Monday, March 19, 2012

సచిన్ సచిన్ సచిన్

సచిన్ వంద సెంచరీలు.. లేక వందవ సెంచరీని విశదీకరించి మిమ్మల్ని మెప్పించడానికి నేను క్రీడా విశ్లేషకుణ్ణి కాను. ఏదో నేలబారు క్రికెట్ అభిమానిని. ఈ మధ్య నా బ్లాగు ప్రయాణం మరీ నత్త నడకన (అంటే మన UPA పాలనలా) సాగుతున్నా, సచిన్ సెంచరీ తరువాత నాలుగు మాటలు రాసుకుని నేనూ చరిత్ర పుటల్లో (అదేనండీ బ్లాగు పుటల్లో) ఎక్కిపోదాం అని మొదలు పెట్టా. ఇందులో మీరు హర్ట్ అయ్యి చిర్రుబుర్రులాడటానికి ఏమీ లేదు, ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే (అది కూడా ప్రస్తుతానికి).

కొన్ని రోజుల క్రితం స్నేహితుడొకరు అబ్బాయి పుడితే సచిన్ అని పెరు పెట్టాడు, ఇదేం చోద్యం అనుకుని అడిగిచూసా. (వాళ్ళ నాన్నగారి/తాతగారి పేరు సత్యనారాయణ ఏమో అని అనుమానం కూడా కలిగింది ఎక్కడో ఓ మూల... ) కానీ వాడిచ్చిన వివరణ విన్నాక క్లారిటీ వచ్చింది. వాడికి సచిన్ అంటే వల్లమానిన ఇష్టంట.. జీవితం లో ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పుడల్లా సచిన్ నే తలచుకునే స్పూర్తి పొందుతాట్ట, (అంటే మన్మోహన్ రాహుల్ గాంధీ ని తలచుకున్నట్టు అన్నమాట) అందుకే దానికి గుర్తు గా పిల్లాడికి సచిన్ అని పేరు పెట్టుకున్నానని తేల్చాడు. ఇంకేమంటాం. ఎవడి ఓటు వాడిది కదా. ఒరేయ్, మరి ఆ వందో సెంచరీ కొట్టకపోతేనో అని నా మనసులో ఉన్న భయాన్ని కక్కేసా.. వాడు నిదానంగా నేను ఆ ముందు 99 సెంచరీలూ చూసి పెట్టారా అన్నాడు. అమ్మో వీడి అభిమానం ముందు మన కుప్పిగెంతులు రిస్కేమో అనిపించి ఇంక ఆగిపోయా.

నిజానికి ఫిక్సింగ్, IPL/లలిత్ మోడీ, వగైరాల పుణ్యమా అని నేను క్రికెట్ కి తెలీకుండానే దూరమైపోయాను. ఈ మధ్య అయితే మన టీం లో కన్నా ప్రక్క టీముల్లోనే తెలిసిన పేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైనల్ కి వెళ్ళాలంటే ఎన్ని పాయింట్లు.. వెళ్ళకూడదంటే ఎలా ఓడిపోవాలి.. ఇలాంటి చర్చలు అర్థం చేసుకోవడం ఎప్పుడో మానేసాను. కానీ ఇప్పటికీ సచిన్ అంటే అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. భారతీయ క్రికెట్ ని రెండు భాగాలుగా వర్ణించవచ్చు.. ఎందుకంటే ఒక భాగం మొత్తం సచిన్ కే కేటాయించాలి. కనీసం మా తరం వరకూ (అంటే ఎంసెట్ లో సీట్ల కన్నా అభ్యర్థులు ఎక్కువ ఉన్న తరం) సచిన్ దారిచూపే శిఖరం. దాని మెరుగులు.. ఎత్తులు లెక్కపెట్టడం ఎప్పుడో ఆపేసాను, అతని నుంచి నేను ఏం నేర్చుకున్నానా అన్నది మాత్రమే అసలు విషయం.. నా వరకూ. కొన్ని విజయాలు జాతిని ఏకతాటిపై తెస్తాయి, సచిన్ కెరీరు కూడా అలాంటిదే. మొన్న మా మామయ్య ఫోను లో మాట్లాడుతూ ఒక మాటన్నాడు, సచిన్ సెంచరీలు జట్టు గెలుపుకి ఎంత దోహదపడ్డాయి అని లెక్క పెడుతున్నారు, మరి 90 లో అవుటయిన ఇన్నింగ్స్ మాటేమిటి అని. సచిన్ ని ఎవరైన విమర్శిస్తే, ఆ విమర్శలోనూ, నాకు దాగున్న అభిమానమే కనిపిస్తుంది. యువతరం యేభైలకి చేరువులో ఉన్న షారుఖ్ నీ అమీర్ నీ ఎంత ఫాలో అవుతోందో తెలీదు కానీ, సచిన్ అనే వెలుగు కిరణం మరికొన్ని తరాల వరకూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. నిశ్శబ్ధంగా.

