Thursday, March 29, 2012

రాజకీయ క్షమాభిక్ష

అభిలాష సినిమాలో, హీరో ఉరిశిక్ష రద్దు కోసమని తన ప్రాణాలనే పణంగా పెడతాడు. అలా అని ఉరిశిక్ష పడ్డవాళ్ళందరూ హీరోలనుకుంటే మనంత అమాయకుడు మరోడు లేడు. స్వతంత్ర భారతంలో ఉరి ఆషామాషీ నేరాల్లో పడదు, ఘోరాతి ఘోరమైన కేసుల్లోనే విషయం మరణశిక్ష వరకూ వెళ్తుంది. కానీ మన కోర్టుల్లో తీర్పులు వచ్చి, శిక్షలు అమలు చెయ్యాల్సిన టైం కి మనం అసలు నేరం మరచిపోతాం. అయ్యో పాపం మరణ శిక్షా అని దీర్ఘాలు తీసి, నేరస్థుడిపై సానుభూతి చూపిస్తాం. ఈ సానుభూతి నేరస్థులకి శ్రీరామ రక్ష.. శిక్షలు, వాటి అమలు, జరిగిన నేరానికే కాదు, అలాంటి నేరాన్ని చేద్దామనుకునే మరెవడికైనా ఒక హెచ్చరిక గా ఉండాలి. ఒక ప్రక్క దొరికిన దొంగలను దొరికన చోటన కాల్చిపడేస్తున్న పోలీసు వ్యవస్థ.. మరో వైపు ఉరిశిక్ష పడిన నేరస్థులని కూడా రాజకీయ ప్రయోజనాలకోసం వెనకేసుకొచ్చే పార్టీలు. అఫ్జల్ గురూని కాశ్మీరు ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటే, రాజీవ్ హత్యలో నేరస్థుల్ని ద్రవిడ పార్టీలు భుజానెత్తుకుంటాయి. ( వాటికి దేశంలో మగ్గుతున్న తమిళుల కంటే లంకలోని తమిళులే ముద్దు మరి ). ఇప్పుడు పంజాబ్ లోనూ అదే జరుగుతోంది. ఒకప్పటి ముఖ్యమంత్రి మరణానికి కారణమైన నేరస్థుణ్ణి క్షమించమంటూ ఇప్పటి ముఖ్యమంత్రి ఆఘమేఘాల మీద రాష్ట్రపతిని కలిసి మరీ వేడుకున్నారు.. ఏమనగలం.. ఏళ్ళ తరబడి క్షమాబిక్ష పిటిషన్లను ఎటూ తేల్చకుండా తమదగ్గర అట్టేపెట్టడం, రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకోవడం.. ఎంతవరకూ సమంజసం ?

ఈ ప్రహసనంలో పార్టీలు తమ స్వార్థానికి వాడుకునే బూచి, శాంతిభధ్రతలు. నేరస్థులకి శిక్షను అమలుపరచలేని పరిస్థితిలో ఉన్నామా మనం ? ప్రజలు కోరుకుంటే వెంటనే కాల్చిపారేయడం. అదే ప్రజలు (బహుశా వాళ్ళని ప్రాతినిధ్యం వహిస్తున్న కొద్ది మంది) సానుభూతి చూపిస్తే, క్షమించేయడం. ఇంక న్యాయం, చట్టం, కోర్టులు, శిక్షలు.. ఇవన్నీ ఎందుకు ? నేరస్థుల్ని ఒక బహిరంగ ప్రదేశం లో నిలబెట్టి జనాల్ని తీర్పులు చెప్పమంటే సరి. ఎవడి గొంతు పెద్దదో, ఎవడి మాట చెల్లుతుందో వాడే న్యాయమూర్తి. ఉరిశిక్ష వేసే హక్కు మనకుందా లేదా అన్నది వేరే ప్రశ్న, నిజంగా మరణశిక్షే అమానుషం అనుకుంటే, దాన్ని సమూలంగా రద్దు చేసుకోవచ్చు. కానీ వేసిన శిక్షల అమలుని శాంతి భధ్రతల పేరుతో ప్రభావితం చేయడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు. ఒక వర్గం ప్రయోజనాలకోసమో, ప్రతీకారేచ్చతోనో జరిగే నేరాల్లో మరణ శిక్ష ఇంక అమలు చెయ్యడం సాధ్యం కాదు అనే సంకేతాన్ని ఇచ్చేలా ఉన్నాయి ఈ సంఘటనలు. జరిగిన నేరంలో అశువులు బాసిన అమాయకులు, చిన్నాభిన్నం అయిన కుటుంబాలు ఈ సందర్భం లో ఎవరికి గుర్తు ?. ఎంత దారుణం. ప్రియాంక గాంధీ క్షమించేస్తుంది.. లండన్ లో చదువుకుంటున్న నళిని, మురుగన్ల కూతురు లైవ్ లో కృతజ్ఞతలు చెప్పేస్తుంది. తమిళ ఈలం తో కానీ, శాంతి సేన తో కానీ ఏ సంబంధం లేకపోయిన ఆ రోజు అక్కడ ఉన్న పాపానికి ప్రాణాలు కొల్పోయిన మనలాంటి జనాలు ఎవరికీ అక్కరకు రారు. మన ఔదార్యం ఎంత గొప్పది అంటే మన సానుభూతి ప్రియాంక గాంధీకీ ఉంది, హరిత్ర మురుగన్ కీ ఉంది. ఇంక నేరం/శిక్ష ఏవి ?

రేపో మాపో కసబ్ కి ఉరి తీయాలంటే కూడా, పెద్దయెత్తున సానుభూతి కదిలి వస్తుంది. బహుశా క్రొవ్వొత్తుల ప్రదర్శనలు కూడా జరుగుతాయేమో. లండన్ లో ఒక సర్వమత ర్యాలీ.. పాకిస్తాను లోనూ, ఢాకాలోనూ బందు.. వీటన్నింటినీ చూసి మనం ఆ కిరాతకుడు చేసిన మారణకాండను బుర్రల్లోంచి తొలగించి, క్షమాభిక్ష ప్రసాదిస్తాం. మన క్షమాగుణం చరిత్రలో నిలచిపోతుంది.

నిజానికి కొన్ని నేరాలకి ఉరిశిక్ష కూడా సరిపోదు అని నా అభిప్రాయం.

No comments:

Post a Comment