Friday, February 24, 2012

పందుల దొడ్డా.. లేక బందెల దొడ్డా..

ఎవడైనా మనల్ని వెధవన్నర వెధవా అన్నాడనుకోండి, మనం హర్ట్ అవుతామా లేదా. మరి అలా నొచ్చుకున్న తరుణంలో, తిట్టిన వాడు నాలిక కరుచుకుని, అయ్యో సారీ.. నేను వెధవన్నర వెధవా అనలేదు.. కేవలం వెధవా అని మాత్రమే అన్నాను.. అంటే ఎంత రిలీఫ్.. మరియు ఓదార్పు.. నువ్వు పందివి కాదురా, దున్నపోతువు మాత్రమే అంటే అంతకు మించిన పొగడ్త ఉందా ?

సేం టూ సేం అదే ఫీలింగ్ మన శాసన సభకి ఈ రోజు. ఎర్ర బుస్కోటు వేసుకుని కోడి కూర తింటూ వీధి పోరాటాల్లో దర్శనమిచ్చే నారాయణ గారు, శాసన సభని పందుల దొడ్డి తో పోల్చారని మీడియా అంతా కోడై కూసింది. ఇంతలోనే పశ్చాత్తాపంతో (సభా హక్కుల ఉల్లంఘన వల్ల కాదేమో లెండి) ఆయన, నేను అన్నది బందెల దొడ్డి అని.. పందుల దొడ్డి కాదని వివరణ ఇచ్చారు. ఇందులో మనం మన శాసన సభ గౌరవం ఎంత ఇనుమడించిందో తెలుసుకోవాలని మనవి. ప్రజాస్వామ్యం విలువలు అత్యున్నత స్థాయికి చేరుకున్నందుకు మనం గర్వపడాలి. సంతోషించాలి. కానీ మీతో నాకున్న చనువు కొద్దీ చెప్తున్నాను, మన శాసన సభ్యులు పశువుల (లేక పందుల) నుంచీ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. వాటి క్రమశిక్షణ వీళ్ళకేది ? అవి వాటిలో అవి అర్థం లేకుండా తన్నుకోవు, ఒకవేళ లోక కల్యాణం కోసం తన్నుకున్నా మనల్ని లైవ్ లో చూడమనవు. జట్టుకట్టి ఆ జట్టుని మరొకడి దగ్గర తాకట్టు పెట్టవు.. మేత లేదని ఊరి మీద పడి ఇళ్ళు దోచుకోవు.. ఫోనుల్లో బూతు వీడియోలు చూడవు.. అన్నిటికన్నా ముఖ్యం గా మన మొహాన పేడ కొట్టవు, అంతో ఇంతో సాయమే చేస్తాయి. ఈ లక్షణాల్లో ఒక్కటైనా ఉందా మన MLA లకి ?

అయినా.. నాకు తెలీక అడుగుతున్నాను.. అసెంబ్లీ ని పందుల దొడ్డితో పోలిస్తే, ఇబ్బంది ఉంటే గింటే పందులకుండాలి కానీ, మన సభ్యులకు ఏంటంట అవమానం ? నా బ్లాగు వరకూ మాత్రం నేను నారాయణ గారి వివరణని గౌరవిస్తున్నాను. మరి ఏ ఏభైయేళ్ళకో ఇది చారిత్రక తప్పిదం అని ఒప్పుకుని మాట మారిస్తే చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి మాత్రం బందెల దొడ్డే ఫైనల్. లాక్ చేసేద్దాం.

Tuesday, February 14, 2012

అమ్మ అంటే కేవలం త్యాగమేనా ?

ఆదివారం వైజాగ్ నుంచి అమ్మతో చెన్నై వస్తూంటే, ఏవో ఆలోచనలు మెదిలాయి మనసులో. మీతో పంచుకోవాలని అనిపించి ఈ టపా మొదలుపెట్టాను. (కొన్ని వాక్యాలు పరస్పర విరుద్ధం గా తోచచ్చు.. మరికొన్ని అసంపూర్ణంగా.. తప్పు మనసుదే అయ్యుంటుంది మరి. ;-) )

అసలు ప్రయాణం అంతా మాటల్లోనే అయిపోతుందేమో అనుకున్నాను, కానీ ఆలోచనలు అలసి ఆగితే కదా భావాలు భాషగా బయట పడడానికి. నాకు తెలీకుండానే ఒక్కోసారి గతం వర్తమానం అయిపోతుంటుంది. నేనూ మళ్ళీ బ్రతికేస్తుంటాను.. ఒకే అనుభవం గుర్తొచ్చిన ప్రతీసారీ నిత్య నూతనంగా కనిపిస్తుంది.. అయినా అమ్మకి నేను కొత్తగా ఏంచెప్పను ? నా నిశ్శబ్ధాన్ని నాకంటే బాగా అర్థం చేసుకోగలిగేది ఆమె తప్ప మరెవరు ?

