Wednesday, January 25, 2012

లేఖిని తో వచ్చిన కష్టాలు.. మరియు "టా".. లు :-)

తెలుగు బ్లాగర్లందరి లానే నేను కూడా నా ఓనమాలు లేఖిని లోనే దిద్దాను. అందుకే నాకు లేఖిని అంటే అమిత మైన అభిమానం. మిత్రులెవరైనా ఇంకో టూల్ వాడితే నాకు వొళ్ళు మండుతూ ఉంటుంది. అమ్మ చేతి వంటని ఎంచితే ఊరుకుంటామా.. కానీ ఈ అనురాగం నాకు చిక్కులు తెచ్చిపెడుతుందనీ, నన్ను అబాసు పాలు చేస్తుందని.. మధ్యాహ్నం నిద్రలో కూడా ఎప్పుడూ కల కనలేదు. నా వ్యథని మీకు చెప్పుకోకపోతే ఇంక ఆ వ్యథకి.. మన బంధానికి అర్థమే లేదు కదా అందుకే మొదలు పెట్టా.. ఈ టపా..

లేఖిని నిర్వాహకులు నొచ్చుకోకుండా, నా బాధల్ని మానవతా దృక్పథం తో చూసి, ఓదార్పు యాత్రకి వస్తారని కోరుకుంటున్నాను.

ఈ మెయిలు అన్నది పుట్టినప్పటి నుంచీ నాకు తెలుగు లో మెయిల్స్ రాయడం అలవాటే, (మనకి వచ్చిన నాలుగు ఇంగ్లీషు ముక్కలతో ఎదుట వారిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని ). ఈ క్రమం లో నేను తెలుగు ని ఇంగ్లీషులో రాయడం బానే అలవాటు చేసుకున్నాను. ఎంతంటే కొన్ని పదాలు తెలుగు లో రాయడమే మరచిపోయానంటే నమ్మండి... ఇలా ఏదో గుట్టు చప్పుడు కాకుండా నెట్టుకొస్తున్న నాదైన టెంగ్లిష్ నావకి లేఖిని పరిచయం (మా ఆవిడ చదువుతూ ఎవరో అమ్మాయి పేరు అనుకోదు కదా.. :-)) ఒక్క కుదుపు కుదిపింది. నాన్నా, భాస్కర్ అని రాయడం అంటే, "bhaaskar" అని రాయాలి అని మొదటి రోజే ఓ జెర్క్ ఇచ్చింది. ఇదేదో బానే ఉంది కదా, రెండు రెళ్ళు ఆరే కదా అని అనుకుని, తెగ సంబర పడి, మెల్లగా, మెల్లగా లేఖిని ఒరవడికి అలవాటు పడిపోయాను. పడ్డవాడెవ్వడూ చెడ్డవాడు కాదని, ఏదో నాలుగు మాటలు అచ్చ తెలుగు ఫాంటు లో చూసుకుని, దేవులపల్లి, శ్రీశ్రీ తరువాత నేనే అని ఫీల్ అయిపోవడం మొదలెట్టాను. అడపదడపా రాసే బ్లాగు పోస్టు తెలుగు లోనే రాసుకుంటూ, ఇద్దరే ఇద్దరికి దాని గురించి చెప్పుకుంటూ.. (ఆసక్తి ఉన్నవాడికి.. లేని వాడికి) ఏదో నా బ్లాగు ప్రయాణం కొనసాగిస్తున్నాను. ఇంతలోనే నేను అనుకోని ప్రమాదం ముంచుకొచ్చింది. మామోలు ఈమెయిల్స్ లో ఎప్పటిలానే నేను టెంగ్లిష్ మాటలు రాయలేకపోతున్నాను అని కొంచం లేట్ గా... లేటెస్టు గా గ్రహించుకున్నాను. ఇంతకు మునుపు హ్యాపీ గా "happy" అని రాసుకునే వాణ్ణా, ఇప్పుడు "hyaapii" అని రాయడం మొదలు పెట్టాను. (చూడ్డానికి అదేదో పెంపుడు పిల్లి పేరు లా లేదూ.. ? ) "tha" లన్నీ "ta" ల గా మారిపోయాయి.. "dha" లేమో పాపం "da" లగా.. ఎన్ని తప్పులో.. తిప్పలో చూడండి. "chetallo" (చేతల్లో) చూపిస్తానని రాస్తే, మొన్నెవరో అది చేటల్లో అనుకుని అపార్థం పడిపోయారు. "neekuu" ( నీకూ ) అని రాస్తే, అదేదో కావాలనే "యూ" అని నొక్కి వక్కాణిస్తున్నానని మిత్రుడు ఫీల్ అయ్యాడు. "కొత్తగా" అనడానికి బదులు "కొట్టగా" అంటే.. ఎవరూరుకుంటారు.. ఆంగ్ల మాటలని తెలుగు లో ఖూనీ చేసేస్తున్నానండీ చేసేస్తున్నాను.. తెలుగు నేమో నాదైన టెంగ్లిష్ లో.. అలా అని పొనీ క్యాపిటల్ లెటర్స్ అయినా వాడుతున్నానా అంటే ఆ సోకూ లేదు. సో మొత్తానికి నా వాక్యాల్లో అదేదో జాంబియా జుంబో భాష లాగ బోలుడన్ని సౌండ్లకి ఒకేలా అక్షరాలు కనిపిస్తున్నాయి. చదివే వాళ్ళకి ఎలా వినిపిస్తోందో.. ఎవరికి తెలుసు..

