Saturday, December 28, 2013

సామాన్యుడి రాజకీయాలు (ఆప్)


ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసాడు. ఈ మధ్య కాలంలో, నగదు, మద్యం పంచకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత అమ్ ఆద్మీ పార్టీ కే దక్కుతుంది. ఐ.ఐ.టి లో చదువుకుని, ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత స్థానంలో పని చేస్తూ, అవన్నీ వదులుకుని సమాచార హక్కు కార్యకర్తగా మొదలై, అన్నా హజారే అనుచరుడిగా ప్రాచుర్యం పొందిన కేజ్రీవాల్, పార్టీ ని ప్రకటించినప్పుడు ఎవరూ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మన ప్రజాస్వామ్యం మీద మన దగాకోరు నాయకులకు ఉన్న నమ్మకం అలాంటిది. కానీ తమకున్న ఏ ఆయుధాన్నీ వదలకుండా, "ఆప్" ఆనతి కాలంలోనే ఒక ప్రముఖ రాజకీయ శక్తిగా ఎదిగింది. అదే అపూర్వమైన విజయం. ప్రజలకు అర్థమయ్యేది, నచ్చేది మాట్లాడ్డం, మీడియా మెచ్చేది, చూపించేది చెయ్యడం.. ఈ రెండూ బాగా వంటబట్టించుకున్నాడు కేజ్రీవాల్. సోషల్ మీడియాని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. రాజకీయాల్లో ఒక్కోసారి "గత చరిత్ర" లేకపోవడమే పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. అంతిమ లక్ష్యాలు ఎంత గొప్పవి, ఉదాత్తమైనవి అయినా, జనాలని ఆకట్టుకోవాలంటే, ఓట్లు రాబట్టుకోవాలంటే కొన్ని నేలబారు హామీలు తప్పవు. ఆకలితో అలమటిస్తున్న వాడికి నోటికి అన్నం ముద్ద కావాలి, రూపాయి విదేశీ మారకపు విలువ పెంచుతామంటే లాగి ఒక్కటిస్తాడు. ఆ పరంగా చూస్తే, "ఆప్" మిగతా పార్టీలకు ఏమీ తక్కువ తినలేదు. కానీ మరీ దగుల్బాల్జీ నాయకుల్లా, లాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు ఇస్తామనలేదు. మంచి నీళ్ళు ఇస్తామన్నారు, కరెంటు చార్జీలు తగ్గిస్తామన్నారు. సాధ్యాసాధ్యాలు ప్రక్కన పెడితే, ఇలాంటివి ప్రజలకి అత్యంత అవసరమైనవే.

ఇంక ప్రభుత్వ ఏర్పాటు విషయానికి వస్తే, "ఆప్" తమ మనసులోని మాటే, ప్రజల నోట చెప్పించింది, అదికూడా వినూత్నమైన పద్దతుల్లో. నిజానికి షీలా దీక్షిత్ ని ఓడించడంతోనే తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఇంకా ఇప్పుడే పురుడు పోసుకున్న కొత్తపార్టీ, అన్ని స్థానాలు గెలవడం నిజంగానే సామాన్యమైన విషయం కాదు. చారిత్రాత్మికం అనే చెప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రజల్లో "ఆప్" పట్ల ఉన్న అంగీకారాన్ని సూచిస్తోంది. ఇప్పుడు మరలా ఎన్నికలు జరిపినా, ఆప్ కే పట్టం కడతారు. ఇప్పటికే కోట్లు ఖర్చుపెట్టిన మిగతా పార్టీల నేతలు మళ్ళీ అంతా ఖర్చుపెట్టనూ లేరు. అందుకే కాంగ్రెస్ మద్దతివ్వడం అనివార్యం అయ్యింది. తమకున్న కొద్దిపాటి సీట్లతో కాంగ్రెస్ "ఆప్" మీద పెత్తనం చేలాయిస్తుందా, దాన్ని ఆప్ భరిస్తుందా, అన్నది భవిష్యత్తే తేల్చాలి. కానీ ఆప్ చేసిన వాగ్దానాలలో కొన్ని నేరవేర్చినా, కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించలేని పరిస్థితి ఉత్పన్నం కావచ్చు.

ఆప్ వరకూ, ఇప్పటికే ఇంటి పోరులు మొదలయ్యాయి, కలిసి అరవడం లో ఉన్న సులువు, కలిసి పని చెయ్యడం లో ఉండకపోవచ్చు. ఈ అసమ్మతులు, అసంతృప్తులను కేజ్రీ వాల్ ఎలా నెట్టుకొస్తాడో వేచి చూడాలి. సిస్టం ని విమర్శించడం తేలిక, కానీ దాన్ని మార్చడం, లేదా ఉన్నంతలో మంచి పని చేయించడం చాలా కష్టతరం. ఎందుకంటే ఇప్పుడు మారింది కేవలం పాలకవర్గం, వాళ్ళ క్రింద పనిచేసే వ్యవస్థ పాతదే, రాత్రికి రాత్రి మారేదీ కాదు. ప్రతీ పనికి "నాకేంటి" అనే స్వభావాన్ని అలవర్చుకున్న పాలనా యంత్రాంగాన్ని కాస్తో, కూస్తో దారిలోకి తేగలిగితే సామాన్యుడు విజయం సాధించినట్టే. కేజ్రీవాల్ సింబాలిక్ గా చెప్పే విషయాలు (VIP హోదా వద్దనడం, మెట్రో లో ప్రయాణించడం.. మొదలైనవి) చూడ్డానికి బావున్నా, ప్రజలకి నిజమైన మేలు చేసేది మాత్రం, విధాన పరమైన మార్పులు, లాభాపేక్ష లేని పాలన. కాదు, మేమూ ఆ తానులోని ముక్కలమే అని "ఆప్" నిరూపిస్తే, రోజూ ఓడిపోతున్న మన ప్రజాస్వామ్యానికి మరో ఓటమిగా మిగిలిపోతుంది ఈ "ఆప్" గెలుపు.మనలో మన మాట, తెలుగు అసామాన్యుడు JP గారు, ఆప్ నుంచీ ఏమైనా పాఠాలు నేర్చుకున్నారో, లేదో మరి..

Friday, December 13, 2013

ఇదా మండేలాకు నివాళి ?


