైన అభిమానం. మిత్రులెవరైనా ఇంకో టూల్ వాడితే నాకు వొళ్ళు మండుతూ ఉంటుంది. అమ్మ చేతి వంటని ఎంచితే ఊరుకుంటామా.. కానీ ఈ అనురాగం నాకు చిక్కులు తెచ్చిపెడుతుందనీ, నన్ను అబాసు పాలు చేస్తుందని.. మధ్యాహ్నం నిద్రలో కూడా ఎప్పుడూ కల కనలేదు. నా వ్యథని మీకు చెప్పుకోకపోతే ఇంక ఆ వ్యథకి.. మన బంధానికి అర్థమే లేదు కదా అందుకే మొదలు పెట్టా.. ఈ టపా..

లేఖిని నిర్వాహకులు నొచ్చుకోకుండా, నా బాధల్ని మానవతా దృక్పథం తో చూసి, ఓదార్పు యాత్రకి వస్తారని కోరుకుంటున్నాను.

ఈ మెయిలు అన్నది పుట్టినప్పటి నుంచీ నాకు తెలుగు లో మెయిల్స్ రాయడం అలవాటే, (మనకి వచ్చిన నాలుగు ఇంగ్లీషు ముక్కలతో ఎదుట వారిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని ). ఈ క్రమం లో నేను తెలుగు ని ఇంగ్లీషులో రాయడం బానే అలవాటు చేసుకున్నాను. ఎంతంటే కొన్ని పదాలు తెలుగు లో రాయడమే మరచిపోయానంటే నమ్మండి... ఇలా ఏదో గుట్టు చప్పుడు కాకుండా నెట్టుకొస్తున్న నాదైన టెంగ్లిష్ నావకి లేఖిని పరిచయం (మా ఆవిడ చదువుతూ ఎవరో అమ్మాయి పేరు అనుకోదు కదా.. :-)) ఒక్క కుదుపు కుదిపింది. నాన్నా, భాస్కర్ అని రాయడం అంటే, "bhaaskar" అని రాయాలి అని మొదటి రోజే ఓ జెర్క్ ఇచ్చింది. ఇదేదో బానే ఉంది కదా, రెండు రెళ్ళు ఆరే కదా అని అనుకుని, తెగ సంబర పడి, మెల్లగా, మెల్లగా లేఖిని ఒరవడికి అలవాటు పడిపోయాను. పడ్డవాడెవ్వడూ చెడ్డవాడు కాదని, ఏదో నాలుగు మాటలు అచ్చ తెలుగు ఫాంటు లో చూసుకుని, దేవులపల్లి, శ్రీశ్రీ తరువాత నేనే అని ఫీల్ అయిపోవడం మొదలెట్టాను. అడపదడపా రాసే బ్లాగు పోస్టు తెలుగు లోనే రాసుకుంటూ, ఇద్దరే ఇద్దరికి దాని గురించి చెప్పుకుంటూ.. (ఆసక్తి ఉన్నవాడికి.. లేని వాడికి) ఏదో నా బ్లాగు ప్రయాణం కొనసాగిస్తున్నాను. ఇంతలోనే నేను అనుకోని ప్రమాదం ముంచుకొచ్చింది. మామోలు ఈమెయిల్స్ లో ఎప్పటిలానే నేను టెంగ్లిష్ మాటలు రాయలేకపోతున్నాను అని కొంచం లేట్ గా... లేటెస్టు గా గ్రహించుకున్నాను. ఇంతకు మునుపు హ్యాపీ గా "happy" అని రాసుకునే వాణ్ణా, ఇప్పుడు "hyaapii" అని రాయడం మొదలు పెట్టాను. (చూడ్డానికి అదేదో పెంపుడు పిల్లి పేరు లా లేదూ.. ? ) "tha" లన్నీ "ta" ల గా మారిపోయాయి.. "dha" లేమో పాపం "da" లగా.. ఎన్ని తప్పులో.. తిప్పలో చూడండి. "chetallo" (చేతల్లో) చూపిస్తానని రాస్తే, మొన్నెవరో అది చేటల్లో అనుకుని అపార్థం పడిపోయారు. "neekuu" ( నీకూ ) అని రాస్తే, అదేదో కావాలనే "యూ" అని నొక్కి వక్కాణిస్తున్నానని మిత్రుడు ఫీల్ అయ్యాడు. "కొత్తగా" అనడానికి బదులు "కొట్టగా" అంటే.. ఎవరూరుకుంటారు.. ఆంగ్ల మాటలని తెలుగు లో ఖూనీ చేసేస్తున్నానండీ చేసేస్తున్నాను.. తెలుగు నేమో నాదైన టెంగ్లిష్ లో.. అలా అని పొనీ క్యాపిటల్ లెటర్స్ అయినా వాడుతున్నానా అంటే ఆ సోకూ లేదు. సో మొత్తానికి నా వాక్యాల్లో అదేదో జాంబియా జుంబో భాష లాగ బోలుడన్ని సౌండ్లకి ఒకేలా అక్షరాలు కనిపిస్తున్నాయి. చదివే వాళ్ళకి ఎలా వినిపిస్తోందో.. ఎవరికి తెలుసు..