నా మానాన నేనేదో గుంపులొ గోవిందు గాడి లా లాక్కొచ్చేస్తుంటే, ఈ లేఖిని చూడండి నా తాట ఎలా తీసిందో. ఇప్పుడు తెలుగూ లేక.. టెంగ్లీషూ లేక.. ఒంటరిని అయిపోయాను.. ఇంక ఈ-మెయిలు కు ఏమని పోను ? నిన్నటికి నిన్న ఒక ఇంగ్లీష్ పదాన్ని తెలుగు పదం అని వాదిస్తుంటే, ఫ్రెండ్ ఒక అమ్మాయి తన సానుభూతిని చూపింది నా మీద. ఇప్పుడు ఇదే ఊపులో నేను రేపు ఏ C++ ప్రొగ్రాం లోనో ఇలా రాయడం మొదలు పెడితే కంపైలర్ ఏమైపోవాలి.. మీరే చెప్పండి. అసలే ఆర్థిక సంక్షోభం.. ఆపైన ఇంటికోసం తీసుకున్న లోను.. మనసున్న వాళ్ళు.. ఓ మార్గం చెప్పండి మరి.

పొనీ ఇంత లేఖిని హ్యాంగ్ ఓవర్ లో, తెలుగు బ్లాగు ఏమైనా స్పీడు గా రాస్తున్నానా అంటే అ ముచ్చటా లేదు.. రాద్దామనుకున్న నాలుగు లైన్లు కొద్దిపాటి తప్పులతో పోస్ట్ చెయ్యడానికి గంటలు పట్టేస్తోంది.. ఇప్పుడు ఏమిటి తక్షణ కర్తవ్యం.. మెయిల్స్ కూడా అచ్చ తెలుగు లో ఇచ్చేద్దామా అంటే, ఈ ఇంగ్లీషు చదువు గాళ్ళకి తెలుగు చదవడమే రాదాయే.. మన "ప్రేమ" వాళ్ళకి "దోమ" లా కనిపించచ్చు.. పర్వాలేదు అనుకున్నా.. "దోమ".. "ప్రేమ" అయిపోతే కొంప కొల్లేరైపోదూ.. లేని పోని రిస్క్ కదా...

ఏదో లెండీ.. సీత కష్టాలు సీతవి.. నా కష్టాలు నావి.. సెల్వ స్వామి కష్టాలు.. మా ఆవిడవి.. (మీరు మొగలి రేకులు చూడకపోతే అది నా తప్పు కాదు) అందుకని మీ బుర్రలు పాడు చేసుకోకండి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. పది మైళ్ళవతల మీ ఆఫీసు ఉంటే రోజూ పదకొండు మైళ్ళు వెళ్తూ ఉండండి.. ఏదో ఒకరోజు మీరు సొంత బిజినెస్సు పెట్టుకోవాల్సి వస్తుంది.

7 comments:

 1. aaDalEka maddelu vODu anTE idE anTaaraa ? :-)

  ReplyDelete
 2. నేను కూడా ఇటువంటి కష్టాలు పడ్డాను లేఖిని తో మొదట్లో.. తరువాత గూగుల్ IME వాడడం మొదలుపెట్టా.. మీరూ ఒకసారి ప్రయత్నిచండి

  ReplyDelete
 3. నిజమేనండీ ! యెంత కష్తం గా ఉందో! లేఖినిలొ తప్ప ఇంకెక్కడా ఠ రానే రాదు. అలా అని ఇక్కడ నుండే అన్నీ వ్రాయడం చేద్దామా అంటే కొన్ని చోట్ల చాలా సులువుగా..తెలుగు వ్రాసే వీలు ఉంటుంది. అందుకే నేను అక్కడా ఇక్కడా కప్ప గంతులు గెంతుతూ ఉంటాను .మీ బాధ అర్ధం అయింది. ప్చ్..

  ReplyDelete
 4. అక్షరమాల ప్రయత్నించండి.. అను వస్తే ఇంకా మంచిది..

  http://code.google.com/p/aksharamala/downloads/detail?name=Aksharamala2007-3.6.2.12.zip&can=2&q=

  ReplyDelete
 5. మొదట్లో ఆర్టీయస్ వాడెప్పుడు నేను కూడా ఇలానే ఆంగ్లానికి తెంగ్లిష్ టైపాట్లు పడేవాడ్ని. ఇప్పుడయితే ఎంచక్కా ఇన్ స్క్రిప్ట్ కు మారిపొయినాను. మెదడులో ఏ టైపాటు దానిదే.

  ReplyDelete
 6. నేను బరహIME వాడుతాను. ఇప్పుడు బాగా అలవాటు అయ్యింది.
  @వనజ వనమాలిగారు, బరహలొ "ఠ" వస్తుంది. Tha అని టైపు చేయాలి.

  ReplyDelete