Thursday, June 28, 2012

కొత్త పరీక్షలు.. పాత ప్రశ్నా పత్రాలు..

మొన్నెప్పుడో JNTU కాకినాడ వాళ్ళు ఈ-కామర్స్ పరీక్షకి పాత ప్రశ్నా పత్రాన్నే యధాతథంగా ఇచ్చేసారనే వార్త చదివినప్పటి నుంచీ ఒక పోస్ట్ రాద్దామనే అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది(ఏంటో ఈ మధ్య బ్లాగు రాయలనే ఆసక్తే బాగా సన్నగిల్లిపోయింది. కారణాలు ఏమైనా.. )


IT ఉద్యోగానికి రాక ముందు, ఓ యేడాది నేనూ లెక్చరర్ నౌకరీ వెలగపెట్టాను.విశాఖలో కాస్త పేరున్న కళాశాలలోని MCA విభాగం లో. నేను జాయిన్ అయిన రోజునే మా డైరెక్టర్ గారు భుజం మీద చెయ్యేసి, బాబూ ఈ సబ్జెక్ట్ లో గత సంవత్సరం సగం మంది కూడా ప్యాస్ కాలేదు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పు అని సూచించారు. కొత్త వ్యాపకం,ఉత్సాహం... సో ఒళ్ళే కాదు, ఓ నాలుగు పుస్తకాలూ దగ్గర పెట్టుకుని చాలా కష్టపడి సిలబస్ పూర్తిచేసాను. స్టూడెంట్సూ.. కాస్తో కూస్తో ప్రసన్నులయ్యారనే చెప్పాలి, పాఠం కంటే.. నేను పడుతున్న కష్టానికి. మధ్య మధ్యలో మోడల్ పరీక్షలు, క్విజ్జులు, చివర్లో ఒక పూర్తి పరీక్ష పెట్టి వాళ్ళని బానే సన్నిధ్ధం చేసాను. పాత ప్రశ్నా పత్రాల్లోని కష్టమైన ప్రశ్నలకి సమాధానాలు తయారు చేసి మరీ ఇచ్చాను. పరీక్షకి వాళ్ళెంత టెన్షన్ పడ్డారో కానీ,నేను మాత్రం కాళ్ళ గోళ్ళు కూడా తినేసే అంత ఆతృత పడ్డాను. పరీక్ష రోజు వేరే రూం లో ఇన్విజిలేషన్ లో ఉన్నా, ప్రక్క రూం కి వెళ్ళి వీళ్ళ ప్రశ్నా పాత్రం చూసానా, నోట మాట రాలేదు, పండూ గాడు కొట్టకుండానే మైండ్ బ్లాక్ అయ్యింది.. సరిగ్గా అంతకు ముందరి సంవత్సరం ఇచ్చిన పేపరే.. ముద్రా రాక్షసాలతో సహా. మా వాళ్ళు గట్టెక్కుతారని ఆనందించాలో, నా కష్టం.. వాళ్ళ కష్టం వృధా పోయాయని బాధ పడాలో తెలీలేదు. వెంటనే మా HOD గారి దగ్గరకి వెళ్ళి ఇదేం ఘోరం అని వాపోయాను, ఆవిడ తనదైన వేదాంత ధోరణిలో నా వైపు చూసి, పాఠం చెప్పడం వరకే మన పని అని తేల్చారు. ఇంకేమంటాం. నోరు మూసుకుని,జోరు తగ్గించుకుని నెక్స్ట్ సెమిస్టెర్ ముందు పాత ప్రశ్నా పత్రంతోనే మొదలు పెట్టాను. (ఇంతకీ మా వాళ్ళు అందరూ ప్యాసయ్యారా లేదా అనే కదా మీ ప్రశ్న, పాత పేపరే ఇచ్చినా, తెల్ల కాగితాలు మనమే నింపాలి కదా, ఒకరిద్దరు సాగిల పడ్డారు.. నిట్టూర్చి వదిలేసాను లెండి)