నా మానాన నేనేదో గుంపులొ గోవిందు గాడి లా లాక్కొచ్చేస్తుంటే, ఈ లేఖిని చూడండి నా తాట ఎలా తీసిందో. ఇప్పుడు తెలుగూ లేక.. టెంగ్లీషూ లేక.. ఒంటరిని అయిపోయాను.. ఇంక ఈ-మెయిలు కు ఏమని పోను ? నిన్నటికి నిన్న ఒక ఇంగ్లీష్ పదాన్ని తెలుగు పదం అని వాదిస్తుంటే, ఫ్రెండ్ ఒక అమ్మాయి తన సానుభూతిని చూపింది నా మీద. ఇప్పుడు ఇదే ఊపులో నేను రేపు ఏ C++ ప్రొగ్రాం లోనో ఇలా రాయడం మొదలు పెడితే కంపైలర్ ఏమైపోవాలి.. మీరే చెప్పండి. అసలే ఆర్థిక సంక్షోభం.. ఆపైన ఇంటికోసం తీసుకున్న లోను.. మనసున్న వాళ్ళు.. ఓ మార్గం చెప్పండి మరి.

పొనీ ఇంత లేఖిని హ్యాంగ్ ఓవర్ లో, తెలుగు బ్లాగు ఏమైనా స్పీడు గా రాస్తున్నానా అంటే అ ముచ్చటా లేదు.. రాద్దామనుకున్న నాలుగు లైన్లు కొద్దిపాటి తప్పులతో పోస్ట్ చెయ్యడానికి గంటలు పట్టేస్తోంది.. ఇప్పుడు ఏమిటి తక్షణ కర్తవ్యం.. మెయిల్స్ కూడా అచ్చ తెలుగు లో ఇచ్చేద్దామా అంటే, ఈ ఇంగ్లీషు చదువు గాళ్ళకి తెలుగు చదవడమే రాదాయే.. మన "ప్రేమ" వాళ్ళకి "దోమ" లా కనిపించచ్చు.. పర్వాలేదు అనుకున్నా.. "దోమ".. "ప్రేమ" అయిపోతే కొంప కొల్లేరైపోదూ.. లేని పోని రిస్క్ కదా...

ఏదో లెండీ.. సీత కష్టాలు సీతవి.. నా కష్టాలు నావి.. సెల్వ స్వామి కష్టాలు.. మా ఆవిడవి.. (మీరు మొగలి రేకులు చూడకపోతే అది నా తప్పు కాదు) అందుకని మీ బుర్రలు పాడు చేసుకోకండి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. పది మైళ్ళవతల మీ ఆఫీసు ఉంటే రోజూ పదకొండు మైళ్ళు వెళ్తూ ఉండండి.. ఏదో ఒకరోజు మీరు సొంత బిజినెస్సు పెట్టుకోవాల్సి వస్తుంది.