పోరాటాన్నే జీవితం చేసుకున్న మహోన్నత నాయకుడు మండేలా కు నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసిన సభకు ప్రపంచ నాయకులు ఎందరో విచ్చేశారు. మండేలా ఎలాంటి నాయకుడు.. ఎంతటి సంఘర్షణ, కార్యదీక్ష, అచీవ్ మెంట్.. మరణం ఎవరికైనా తప్పని ముగింపు, కానీ ఆ సందర్భానికి ఒక ఆర్ద్రత, భావోద్వేగం ఉన్నాయి. కోట్ల ప్రజల జీవితాలను, సమూలంగా మార్చేసిన నాయకుడు అస్తమిస్తే, అది ఒక సున్నితమైన సమయం. ఆ జాతికీ, దేశానికీ, మనం చెందకపోయినా, ఆ పరిస్థితిని గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ. మరీ ముఖ్యంగా దేశాధినేతలు ఎంత ఆదర్శంగా నిలవాలి.. అలాంటి సందర్భంలో క్రింద అటాచ్ చేసిన ఫోటో (సెల్ఫీ) తీసుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారా ? వాళ్ళు.. అమెరికా, డెన్మార్క్, ఇంగ్లాండు అధినేతలు. ప్రపంచాన్ని శాసించే ఒబామా, ఈ ఒక్క ఫోటోతో, తనను తాను ఎంతో చులకన చేసుకున్నాడు. ఏదో ఆకతాయి కుర్రాడు చేసాడు అని అనుకునే వీలులేని చర్య ఇది.

నా వరకూ, నేను మాటలు కంటే చేసే పనులే ముఖ్యం అనుకుంటాను, అడపదపా మన మీడియా ఓ చిన్న స్టేట్మెంట్ ని భూతద్దంలో చూపించడాన్ని నేను సమర్ధించను. కానీ ఈ ఫోటో చూసిన వెంటనే ఎందుకో మనసు చివుక్కుమంది. ఆ మాత్రం సీరియస్ లేని వాళ్ళు అలాంటి సభకు వెళ్ళనే కూడదు.

కొంచం అతిశయోక్తి అనిపించినా, నాకెందుకో, ఈ ఫోటో పాశ్చాత్య దేశాల అసలు నైజాన్ని, దృక్పథాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది అనిపించింది. ప్రాణాలకు ఖండాలు బట్టి విలువ కట్టే ఈ దేశాల మనసులు మారాలంటే, ఓ మండేలా.. ఓ మాహాత్ముడు సరిపోరు. చరిత్ర నేటికీ నిరూపిస్తున్నది అదే కాబోలు.


నిజానికి, "పేదరికం" దేశాల ఆర్థిక స్థితికి సంబంధించిన విషయం కాదు, సంస్కృతీ, విలువలకి సంబంధించినది అనుకుంటే.. మనకంటే పేద దేశాలు చాలానే ఉన్నట్టున్నాయి.

Sunday, December 8, 2013

ఆనందాల బ్రహ్మ


తనదైన శైలిలో డైలాగులు, గిలిగింతలు పెట్టే హావభావాలు, వీటికి తోడు తిరుగులేని టైమింగ్, వెరసి స్క్రీన్ మీద యిట్టె నవ్వులు పూయించే హాస్యవరపు - ధర్మవరపు, ఇకలేరు అంటే, ఒప్పుకోడానికి మనసు సిద్ధపడడం లేదు.

అప్పుడెప్పుడో నరేష్ సినిమాలో చిన్న సైజు విలన్ నుంచీ, నిన్నటి దూకుడు కూల్ బాబు వరకూ, ఎన్నో విలక్షణమైన పాత్రల్లో ఆయన అందించిన వినోదం నేనైతే ఎన్నటికి మరచిపోలేను. ఎన్నో ఏళ్ల నుంచీ అడపాదడపా సరదా వేషాలు వేస్తున్నా, "నువ్వు-నేను", "ఒక్కడు", లాంటి సినిమాలు ఆయనకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి, ఆ తరువాత ఆయన ఇంక వెనక్కి చూసుకోలేదు.

చలనచిత్రాలు ఆయనకి పేరు ప్రఖ్యాతులు తెచ్చినప్పటికీ, ఎందుకో నాకు మాత్రం, ఆయన తెలుగు మనసులు దోచుకున్నది టీవీ ద్వారానే అనిపిస్తుంది. ప్రభుత్వ గొంతు తప్ప, తమకంటూ ఒక విధానమే సరిగ్గా లేని రోజుల్లోనే దూరదర్శన్ ని సరదా దర్శన్ చేసిన ఘనత ఆయనదే. జంధ్యాల మార్కు క్లీన్ కామెడి ని తెలుగు టీవీ లోకి తెచ్చింది ఆయనే అనడంలో అనుమానమే లేదు.

నాకు బాగా గుర్తు, ఆనందో బ్రహ్మ ప్రారంభానికి ముందు, ఒక సీన్ చూపించేవారు.. - ఓ తండ్రి పిల్లాడిని ప్రక్కింటి వాళ్ళని అడిగి సుత్తి తెమ్మని పంపుతాడు, ఆ పిల్లాడు ఆ ఇల్లూ, ఈ ఇల్లూ తిరిగి, ఎవరూ ఇవ్వడం లేదని తండ్రికి చెప్తాడు. ఆ తండ్రి పెద్దగా నిట్టూర్చి, లోకం పోకడకి బాధపడి, చివరికి ఇంట్లో ఉన్న సుత్తిని తెమ్మంటాడు. :-) ఆ తండ్రి పాత్రలో గిలిగింతలు పెట్టిన ధర్మవరపుని మరచిపోగలమా ? సున్నితమైన హాస్యం, వెకిలితనం లేకుండా, వీలు ఉన్నంతవరకూ సమాజానికి ఉపయోగపడే సందేశం, ఇవి అన్నీ కలిసిన హాస్యపు విందులు ఎన్నో టీవీ ద్వారా అందించారు ఆయన. ఈ కోణంలో చూస్తే, ఆయన్ని హిందీ విలక్షణ నటుడు జస్పాల్ భట్టి తో పోల్చవచ్చేమో. (భట్టి కూడా ఓ రోడ్డు ప్రమాదం వల్ల అకస్మాత్తుగా మనకి దూరం అయ్యారు)

అతడు లో, షేవింగ్ క్రీం తో బ్రెష్ చేసుకుంటూ, "ఇలాంటివి మన వూరిలో ఎందుకు దొరకడం లేదు", అని ఆశ్చర్యపోయినా, ఫ్యామిలీ సర్కస్ లో, కోటా శ్రీనివాసరావు ని వెంట ఉంటూనే ఓ ఆటాడుకున్నా, మరో చిత్రంలో, "మేమూ అవుతాం బాబు, ప్రిన్సిపాళ్ళం" అన్నా, ఆయనకే చెల్లింది.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికంగా మనకి దూరం అయినా, తెలుగు ప్రేక్షక హృదయాల్లో నిండు నూరేళ్ళు జీవిస్తారు, గుర్తొచ్చినప్పుడల్లా, నవ్విస్తూనే గుండె బరువెక్కిస్తారు.