ఇది జరిగిన ఏడాదికి, నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో M.Tech జాయన్ కావడమూ. ఒక పేరుమోసిన ప్రొఫెసర్ గారి దగ్గర తప్పక, శిష్యరికం చెయ్యడం తటస్తించింది. అప్పుడు అర్థం అయ్యింది, ఈ కాపీ పేపర్ల వెనుక అసలు కమామిషు.ప్రతీ సబ్జెక్ట్ కీ యూనివెర్సిటీ ఎరుకున వున్న ఏ ఆచార్యుడికో పేపర్ సెట్టింగ్ బాధ్యత అప్పగిస్తారు, డీను గారి వియ్యంకుడి స్నేహితులో, లేదా హెడ్డు గారి పూర్వ విద్యార్థులో..ఇలా అన్న మాట. వాళ్ళకీ, ఈ సబ్జెక్ట్ కీ అసలు ఏ కాస్తైనా రక్త సంబంధం/అభిషేకం ఉందా లేదా అన్నది ఎవడికీ పట్టదు. ఓ రెండు పాత ప్రశ్నా పత్రాలూ, సిలబస్సు, ఓ నాలుగు పుస్తకాల పేర్లూ, పంపి చేతులు దులుపుకుంటారు.ఆ ఫలానా ప్రొఫెసర్ గారు మంచి వాడైతే ఆ పాత పేపర్లు ఒకసారి చూసి, పుస్తకాలు ఏ లైబ్రరీ లోనో తెరచి ఓ నాలుగు ప్రశ్నలు యూనివెర్సిటీ మొహాన కొడతాడు. అదే మా గురువుగారి లాంటి బిజీ పెర్సన్ అయితే, దగ్గర్లో ఉన్న స్కాలర్ కి (నా లాంటి అభాగ్యుడు కి) ఆ భాద్యత పెడతాడు. స్కాలర్ గారి హాస్టల్లో భోజనం బాగోగుల బట్టి మనకి పేపర్ వస్తుంది. ఇంకా, మూడోరకం మహానుభావులున్నారు, వీళ్ళు పుస్తకాలు తెరిచే రిస్క్ తీసుకోరు, అలా అని మరొకడిని నమ్మరు..పంపిన పేపర్లనే అటు తిప్పి, ఇటు తిప్పి ఓ పేపర్ తయారు చేస్తారు, ఈ హడావిడి లో ఒక్కోసారి ఒకే ప్రశ్న మొదట పేజీలోనూ.. రెండో పేజీలోనూ ప్రత్యక్షం అవుతుంది. (మొదటి దానికేమో మూడు మార్కులు.. రెండోదానికేమో ముప్ఫై.. రాసేవాడి/దిద్దేవాడి ఖర్మ చూడండి ఇంక) వీళ్ళంతా ఒక ఎత్తయితే, ఇంకో రకం.. అసలు ఆ వ్యవహారమే మరచిపోతారు, ఒకటి రెండు, అయిదు పది సార్లు యూనివెర్సిటీ అధికారులు గుర్తు చేసాక, చిరాకు వచ్చి, వాళ్ళు పంపిన పేపర్ నే తిరిగి పంపేస్తుంటారు.. అది డైరెక్ట్టు గా ప్రింటింగ్ కి వెళ్ళిపోవడమూ, విద్యార్థులను పరీక్ష రోజు వెక్కిరించడమూ సర్వ సాధారణం. ఇదే తంతు, వరసగా రెండు మూడేళ్ళు జరిగిన సందర్భాలూ ఉంటాయి. పేపర్ సెట్టర్స్ కి అసలు పాత పేపర్లు పంపడం మానస్తే అంటారా, అప్పుడు మరో సబ్జెక్ట్ ప్రశ్నా పత్రం తిరుగు టపాలో వచ్చే ప్రమాదముంది, దానికంటే కొత్త సీసాలో పాత మందే బెటర్ కదా.. మీరు ముక్కు మీద వేళ్ళు,కాళ్ళూ వేసుకోకపోతే, ఒక్కోసారి అసలు పరీక్ష పెట్టాలనే సంగతే యూనివెర్సిటీ మర్చిపోతుంటుంది, అలాంటప్పుడూ చివరి నిమషం లో ఆదుకునేవి పాత పేపర్లే మరి.. .


కొత్తగా వచ్చిన తెలుగు మెలోడి, ఆ పాత ఇంగ్లీషు పాటలా ఉండడం, ఇద్దరు మేధావులు ఒకేలా ఆలోచిస్తారన్నదానికి నిదర్శనం అని మీరు అనుకుంటే, మిమ్మల్ని ఆర్కే నాయుడు కూడా కాపాడలేడు. ;-)