Sunday, April 1, 2012

మిస్సవ్వకూడని కహానీ..

ఆదివారం ఆఫీసులో ఇంటర్వ్యూ ల పని పడడటం తో ఈ సారి మా వీకెండ్ కాస్త హడావిడి గానే మొదలయ్యింది. సగటు గృహస్థు గాడికి ఆటోమేటిక్ గా వచ్చే ప్లానింగ్ తో ఓ రెండ్రోజుల ముందే శనివారం సాయంత్రానికి సినిమా టికెట్లు తీసి పెట్టా (అబ్బా మీరు మరీ పొగిడేయకండీ.. :-) ). ఆఫ్ బీట్ సినిమాలు రావడమే అరుదు కనుక, ఈమధ్యే రిలీజ్ అయ్యి, మంచి రివ్యూస్ ని సొంతం చేసుకున్న "కహానీ" ని కవర్ చేసాం, చెన్నై ఈగా థియేటర్లో (హాలుకి ఆ పేరు ఎందుకు పెట్టారో మీకు చనువుంటే రాజ మౌళి ని అడగండి, నేనేం చెప్పగలను). కాస్త వైవిధ్యం ఉన్న చిత్రాలను ఆస్వాదించే వాళ్ళెవరూ అస్సలు మిస్ అవ్వకూడని చిత్రమిది. మా సినిమా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అని మైకులూ/మూతులూ గుద్ది చెప్పడమే కానీ, కండలు లేకున్నా బండలు ముక్కలు చేసే హీరో - అన్నీ ఉన్నా పప్పులోనే కాలేసే విలన్ - అడపాదడపా కనిపించి అందాలు ఆరబోసే హీరోయిన్ - ఓ నాలుగు అనవసరపు పాటలు - ఎడిటింగ్ లో అంటుకున్న కామిడీ, తప్ప మన రొటీన్ సినిమాల్లో ఏదీ వైవిధ్యం ?. సినిమా పరమార్థం వినోదమే కానీ ఒకే మార్కు సినిమాలు ఎన్నని చూస్తాం, శరవణా భవన్ లో సాంబార్ వడ ఎంత బావున్నా రోజూ అదే తింటే మొహం మొత్తదూ.. మరో రుచీ ప్రయత్నం చెయ్యాలి మరి. ఒక్కోసారి కంట్లో నీళ్ళు రావచ్చు, మరోసారి కడుపు కోయంబేడు మార్కెట్ కావచ్చు, పర్వాలేదు, అదీ ఒక అనుభవమే కదా. మన ఆఫ్ బీట్ సినిమాల సంగతీ అంతే.. నేను (మా ఆవిడతోనే లెండి) మూడు చిత్రాలు దాదాపుగా ఒకే హాల్లో చూసాను. ఉడాన్, దోభీఘాట్, నిన్న చూసిన కహానీ. మూడూ వైవిధ్యమైన చిత్రాలే. నా వరకూ ఉడాన్ కాస్త నిరాశ పరిచింది, దోభీఘాట్ ఓ.కే అనిపించిది, బానే వెంటాడింది కూడా. కానీ కహాని నిజమైన ఎంటెర్ టైన్మెంట్ ఇచ్చింది. అంటే పాప్ కార్న్ క్రింద పడేలా పడి పడి నవ్వడం కాదండోయి, ఊపిరి బిగ పెట్టి సాంతం చూసేలా చేసింది. ఈ మధ్య నేను ఏ చిత్రాన్ని ఇంత సీరియస్ గా ఫాలో అవ్వలేదు అంటే నమ్మండి.

