Thursday, March 29, 2012

రాజకీయ క్షమాభిక్ష

అభిలాష సినిమాలో, హీరో ఉరిశిక్ష రద్దు కోసమని తన ప్రాణాలనే పణంగా పెడతాడు. అలా అని ఉరిశిక్ష పడ్డవాళ్ళందరూ హీరోలనుకుంటే మనంత అమాయకుడు మరోడు లేడు. స్వతంత్ర భారతంలో ఉరి ఆషామాషీ నేరాల్లో పడదు, ఘోరాతి ఘోరమైన కేసుల్లోనే విషయం మరణశిక్ష వరకూ వెళ్తుంది. కానీ మన కోర్టుల్లో తీర్పులు వచ్చి, శిక్షలు అమలు చెయ్యాల్సిన టైం కి మనం అసలు నేరం మరచిపోతాం. అయ్యో పాపం మరణ శిక్షా అని దీర్ఘాలు తీసి, నేరస్థుడిపై సానుభూతి చూపిస్తాం. ఈ సానుభూతి నేరస్థులకి శ్రీరామ రక్ష.. శిక్షలు, వాటి అమలు, జరిగిన నేరానికే కాదు, అలాంటి నేరాన్ని చేద్దామనుకునే మరెవడికైనా ఒక హెచ్చరిక గా ఉండాలి. ఒక ప్రక్క దొరికిన దొంగలను దొరికన చోటన కాల్చిపడేస్తున్న పోలీసు వ్యవస్థ.. మరో వైపు ఉరిశిక్ష పడిన నేరస్థులని కూడా రాజకీయ ప్రయోజనాలకోసం వెనకేసుకొచ్చే పార్టీలు. అఫ్జల్ గురూని కాశ్మీరు ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటే, రాజీవ్ హత్యలో నేరస్థుల్ని ద్రవిడ పార్టీలు భుజానెత్తుకుంటాయి. ( వాటికి దేశంలో మగ్గుతున్న తమిళుల కంటే లంకలోని తమిళులే ముద్దు మరి ). ఇప్పుడు పంజాబ్ లోనూ అదే జరుగుతోంది. ఒకప్పటి ముఖ్యమంత్రి మరణానికి కారణమైన నేరస్థుణ్ణి క్షమించమంటూ ఇప్పటి ముఖ్యమంత్రి ఆఘమేఘాల మీద రాష్ట్రపతిని కలిసి మరీ వేడుకున్నారు.. ఏమనగలం.. ఏళ్ళ తరబడి క్షమాబిక్ష పిటిషన్లను ఎటూ తేల్చకుండా తమదగ్గర అట్టేపెట్టడం, రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకోవడం.. ఎంతవరకూ సమంజసం ?

ఈ ప్రహసనంలో పార్టీలు తమ స్వార్థానికి వాడుకునే బూచి, శాంతిభధ్రతలు. నేరస్థులకి శిక్షను అమలుపరచలేని పరిస్థితిలో ఉన్నామా మనం ? ప్రజలు కోరుకుంటే వెంటనే కాల్చిపారేయడం. అదే ప్రజలు (బహుశా వాళ్ళని ప్రాతినిధ్యం వహిస్తున్న కొద్ది మంది) సానుభూతి చూపిస్తే, క్షమించేయడం. ఇంక న్యాయం, చట్టం, కోర్టులు, శిక్షలు.. ఇవన్నీ ఎందుకు ? నేరస్థుల్ని ఒక బహిరంగ ప్రదేశం లో నిలబెట్టి జనాల్ని తీర్పులు చెప్పమంటే సరి. ఎవడి గొంతు పెద్దదో, ఎవడి మాట చెల్లుతుందో వాడే న్యాయమూర్తి. ఉరిశిక్ష వేసే హక్కు మనకుందా లేదా అన్నది వేరే ప్రశ్న, నిజంగా మరణశిక్షే అమానుషం అనుకుంటే, దాన్ని సమూలంగా రద్దు చేసుకోవచ్చు. కానీ వేసిన శిక్షల అమలుని శాంతి భధ్రతల పేరుతో ప్రభావితం చేయడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు. ఒక వర్గం ప్రయోజనాలకోసమో, ప్రతీకారేచ్చతోనో జరిగే నేరాల్లో మరణ శిక్ష ఇంక అమలు చెయ్యడం సాధ్యం కాదు అనే సంకేతాన్ని ఇచ్చేలా ఉన్నాయి ఈ సంఘటనలు. జరిగిన నేరంలో అశువులు బాసిన అమాయకులు, చిన్నాభిన్నం అయిన కుటుంబాలు ఈ సందర్భం లో ఎవరికి గుర్తు ?. ఎంత దారుణం. ప్రియాంక గాంధీ క్షమించేస్తుంది.. లండన్ లో చదువుకుంటున్న నళిని, మురుగన్ల కూతురు లైవ్ లో కృతజ్ఞతలు చెప్పేస్తుంది. తమిళ ఈలం తో కానీ, శాంతి సేన తో కానీ ఏ సంబంధం లేకపోయిన ఆ రోజు అక్కడ ఉన్న పాపానికి ప్రాణాలు కొల్పోయిన మనలాంటి జనాలు ఎవరికీ అక్కరకు రారు. మన ఔదార్యం ఎంత గొప్పది అంటే మన సానుభూతి ప్రియాంక గాంధీకీ ఉంది, హరిత్ర మురుగన్ కీ ఉంది. ఇంక నేరం/శిక్ష ఏవి ?