Sunday, January 15, 2012

మాఫియా మాన్

గాడ్ ఫాదర్ నుంచీ డాన్ వరకూ, నాయకుడు నుంచీ సర్కార్ వరకూ.. నేర సామ్రజ్యాన్ని ఒక స్టైల్ తో సెలెబ్రేట్ చేస్తూ తీసిన చిత్రాలు చాలా ఉన్నాయి. మరీ ఎక్కువ ఆలోచించకుండా చూస్తే అవో కిక్ ఇస్తాయి. ఆ ధోరణిలోనే మరో సినిమా బిజినెస్ మాన్. మాఫియా కథాంశమే అయినా, పూరీ తనదైన పంచ్ డైలాగ్స్ తో కొంచం వింతగా తీసాడు. మిగతా మాఫియా చిత్రాల్లో ఉండే సీరియస్ నెస్ కానీ, కన్విక్షన్ కానీ ఈ చిత్రం లో మీకు ఎక్కడా కనిపించవు. ఇదీ కథ అని చెప్పడానికీ, ఈ పాత్ర నచ్చింది అని మురిసిపోడానికీ, హాలు బయటకు వచ్చాక ఓ రెండు పాటలు గుర్తుకు తెచ్చుకోడానికీ అవకాశం లేదు కాబట్టి, సమీక్ష రాసే ధైర్యం చెయ్యడం లేదు. మహేష్ బదులు పూరీ జగనే హీరో పాత్ర చేసినా నాకు ఏ అభ్యంతరం లేదు. అక్కడక్కడ దూకుడు షేడ్ కనిపించినా, ఇది మొత్తం మీద పూరీ మార్కు సినిమా. వర్మా చిత్రాలకు ఒక ట్రిబ్యూట్ అని కూడా చెప్పుకోవచ్చేమో. సన్నివేశాల తీరు పూరీ ఆ మధ్య తీసిన "అమితాబ్' బుడ్ఢా" ని గుర్తు చేస్తాయి. హీరో తప్ప మిగతా అన్ని పాత్రలకీ సీన్లూ తక్కువే, సీనూ తక్కువే. కానీ సంక్రాంతి మూడ్ లో చూసొస్తే మిమ్మల్ని ఆట్టే ఇబ్బంది పెట్టని చిత్రమిది. దూకుడు కామెడీనీ నమ్ముకుంటే, ఇది పూర్తిగా హీరోనే నమ్ముకుంది. ఇలాంటివి మరో రెండు సినిమాలు చేస్తే ఇంక మహేష్ బోరుకొట్టడం ఖాయం.. అప్పుడు మళ్ళీ ఏ అల్లూరి సీతారామరాజో తీసుకోవాలి.

మరో మాటండోయ్, సినిమాకి "A" సెర్టిఫికేట్ ఇచ్చారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళకండి. హీరో పాత్ర అలా బూతుల్ని వల్లిస్తూనే ఉంటుంది (మన టైం బావుండి కొన్ని మనకి వినిపించవు), హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర చేత తెలుగు ని కనీసం ఓ వందసార్లు హత్య చేయించారు, అతి దారుణంగా. ఒకటి రెండు చోట్ల మీకు చాచి ఒక్కటివ్వాలనిపిస్తుంది. ఈ సినిమాలో అసలు సస్పెన్స్ విషయం ఏంటా అంటే, హీరో హీరోయిన్లు ఎప్పుడు ప్రేమలో పడ్డారన్నదే. ఈసారి వోల్వో బస్సు లో చూసినప్పుడు నోట్ చేసుకుని మీకు మళ్ళీ విన్నవించుకుంటాను. (అయినా హీరో హీరోయిన్లు ప్రత్యేకంగా మళ్ళీ ప్రేమలో పడాలా ఏంటి.. మరీ చాదస్తం కాకపోతే.. ) తెలుగు చిత్రాల్లో "దూకుడు" ఒక బెంచ్ మార్క్ అవ్వగల్గినప్పుడు, బిజినస్ మాన్ భారీ హిట్టు కొడితే మనం ఏమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నేటి యువ తరం ప్రేక్షకులకి కావాల్సింది కేవలం ఎంటర్టైన్ మెంట్, అది న్యూస్ లో అయినా.. సినిమాలో అయినా. (బహుశా సొంత జీవితంలో అయినా..)

