Sunday, March 25, 2012

అయ్యో పాపం స్పెన్సర్ ప్లాజా (చెన్నై నుంచి రికార్డెడ్ లైవ్)

వారాంతం లో భార్యను బయటకు తీసుకెళ్ళనివాడు వచ్చే జన్మలో మన్మోహన్ సింగ్ గా పుడతాడని ఏదో సామెత ఉందంట. నిజమో కాదు, ఇప్పుడు మనకి అప్రస్తుతం. ఎందుకైనా మంచిదని, నేను మా ఆవిడని నా డొక్కు పల్సర్ మీద నిన్న సాయంత్రం అలా స్పెన్సర్ ప్లాజా కి తీసుకెళ్ళాను. కొత్తగా పెట్టిన ఎన్నో మాల్స్ ఉండగా అవన్నీ వొదిలేసి ఎప్పుడో క్రీస్తు పూర్వం కట్టిన స్పెన్సర్ కి ఎందుకెళ్ళేమా అనే కాదా మీ అణుమానం, ఏంచెప్పమంటారు, నాకూ స్పెన్సర్ కి ఒక అవినాభావ సంబంధం మరి. ఎక్కడికో దగ్గరికి అని బయలు దేరితే, ఆటోమేటిక్ గా నేను స్పెన్సర్ లోనే ల్యాండ్ అవుతాను. ఈ బంధం ఇప్పటిది కాదు సుమండీ, ఎప్పుడో పదమూడేళ్ళ క్రితం ఒకసారి అన్నా యూనివెర్సిటీ ప్రవేశ పరీక్షకని చెన్నై వచ్చాను, అప్పుడు చూసాను మొదటిసారి ఈ మాల్ ని. వైజాగ్ లో చందనా బ్రదర్స్ ని, ఆసియా లో అతి పెద్దది అని ప్రచారం చేసుకున్న బొమ్మనా బ్రదర్స్ ని, తప్ప మరే పెద్ద దుకాణం దూరం నుంచీ కూడా చూడని నాకు స్పెన్సర్ తెగ నచ్చేసింది. మౌంట్ రోడ్డు మీద (దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే,, విజయవాడ లో బందరు రోడ్డు లేదూ అలానే మరి.. ) ఠీవిగా, దర్జాగా కనిపించే స్పెన్సర్ అంటే నాకో పిచ్చి ప్రేమ. (దీన్ని మీరు ఆకర్షణ అని అన్నా, నేను పట్టించుకోను) ఆరేళ్ళ క్రితం ఉద్యోగ రీత్యా చెన్నై వచ్చాక, వీలు దొరికినప్పుడల్లా స్పెన్సర్ ని సందర్శిస్తూనే ఉన్నాను. ఏ దిక్కూ/కిక్కూ లేని బ్రహ్మచారి గాళ్ళకి మరి ఆ రోజుల్లో స్పెన్సరే పెద్ద దిక్కు. ఆఫీసు పని మీద విదేశం వెళ్ళాల్సి వచ్చినా, నా పెళ్ళి షాపింగ్, మిత్రుల పెళ్ళిళ్ళ షాపింగులూ.. వగైరాలన్నీ స్పెన్సర్ లోనే. మా ఫ్రెంచ్ కొలీగ్స్ ఎవరైనా వచ్చి చెన్నై లో మంచి మాల్ చెప్పమన్నా, నేను తడుముకోకుండా స్పెన్సర్ అంటాను. నేను మెచ్చే మరో అంశమేంటంటే స్పెన్సర్ లో బ్రెడ్ ఆమ్లెట్ నుంచీ బెంజి కారు వరకూ అన్నీ దొరికేవి.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, నిన్నటి రోజు స్పెన్సర్ కి వెళ్ళి చూస్తే గుండె తరుక్కుపోయింది. ఒకప్పుడు పార్కింగ్ ప్లేసు లోపలికి వెళ్ళడానికి మెయిన్ రోడ్డు మీద వరకూ చాంతాడంత లైను ఉండేది.. సైకిల్ గ్యాప్ కాదు కదా, సైకిల్ చైను గ్యాప్ కనిపించినా, టూ వీలర్స్ పెట్టేసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు పార్కింగ్ అంతా ఖాళీ, టోకెన్ ఇచ్చేవాడు సరదాగా జోకులువేస్తూ, మీరు వచ్చారు అదే మహాభాగ్యం అన్నట్టు ఉన్నాడు. మన తొక్కలో బైకుని లారీ రేంజ్ లో పార్క్ చేసినా అడిగే నాధుడు కనిపించలేదు. కొన్ని వాహనాలు అయితే వీళ్ళే మరీ బోసిపోకుండా ఉండటానికి పెట్టారేమో అని డౌటు వచ్చేలా ఉన్నాయి. పార్కింగ్ మాట అలా ఉంచండి, లోనికి వెళ్ళి చూస్తే, మాల్ అంతా నిర్మానుష్యం. ఒకప్పుడు బయట మెట్ల మీద ప్రేమ జంటలు స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ, పాప్ కార్న్ ప్యాకెట్లతో కనిపించేవి. మాల్ లోపలి చల్లదనం డోరు తెరుచుకున్నప్పుడల్ల్లా బయట మెట్లవరకూ వచ్చేది. ఇప్పుడు అసలు డోరూ లేదు. ఏ.సీ లేదు.. లోపాలంతా ఏ సహారా ఎడారిలోనో మార్గ మధ్యంలో గుడారాలు వేసుకుని ఉన్నట్టు జనాలు. అక్కడక్కడ, చమట్లు కక్కుకుంటూ. సందడి చెవిటి మెషీను పెట్టుకుని విన్నా మీకు వినిపించదు. ఎక్కడైనా ATM బయట లైను చూస్తాం, ఇక్కడ ATM లే క్యూలో నిలబడి ఎదురుచూస్తున్నాయి.