రేపో మాపో కసబ్ కి ఉరి తీయాలంటే కూడా, పెద్దయెత్తున సానుభూతి కదిలి వస్తుంది. బహుశా క్రొవ్వొత్తుల ప్రదర్శనలు కూడా జరుగుతాయేమో. లండన్ లో ఒక సర్వమత ర్యాలీ.. పాకిస్తాను లోనూ, ఢాకాలోనూ బందు.. వీటన్నింటినీ చూసి మనం ఆ కిరాతకుడు చేసిన మారణకాండను బుర్రల్లోంచి తొలగించి, క్షమాభిక్ష ప్రసాదిస్తాం. మన క్షమాగుణం చరిత్రలో నిలచిపోతుంది.

నిజానికి కొన్ని నేరాలకి ఉరిశిక్ష కూడా సరిపోదు అని నా అభిప్రాయం.

Tuesday, March 27, 2012

14 కోట్లూ ఒక లంచమేనా..

చిన్నప్పుడు, బహుశా ఒకటో తరగతిలో అయ్యుంటుంది, నాకు ఎన్ని అంకెలు వచ్చు అని ఎవరైనా అడిగితే నేను గుక్క తిప్పుకోకుండా వందో, రెండొందలో చెప్పేసే వాణ్ణి. ఆ వయసులో అదో అచీవ్ మెంట్. కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయో చూడాల్సిన అవసరం ఎప్పుడూ రానే లేదు. కానీ 2G రాజా గారి పుణ్యామా అని హఠాత్తుగా కోటి అతి చిన్న సంఖ్య అయిపోయింది. పేపర్లో లంచాలు, కుంభకోణాలు.. కనీసం ఓ పదివేల కోట్లైనా లేకపోతే కంటికి ఆనడం లేదు. అసలు అలాంటి వార్తలు మెయిన్ పేపర్ లో రాయకూడదని నా ఫీలింగ్. మొన్నెప్పుడో బొగ్గు కుంభకోణం అన్నారు, బావుంది, 2G సరసన నిలచేలా ఉంది. కానీ నిన్నటికి నిన్న మన ఆర్మీ చీఫ్ మరీ చీపు గా 14 కోట్ల లంచం తనకు ఇవ్వచూపారని వాపోయారు. ఆయన బాధను మనం మానవీయ కోణం లో చూడాలి. అది కూడా పదవీ విరమణ కి కాస్త దూరం లో మరీ 14 కోట్లంటే.. అవమానమే. దానికి మన కేంద్ర రక్షణ మంత్రే సాక్ష్యం అన్నారు వీ కే సింగ్ గారు. ఇవే ఆరోపణలు ఏ సిబల్ పైనో, పవార్ పైనో వస్తే అసలు గొడవే లేదు, వాళ్ళు డైరెక్ట్ గా ఇలాంటి చిన్న స్కాముల్లో తలదూర్చరు అని మనం వీజీ గా నమ్మేసే వాళ్ళం. కానీ అంటోనీ గారికి కాస్తో కూస్తో మంచి పేరుందాయే. ఆయనేమో ఈ రోజు ప్రకటన చేస్తూ, నేనూ నిజమే, ఆయనా నిజమే, 14 కోట్లూ నిజమే.. ఇస్తానన్నది ఫలానా ఫలానా.. ( కానీ ఎందుకు ఇవ్వలేదో నాకు తెలీదు.. ) ఈయన ఎందుకు కేసు పెట్టలేదో అంతకంటే తెలీదు అన్నారు.