సరదాగా ఒకసారి చూడదగిన చిత్రమే, మరీ మీ ఊర్లో చొక్కాలు చింపుకుని వెళ్ళే పరిస్థితి ఉంటే, ఓ రెండ్రోజులు ఆగి వెళ్ళండి, ఏంపర్వాలేదు. చెన్నైలో అయితే తేలిగ్గానే దొరుకుతున్నాయి టికెట్లు. మీరు ఎవరితోనూ అనరనే నమ్మకంతో చెప్తున్నాను, ఈ సినిమాకు టైటిల్ నన్ను పెట్టమని ఏ తలమాసిన వాడైన అడిగి ఉంటే "బలుపు" అని పెట్టేవాణ్ణి.

ఓ.కే మరి.. మరొక టపాలో కలుద్దాం,.. అన్నట్లు.. "సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ"..

Friday, January 13, 2012

ఒక జత బాటా జోళ్ళ కథ (ముగింపు.. ముక్తాయింపు)

నేను జరిగిన కథ చెప్పేలోపు మీరు మీకు తెలిసిన సీరియల్ టైటిల్ సాంగ్ పాడుకోగలరు. ఉదా : "ఎందుకో నాకు ఈ చెప్పులూ.. ఎందుకో నాకు ఈ తిప్పలూ", "విరిసే విరిసే బాటా చెప్పులు.. విరిసే విరిసే బాటా చెప్పులు"..
ఓ.కే.. అయిపోయింది జరిగిన కథ. మీరంతా ఈ సస్పెన్సు ని భరించలేక, ప్రక్కవాళ్ళ గోళ్ళు/వేళ్ళూ కూడా కొరికేస్తున్నారని తెలిసింది.. ఇంక ముగింపు విషయానికి వస్తాను. కొన్ని రోజుల వ్యథ తరువాత నేను ఆ పోయిన చెప్పుల సంగతి మరచేపోయాను. పాపం ఆడవాళ్ళకి మరుపు దేవుడు బై బర్త్ ఇవ్వలేదు కాబట్టి మా ఆవిడ అప్పుడప్పుడు తలుస్తూనే ఉంది. ఇంతకీ నేను మీకు గత టపా లో చెప్పినట్టు ఒళ్ళు గగుర్పాటు పొడిచే సంఘటనలు ఏమీ జరగలేదు కానీ, దాదాపు గా అంత షాకూ తగిలింది. ఉదయం అఫీసుకు బయలుదేరుతుంటే బాల్కనీ బయట రెండో మెట్టు మీద నా పాద రక్షలు ఠీవిగా దర్శనమిచ్చాయి. చెప్పో రక్షతి రక్షితః అన్నారు కదా, అని వాటిని రక్షించాను మళ్ళీ. (ఎటువంటి అగ్నిపరీక్షలు చేయకుండానే) అప్పుడే తలుపు వేస్తున్న మా అవిడకి ఈ విడ్డూరాన్ని విశదీకరించి, అంత కంగారు పడాల్సింది ఏమీ లేదు అని భరోశా ఇచ్చి, ఆ నల్లటి మెత్తటి జోళ్ళ జతను లోపల పడేసి బయలు దేరాను. (ఇంతటి విపత్కర కాలం లోనూ నేను ఫ్రెంచ్ లీవు పెట్టలేదు చూసారా.., అయినా మీకు ఇంటి కన్నా గుడి పదిలం అని ఎవరు చెప్పారండీ.. నేను ఒప్పుకోను.. ) ఆఫీసుకు వచ్చి నేనూ, ఇంట్లో ఉండి మా ఆవిడా మొత్తం పరిస్థితిని ని బాగా క్లోజ్ గా గమనించీ, విశ్లేషించీ ఏమీ తేల్చుకోలేకపోయాం. నేనేమో -- "తలచినదే జరిగినదా" అని పాడుకుంటే.. మా ఆవిడ తన కోకిల కంఠం తో (ఈ రోజు నాకు అరటికాయి బజ్జీలు గారంటీ.. ;-) ) "విధి చేయు వింతలన్నీ" అని ఎత్తుకుంది. (ఆ జోళ్ళ జత దగ్గర్లో "నువ్వేమీ చేసావు నేరం.. " అంటూ ఏదో యేసుదాసు వాయిస్ వినిపించింది అని టాకు.. నేను నమ్మలేదు లెండి.. ) ఇంక కోడ్ బ్రేకింగ్ విషయానికొస్తే, ఏ పేరుమోసిన గజదొంగో పశ్చాత్తాపంతోనో, సైజు సరిపోకో, వెనక్కి తెచ్చి ఇచ్చాడనుకున్నా, UP లో ఎన్నికలు పెట్టుకుని ఎవడైనా చెన్నైలో తిరుగుతాడా, సిట్టింగు నియోజకవర్గం చూసుకోవాలా అక్కర్లేదా ? పోనీ మా ఎదురింటి చంద్రముఖి హస్తం ఏమైనా ఉందా అంటే (ఆవిడ గురించి ఎప్పుడో బాగా ఓపిక ఉన్నప్పుడు ఒక పది టపాలు రాస్తాను), ఆవిడకి మన జత బాటా చెప్పులు చేసిన అవమానం ఏదీ లేదే.. (అంటే ఆ మధ్య మా పనిమనిషి తన జోళ్ళు వాళ్ళింటిముందు పెట్టిందని, ఆవిడ ఓ బాల్చీడు నీళ్ళు వాటిమీద పోసి తన సంఘీభావాన్ని తెలియచేసింది లెండి)