ఎస్కలేటర్స్ మీద నేను కుటుంబ సమేతంగా ఎక్కితే, మర్యాద రామన్నలో సునీల్ సైకిల్ లా ఆర్తనాదాలు చేసుకుంటూ కదిలాయి. మా ఆవిడ హర్ట్ అయ్యి, దిగేటప్పుడు మెట్లే అని ఆర్డరు వేసింది. (ఎస్కలేటర్ ఎక్కడం వరకూ ఓ.కే కానీ దిగడం తనకి భయమన్న నిజం నేను మీరు ఎంతబలవంతం చేసినా చెప్పను కాక చెప్పను) ఒకప్పుడు తెల్లవాళ్ళే కనిపించేవారు అంతటా, ఇప్పుడు అక్కడక్కడ నల్ల బురఖాలు తప్ప కొత్తమొహాలు ఏవీ లేవు. వచ్చిన వాళ్ళూ నాలా ఏదో గత జన్మ రుణం తీర్చుకుంటున్నట్టే మొహాలు పెట్టుకుని వచ్చారు. బహుదూరపు బాటసారుల్లా ఓ రెండు రౌండ్లు వేసి, బాటా షాపులోకి దూరాం. ఒక్క సేల్స్ మ్యాన్ పలకరిస్తే ఒట్టు, (బాటా లో ఇది మామోలే లెండి, మా అన్నయ్యకి ఒకసారి చిర్రెత్తి, మీది ప్రభుత్వ రంగ సంస్థా అని అడగనే అడిగాడు), కొత్తల్లా, అసలు కనుచూపు మేర ఎవడూ కనిపించలేదు. నేనే నాకు కావల్సిన చెప్పులూ, సైజూ వెతుక్కుని, ఆపై మా ఆవిడని సంప్రదించి, మొత్తం మీద తనూ నేనూ ఓ రెండు జతలు ఫైనల్ అనుకుని, బిల్లు కూడా వేసుకుందామనుకునే టైం లో ఒకాయనెవడో వచ్చి ఆ తంతుని మాత్రం పద్దతి గా చేసి చిల్లర చేతిలో పెట్టాడు. జేబు రుమాలుతో చమట తుడుచుకుని, షాపు బయటకు వచ్చాం. ఎదురుగా పైన సబ్ వే ఉండాలి, మూసేసి ఉంది. ప్రక్కనే ఉన్న జూస్ షాపు నేడో రేపో అన్నట్టుంది. రేనాల్డ్స్ పెన్నులు మాత్రం పెద్ద దుకాణం పెట్టి అమ్ముతున్నారు, వాళ్ళ రికార్డుల ప్రకారం లాస్ట్ కస్టమర్ గత సంవత్సరరం అన్నా హజారే దీక్ష అప్పుడు వచ్చాడంట. అదీ పరిస్థితి. అలా ఫుడ్ కోర్టువైపు నడిచామా, అక్కడ ఇంకా ఘోరం. షాపులు నడిపే జనాలే తప్ప కస్టమర్స్ కాన రారే.. KFC, శరవణా భవన్ ఇంకే గ్రహం మీదా ఇంత ఖాళీగా ఉండవంటే నమ్మాలి. ఏదో కాస్త పొట్టలో పడేసుకుని, ఓ లెమన్ సోడాతో (విత్ సాల్ట్.. ;-)) గొంతు తడుపుకుని మాల్ బయటకి వచ్చాం. నాకైతే మనసు మనసులో, హెల్మెట్ చేతిలోనూ లేదు.. ఎమిటీ దారుణం, ఎందుకీ వివక్ష.. ఓ ప్రక్క ఎక్స్ ప్రెస్ అవెన్యూ, స్కై వాక్.. ఆఖరికి ఆరడుగులు ఉండే సిటీ సెంటర్ కూడా అసలు ఇసుక వేసినా రాలనంత హడావిడి గా ఉంటే, పాపం స్పెన్సర్ కి మాత్రం ఎందుకీ కష్టం. మన వాళ్ళకెప్పుడూ కొత్త వింతే, తెలిసిందే, కానీ అడుగడుగునా మనకు తోడొచ్చిన స్పెన్సర్ ని ఇలా ఎలా వదిలేయగలం. VLCC ప్రకటనలో కుడివైపు ఫొటో లా ఇలా చిక్కి శల్యమైన మన అభిమాన మాలు ని మనం కాక మరెవరు ఉధ్ధరిస్తారు, ఆదుకుంటారు.. తప్పదు. అందుకే నేను బ్లాగు ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, చెన్నై లో ఉన్న వాళ్ళందరూ స్పెన్సర్ కి అప్పుడప్పుడైనా వెళ్తూ ఉండండి, మీరు ఏమీ కొనకపోయినా పర్వాలేదు, స్పెన్సర్ కి మనం ఉన్నాం అనే భరోసా ఇవ్వాల్సిన తరుణం ఇది. ప్రక్క వూళ్ళ నుంచి టాక్సీలు కట్టించుకుని కేజీల లెక్కన బంగారం కొనడానికి వచ్చేవాళ్ళూ ఈసారి షాపింగ్ మరి కొంతైనా స్పెన్సర్ లో చెయ్యగలరు. (చిప్స్ ప్యాకట్లు కాదు). కొత్త మాల్స్ కి వెళ్ళి గంటకో ఏభై పార్కింగ్ కి సమర్పించుకుంటే కానీ మీకు థ్రిల్ రాదా ? స్పెన్సర్ లో రెండుగంటలకి పది రూపాయాలే, అది కూడా రద్దయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకుని, మెత్తటి తెల్లటి తువ్వాల్లాంటి జేబు రుమాలు పట్టుకుని వెళ్ళారంటే, మీకు స్పెన్సర్ ఏమాత్రం తక్కువ చెయ్యదు. మీ షాపింగ్ అనంతరం, బయటకు వచ్చాక ఆటో కావాల్సి వచ్చినా, రోడ్డు మీద మీకోసమే ఎదురుచూస్తున్నట్టు ఉన్న ఆటో ని మాత్రం పొరపాటున కూడా బేరమాడకండి.. మీ ఇల్లు అమ్ముకుని మరీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. నాలుగు అడుగులు స్టైల్ గా నడిచి, అప్పుడు బేరమాడుకోండి. ఏంపర్వాలేదు, ఈమధ్య మా ఆటో వాళ్ళు సులభ వాయిదా ఆప్షన్ కూడా ఇస్తున్నారు.

