Saturday, January 7, 2012

రుద్రవీణ

జెమిని మువీస్ లో నాకు ఎంతగానో ఇష్టమైన రుద్రవీణ సినిమా వస్తుంటే నేను ఈ పోస్ట్ రాయడం మొదలు పెట్టాను. ఏడు గంటలకు ఆ సినిమా ని రిమైండర్ పెట్టుకుని మరీ చూడ్డం మొదలు పెట్టి, ఒకరిద్దరు స్నేహితులకు మెసేజులు కూడా పంపి, వ్యాపార ప్రకటనల బాధ భరించలేక వేరే గదిలోకి వచ్చేసాను. (టీవీ రిమోట్ ని లాంఛనాలతో సహా మా ఆవిడకి ఇచ్చేసాను అని మీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా ? ) ఎంత మంచి/నచ్చుకున్న చిత్రమైనా ఈ యాడ్స్ ధాటికి తట్టుకుని నిలబడాలంటే కష్టమే. పావుగంటకోసారి పదినిమషాల బ్రేకు, ఈ రాత్రి తెలవారదేమో అనిపిస్తోంది.

ఇంక రుద్రవీణ విషయానికొస్తే, చిరంజీవి కెరీర్లోనే ఒక ఉత్తమమైన చిత్రం అది. కథా పరంగా చూసినా, నటన పరంగా చూసినా ఇప్పటికీ అది మనసుకు హత్తుకుని, ఆలోచింప చేసేలానే ఉంది, వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలానే ఉంది. చిరు సొంత బేనరు అంజనా ప్రోడక్షన్స్ మీద నిర్మించిన చిత్రం అది. ఈ మధ్య కాలం లో అలాంటి సినిమా పొరపాటున కూడా చూసిన గుర్తు లేదు. కథలో ఒక సామాజిక స్పృహ, నాటకీయత లేని కథనం, వ్యక్తిత్వం మరియు జీవం ఉన్న పాత్రలూ. ఎంత చైతన్య వంతమైన చిత్రం.. అలాంటి సినిమాలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకులు (అంటే వేరే గ్రహం నుంచి రారుగా, నేను, మీరు,.. మనమే) ఖచ్చితంగా ఆదరిస్తారు, ఒక వేళ పోనీ వాణిజ్యపరంగా రిస్క్ అని అనుకున్నా, ఇప్పుడు మన మీద బలవంతంగా రుద్దుతున్న చెత్త ఏమైనా గారంటీగా ఆడుతోందా ? (బద్రీనాథ్ బడ్జెట్ తో రుద్రవీణ లాంటి సినిమాలు ఓ పది తీయొచ్చేమో. ) తప్పో రైటో సినిమా మందిలోకి చొచ్చుకుని పోతుంది, చూస్తోంది నిజమా.. అబద్దమా అని జనం ఆలోచించుకునేలోపే వాళ్ళ బుర్రల్లోకి విషయం వెళ్ళిపోతుంది. అలాంటి మీడియం ని ఉపయోగించుకుని ఎంత మంచి చెయ్యొచ్చు ? రుద్రవీణ లాంటి సినిమాలు నేటికీ అవసరమే. ఇప్పటికీ మన స్వర్ణ భారతంలో సగం బాధలకి కారణం మద్యమే. కాదనగలమా ? సినిమాలో చూపించినవి అన్నీ ఆచరణ సాధ్యం కాకపోవచ్చు కానీ నిజంగానే అలాంటి గ్రామ స్వరాజ్యమే తేగల్గితే, ఎంతో మెరుగైన సమాజాన్ని నిర్మించగలం. సందేహమే లేదు.

మద్యం టెండర్లు, బెల్టు షాపులు, సిండికేట్లు, MRP లు.. ఇవే ప్రజాస్వామ్యన్ని నియంత్రిస్తుంటే, మార్పు ఎలా సాధ్యం ? పేదోడి బ్రతుకు ముక్కలు చేసి, కుటుంబాలని రోడ్డున పడేసే మద్యాన్ని ఆదాయ వనరు చేసుకున్న రాజకీయాలు, ప్రభుత్వాలు ఆ మార్పుని ఎలా రానిస్తాయి. ?

ఏదో ఈ నాలుగు మాటలూ పంచుకోవాలనిపించి మొదలుపెట్టాను, యాడ్స్ మధ్య రుద్రవీణను వెతుక్కునే ప్రయత్నం మళ్ళీ చేస్తాను. తిరిగి ఇంకో టపాలో కలుద్దాం.

మనలో మన మాట, మద్య నిషేదం కాకపోయినా కనీసం బెల్టు షాపులన్నీ మూయిస్తేనే ప్రభుత్వాన్ని సమర్ధిస్తామని చిరు అనగలడా, కనీసం పదిశాతం సూర్యం అయినా కాగలడా ?

2 comments:

  1. "మద్య నిషేదం కాకపోయినా కనీసం బెల్టు షాపులన్నీ మూయిస్తేనే ప్రభుత్వాన్ని సమర్ధిస్తామని చిరు అనగలడా, కనీసం పదిశాతం సూర్యం అయినా కాగలడా ?"

    ఆ మాటేమో గాని ఈ సినిమా మాత్రం చాలా గొప్ప సినిమా కధ కధనం పాత్రలు అన్ని చక్కగా కుదిరిన సినిమా, మంచి చిత్రాన్ని గుర్తుకుతెచ్చారు!!

    ReplyDelete
  2. రుద్రవీణ సినిమా చూసి రూం కి వచ్చి అర్థ రాత్ర్హి ఒంటి గంట సమయం లో కవిత వ్రాసాను .మీ సమీక్ష ఆరోజుల్ని గుర్తుకు తెచ్చింది.అద్భుతమైన సినిమా .ఎప్పటికి అందులోని మద్య నిషేధం రాదేమో .పాల కన్నా మద్యం ఎక్కువ త్రాగుతున్నారు.
    రవిశేఖర్ www.ravisekharo.blogspot.com

    ReplyDelete