Monday, December 2, 2013

నా రెండవ కథ కౌముది లో :-)


ఆ మధ్య ఎప్పుడో రాసిన నా రెండో కథ "అహం బ్రహ్మాస్మి", ఈ నెల కౌముదిలో ప్రచురింపబడింది.

వీలు చూసుకుని ఒక లుక్కు వేయగలరు. అనుకున్న ఆలోచనని కథగా మలచడంలో ఇంకా బుడి బుడి అడుగుల స్టేజీలోనే ఉన్నాను కనుక, ఏ అంచనాలూ లేకుండా చదివితే మంచిది మరి. :-)

మోనా లిసా పునః దర్శనం (ప్యారిస్ కబుర్లు)


2009 లో పారిస్ వచ్చినప్పుడే, ప్రపంచ ప్రఖ్యాత louvre మ్యుజియం ని సందర్శించాను. ముఖ్యంగా మోనా లిసా చిత్రరాజాన్ని. ఈ మధ్యే, మా కొల్లీగ్స్ ఇద్దరు పారిస్ రావడం తో, వాళ్ళని తీసుకుని ఈ రోజు మళ్ళీ louvre కి వెళ్లాను. ఈ రోజే ఎందుకంటే, ప్రతీ నెలా, మొదటి ఆదివారం మ్యుజియం ప్రవేశం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ...

louvre ఒక సముద్రం లాంటిది, దాంట్లో.. ఈదుతూ.. ఈదుతూ.. తీరం తెలీక ఏ తెలియని యుగంలోనో కొట్టు మిట్టాడుతుంటే, మనకి మన టైం బావుంటే, మోనా లిసా పెయింటింగ్ సైన్ బోర్డ్ కనిపిస్తుంది. అలానే మేమూ, బహుదూరపు బాటసారుల్లా మోనా లిసా ని చేరుకుని, దర్శన భాగ్యం పొందాం. ఓ పెద్ద హాలు, ఒక ఖాళీ గోడ, మధ్యలో కాస్త క్రిందగా, అద్దాల వెనుక ఒక మోస్తరు సైజు చిత్ర పటం. (అంతకంటే పెద్దగా మన ఇళ్ళల్లో టీవీలు ఉంటున్నాయి, అంటే మీరు నమ్మాలి) మొదటి సారి చూసిన ఎవరికైనా, నిట్టుర్పే మిగులుతుంది. నాకు ఇదివరకు చూసిన జ్ఞాపకం బానే ఉంది కనుక, నేను చాలా సాదా సీదా అంచనాలతో వెళ్లాను. ఓ మంచి పెయింటింగ్ అని అనుకుని చూస్తే మాత్రం, ఒక మాజిక్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కళ్ళు, చిరునవ్వు. ఆ జన సందోహం మధ్య (చైనీయులు అని చదువుకోండి) మరీ, మీరూ మోనా లిసా మాట్లాడుకోవాలి అంటే చెప్పలేను కానీ, కళ్ళతో సంభాషించగలిగితే, మోనా లిసా మీకు ఒక అనుభూతి ని ఖచ్చితంగా మిగులుస్తుంది.

పెయింటింగ్ అందంతో పాటూ, వచ్చిన ప్రాచుర్యం (చోరీ కి గురికావడం.. వగైరా. వగైరా.) కూడా మోనా లిసా కి ఆభారణాలు అయ్యాయి. నిజానికి డావిన్స్కి చిత్రించిన ఎన్నో అద్భుతాలతో పోలిస్తే, మోనా లిసా ఒక సాధారణ చిత్రమే. అదే హాలులో, ఎందరో చిత్రకారుల అందమైన పెయింటింగ్స్ ఉన్నా, టూరిస్ట్‌లు పెద్దగా వాటిని పట్టించుకున్నట్టు కనపడరు. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మోనాలిసా కి సరిగ్గా ఎదురుగా ఒక గోడ నిండా ఉన్న "The Wedding Feast at Cana - Paolo Veronese" పెయింటింగ్. చాలా పెద్ద చిత్రం, ఇట్టే మన మనసుని దోచుకుంటుంది.

ఈసారి, louvre సాగర మధనం లో నాకు కాస్త తృప్తిని ఇచ్చిన మరో అంశం, ఈజిప్షియన్ మమ్మీ. అద్దాల పెట్టెలో, నిజంగా ఉన్నది ఒరిజినల్ మమ్మీ ఏ నా, అనే అనుమానం మనకి కలగక మానదు. నాకూ అదే అణుమానం వచ్చింది, మరీ ఇలా మామోలు వాతావరణం లో ఎలా ఉంచేస్తారు అని. అక్కడ ఉన్న గైడ్ ని అడిగితే, నిజమైనదే, ఇక్కడ ఉన్నవి అన్నీ అసలు సిసలైనవే అని సమాధానం వచ్చింది. ఓహో అనుకుని, మరో సారి చూసి, టాటా బైబై చెప్పేసాం.

మనలో మన మాట, మా కొల్లీగ్స్ తీసిన వందల ఫొటోలకి, నాకు కెమెరా, ఫోటో, అనే రెండు మాటల మీద విరక్తి వచ్చేసింది. నాసా వాళ్ళు కూడా అన్ని ఫోటోలు తీసి ఉండరని నా గట్టి దృఢ పిచ్చి నమ్మకం. ఈ విషయం మీద వేరేగా ఎప్పుడో నా గోడు మీకు చెప్పుకుంటా కానీ.. మరీ ఇంత ఘోరం అయితే ఎలా అండి బాబూ.. అమ్మో.. ఈ డిజిటల్ కెమెరా కనిపెట్టినోడిని ప్లాష్ లైట్ తో చంపేయాలి అసలు. ఫోటోలు జ్ఞాపకాలని గుర్తుచేస్తాయి, సందేహమే లేదు., కానీ ముందు ఆ క్షణాన్ని మనసారా అనుభవించాలి కదా. ఏమో లెండి, ఎవరి ఇంటరెస్ట్ వాళ్ళది, నేను మాత్రం కెమెరా పట్టుకెళ్ళ లేదు, వాళ్ళు తీసిన వందల, వేల ఫోటోలలో, ఏ మూలో కనిపించకపోతానా..


(louvre ఉచ్చారణ ని తెలుగు లో సరిగ్గా రాయలేక, ఫ్రెంచ్ లోనే ఉంచేసాను, గమనించగలరు., వీజీగా కావాలనుకుంటే, లూర్ అని చదువుకోండి :) )

Sunday, November 17, 2013

భారత హృదయ రత్నం సచిన్!!