ఏది అయితేనేం.. విషయం మా లాజిక్కుకి, మాకు తెలిసిన మ్యాజిక్కుకు మించి ఉండడం తో CBI JD గారికి నివేదించాలని నిర్ణయించుకున్నాం. (ఇంకెవరూ, మన లక్ష్మీ నారాయణ గారే) ఆయనికి తీరిక అయిన వెంటనే తీరిగ్గా దర్యాప్తు చెయ్యమని మా విజ్ఞప్తి. మన పేదరికం అంతా చూసి మన దగ్గర ఆదాయానికి ఉండాల్సిన ఆస్థి కూడా లేదని కేసు పెడతారేమో అని భయపడుతోంది మా ఆవిడ, మీకు తెలిసి అలాంటి చట్టాలేమైనా ఉన్నాయా ?. నా వరకూ అయితే పోయినవి, వచ్చేయన్న ఆనందం కన్నా, ఏ రాజకీయ నాయకుడి చెంపలు పగలు గొట్టి వచ్చాయో అని టెన్షన్ గా ఉంది. ఏది చక్కబెట్టి వచ్చినా, చెప్పు చెప్పే అని మీరు ఎంత చెప్పినా, అంత ఘనకార్యం చేసాక ఎలా దాన్ని మరీ చెప్పుగా వాడడం చెప్పండి.. అందుకని సంగతి సద్దుమణిగే వరకూ నా పాత కొత్త చెప్పులకు కాస్త దూరంగానే ఉండాలని నిశ్చయించుకున్నాను. అసలే నేను కూడా ఫ్లాష్ బ్యాకులో తులసి, తులసి దళం, అష్టావక్ర.. అలాంటివి అన్నీ చదివి భయపడిన వాణ్ణే, తరువాత కదా విజయానికి అయిదు మెట్లు చదివి విజయం సాధించింది. ;-) కోరి చెప్పు తో ఎందుకు తల గోక్కోడం చెప్పండి...