ఇదంతా చూస్తుంటే, నాకు నవ్వాలో.. ఏడ్వాలో.. తెలీడం లేదు. ఒకాయనేమో సైన్యానికి అధిపతి.. మరొకాయన రక్షణ శాఖకి కేబినట్ మంత్రి. ఇద్దరిలో ఒకరు చెప్పేది అబద్దం అని తెలుస్తూనే ఉంది. మంత్రి గారు కిమ్మనలేదు అంటాడు ఈయన, అయ్యో నేను ఆ రోజు కేరళ వెళ్ళడానికి రైలు రిజర్వేషన్ పనిలో బిజీ గా ఉన్నాను, అందుకే దర్యాప్తు ఆదేశించలేదు అంటారు మంత్రి గారు. ఎవరిని నమ్మడం. ఇంతా చేసి పోనీ ఆ లంచం ఆఫర్ చేసిన వ్యక్తి ఏమైనా తెహల్కా వాడా అంటే, ( చీకట్లో ఇద్దర మనుషుల నీడలైనా చూసి మనం గుర్తుపట్టేయడానికి ) కనీసం TV9 వాడు కూడా కాదు. ఆయనో మాజీ సైన్యాధికారి. అయ్యా నా పెన్షన్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు, ఈ తిరుగుడులో 14 పేరగాన్ జోళ్ళు మార్చాను అంటే, అసలే రిటైర్మెంట్ టెన్షన్ లో ఉన్న మన పెద్దాయనికి, 14 కోట్లని అర్థం అయ్యిందేమో.. అసలు తమాషా, విపక్షం తరపున మన జైట్లీ గారు ప్రభుత్వానికే తమ మద్దతు అని రాజ్యసభలో ప్రకటించడం. కరక్టే లెండి, ఫ్రీగా దొరికాయని తీగలు లాగితే, ఎవరి డొంకలు కదులుతాయో, ఎవరి పీకలు తెగుతాయో ఎవరికి తెలుసు. (బంగారు లక్ష్మణ్ గారు కుళ్ళు నవ్వుతో డబ్బు కట్టలని తన డ్రా లో పెట్టుకోవడం మరచిపోవడానికి మనం సంజయ్ రామసామీలం కాదు కదా)

నాలాంటి సగటు పొరుడికి, సైన్యం, దాని బాగోగులు గురించి ఏంతెలుసు అంటే, సన్నీ డియోల్ సినిమాల్లో చూపించినంత. ఎంత బడ్జెట్ ఇస్తున్నారో, ఎంత ఖర్చు చేస్తున్నారో, దేనికి/ఎలా ఖర్చు చేస్తున్నారో, ఎవరిది భాధ్యతో.. ఇవన్ని మనకి చిదంబర (సారీ... ఆంటోనీ) రహస్యాలు. ప్రజాస్వామ్యం లో ప్రజలే ప్రభువులు అని చెప్పుకుని, మురిసిపోయి, ముసుగేసుకుని పడుకోవడమే కానీ, పారదర్శకత ఏది. ఇంకా మన రాష్ట్రమే నయ్యం, బురద పోసుకునే బృహత్తర కార్యక్రమం లో అయినా మనకీ కాస్త ఉప్పందిస్తూ ఉంటారు. సైన్యం అంటే ఇప్పటికీ సమాజం లో ఒక తరగని గౌరవం, ప్రతిష్ఠ ఉన్నాయి, కానీ అది కూడా మన క్రికెట్ బోర్డు లాంటిదే అనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయి ఈ వివాదాలు. స్కాములూ. ఏది ఏమైనా మొన్నటి వరకూ తన పుట్టిన తేదీ విషయం లో వార్తలకెక్కిన మన చీఫ్ గారు, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ 14 కోట్ల అంశం ఎందుకు తిరగతోడుతున్నారో ఆయనకే తెలియాలి. UPA-2 కి మధ్యంతరం కళ వచ్చేసిందంటారా ?