కొందరికి అవార్డులు పేరు తెచ్చిపెడతాయి, మరికొందరు బహుమతికే అలంకారం అవుతారు. సచిన్ భారతరత్న విషయం లో ఎందుకో నాకు ఏ భావనా కలగలేదు, బహుశా దానికి కారణం, మన హృదయాల్లో భారతరత్నకు మించిన ఎన్నో అవార్డులు ఎప్పుడో సచిన్ సొంతమవ్వడం వల్ల కావచ్చు. సచిన్ వల్ల క్రికెట్ లాభ పడిందా, లేక క్రికెట్ వల్ల సచిన్ కి ఖ్యాతి వచ్చిందా తేల్చలేమ్. కానీ ఒక జాతిని, కొన్ని తరాలనీ జీవితాంతం ప్రభావితం చేసిన స్ఫూర్తి ప్రదాత సచిన్. అందులో ఏ సందేహం లేదు. ఆ కోణం లో చూస్తే క్రికెట్ కేవలం సచిన్ లో ఒక భాగం. మచ్చలేని వ్యక్తిత్వం, ఎనలేని నైపుణ్యం, నేలబారు వినయం, గుండె నిండా దేశభక్తి, వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే కొందరు కర్మయోగులకే సాధ్యం. ఓ అబ్దుల్ కలాం.. ఓ సచిన్ టెండూల్కర్..

నా దృష్టిలో సచిన్ యొక్క అతిపెద్ద కాంట్రిబ్యూషన్ అతని ఆట, రికార్డ్స్ కాదు, వాటికంటే వందలు రెట్లు విలువైనవి.. యువతకి, యావత్ భారతజాతికి అతను ఇచ్చిన ప్రేరణ, దిశ.

సచిన్ చివరి ఆటలో స్టేడియం విజువల్స్ చూస్తుంటే, అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, అది ఆనందం కాదు.. బాధా కాదు.. క్రీడనే జీవితం చేసుకున్న ఒక ఆటగాడికి, ఓ సగటు ప్రేక్షకుడు ఇచ్చే వీడ్కోలు కాబోలు అది. నా జీవితంలో అది మొదటిది. చివరిదీ అయినా ఆశ్చర్యపోను.

సచిన్ దేవుడా ? క్రికెట్ మతం అయితే, సచిన్ దేవుడే. ఆ భగవంతుడు అందరి దృష్టిలో ఉన్నాడో, లేడో తెలీదు. సచిన్ ఉన్నాడు, కనిపించాడు, ప్రభావితం చేసాడు, ఎప్పటికీ.

 
(పెయింటింగ్ fineartamerica వెబ్ సైట్ నుంచి)

Monday, November 11, 2013

ఈ సున్నా ఏదైతే ఉందో... (ప్యారిస్ కబుర్లు)


ఈ రోజు మాకు సెలవు. ఎందుకని అడక్కండి, ఎందుకంటే  మా వాళ్ళు సెలవు అన్నాక, నేను ఎందుకు అని ఎప్పుడూ అడగను. ఉదయం కాస్త లేట్ గా, లేటెస్ట్ గా లేవగానే, పొయ్యి ముట్టించి, ఓ గ్లాసుడు కాఫీ నీళ్ళు కలుపుకుని సేవిస్తూ, లాప్ టాప్ ఆన్ చేసాను.

అలవాటు లో పొరపాటుగా, ఈనాడు పేపర్ తో పాటూ, మా పారిస్ వెదర్ ఎలా ఉందా అని చూస్తే, గుండె జారి గల్లంతో, మరోటో అయిపోయింది. ఏంటా సంగతి అంటే, బయట ఉష్ణోగ్రత సున్నా. (మళ్ళీ ప్రక్కన ఫీల్స్ లైక్ -1 అంట, గాడిద గుడ్డేం కాదూ.. అనుకున్నా.. ) నిజానికి నాకు రూమ్ లో పెద్దగా తేడా తెలీనే లేదు, బహుశా చెక్క ఫ్లోరింగ్ మరియు గోడల దయ వల్ల అయ్యుంటుంది. నా గల్లంతైన గుండెనే నేను స్టైల్ గా జేబులో పెట్టేసుకుని, మొదట చేసిన పనేంటంటే, కిటికీ తీసి, బయట వాతావరణాన్ని లోపలికి రమ్మని ఆహ్వానించడం. విశాఖలో పెరిగి, చెన్నై లో ఉద్యోగం వెలగబెడుతున్న నేను, సున్నా కాదు కదా, దాని అబ్బనీ (10), తాతని (20) కూడా గట్టిగా చూసి ఎరగను, ఫ్రెండ్ షిప్ అంతా ముత్తాత (30) తోనే.

మీరు ఏమన్నా అనండి. సున్నా, మనం భయపడినంత ఘోరంగా ఏమీ లేదండి. మరీ బయటకెళ్ళి నిక్కరేసుకుని నృత్యాలు చేస్తామంటే చెప్పలేం కాని, ఫుల్ ఫర్నిచర్ తో వెళ్ళామనుకోండి, ఏం పర్వాలేదు. సాయంత్రానికి కాస్త వెచ్చబడ్డాక, అంటే ఉష్ణోగ్రత ఓ అయిదు దాటాక, ఒక చిన్న వాక్ కూడా చేసి వచ్చా, మేనేజ్ బుల్ గానే అనిపించింది. మా ఫ్రెంచ్ కొల్లీగ్స్ ఏమో జనవరి లో అన్నీ మైనస్ టెంపరేచర్స్ అంటున్నారు, చూడాలి నా ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో, మరీ ఇబ్బంది గా ఉంటే, పారిస్ ని UT చెయ్యమని అడిగేస్తాలెండి. ;-)

ఇందులో ఇందులో, నిన్న మా పాత కొల్లీగ్ ఒకావిడ తన కుటుంబం తో పారిస్ ట్రిప్ కోసమని వస్తే, వెళ్ళి హలో చెప్పాను. అప్పుడు ఆ చలిలో తీసిన ఈఫిల్ టవర్ ఫోటో మా ఆవిడకి పంపితే.. నా బాధలు అర్థం చేసుకోకపోగా, నేను ఎప్పుడు చూస్తానో అని దీర్ఘాలు.. సుదీర్ఘాలు.. బండీరాలు..
దూరపు కొండలు నునుపే కాదు.. వెచ్చన కూడాను. ఏంటంటారు ?

