Tuesday, February 14, 2012

అమ్మ అంటే కేవలం త్యాగమేనా ?

ఆదివారం వైజాగ్ నుంచి అమ్మతో చెన్నై వస్తూంటే, ఏవో ఆలోచనలు మెదిలాయి మనసులో. మీతో పంచుకోవాలని అనిపించి ఈ టపా మొదలుపెట్టాను. (కొన్ని వాక్యాలు పరస్పర విరుద్ధం గా తోచచ్చు.. మరికొన్ని అసంపూర్ణంగా.. తప్పు మనసుదే అయ్యుంటుంది మరి. ;-) )

అసలు ప్రయాణం అంతా మాటల్లోనే అయిపోతుందేమో అనుకున్నాను, కానీ ఆలోచనలు అలసి ఆగితే కదా భావాలు భాషగా బయట పడడానికి. నాకు తెలీకుండానే ఒక్కోసారి గతం వర్తమానం అయిపోతుంటుంది. నేనూ మళ్ళీ బ్రతికేస్తుంటాను.. ఒకే అనుభవం గుర్తొచ్చిన ప్రతీసారీ నిత్య నూతనంగా కనిపిస్తుంది.. అయినా అమ్మకి నేను కొత్తగా ఏంచెప్పను ? నా నిశ్శబ్ధాన్ని నాకంటే బాగా అర్థం చేసుకోగలిగేది ఆమె తప్ప మరెవరు ?

ఎందుకో సడన్ గా ఒక వాక్యం తట్టింది నాకు.. "అమ్మ లేకపోతే నేను లేను.. కానీ నేను లేకపోయినా ఆమె ఉంది.. ఆమెకంటూ ఒక జీవితం ఉంది".. లోతుగా ఆలోచించాను. అమ్మే నా అస్తిత్వం. నాకు జన్మనిచ్చింది. ఆమె లేకపోతే నేను లేనే లేను. కానీ ఆమె జీవితం లో నా పాత్ర ఎంత ?

మార్గ మధ్యంలో అమ్మ కూడా ఏవో గుర్తు చేసుకుంది, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా కలిసి ప్రయాణించాం.. ఇలాంటి వివరాలు.. అమ్మకు జ్ఞాపకాలే ఊపిరి. నేను టచ్ లోనే లేని నా స్నేహితుల పేర్లు అమ్మకు ఇంకా గుర్తే.. అమ్మకి నా గతం జీవితం కాబోలు. అందుకే నేను మర్చిపోయిన సంఘటనలూ అమ్మకి కంటికి కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి నేటికీ.. ఆ గతం ఆమెకి ఒక గర్వాన్నీ/సంతృప్తినీ ఇస్తుంది. దాన్ని నేను గౌరవిస్తాను మనసారా. బిడ్డకి అయిన గాయాలు కాలంతో పాటూ మానిపోతాయి, కానీ ఆ కన్నీళ్ళు తనవిగా చేసుకున్న తల్లి ఎలా మరువగలదు ?

ఏవో ఆలోచనలు.. వ్యక్తిగా అమ్మని నేను అర్థం చేసుకున్నాను, ప్రేమించాను. గౌరవించాను. ఆమె జీవితంతో పోరాడింది, మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టడానికి.. అవి గుర్తొస్తే కళ్ళు చమరుస్తాయి.. కలలోనైనా.. అంతకు మించి ఆమె వ్యక్తిత్వం నాకు స్పూర్తి. ఆదర్శం. కానీ అమ్మ అంటే త్యాగమేనా.. కాదేమో. ఆమె తనదైన జీవితాన్ని, తనకు నచ్చినట్టు గడపాలి అని నా కోరిక. అందులో నేనూ భాగం అవ్వాలని ఆశ పడతాను, అంతేకానీ దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చెయ్యను. అమ్మలో ఉన్న మామోలు మనిషి ని తన బలహీనతలతో సహా నేను అంగీకరించాలనుకుంటాను. ఎందుకంటే ఆ మనిషి నాకు ప్రాణ మిత్రుడు.. ఆత్మ బంధువు.