Sunday, March 25, 2012

అయ్యో పాపం స్పెన్సర్ ప్లాజా (చెన్నై నుంచి రికార్డెడ్ లైవ్)

వారాంతం లో భార్యను బయటకు తీసుకెళ్ళనివాడు వచ్చే జన్మలో మన్మోహన్ సింగ్ గా పుడతాడని ఏదో సామెత ఉందంట. నిజమో కాదు, ఇప్పుడు మనకి అప్రస్తుతం. ఎందుకైనా మంచిదని, నేను మా ఆవిడని నా డొక్కు పల్సర్ మీద నిన్న సాయంత్రం అలా స్పెన్సర్ ప్లాజా కి తీసుకెళ్ళాను. కొత్తగా పెట్టిన ఎన్నో మాల్స్ ఉండగా అవన్నీ వొదిలేసి ఎప్పుడో క్రీస్తు పూర్వం కట్టిన స్పెన్సర్ కి ఎందుకెళ్ళేమా అనే కాదా మీ అణుమానం, ఏంచెప్పమంటారు, నాకూ స్పెన్సర్ కి ఒక అవినాభావ సంబంధం మరి. ఎక్కడికో దగ్గరికి అని బయలు దేరితే, ఆటోమేటిక్ గా నేను స్పెన్సర్ లోనే ల్యాండ్ అవుతాను. ఈ బంధం ఇప్పటిది కాదు సుమండీ, ఎప్పుడో పదమూడేళ్ళ క్రితం ఒకసారి అన్నా యూనివెర్సిటీ ప్రవేశ పరీక్షకని చెన్నై వచ్చాను, అప్పుడు చూసాను మొదటిసారి ఈ మాల్ ని. వైజాగ్ లో చందనా బ్రదర్స్ ని, ఆసియా లో అతి పెద్దది అని ప్రచారం చేసుకున్న బొమ్మనా బ్రదర్స్ ని, తప్ప మరే పెద్ద దుకాణం దూరం నుంచీ కూడా చూడని నాకు స్పెన్సర్ తెగ నచ్చేసింది. మౌంట్ రోడ్డు మీద (దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే,, విజయవాడ లో బందరు రోడ్డు లేదూ అలానే మరి.. ) ఠీవిగా, దర్జాగా కనిపించే స్పెన్సర్ అంటే నాకో పిచ్చి ప్రేమ. (దీన్ని మీరు ఆకర్షణ అని అన్నా, నేను పట్టించుకోను) ఆరేళ్ళ క్రితం ఉద్యోగ రీత్యా చెన్నై వచ్చాక, వీలు దొరికినప్పుడల్లా స్పెన్సర్ ని సందర్శిస్తూనే ఉన్నాను. ఏ దిక్కూ/కిక్కూ లేని బ్రహ్మచారి గాళ్ళకి మరి ఆ రోజుల్లో స్పెన్సరే పెద్ద దిక్కు. ఆఫీసు పని మీద విదేశం వెళ్ళాల్సి వచ్చినా, నా పెళ్ళి షాపింగ్, మిత్రుల పెళ్ళిళ్ళ షాపింగులూ.. వగైరాలన్నీ స్పెన్సర్ లోనే. మా ఫ్రెంచ్ కొలీగ్స్ ఎవరైనా వచ్చి చెన్నై లో మంచి మాల్ చెప్పమన్నా, నేను తడుముకోకుండా స్పెన్సర్ అంటాను. నేను మెచ్చే మరో అంశమేంటంటే స్పెన్సర్ లో బ్రెడ్ ఆమ్లెట్ నుంచీ బెంజి కారు వరకూ అన్నీ దొరికేవి.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, నిన్నటి రోజు స్పెన్సర్ కి వెళ్ళి చూస్తే గుండె తరుక్కుపోయింది. ఒకప్పుడు పార్కింగ్ ప్లేసు లోపలికి వెళ్ళడానికి మెయిన్ రోడ్డు మీద వరకూ చాంతాడంత లైను ఉండేది.. సైకిల్ గ్యాప్ కాదు కదా, సైకిల్ చైను గ్యాప్ కనిపించినా, టూ వీలర్స్ పెట్టేసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు పార్కింగ్ అంతా ఖాళీ, టోకెన్ ఇచ్చేవాడు సరదాగా జోకులువేస్తూ, మీరు వచ్చారు అదే మహాభాగ్యం అన్నట్టు ఉన్నాడు. మన తొక్కలో బైకుని లారీ రేంజ్ లో పార్క్ చేసినా అడిగే నాధుడు కనిపించలేదు. కొన్ని వాహనాలు అయితే వీళ్ళే మరీ బోసిపోకుండా ఉండటానికి పెట్టారేమో అని డౌటు వచ్చేలా ఉన్నాయి. పార్కింగ్ మాట అలా ఉంచండి, లోనికి వెళ్ళి చూస్తే, మాల్ అంతా నిర్మానుష్యం. ఒకప్పుడు బయట మెట్ల మీద ప్రేమ జంటలు స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ, పాప్ కార్న్ ప్యాకెట్లతో కనిపించేవి. మాల్ లోపలి చల్లదనం డోరు తెరుచుకున్నప్పుడల్ల్లా బయట మెట్లవరకూ వచ్చేది. ఇప్పుడు అసలు డోరూ లేదు. ఏ.సీ లేదు.. లోపాలంతా ఏ సహారా ఎడారిలోనో మార్గ మధ్యంలో గుడారాలు వేసుకుని ఉన్నట్టు జనాలు. అక్కడక్కడ, చమట్లు కక్కుకుంటూ. సందడి చెవిటి మెషీను పెట్టుకుని విన్నా మీకు వినిపించదు. ఎక్కడైనా ATM బయట లైను చూస్తాం, ఇక్కడ ATM లే క్యూలో నిలబడి ఎదురుచూస్తున్నాయి.