(ఎప్పుడో కానీ, మనకి కాఫీ/టీ రైట్స్ ఉన్న ఫోటో పెట్టే అవకాశం రాదు, అందుకని నా మొబైల్ లో తీసిన రెండు ఫోటోలూ అటాచ్ చేస్తున్నా.. ఏంటి ఈఫిల్ టవర్ మరీ రేనాల్డ్స్ పెన్ కాప్ లా చిన్నగా కనిపిస్తోంది, అనుకుంటే, నేను అంత దరిద్రంగా తీశాను అని గుర్తుతెచ్చుకోగలరు. ;-) )

Saturday, November 9, 2013

ఈ ఏటి మేటి నటుడు ఎవరు ? ;-)


ఇంకెవరు, మన ప్రియతమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే.

సొంత డవిలాగులు, డబ్బింగ్ వల్ల కొంచం వెనక బడ్డారు కానీ, లేకపోతే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే నటనే, అనుమానమే లేదు. ఓ రకం గా చూస్తే, నటనకి పరాకాష్ట ఏమిటి ? నటిస్తున్నానని నటుడే మరచిపోవడం, అంటే పాత్రలో పూర్తిగా లీనమైపోయి జీవించేయడం, ఇప్పుడు జరుగుతున్నది అదే. లేకపోతే, దశాబ్దాలు పార్టీలో, ప్రభుత్వాల్లో, చక్రం తిప్పిన రోశయ్య గారే, అమ్మ చీపురిస్తే తుడుస్తాను అని ఫిక్స్ అయిన కాంగ్రెస్స్ పార్టీలో, స్పీకర్ కాకమునుపు ఎప్పుడూ పేరు కూడా వినిపించని కిరణ్, అధిష్టానం మీద యుద్ధం ప్రకటించడం ఏమిటి, మరీ చోద్యం కాకపోతే.

రాష్ట్ర విభజన అనంతరం, సీమాంధ్ర కి ఇచ్చిన తాయిలాలు పంచుకోవడం లోనూ, అవి మా వల్లే వచ్చాయని చెప్పుకోవడం లోనూ, పార్టీల మధ్యా, నాయకుల మధ్యా, పోరాటాలు జరుగుతాయి. అప్పటివరకూ కిరణ్ సీమాంధ్ర రక్షకుడి పాత్రని రక్తి కట్టిస్తారు.

Tuesday, November 5, 2013

ఒపీనియన్ పోల్స్ ని కాదు, పోల్స్ నే బాన్ చేస్తే సరిపోతుంది..


ఈ మధ్య వచ్చిన ఒపీనియన్ పోల్స్ పట్ల కాంగ్రెస్ గుర్రు గా ఉంది. ఏడాదంతా రోడ్ల మీద తిరిగిన వాడికి, హోప్ ఎగ్జామ్స్ పెట్టినట్టు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం తెలిసిందే కదా, "గేమ్ గెలిచేలా లేకపోతే, చేంజ్ ది రూల్స్". ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ అదే పని లో ఉన్నట్టున్నాడు, అసలు ఒపీనియన్ పోల్స్ శాస్త్రీయం కాదు అని తేల్చేసాడు. రేపో మాపో ఓ ఆర్డినెన్సు తోనో, లేక ఎలక్షన్ కమీషన్ ద్వారానో ప్రీ-పోల్ సర్వేలన్నీ బాన్ చేసినా మనం ఏమీ ఆశ్చర్యపడనక్కర్లేదు. నాకు తెలిసి ఎన్నికలకి బాగా దగ్గరలో, అంటే ఒకటీ రెండు రోజుల మందు సర్వే ఫలితాలు ప్రచురించడం ఇప్పటికే EC బాన్ చేసింది.

ఇక మిగిలింది, ఒపీనియన్ నే బాన్ చెయ్యడం. లేక, ఇంకా ముందుకెళ్ళి పోల్ నే బాన్ చెయ్యడం.

నా దగ్గర మరో అవిడియా కూడా ఉంది, ఎలాగో ఇప్పుడు వాడుతున్నది, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్స్ కనుక, ఒక వార్నింగ్ మెసేజ్ పెట్టచ్చు, "మీరు కాంగ్రెస్ కి వోటు వెయ్యడం లేదు, సిబిఐ మీ మీద కేసు పెట్టొచ్చు. డు యు స్టిల్ వాంట్ టు కంటిన్యూ" అని.

గాంధీ గారి ఆత్మ దేశం లో ఎక్కడో తచ్చాడుతూనే ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆయన కలలు కన్న స్వరాజ్యం కనుచూపు మేరలో కనిపించడం లేదు.

ఆయన్ని అడగాలని ఉంది.. "ఇప్పుడున్న గాంధీల నుంచీ దేశాన్ని కాపాడమని".

Sunday, November 3, 2013

ప్యారిస్ లో మిన్నంటిన దీపావళి సంబరాలు.. ;-)


అదొక్కటే తక్కువొచ్చింది మరి. కాకరపువ్వొత్తు కాలిస్తే, కరాచీ నుంచీ లాంచీ లో నించుని వచ్చేసిన తీవ్రవాదనుకునేలా ఉన్నారు. అందుకని నేను గడప దాటలేదు. (అసలు గడపే లేదనుకోండి, అది వేరే విషయం)

క్రింద ఫోటో సంగతా.., ప్రెంచ్ వాళ్ళు "Bastille Day" అని ఓ రోజున ఫైర్ వర్క్స్ ప్రదర్శిస్తారు, అప్పుడు తీసింది లెండి. సింబాలిక్ గా ఉంటుందని పెట్టా. :-)

మన వాళ్ళందరూ, జేబులు, చేతులు కాల్చుకోకుండా, జార్తగా దీపావళి జరుపుకుని ఉంటారని ఆశిస్తూ.. 

Friday, November 1, 2013

మోడీ ప్రధాని పదవికి ముఖ్య సోపానం ?

ఏముంది, ప్రత్యర్థి రాహుల్ గాంధీ అవ్వడమే.

ఇన్ని స్కాములు తరువాత కూడా ఎవరైనా కాంగ్రెస్ కి వోటేస్తారా ? ప్రస్తుతానికి ఒపీనియన్ పోల్స్ అయితే మోడీ వైపే మొగ్గు చూపుతున్నాయి. నిజానికి, దేశం లో ఎన్నో వర్గాలకు, ఇంకా మోడీ మీద నమ్మకం లేదు, కానీ రాహుల్ తో పోల్చుకుని చూస్తే, మరి మోడీ తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఉత్తర భారతంలో కొన్ని రాష్ట్రాలను BJP స్వీప్ చేసేలానే ఉంది. దక్షిణాది లో కమలానికి పెద్ద వోట్ బ్యాంకు లేకపోయినా, జయలలిత మోడీ వెంటే నడుస్తుంది. ఎన్ని సీట్లు మిగుల్తాయో కాని, బాబు కూడా BJP నే బలపరుస్తాడు అనిపిస్తోంది, మరి లౌకికవాదమో, అంటే, ఏముంది, దగాకోరు కాంగ్రెస్స్ ని గద్దె దించడానికి, తెలుగు వాడి ఆత్మగౌరవం, ఆవకాయ పచ్చడి కోసం తప్పలేదు అనొచ్చు.