అత్యుత్తమ స్థాయి పరిశ్రమ, నైపుణ్యం, క్రమశిక్షణ, ప్రదర్శన.. అంతకు మించిన మాడెస్టీ, హ్యుమిలిటీ.. అన్నీ కలిపి సచిన్. కొందరు దేశం కోసం బ్రతుకుతారు.. మరికొందరు దేశాన్ని తమతోపాటూ నడిపిస్తారు. కానీ చాలా కొద్దిమంది జాతిని చైతన్యంతో నింపి తమలా తయారు చేస్తారు. వారిలో నేను సచిన్ ని ముందు నిలబెడతాను. (ఇది కేవలం నా అభిప్రాయం, వ్యక్తుల ప్రభావం, వాళ్ళలో మనం ఏంచూస్తున్నాం అనే దాని మీద కూడా ఆధారపడుతుంది)

సచిన్ క్రీడా నైపుణ్యాన్ని ఈ సంఖ్యలు కొలవగలవో.. లేదో.. నాకు అనుమానమే. కానీ వాటితో అతని వ్యక్తిత్వాన్ని మాత్రం ఖచ్చితంగా సరితూచలేం.. అది కొన్ని తరాలని జీవితాంతం ప్రభావితం చేసిన వ్యక్తిది.. అంతమాత్రం చెప్పగలం. సచిన్ లో ఉన్న ఆటగాడికి ఏదో ఒక రోజు విరమణ తప్పదు, కానీ అది సచిన్ కి కాదు.. అతని దీక్ష కీ కాదు.. అతని ప్రభావానికి అంతకంటే కాదు.

చివరిగా ఒక మాట, భారతరత్న అన్నది నిజంగా జనం హృదయాల్లోంచీ వచ్చేదే అయితే, అది సచిన్ కి ఎప్పుడో వచ్చింది. కొత్తగా అవార్డు ఇచ్చి మనం సాధించేది ఏముంది ?

(సచిన్లో నాకు నచ్చనిదీ ఒకటుందండోయ్.. ఆ ల్యూమినస్ ఇన్వర్టర్ వ్యాపర ప్రకటన.. దానికి తోడు తెలుగు డబ్బింగ్ మరీ ఘోరం, ఎవరో గుజరాతీ వాళ్ళు చెప్పినట్టున్నారు.. ;-) )

2 comments:

  1. బాగా చెప్పారు అండి.. ధన్యవాదములు..మాములుగా ఇండియా ఆడుతుంది అంటే మొదట అడిగే ప్రశ్న స్కోరు ఎంత సచిన్ ఎన్ని కొట్టాడు.. నా ఉహ తెలిసన దెగ్గర నుంచి నిన్న పాక్ మ్యాచ్ వరకు ఇదే విన్నాను ఇంక ఇలా వింటూనే ఉండాలి.. మొన్న టెస్ట్ సిరిస్ మొదటి మ్యాచ్ ఓడిపోతే టైం దొరికింది అని ఒకరు ఫ్యామిలి ని తీసుకోని పార్క్ వెంట తిరుగుతారు.. ఒకరు నైట్ క్లబ్ లో డాన్సు వేస్తారు కాని ఎందుకు ఓడిపోయాం... మళ్ళి అల జరగా కుంట ఉండాలి అని ట్రై కూడా చేయరు.. ఇలా వీరు ఎంజాయ్ చేస్తూ ఉంటె.. సచిన్ మాత్రం కొడుకుని తీసుకొని వచ్చి గ్రౌండ్ లో తను ప్రాక్టీస్ చేస్తూ కొడుకోతో కూడా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు.. ఇది సచిన్... సచిన్ కి ఆటమీద ఉన్న ప్రేమ.. సచిన్ గురించి కామేట్స్ చేస్తూ ఉంటారు.. వాళ్ళని చూసి నాకు జాలి వేస్తుంది..

    ReplyDelete