ఎస్కలేటర్స్ మీద నేను కుటుంబ సమేతంగా ఎక్కితే, మర్యాద రామన్నలో సునీల్ సైకిల్ లా ఆర్తనాదాలు చేసుకుంటూ కదిలాయి. మా ఆవిడ హర్ట్ అయ్యి, దిగేటప్పుడు మెట్లే అని ఆర్డరు వేసింది. (ఎస్కలేటర్ ఎక్కడం వరకూ ఓ.కే కానీ దిగడం తనకి భయమన్న నిజం నేను మీరు ఎంతబలవంతం చేసినా చెప్పను కాక చెప్పను) ఒకప్పుడు తెల్లవాళ్ళే కనిపించేవారు అంతటా, ఇప్పుడు అక్కడక్కడ నల్ల బురఖాలు తప్ప కొత్తమొహాలు ఏవీ లేవు. వచ్చిన వాళ్ళూ నాలా ఏదో గత జన్మ రుణం తీర్చుకుంటున్నట్టే మొహాలు పెట్టుకుని వచ్చారు. బహుదూరపు బాటసారుల్లా ఓ రెండు రౌండ్లు వేసి, బాటా షాపులోకి దూరాం. ఒక్క సేల్స్ మ్యాన్ పలకరిస్తే ఒట్టు, (బాటా లో ఇది మామోలే లెండి, మా అన్నయ్యకి ఒకసారి చిర్రెత్తి, మీది ప్రభుత్వ రంగ సంస్థా అని అడగనే అడిగాడు), కొత్తల్లా, అసలు కనుచూపు మేర ఎవడూ కనిపించలేదు. నేనే నాకు కావల్సిన చెప్పులూ, సైజూ వెతుక్కుని, ఆపై మా ఆవిడని సంప్రదించి, మొత్తం మీద తనూ నేనూ ఓ రెండు జతలు ఫైనల్ అనుకుని, బిల్లు కూడా వేసుకుందామనుకునే టైం లో ఒకాయనెవడో వచ్చి ఆ తంతుని మాత్రం పద్దతి గా చేసి చిల్లర చేతిలో పెట్టాడు. జేబు రుమాలుతో చమట తుడుచుకుని, షాపు బయటకు వచ్చాం. ఎదురుగా పైన సబ్ వే ఉండాలి, మూసేసి ఉంది. ప్రక్కనే ఉన్న జూస్ షాపు నేడో రేపో అన్నట్టుంది. రేనాల్డ్స్ పెన్నులు మాత్రం పెద్ద దుకాణం పెట్టి అమ్ముతున్నారు, వాళ్ళ రికార్డుల ప్రకారం లాస్ట్ కస్టమర్ గత సంవత్సరరం అన్నా హజారే దీక్ష అప్పుడు వచ్చాడంట. అదీ పరిస్థితి. అలా ఫుడ్ కోర్టువైపు నడిచామా, అక్కడ ఇంకా ఘోరం. షాపులు నడిపే జనాలే తప్ప కస్టమర్స్ కాన రారే.. KFC, శరవణా భవన్ ఇంకే గ్రహం మీదా ఇంత ఖాళీగా ఉండవంటే నమ్మాలి. ఏదో కాస్త పొట్టలో పడేసుకుని, ఓ లెమన్ సోడాతో (విత్ సాల్ట్.. ;-)) గొంతు తడుపుకుని మాల్ బయటకి వచ్చాం. నాకైతే మనసు మనసులో, హెల్మెట్ చేతిలోనూ లేదు.. ఎమిటీ దారుణం, ఎందుకీ వివక్ష.. ఓ ప్రక్క ఎక్స్ ప్రెస్ అవెన్యూ, స్కై వాక్.. ఆఖరికి ఆరడుగులు ఉండే సిటీ సెంటర్ కూడా అసలు ఇసుక వేసినా రాలనంత హడావిడి గా ఉంటే, పాపం స్పెన్సర్ కి మాత్రం ఎందుకీ కష్టం. మన వాళ్ళకెప్పుడూ కొత్త వింతే, తెలిసిందే, కానీ అడుగడుగునా మనకు తోడొచ్చిన స్పెన్సర్ ని ఇలా ఎలా వదిలేయగలం. VLCC ప్రకటనలో కుడివైపు ఫొటో లా ఇలా చిక్కి శల్యమైన మన అభిమాన మాలు ని మనం కాక మరెవరు ఉధ్ధరిస్తారు, ఆదుకుంటారు.. తప్పదు. అందుకే నేను బ్లాగు ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, చెన్నై లో ఉన్న వాళ్ళందరూ స్పెన్సర్ కి అప్పుడప్పుడైనా వెళ్తూ ఉండండి, మీరు ఏమీ కొనకపోయినా పర్వాలేదు, స్పెన్సర్ కి మనం ఉన్నాం అనే భరోసా ఇవ్వాల్సిన తరుణం ఇది. ప్రక్క వూళ్ళ నుంచి టాక్సీలు కట్టించుకుని కేజీల లెక్కన బంగారం కొనడానికి వచ్చేవాళ్ళూ ఈసారి షాపింగ్ మరి కొంతైనా స్పెన్సర్ లో చెయ్యగలరు. (చిప్స్ ప్యాకట్లు కాదు). కొత్త మాల్స్ కి వెళ్ళి గంటకో ఏభై పార్కింగ్ కి సమర్పించుకుంటే కానీ మీకు థ్రిల్ రాదా ? స్పెన్సర్ లో రెండుగంటలకి పది రూపాయాలే, అది కూడా రద్దయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకుని, మెత్తటి తెల్లటి తువ్వాల్లాంటి జేబు రుమాలు పట్టుకుని వెళ్ళారంటే, మీకు స్పెన్సర్ ఏమాత్రం తక్కువ చెయ్యదు. మీ షాపింగ్ అనంతరం, బయటకు వచ్చాక ఆటో కావాల్సి వచ్చినా, రోడ్డు మీద మీకోసమే ఎదురుచూస్తున్నట్టు ఉన్న ఆటో ని మాత్రం పొరపాటున కూడా బేరమాడకండి.. మీ ఇల్లు అమ్ముకుని మరీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. నాలుగు అడుగులు స్టైల్ గా నడిచి, అప్పుడు బేరమాడుకోండి. ఏంపర్వాలేదు, ఈమధ్య మా ఆటో వాళ్ళు సులభ వాయిదా ఆప్షన్ కూడా ఇస్తున్నారు.