పురాణాల నుంచీ నేటి తరం కథల వరకూ అమ్మ పాత్ర అంటేనే ఒక ఔచిత్యం.. పిల్లల కోసం గుండెనే కోసి ఇచ్చేసే అంతటి త్యాగం, ఎన్ని తప్పిదాలైనా చిరునవ్వుతో క్షమించేసే సహనం.. కానీ అమ్మ కూడా ఒక సాధారణ వ్యక్తే కదా ? ఆమె జీవితాంతం త్యాగాలు చేస్తూనే ఉండిపోవాలా ? తనకంటూ కోరికలు, ఆశలూ ఉండవా ? బాధ్యతలు నెరవేర్చాక అమ్మకి జీవితం ఏమిచ్చింది ? ఆ జీవితం నుంచి ఆమె ఏం ఆశిస్తోంది ?

ఈ ప్రశ్నలన్నిటికీ నాకు నేను సమాధానాలు చెప్పుకునే ప్రయతం చేస్తున్నాను.. నిజాయితీగా.

"అమ్మ నా తప్పటడుగులని భరించి.. సరిదిద్ది.. నడక నేర్పింది.. పరుగులో పడిపోయి ఏడ్చినప్పుడల్లా.. ఓదార్చి, వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఆమెకు ఆసరాగా నేను నిలిచే క్షణాన... నా చేతికి ఆమె గుండె బరువు మోసే సత్తువని ఇవ్వమని.. ఆమె మనసుకు గాయమైతే నా కంట నీటినొలికించమని ఆ దైవాన్ని ప్రార్ధిస్తున్నాను"

మొన్నెప్పుడో రాసుకున్న వాక్యాలు ఇవి..

"అమ్మతో మాట్లాడని రోజు అసంపూర్ణం గా అనిపిస్తుంది..
పంచుకోని ఆనందానికి అర్థమే లేదనిపిస్తుంది..
ఆమె అంతరంగం అంతేలేని సాగరం..
ఆమె జీవితం.. తరచి చూసుకోవాల్సిన పుస్తకం.
దేవుడు ఎప్పుడూ నాకు ఎదురుపడనేలేదు...
అమ్మ నా చేయి ఎప్పుడూ వదలనేలేదు. "


(ఈ రోజు అమ్మ గురించి రాయడం యాధృచ్చికమే కావచ్చు, కానీ నాకు ఎంతో అర్థవంతం గా అనిపించింది. మనిషి జీవితంలో తల్లి ప్రేమను మించినదేముంది ? )

3 comments:

 1. బిడ్డకి అయిన గాయాలు కాలంతో పాటూ మానిపొతాయి, కానీ ఆ కన్నీళ్ళు తనవిగా చేసుకున్న తల్లి ఎలా మరువగలదు ?

  అమ్మలో ఉన్న మామోలు మనిషి ని తన బలహీనతలతో సహా నేను అంగీకరించాలనుకుంటాను. ఎందుకంటే ఆ మనిషి నాకు ప్రాణ మిత్రుడు.. ఆత్మ బంధువు.

  ఇవి చాలు..ఆమెకి మీరివ్వగల్గే.. అతి పెద్ద బహుమతులు ఇవే!!! ఆ తల్లి ఇంకేమి కోరుకోదు కూడా!!!!

  ReplyDelete
 2. "ఆమె తనదైన జీవితాన్ని, తనకు నచ్చినట్టు గడపాలి అని నా కోరిక. అందులో నేనూ భాగం అవ్వాలని ఆశ పడతాను, అంతేకానీ దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చెయ్యను".very nice.

  many people cant understand the thin line between taking care of ,and dictating others life.

  ReplyDelete
 3. Amma gurinchi yentha sepu chadivina haayigaane untundhi , chala baaga share chesaru mee views ni....:-)

  esp.

  బిడ్డకి అయిన గాయాలు కాలంతో పాటూ మానిపొతాయి, కానీ ఆ కన్నీళ్ళు తనవిగా చేసుకున్న తల్లి ఎలా మరువగలదు ?

  దేవుడు ఎప్పుడూ నాకు ఎదురుపడనేలేదు...
  అమ్మ నా చేయి ఎప్పుడూ వదలనేలేదు. "

  Bhagavanthudu anni chootla undaleka Amma ni srutinchadu antaru , aa vishayanni chala chakkaga chepparu.

  ReplyDelete