కామెడిగా చెప్పినా, విషయం లోని సీరియస్ నెస్ మీకు అర్థమయ్యే ఉంటుంది లెండి. స్పెన్సర్ ని పాల ముంచే బాధ్యత మనందరిదీ, గుర్తుపెట్టేసుకోండి.

హమ్మయ్యా.. ఇప్పుడు గుండె కాస్త తేలిక పడింది. ఏదైనా చెప్పుకుంటేనే కదా బ్లాగుకి.. మనకీ అందం. ఇంకో విషయమండోయ్, అంతటి ఎడారి నిశ్శబ్ధంలోనూ అడపాదడపా మన అచ్చ తెలుగు గొంతులే వినిపించాయి. నా భ్రమ అని కొట్టిపారేయకండి, మన వాళ్ళకి మిగాత కొత్త మాల్స్ చిరునామాలు ఇంకా సరిగ్గా తెలీవేమో అని నా నమ్మకం.. ;-)

3 comments:

 1. ఎంతన్యాయం! మీరు చెబుతుంటే చెన్నైని, ఆయొక్క స్పెన్సరు ప్లాజానీ ఎన్నడూ చూడని నాకే కడుపు తరుక్కుపోయింది. ఈ స్పెన్సరోద్దరణోద్యమానికి మీరే నాయకత్వం వహించాలని విన్నవించుకుంటూ కన్నీళ్లతో...

  భవదీయుడు.

  P.S.: ఆ నానుడి ఎప్పటినుండీ వాడుకలో ఉంది? తెలియజేయగలరు.

  ReplyDelete
 2. వింటుంటేనే ఆశ్యర్యంగా ఉంది. నేను మొదట మాల్ లోకి అడుగు పెట్టింది స్పెన్సర్స్ లోకే. అప్పుడు అది బలేగా ఉంది. అలాంటి మాల్ ఇలా ఎందుకు అయిందో కూడా వ్రాసి ఉండాల్సింది. నిర్వహణా లోపమా, లేక మరేమన్నానా.

  ReplyDelete
 3. నా కైతే గుండె తరుక్కుపోయింది మీ పోస్ట్ చదువుతుంటే. గతంలో కొన్ని సార్లు నేను చెన్నై వెళ్ళినప్పుడు స్పెన్సర్‌కి వెళ్ళి కొంత షాపింగ్ చేసి ఉన్నాను. అప్పట్లో దర్జాగా ఉండేది. పాపం. మీరన్నట్లు మన వాళ్లకి కొత్త వింత, పాత రోత.

  ReplyDelete