కామెడిగా చెప్పినా, విషయం లోని సీరియస్ నెస్ మీకు అర్థమయ్యే ఉంటుంది లెండి. స్పెన్సర్ ని పాల ముంచే బాధ్యత మనందరిదీ, గుర్తుపెట్టేసుకోండి.

హమ్మయ్యా.. ఇప్పుడు గుండె కాస్త తేలిక పడింది. ఏదైనా చెప్పుకుంటేనే కదా బ్లాగుకి.. మనకీ అందం. ఇంకో విషయమండోయ్, అంతటి ఎడారి నిశ్శబ్ధంలోనూ అడపాదడపా మన అచ్చ తెలుగు గొంతులే వినిపించాయి. నా భ్రమ అని కొట్టిపారేయకండి, మన వాళ్ళకి మిగాత కొత్త మాల్స్ చిరునామాలు ఇంకా సరిగ్గా తెలీవేమో అని నా నమ్మకం.. ;-)

Friday, March 23, 2012

నందనానికి నా విన్నపాలు

శ్రీ ఖర నామ సంవత్సరం కటువుగా, కఠినంగానే కదిలినా, మూసుకుపోయిన కళ్ళను కాస్త తెరిపించి మరీ వెళ్ళింది. మండుటెండలతో ముందుకొచ్చిన నందనం మనలో మరింత చైతన్యం నింపి, సుఖసంతోషాలతో, పండగ సంబరాలతో అలరించాలనీ ఆశిద్దాం.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు

నందనమా, ఇవిగో నా విన్నపాలు.. కాసుకో...