ఆటా ఇటా లా ఉన్న వోటర్లు, పార్టీలు కూడా, మోడీ గెలుపు ఖాయమనిపిస్తే, ఆయన వైపే జట్టు కడతారు. మెల్లగా కాంగ్రెస్స్ మన్మోహన్ నే బలిపశువును చేస్తోంది, మంచి సోనియాది, మిగిలిన చెత్త అంత సింగు గారి ఎకౌంటు. కానీ, ఏంచేసినా రాహుల్ ని నాయకుడి గా నిలబెట్టడంలో మాత్రం సఫలం కాలేక పోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో రాహుల్ మోడిని గట్టిగా విమర్శించే ధైర్యం కూడా చెయ్యలేడు.

డిల్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవబోతోంది, వచ్చే పార్లమెంటు లో ఒకరిద్దరు సభ్యులైనా సామాన్యుల గొంతు వినిపిస్తే సంతోషమే.                                (కార్టూన్ ఇండియాటుడే వెబ్సైటు లోనిది)

Sunday, October 27, 2013

కర్మయోగికి అక్షర నివాళి


మా పెద్ద మామయ్య గొల్లపూడి సుబ్బారావు గారు, మొన్న బుధవారం స్వర్గస్తులయ్యారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు.

మెకానికల్ ఇంజినీరింగ్ లో ఐ.ఐ.టి లో డాక్టరేట్ పొందిన ఆయన, హిందూస్తాన్ మోటార్స్, BHPV, మొదలగు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసి, తరువాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జనరల్ మేనేజర్ గా చాలా ఏళ్ళు సేవలందించారు. పదవీ విరమణ అనంతరం వైజాగ్ గీతం లో ప్లేస్ మెంట్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు, తుది శ్వాశ విడిచేవరకూ.
 
ఒక్క వాక్యంలో ఆయన్ని పరిచయం చెయ్యాలంటే - ఎనలేని మేధస్సు, మొక్కవోని పట్టుదల, అఖుంటిత దీక్ష. దగ్గర నుంచీ ఆయన్ని చూసిన వాళ్ళెవరూ,  ఆయన్ని ఎప్పటికీ మరచిపోలేరు. సింహం లాంటి వ్యక్తిత్వం, తాను నమ్మినది చెయ్యడానికి ఎవరినీ ఖాతరు చేయ్యని తనం, ప్రతిఫలం ఆశించకుండా శ్రమించడం. చాలా మంది బ్రతకడానికి పని చేస్తారు. కొందరు పని చెయ్యడానికి బ్రతుకుతారు. ఈయనది మూడో దారి, "పనే నేను" అనుకునే తత్త్వం. దేవుడు, కుటుంబం, మానవ సంబంధాలు, పాప పుణ్యాలు, ఇలాంటివి ఆయన లిస్టు లో ఎక్కడో చివర ఉంటే ఉంటాయి. మా కజిన్స్ అందరికీ ఆయన రోల్ మోడల్. కేవలం చదువు ద్వారా ఏ స్థాయికి చేరుకోవచ్చు అన్నది ఆచరించి చూపించిన మార్గదర్శి. మా చిన్నతనం లో, ప్రతీ ఏడూ ఏదో ఒక పండగకి అందరినీ ఇంటికి పిలిచి, ఏవో ఒక కానుకలు ఇచ్చేవాడు. ఆ గిఫ్ట్ చేతిలో పెడుతూ ఆయన అడిగే ఒకే ఒక ప్రశ్న - "నువ్వు చేస్తున్న దానిలో నువ్వు ఫస్ట్ గా ఉన్నావా లేదా.. ? ". నేటికీ అదే ప్రశ్న ఆయనది. ఏ పని చేసినా పర్వాలేదు, కానీ అది అందరికంటే బాగా చెయ్యాలి. ఆది ఆయన ఫిలోసఫి. 

ఆయన కెరీర్ అంతా ఒక్క ఎత్తైతే, గీతం లో ప్లేస్ మెంట్ ఆఫీసర్ గా ఆయన కాంట్రిబ్యూషన్ మరొక రేర్ అచీవ్మెంట్. వేలమంది విద్యార్థులు ఆయనవల్ల, ఆయన నిబద్దత వలనా, లాభ పడ్డారు. విశాఖకు, మరీ ముఖ్యంగా గీతం కు కార్పొరేట్ వరల్డ్ లో ఒక స్థాయి ని నిర్మించడం లో ఆయన చేసిన కృషి అద్వితీయమైనది. కాంపస్ లో ఉద్యోగాలు రానివాళ్ళకి, బయట ప్లేస్ అయ్యేలా ప్రోత్సాహం, కాంటాక్ట్స్, రికమండేషన్ లెటర్స్ ఇచ్చి మరీ పంపేవారు. TCS రామదొరై, సత్యం రామలింగరాజు వంటివారు ఆయనకి వ్యక్తిగతం గా పరిచయస్తులు. ఇంటర్వ్యూలు కండక్ట్ చెయ్యడానికి వచ్చే HR ఉద్యోగులు ఆయనతో మాట్లాడడానికి భయపడడం నేను కళ్లారా చూసాను. దూసుకుపోయే ఆయన తత్వంతో కలిసి పనిచెయ్యడం చాలా కష్టమే, కానీ ఆయన పనితనానికి, నైపుణ్యానికి దాసోహం అనక తప్పదు. నాకు బాగా గుర్తు, ఒక ఏడు ప్రాంగణ నియామకాలు జరుగుతున్న సమయంలోనే మా మామయ్య US వెళ్ళాల్సిన అవసరం పడింది, కూతురు గురించి. వెళ్ళలేదు. తరువాత కలిసినప్పుడు నేను ఆ మాటే అడిగితే. ఆయన ఇచ్చిన జవాబు.. - "అక్కడ నా ఒక్క కూతురికోసం నేను వెళ్ళిపోతే, ఇక్కడ వందల మంది పిల్లల సంగతి ఏంటి". కుటుంబం గా ఆయన ధోరణి అంగీకరించడం కష్టమే, కానీ ఆయన బుర్రలో మరో ఆలోచనకి చోటు లేదు. కొన్నేళ్ళ క్రితం, ICU లో ఉండగా, స్పృహ వచ్చిన వెంటనే, అదేదో కంపెని కి లిస్టు పంపాలని ఆత్రుత పడి, ప్రక్కనే ఉన్న మా అమ్మగారి చేత ఆయన అసిస్టెంట్ కి ఫోన్ చేయించడం నాకు తెలుసు. ఇదెక్కడి చోద్యం అని డాక్టర్స్ కూడా ముక్కున వేలు వేసుకున్నారంట.