ఇంతకీ బాదం చెట్టు నీడకీ, పోయి దొరికిన బాటా చెప్పుకీ ఏమిటా సంబంధం అనే గా మీ 'అణు'మానం.. ఓల్డ్ మహాబలిపురం రోడ్డు కీ.. సెంట్రల్ స్టేషన్ కీ ఉన్న అనుబంధమే.. ఏమీ లేదు. రెండూ చెన్నై లోనే ఉన్నాయి. ;-)

Wednesday, January 11, 2012

ఒక జత బాటా జోళ్ళ కథ

ఎవరైనా చెప్పులు గురించి ఒక టపా రాస్తారా ? మీరేమనుకోండి ఇప్పుడు రాయాల్సిన అవసరం, సందర్భం వచ్చాయి కనుక రాస్తున్నా... అయినా అంబటి రాంబాబు గురించీ, మన్మోహన్ సింగ్ గురించీ రాసినప్పుడు తప్పులేనిది నాతో పాటూ అడుగు అడుగులో తోడొస్తున్న బాటా చెప్పులు గురించి రాస్తే మీకు తప్పొచ్చిందా.. మరీ విడ్డూరం కాకపోతే.

ఓ.కే, పోస్ట్ ఆఫీసులో రాస్తున్నాను కాబట్టి, డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళిపోతా, నాకు ఆట్టే ఉపోద్ఘాతాలు నచ్చవు, మా బాసుకి అసలే నచ్చవు. ఆ మధ్య మా నాలుగో పెళ్ళిరోజు (అయిదోదా ? ;-) ) శుభముహూర్తాన మా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. TV9 మరియు ABN కీ తెలిసేలోపే, మా ఆవిడా నేనూ ఈ విషయానికి మరీ పబ్లిసిటీ వద్దని ఒక నిర్ణయానికి వచ్చి ఆ వార్తని మూడో చెవి వాడికి కూడా తెలీకుండా నోళ్ళు నొక్కేసుకున్నాం. ఇంతకీ ఏంటా ఆ పోయిన వస్తువు అంటారా, మధ్య తరగతి వాణ్ణి, మా ఇంట్లో ఏంపోతాయండీ, ఓ జత బాటా చెప్పులు పోయాయి. ఆ పుణ్య కార్యానికి పూనుకున్న వాడెవడో నా కంటే మిడిల్ క్లాసు గాడనుకుంటా పాపం.. బాల్కనీ లో ప్రక్కనే, కాస్త ఖరీదైన స్పోర్ట్స్ షూసూ, మా ఆవిడవి ఓ నాలుగైదారు జతల తెగిపోయిన జోళ్ళూ పెట్టుకుని, కక్కుర్తిగా ఈతొక్కలో వాడేసిన చెప్పులు పట్టుకెళ్ళాడు. బుర్రా బుద్ధీ ఉన్నవాడెవడైనా ఈ పని చేస్తాడా ?. పట్టుకెళ్ళాడే అనుకోండి, మా పెళ్ళి రోజున ఇంతటి ఘోరానికి పాల్పడతాడా అని నేను ప్రశ్నిస్తున్నాను. జరిగిందేదో జరిగింది, లోతైన దర్యాప్తు తరువాత, అంత ఉపయోగపడే ఆధారాలు (వేలిముద్రలు, గోళ్ళ గుర్తులు వగైరాలు) ఏవీ లభించక, మిగిలి లేసుకట్టిన ("బ్రతికి బట్టకట్టిన" కి వచ్చిన పాట్లన్నమట) షూస్ లోపలపెట్టుకుని ఓ రెండు రోజులు ఇంటి తలుపుకు ఉన్న గడియలన్నీ బిడాయించాం. తర్వాత మళ్ళీ మామోలే అనుకోండి