'కాగ్' అక్షింతలతో సరిపుచ్చక, ఈసారి కారం జల్లాలని..
వచ్చే ఎన్నికల్లో అయినా, ఓటరు గెలవాలని..
చిందు, విందు లేకపోయినా ఓకే..
బందులు బందవ్వాలని,
బస్సు టికెట్లు దొరక్కపోయినా పర్వాలేదు..
అవి రోడ్డుమీదే నడవాలని,
పెట్రోలు ధరలు ఎలానో మండుతాయి..
కనీసం శరవణా భవన్ కాఫీ రేటు కుదురుగా ఉండాలని,
ప్యాకప్పో, ప్యాకేజో, ఎవరికి తెలుసు..
చెన్నై లోని తెలుగోళ్ళని తరమకుంటే చాలు,
ప్రమోషన్ మాటేమో గానీ..
మాంద్యం పేరుతో ఉన్నది ఊడకుంటే అదే పదివేలు,
కార్లు.. షికార్లు.. వికార్లు.. వద్దే, వద్దు..
నా నల్ల (మంచి) పల్సర్ పంచరవ్వకపోతే అదే ముద్దు.

(మనలో మన మాట, ఈ ఉపగ్రహ ఛానళ్ళు లేని రోజుల్లో, ఈ సంస్థలన్నీ మనకి శుభాకాంక్షలు ఎలా చెప్పేవో మరి.. ఉదయం నుంచీ టీవీ లో వినీ వినీ చిరాకొస్తోంది)

Monday, March 19, 2012

సచిన్ సచిన్ సచిన్

సచిన్ వంద సెంచరీలు.. లేక వందవ సెంచరీని విశదీకరించి మిమ్మల్ని మెప్పించడానికి నేను క్రీడా విశ్లేషకుణ్ణి కాను. ఏదో నేలబారు క్రికెట్ అభిమానిని. ఈ మధ్య నా బ్లాగు ప్రయాణం మరీ నత్త నడకన (అంటే మన UPA పాలనలా) సాగుతున్నా, సచిన్ సెంచరీ తరువాత నాలుగు మాటలు రాసుకుని నేనూ చరిత్ర పుటల్లో (అదేనండీ బ్లాగు పుటల్లో) ఎక్కిపోదాం అని మొదలు పెట్టా. ఇందులో మీరు హర్ట్ అయ్యి చిర్రుబుర్రులాడటానికి ఏమీ లేదు, ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే (అది కూడా ప్రస్తుతానికి).

కొన్ని రోజుల క్రితం స్నేహితుడొకరు అబ్బాయి పుడితే సచిన్ అని పెరు పెట్టాడు, ఇదేం చోద్యం అనుకుని అడిగిచూసా. (వాళ్ళ నాన్నగారి/తాతగారి పేరు సత్యనారాయణ ఏమో అని అనుమానం కూడా కలిగింది ఎక్కడో ఓ మూల... ) కానీ వాడిచ్చిన వివరణ విన్నాక క్లారిటీ వచ్చింది. వాడికి సచిన్ అంటే వల్లమానిన ఇష్టంట.. జీవితం లో ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పుడల్లా సచిన్ నే తలచుకునే స్పూర్తి పొందుతాట్ట, (అంటే మన్మోహన్ రాహుల్ గాంధీ ని తలచుకున్నట్టు అన్నమాట) అందుకే దానికి గుర్తు గా పిల్లాడికి సచిన్ అని పేరు పెట్టుకున్నానని తేల్చాడు. ఇంకేమంటాం. ఎవడి ఓటు వాడిది కదా. ఒరేయ్, మరి ఆ వందో సెంచరీ కొట్టకపోతేనో అని నా మనసులో ఉన్న భయాన్ని కక్కేసా.. వాడు నిదానంగా నేను ఆ ముందు 99 సెంచరీలూ చూసి పెట్టారా అన్నాడు. అమ్మో వీడి అభిమానం ముందు మన కుప్పిగెంతులు రిస్కేమో అనిపించి ఇంక ఆగిపోయా.