ఎందుకో సడన్ గా ఒక వాక్యం తట్టింది నాకు.. "అమ్మ లేకపోతే నేను లేను.. కానీ నేను లేకపోయినా ఆమె ఉంది.. ఆమెకంటూ ఒక జీవితం ఉంది".. లోతుగా ఆలోచించాను. అమ్మే నా అస్తిత్వం. నాకు జన్మనిచ్చింది. ఆమె లేకపోతే నేను లేనే లేను. కానీ ఆమె జీవితం లో నా పాత్ర ఎంత ?

మార్గ మధ్యంలో అమ్మ కూడా ఏవో గుర్తు చేసుకుంది, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా కలిసి ప్రయాణించాం.. ఇలాంటి వివరాలు.. అమ్మకు జ్ఞాపకాలే ఊపిరి. నేను టచ్ లోనే లేని నా స్నేహితుల పేర్లు అమ్మకు ఇంకా గుర్తే.. అమ్మకి నా గతం జీవితం కాబోలు. అందుకే నేను మర్చిపోయిన సంఘటనలూ అమ్మకి కంటికి కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి నేటికీ.. ఆ గతం ఆమెకి ఒక గర్వాన్నీ/సంతృప్తినీ ఇస్తుంది. దాన్ని నేను గౌరవిస్తాను మనసారా. బిడ్డకి అయిన గాయాలు కాలంతో పాటూ మానిపోతాయి, కానీ ఆ కన్నీళ్ళు తనవిగా చేసుకున్న తల్లి ఎలా మరువగలదు ?

ఏవో ఆలోచనలు.. వ్యక్తిగా అమ్మని నేను అర్థం చేసుకున్నాను, ప్రేమించాను. గౌరవించాను. ఆమె జీవితంతో పోరాడింది, మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టడానికి.. అవి గుర్తొస్తే కళ్ళు చమరుస్తాయి.. కలలోనైనా.. అంతకు మించి ఆమె వ్యక్తిత్వం నాకు స్పూర్తి. ఆదర్శం. కానీ అమ్మ అంటే త్యాగమేనా.. కాదేమో. ఆమె తనదైన జీవితాన్ని, తనకు నచ్చినట్టు గడపాలి అని నా కోరిక. అందులో నేనూ భాగం అవ్వాలని ఆశ పడతాను, అంతేకానీ దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చెయ్యను. అమ్మలో ఉన్న మామోలు మనిషి ని తన బలహీనతలతో సహా నేను అంగీకరించాలనుకుంటాను. ఎందుకంటే ఆ మనిషి నాకు ప్రాణ మిత్రుడు.. ఆత్మ బంధువు.

పురాణాల నుంచీ నేటి తరం కథల వరకూ అమ్మ పాత్ర అంటేనే ఒక ఔచిత్యం.. పిల్లల కోసం గుండెనే కోసి ఇచ్చేసే అంతటి త్యాగం, ఎన్ని తప్పిదాలైనా చిరునవ్వుతో క్షమించేసే సహనం.. కానీ అమ్మ కూడా ఒక సాధారణ వ్యక్తే కదా ? ఆమె జీవితాంతం త్యాగాలు చేస్తూనే ఉండిపోవాలా ? తనకంటూ కోరికలు, ఆశలూ ఉండవా ? బాధ్యతలు నెరవేర్చాక అమ్మకి జీవితం ఏమిచ్చింది ? ఆ జీవితం నుంచి ఆమె ఏం ఆశిస్తోంది ?

ఈ ప్రశ్నలన్నిటికీ నాకు నేను సమాధానాలు చెప్పుకునే ప్రయతం చేస్తున్నాను.. నిజాయితీగా.

"అమ్మ నా తప్పటడుగులని భరించి.. సరిదిద్ది.. నడక నేర్పింది.. పరుగులో పడిపోయి ఏడ్చినప్పుడల్లా.. ఓదార్చి, వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఆమెకు ఆసరాగా నేను నిలిచే క్షణాన... నా చేతికి ఆమె గుండె బరువు మోసే సత్తువని ఇవ్వమని.. ఆమె మనసుకు గాయమైతే నా కంట నీటినొలికించమని ఆ దైవాన్ని ప్రార్ధిస్తున్నాను"

మొన్నెప్పుడో రాసుకున్న వాక్యాలు ఇవి..

"అమ్మతో మాట్లాడని రోజు అసంపూర్ణం గా అనిపిస్తుంది..
పంచుకోని ఆనందానికి అర్థమే లేదనిపిస్తుంది..
ఆమె అంతరంగం అంతేలేని సాగరం..
ఆమె జీవితం.. తరచి చూసుకోవాల్సిన పుస్తకం.
దేవుడు ఎప్పుడూ నాకు ఎదురుపడనేలేదు...
అమ్మ నా చేయి ఎప్పుడూ వదలనేలేదు. "


(ఈ రోజు అమ్మ గురించి రాయడం యాధృచ్చికమే కావచ్చు, కానీ నాకు ఎంతో అర్థవంతం గా అనిపించింది. మనిషి జీవితంలో తల్లి ప్రేమను మించినదేముంది ? )