ఆయనలో భయం నేను ఎన్నడూ చూడలేదు. ఏదో పొందాలనే ఆశ కానీ, ఇంత సాధించాను అనే గర్వం కానీ, వెతికినా ఆయనలో మనకి కనిపించదు. శారీరక బాధ ఏదీ ఆయన్ని క్రుంగ దీయలేదు. రోజుకి మూడు పూటలా డయాలసిస్ చేసుకుంటూ, గీతం కి వెళ్లి వచ్చేవాడు. ఇందాక మా అత్తతో ఫోన్ లో మాట్లాడుతుంటే చెప్తున్నారు, మొన్న వారం, శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతూ, ఆక్సిజెన్ మీద ఉండి, ఆ సిలెండర్ ని వెంట తీసుకుని కాలేజి కి వెళ్ళనివ్వమని అడిగారంట, ఆయనకి బాలేదని అమెరికా నుంచీ ఆఘమేఘాల మీద వచ్చిన కొడుకుని. సింహం లా బ్రతికాడు, అలానే తరలి వెళ్ళిపోయాడు. ఎందరి గుండెల్లోనో చెదరని చైతన్యంగా నిరంతరం వెలుగుతూనే ఉంటాడు.

కొందరి జీవితాలకి మరణం ముగింపు కాదు. అది మరొక్కసారి రుజువు చేసాడు మా మామయ్య. ఆయన్ని తెలిసిన వాళ్ళందరికీ, గుప్పెడు జ్ఞాపకాలు మిగిల్చాడు. గుండెడు ధైర్యం కూడాను.

Saturday, October 26, 2013

ఏవో కొన్ని మాటలు..


బ్లాగు లో ఏదైనా రాసి పోస్ట్ చెయ్యాలనే ఆసక్తి సన్నగిల్లుతోంది. ఎందుకనో. కొంతవరకూ ఈ పారిస్ రొటీన్ లైఫ్ వల్ల కావచ్చు. ఆఫీసు, రూమ్, వండుకోవడం, కడుక్కోవడం.. వగైరా.. వగైరా..

ఒక్కోసారి దేనికోసమో ఎదురు చూస్తున్నట్టే ఉంటుంది, దేనికోసమో తెలీదు. మరోసారి, దేనికిదంతా అనిపిస్తుంది, కానీ పరుగు ఆగదు. ఏకాంతానికి, ఒంటరితనానికి మధ్య ఆత్రంగా నిలబడిన క్షణం, గుండె జ్ఞాపకాల కోసం నిలువెల్లా వెతుక్కుంటుంది. స్పందించడం మానేస్తే, ప్రపంచం ఆగిపోయినట్టు.. హడావిడి రహదారిలో ఒంటరిగా వేసే అడుగులు. చెవులను తాకుతూనే ఉంటాయి వేల గొంతులు, మాటలు వినిపించవు. సూర్యోదయం, వెనువెంటనే మరో సూర్యోదయం.. కాలం కదులుతూనే ఉంది. ముందుకో. మరి వెనక్కో. చావులు.. పుట్టుకలూ.. అన్ని ఫోన్లే చెప్తుంటే.. ఎవరికోసం ఈ దూరం.. ఎవరికి దగ్గర..
జీవితం కోసం.. జీవితం వదిలి.. జీవితం వెనుక.. తెలియని ప్రయాణం. అదే గమ్యం అనుకుంటూ.

ఈ మధ్య రాసుకున్న కొన్ని మాటలు..  అర్థాల కోసం వెతక్కండి.


మరణం భయపెడుతుంది.
భయం..
చంపుతుంది.


నాకంటూ..
ఒక ప్రపంచం కావాలి.
నేను అనే ఆలోచన లేనిది. 


ఒంటరి కిటికీ..
రోజంతా ఎదురుచూస్తుంది.
నా చూపుల కోసం.


నిన్న, నేడు నడుస్తున్నాయి..
రేపటి, గతంలో,
కలిసిపోడానికి.


అన్నీ ఉన్నట్టు..
ఏదీ లేనట్టు మరుక్షణం.
గుండెలో ఎండమావులు.


                                    (The Eiffel Tower seen from the Palais de Chaillot. Image by Pete Seaward.)

Sunday, October 6, 2013

పారిస్ లో "వైట్ నైట్"


ఈ రోజు శనివారం,  పారిస్ లో వైట్ నైట్ (Nuit Blanche) జరుపుకుంటున్నారు. అనగా, రాత్రంతా రవాణా సదుపాయం ఉంటుంది. మ్యూజియంలు, ఆర్ట్ గాలరీస్ వగైరాలు రాత్రంతా తెరిచే ఉంటాయి. మరీ ముఖ్యంగా, ఈ రోజు రాత్రి ప్రవేశం ఉచితం. ఇవి కాక కొన్ని ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, షో లు కూడా నిర్వహిస్తున్నారు. మామోలుగానే ఇక్కడ జనాలకి సాయంత్రమే తెలవారుతుంది, ఇంక ఇలాంటి వేడుక ఉంటే వేరే చెప్పాలా.. నిజంగానే ఈ రాత్రి చీకటి పడేలా లేదు. రోడ్లు, ట్రైన్లు, టూరిస్ట్ ప్రదేశాలు, అన్నీ కళకళ లాడుతున్నాయి. వాతావరణం కూడా బావుంది, మరీ వణికించే చలి కాకుండా. మా ఫ్రెంచ్ స్నేహితులు కొందరితో కలిసి నేనూ ఒకటి రెండు మ్యూజియంలు, కొన్ని ప్రదర్శనలు చూసి, బయట జనాల ఉత్సాహానికి ముచ్చటగా ఉన్నా, మరీ శివరాత్రి చెయ్యలేక, ఎంత కాదనుకున్నా పరాయి దేశం, మరీ రిస్క్ ఎందుకు అని, మనసుతో సహా, ఏదీ పారేసుకోకుండా, జార్తగా రూమ్ కి ఇప్పుడే చేరుకున్నాను. మా జనాలు మాత్రం రాత్రి అంతు చూసేలానే ఉన్నారు.