నిజానికి ఫిక్సింగ్, IPL/లలిత్ మోడీ, వగైరాల పుణ్యమా అని నేను క్రికెట్ కి తెలీకుండానే దూరమైపోయాను. ఈ మధ్య అయితే మన టీం లో కన్నా ప్రక్క టీముల్లోనే తెలిసిన పేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైనల్ కి వెళ్ళాలంటే ఎన్ని పాయింట్లు.. వెళ్ళకూడదంటే ఎలా ఓడిపోవాలి.. ఇలాంటి చర్చలు అర్థం చేసుకోవడం ఎప్పుడో మానేసాను. కానీ ఇప్పటికీ సచిన్ అంటే అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. భారతీయ క్రికెట్ ని రెండు భాగాలుగా వర్ణించవచ్చు.. ఎందుకంటే ఒక భాగం మొత్తం సచిన్ కే కేటాయించాలి. కనీసం మా తరం వరకూ (అంటే ఎంసెట్ లో సీట్ల కన్నా అభ్యర్థులు ఎక్కువ ఉన్న తరం) సచిన్ దారిచూపే శిఖరం. దాని మెరుగులు.. ఎత్తులు లెక్కపెట్టడం ఎప్పుడో ఆపేసాను, అతని నుంచి నేను ఏం నేర్చుకున్నానా అన్నది మాత్రమే అసలు విషయం.. నా వరకూ. కొన్ని విజయాలు జాతిని ఏకతాటిపై తెస్తాయి, సచిన్ కెరీరు కూడా అలాంటిదే. మొన్న మా మామయ్య ఫోను లో మాట్లాడుతూ ఒక మాటన్నాడు, సచిన్ సెంచరీలు జట్టు గెలుపుకి ఎంత దోహదపడ్డాయి అని లెక్క పెడుతున్నారు, మరి 90 లో అవుటయిన ఇన్నింగ్స్ మాటేమిటి అని. సచిన్ ని ఎవరైన విమర్శిస్తే, ఆ విమర్శలోనూ, నాకు దాగున్న అభిమానమే కనిపిస్తుంది. యువతరం యేభైలకి చేరువులో ఉన్న షారుఖ్ నీ అమీర్ నీ ఎంత ఫాలో అవుతోందో తెలీదు కానీ, సచిన్ అనే వెలుగు కిరణం మరికొన్ని తరాల వరకూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. నిశ్శబ్ధంగా.

అత్యుత్తమ స్థాయి పరిశ్రమ, నైపుణ్యం, క్రమశిక్షణ, ప్రదర్శన.. అంతకు మించిన మాడెస్టీ, హ్యుమిలిటీ.. అన్నీ కలిపి సచిన్. కొందరు దేశం కోసం బ్రతుకుతారు.. మరికొందరు దేశాన్ని తమతోపాటూ నడిపిస్తారు. కానీ చాలా కొద్దిమంది జాతిని చైతన్యంతో నింపి తమలా తయారు చేస్తారు. వారిలో నేను సచిన్ ని ముందు నిలబెడతాను. (ఇది కేవలం నా అభిప్రాయం, వ్యక్తుల ప్రభావం, వాళ్ళలో మనం ఏంచూస్తున్నాం అనే దాని మీద కూడా ఆధారపడుతుంది)

సచిన్ క్రీడా నైపుణ్యాన్ని ఈ సంఖ్యలు కొలవగలవో.. లేదో.. నాకు అనుమానమే. కానీ వాటితో అతని వ్యక్తిత్వాన్ని మాత్రం ఖచ్చితంగా సరితూచలేం.. అది కొన్ని తరాలని జీవితాంతం ప్రభావితం చేసిన వ్యక్తిది.. అంతమాత్రం చెప్పగలం. సచిన్ లో ఉన్న ఆటగాడికి ఏదో ఒక రోజు విరమణ తప్పదు, కానీ అది సచిన్ కి కాదు.. అతని దీక్ష కీ కాదు.. అతని ప్రభావానికి అంతకంటే కాదు.

చివరిగా ఒక మాట, భారతరత్న అన్నది నిజంగా జనం హృదయాల్లోంచీ వచ్చేదే అయితే, అది సచిన్ కి ఎప్పుడో వచ్చింది. కొత్తగా అవార్డు ఇచ్చి మనం సాధించేది ఏముంది ?

(సచిన్లో నాకు నచ్చనిదీ ఒకటుందండోయ్.. ఆ ల్యూమినస్ ఇన్వర్టర్ వ్యాపర ప్రకటన.. దానికి తోడు తెలుగు డబ్బింగ్ మరీ ఘోరం, ఎవరో గుజరాతీ వాళ్ళు చెప్పినట్టున్నారు.. ;-) )