కథ విషయానికి వస్తే, అదృశ్యం అయిన తన భర్తను వెతుక్కుంటూ, నిండు గర్భంతో లండన్ నుంచి కోల్కతా వచ్చిన ఒక యువతి కథ ఇది. తన భర్త ఆచూకీ తెలుసుకోడానికి ఆవిడ పడ్డ అగచాట్లు, పోలీసులు, గుఢాచారులు, చట్ట వ్యతిరేక శక్తులూ, వగైరా వగైరా.. మిమ్మల్ని సినిమా చూడమని చెప్తూ, నేను ఉన్న కాస్త కథా చెప్పడం మరీ ఘోరం కనుక ఇంతకంటే నేను కథని రాయబోవడం లేదు. మీరు ఏమీ ఊహించుకోకుండా వెళ్ళండి, ఖచ్చితంగా మీకు సినిమా బానే అనిపిస్తుంది. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన అంశం, టేకింగ్. ఫిల్మ్ సిటీలు, కృత్రిమమైన వాణిజ్య సముదాయాలు మీకు ఎక్కడా కనిపించవు. నిజంగా కోల్కతా వీధుల్లో తీసారో, లేక అంత బాగా సెట్లు వేసారో కానీ, ఆ సంఘటన నిజంగా జరిగితే ఇలానే ఉంటుంది కదా అని అనిపించేలా ఉన్నాయి దాదాపుగా అన్ని సన్నివేశాలు. విద్యా బాలన్ నటన గురించీ వేరే చెప్పుకోనక్కర్లేదు. పాత్ర తప్ప మీకు ఆమె ఎక్కడా కనిపించదు. అనుకున్న స్క్రిప్ట్ మీద పూర్తి పట్టుతో దర్శకుడు సెట్స్ మీదకు వెళ్తే చిత్రం ఎలా ఉంటుందో సరిగ్గా అలానే ఉంది. ఇంటెర్వెల్ ఎప్పుడొచ్చిందో తెలీనే లేదు, వాచీ చూసుకుంటే అప్పటికే గంట దాటింది. మొత్తం సినిమాలో ఒక్క సీన్ కూడా అక్కర్లేనిది లేదు.. పాటలు లేవు.. అవసరానికి మించిన నేపథ్య సంగీతం కూడా లేదు.. మీరు స్క్రీన్ వైపు తప్ప మరెటు వైపూ చూసే సాహసం చెయరు. అలా అని మిమ్మల్ని ఏమీ ఊహాలోకంలోకి తీసుకువెళ్ళదు సినిమా. కానీ మనకు తెలీకుండానే మనం విద్యా పాత్రకి అట్టాచ్ అయిపోతాం. ఇంక ఆ తరువాత సినిమా బహుశా మనం ఆవిడ కోణంలోంచే చూస్తాం. కథ చిన్నదే, కానీ కథనం లో ఎక్కడా బిగువ సడలదు. మేమైతే సినిమా అయ్యాక కూడా ఒక హ్యాంగ్ ఓవర్ లోనే ఉండిపోయాం, రాత్రి నిద్రపోయాక కూడా అవే ఆలోచనలు. దర్శకుడి పూర్తి కష్టం అర్థం చేస్కోవాలంటే మరోసారి చూడాలేమో. సినిమా అంతా ఒక సస్పెన్స్ మనల్ని వెంటాడుతుంది, దాన్ని చివర్లో బట్టబయలు చేసిన తీరు అసలైన హైలైట్. (కొన్ని సస్పెన్స్ సినిమాల ఎండింగ్లు మనల్ని మరీ వెర్రి వెంగళప్పల్ని చేస్తుంటాయి, ఇది అలా లేదు)

కొన్ని సన్నివేశాలు కాస్త నాటకీయంగానే అనిపించినా, టేకింగ్ లో ఉన్న సహజత్వం మనల్ని కన్విన్స్ చేసేస్తుంది. మంచి సినిమా అని ఖచ్చితంగా చెప్పగలను, అయినా చూసిన అందరికీ నచ్చాలని గ్యారంటీ ఏమీ లేదు, కానీ ఓ రాయి వేయడంలో పోయేదేముంది.. పోతే రాయే కదా.. ఎన్నని పోగొట్టుకోలేదు చెప్పండి.. ;-)

(ఈ మధ్య ఎప్పుడు చూడని ఒక వింత, సినిమా అయ్యాక, చాలా వరుసల్లో ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. నేనూ వంత కలిపాననుకోండీ, మా ఆవిడ నా వైపో చూపు చూసిందీ అని నేను మీకు వేరే చెప్పాలా.. ;-). )

No comments:

Post a Comment