"కాలం ఏదో గాయం చేసిందీ.. నిన్నే మాయం చేసానంటోందీ.. ", అంటూ అప్పుడప్పుడు నేను పాడుకున్నా, మన ప్రియతమ నాయకుడు, దివంగత మహానేత వై.ఎస్.ఆర్ సుపుత్రిడిలా, మా ఆవిడ నన్ను ఒదార్చి మళ్ళీ మనిషిని చేసింది. (మన వివాహ బంధం గొప్పతనం ఇక్కడే నేను నొక్కి వక్కాణిస్తున్నాను అని గ్రహించగలరు) ఇది జరిగి నెల దాటింది, (సంవత్సరం కూడా మారినట్టుంది, నా జోళ్ళు పోయాయని కాలం ఆగిపోవాలని నేనూ ఆశించలేదు.. ). కొత్త జోళ్ళు కొనుక్కుందాం అనుకుంటూనే నేను ఒద్దికగా ఏవో పాత వాటితో కాలక్షేపం చేస్తున్నా, అది స్వతహాగా నాలో ఉన్న బద్దకం వల్ల లెండి, పొదుపు అని పొరపడేరు. పోయిన చెప్పులు గురించి పోస్ట్ రాద్దామనుకునే, పోయేవి ఎలానో పోయాయి, కడుపు చించుకుంటే జోళ్ళమీద పడుతుంది అని విశ్లేషించి , ఈసారి ఇంకేదైనా పోయినప్పుడు రాద్దాంలే అనుకుని ఆగిపోయా.. ;-) ఇంతలోనే మనమంతా షాక్ అయిపోయే సంఘటన జరిగింది ఈ రోజు ఉదయం. కలలోకూడా కలవరించనిది అది.. రాసి నీట్టూర్చడం నా వంతైతే, చదివి నిర్ఘాంతపోవడం మీ వంతు. (జయా - శశీ విడిపోయాకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయేమో అని నా అనుమానం)

ఇంతకీ ఏంజరిగింది ? పోయినా చెప్పులు అటక మీద ప్రత్యక్షమయ్యాయ ? లేక పదేళ్ళ బట్టీ వాడుతున్న నల్లని, మెత్తని హెల్మెట్ కూడా మాయమయ్యిందా ? ఏం జరిగింది.. ఏం జరగబోతోంది.. ఇంటి ముందర ఉన్న బాదం చెట్టు చీకటి నీడలు బాల్కనీ లో పడినప్పుడు ఏ ఆకారాలు కనిపిస్తున్నాయి.. ఆ చెట్టుకూ.. పోయిన చెప్పుకూ ఏంటా అర్థం లేని సంబంధం...

(ఆఖరి రెండు లైన్లూ "నేరాలు ఘోరాలు" స్టైల్ లో చదువుకోండి.. ప్లీజ్.. ప్లీజ్.. బావుంటుంది.. ;-) )

అవన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇంక థ్రిల్ ఏముంది.. తదుపరి టపాలో చెప్తా.. ;-).

Saturday, January 7, 2012

రుద్రవీణ

జెమిని మువీస్ లో నాకు ఎంతగానో ఇష్టమైన రుద్రవీణ సినిమా వస్తుంటే నేను ఈ పోస్ట్ రాయడం మొదలు పెట్టాను. ఏడు గంటలకు ఆ సినిమా ని రిమైండర్ పెట్టుకుని మరీ చూడ్డం మొదలు పెట్టి, ఒకరిద్దరు స్నేహితులకు మెసేజులు కూడా పంపి, వ్యాపార ప్రకటనల బాధ భరించలేక వేరే గదిలోకి వచ్చేసాను. (టీవీ రిమోట్ ని లాంఛనాలతో సహా మా ఆవిడకి ఇచ్చేసాను అని మీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా ? ) ఎంత మంచి/నచ్చుకున్న చిత్రమైనా ఈ యాడ్స్ ధాటికి తట్టుకుని నిలబడాలంటే కష్టమే. పావుగంటకోసారి పదినిమషాల బ్రేకు, ఈ రాత్రి తెలవారదేమో అనిపిస్తోంది.

ఇంక రుద్రవీణ విషయానికొస్తే, చిరంజీవి కెరీర్లోనే ఒక ఉత్తమమైన చిత్రం అది. కథా పరంగా చూసినా, నటన పరంగా చూసినా ఇప్పటికీ అది మనసుకు హత్తుకుని, ఆలోచింప చేసేలానే ఉంది, వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలానే ఉంది. చిరు సొంత బేనరు అంజనా ప్రోడక్షన్స్ మీద నిర్మించిన చిత్రం అది. ఈ మధ్య కాలం లో అలాంటి సినిమా పొరపాటున కూడా చూసిన గుర్తు లేదు. కథలో ఒక సామాజిక స్పృహ, నాటకీయత లేని కథనం, వ్యక్తిత్వం మరియు జీవం ఉన్న పాత్రలూ. ఎంత చైతన్య వంతమైన చిత్రం.. అలాంటి సినిమాలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకులు (అంటే వేరే గ్రహం నుంచి రారుగా, నేను, మీరు,.. మనమే) ఖచ్చితంగా ఆదరిస్తారు, ఒక వేళ పోనీ వాణిజ్యపరంగా రిస్క్ అని అనుకున్నా, ఇప్పుడు మన మీద బలవంతంగా రుద్దుతున్న చెత్త ఏమైనా గారంటీగా ఆడుతోందా ? (బద్రీనాథ్ బడ్జెట్ తో రుద్రవీణ లాంటి సినిమాలు ఓ పది తీయొచ్చేమో. ) తప్పో రైటో సినిమా మందిలోకి చొచ్చుకుని పోతుంది, చూస్తోంది నిజమా.. అబద్దమా అని జనం ఆలోచించుకునేలోపే వాళ్ళ బుర్రల్లోకి విషయం వెళ్ళిపోతుంది. అలాంటి మీడియం ని ఉపయోగించుకుని ఎంత మంచి చెయ్యొచ్చు ? రుద్రవీణ లాంటి సినిమాలు నేటికీ అవసరమే. ఇప్పటికీ మన స్వర్ణ భారతంలో సగం బాధలకి కారణం మద్యమే. కాదనగలమా ? సినిమాలో చూపించినవి అన్నీ ఆచరణ సాధ్యం కాకపోవచ్చు కానీ నిజంగానే అలాంటి గ్రామ స్వరాజ్యమే తేగల్గితే, ఎంతో మెరుగైన సమాజాన్ని నిర్మించగలం. సందేహమే లేదు.

మద్యం టెండర్లు, బెల్టు షాపులు, సిండికేట్లు, MRP లు.. ఇవే ప్రజాస్వామ్యన్ని నియంత్రిస్తుంటే, మార్పు ఎలా సాధ్యం ? పేదోడి బ్రతుకు ముక్కలు చేసి, కుటుంబాలని రోడ్డున పడేసే మద్యాన్ని ఆదాయ వనరు చేసుకున్న రాజకీయాలు, ప్రభుత్వాలు ఆ మార్పుని ఎలా రానిస్తాయి. ?

ఏదో ఈ నాలుగు మాటలూ పంచుకోవాలనిపించి మొదలుపెట్టాను, యాడ్స్ మధ్య రుద్రవీణను వెతుక్కునే ప్రయత్నం మళ్ళీ చేస్తాను. తిరిగి ఇంకో టపాలో కలుద్దాం.

మనలో మన మాట, మద్య నిషేదం కాకపోయినా కనీసం బెల్టు షాపులన్నీ మూయిస్తేనే ప్రభుత్వాన్ని సమర్ధిస్తామని చిరు అనగలడా, కనీసం పదిశాతం సూర్యం అయినా కాగలడా ?