వైట్ నైట్ ని తెలుగులో "శ్వేత రాత్రి" అంటే ఎలా ఉంటుంది అంటారు ? మరీ అదేదో మలయాళం డబ్బింగ్ సినిమా పేరు లా ఉంది అంటారా ? :-)

Sunday, September 29, 2013

ది లంచ్ బాక్స్ (హిందీ చలనచిత్రం)


ఈ మధ్యే "ది లంచ్ బాక్స్" అనే హిందీ చలన చిత్రం విడుదల అయ్యింది. నిన్ననే చూసాను, నాకు చాలా నచ్చింది. ఆఫ్ బీట్ సినిమాల టేస్ట్ ఉన్న ప్రేక్షకులు అస్సలు మిస్ అవ్వకూడని చిత్రం ఇది. తీసుకున్న కథాంశం చిన్నదే అయినా, చెప్పిన విధానం, చిత్రీకరణ అద్భుతం గా ఉన్నాయి. సినిమా మొత్తం చూసాక, ఒక మంచి కవిత చదివిన అనుభూతి మిగులుతుంది. చిత్రంలోని పాత్రలు, మన ఆలోచనల్లో కొంతకాలం ఉండిపోయి, మనల్ని పలకరిస్తూ ఉంటాయి, పరిచయస్తుల్లా.

భర్త నుంచీ రవ్వంత అనురాగం కూడా లభించక, అల్లాడుతున్న ఒక గృహిణి "యిలా" (నిమ్రత్ కౌర్), శ్ర్రీమతి ని కోల్పోయి, ఒంటరితనంలోనే తన అస్తిత్వాన్ని సృష్టించుకుని, రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, "సాజన్ ఫెర్నాండెజ్" (ఇర్ఫాన్ ఖాన్).. ఈ రెండు పాత్రలతోనే ఈ కథంతా నడుస్తుంది. యిలా తన భర్తకి పంపిన లంచ్ బాక్స్, పొరపాటున సాజన్ కి చేరడం తో కథ మొదలౌతుంది. తరువాత, వాళ్ళిద్దరి మధ్యా, ఆ బాక్స్ ద్వారానే జరిగిన సంభాషణ, క్రమేణా ఏర్పడిన అనుబంధం అదీ మిగిలిన చిత్రం. సీన్ బై సీన్ చెప్పిన కథకంటే, బిట్వీన్ ది లైన్స్ మనకి మనం ఫీల్ అయ్యే కథే ఎక్కువ. మానవ జీవితంలోని సంక్లిష్టత, ఆశలు, భావోద్వేగాలను దర్శకుడు రితేష్ బాత్రా ఒడిసిపట్టుకుని చిత్రం గా చెప్పగలగడం, సామాన్యమైన విషయం కాదు. అంతర్జాతీయ సినిమాల్లో ఇలాంటి కథలు మనకి అప్పుడప్పుడు కనిపిస్తున్నా, బాలీవుడ్ కి కాస్త క్రొత్త అనే చెప్పాలి. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి కూడా. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, "You've Got Mail" అనే ఆంగ్ల చిత్రాన్ని గుర్తు చేస్తాయి. అంతర్లీనం గా ఉన్న ఆర్ద్రత "దోభీ ఘాట్" ని గుర్తు చేస్తుంది.

కథను ప్రక్కన పెడితే, చిత్రీకరణ ఎంతో నిజాయితీగా, సహజసిద్ధం గా ఉంది. చాలా సీన్లు బహిరంగ ప్రదేశాల్లో, మామోలు జనం మధ్య తీసినట్టు అనిపించింది. ఎలా షూట్ చేసారో మరి. ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. కథలో కొంత నాటకీయత కనిపించినా, అది మనకి అసందర్భంగా అనిపించిదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటుడు ఇర్ఫాన్ ఖాన్ గురించి. నా దృష్టిలో భారత దేశం గర్వించదగ్గ కళాకారుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకడు. నసీరుద్దిన్ షా, అనుపంఖేర్, ఓంపురి ల సరసన నిలబెడతాను నేను ఇర్ఫాన్ ఖాన్ ని. ఏ పాత్ర పోషించినా మనకి పాత్ర తప్ప అతడు కనిపించడు. ఎంత విభిన్నమైన పాత్ర అయినా, స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని, దానికి జీవం పోస్తాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే, మన చిత్రాల్లో నటులు కంటే స్టార్లు ఎక్కువ. వాళ్ళ చుట్టూ, చిత్ర పరిశ్రమ ప్రదక్షణాలు చేస్తూ ఉంటుంది. ఇర్ఫాన్ లాంటి నటుడుకు మంచి చిత్రం దొరకాలే కానీ, ఆస్కార్ అందనిదేమీ కాదు అని నా అభిప్రాయం.

తిరిగి సినిమా విషయానికి వస్తే, పేరు ఇంకేదైనా పెట్టి ఉండాల్సింది అనిపించింది నాకు. ఎందుకంటే, మొదట నేను అదేదో చిన్నపిల్లల సినిమా అనుకున్నా. :-) తెలుగులో ఈ సినిమా వస్తే, టైటిల్ ఏం పెట్టొచ్చు అని ఆలోచిస్తే, నాకు తట్టిన పేరు - "మౌన సంభాషణ". (అయినా, తెలుగు సినిమా టైటిల్ తెలుగులో పెట్టనిస్తారా, డవుటే.. )

ఇలాంటి సినిమాలు ఎప్పుడో గాని రావు, వీలయితే తప్పక చూడండి. 

Wednesday, September 25, 2013

జగన్ సక్రమాస్తుల కేసు :-)


సచిన్ టెండూల్కర్ బ్యాటో, కత్రీనా కైఫ్ వాడిన కర్చీఫో, ఎవడైనా వెయ్యి రెట్లు రేటు పెట్టి కొన్నాడనుకోండి, దాంట్లో కేసు ఏముంది నా మొహం. అది వాడి అభిమానం, ప్రేమ. అంతే కానీ, సచిన్ ని, కత్రినా కర్చీఫ్ ని అరెస్ట్ చేస్తామా ? ఎందుకంత ప్రేమ అని నిలదీయగలమా ? ఇన్నాళ్ళూ గుడ్డెద్దు చేల్లో పడినట్టు ఎటువైపు వెళ్ళాలో తెలియని మన సిబిఐ కి  జ్ఞానోదయం అయ్యింది. నిన్నటి వరకూ అబ్బో వేల కోట్ల కుంభకోణం అని గగ్గోలు పెట్టి, చివరి నిమషం లో తుస్సుమనిపించింది. మొన్నెప్పుడో ములాయం గారికి క్లీన్ చిట్ వచ్చినప్పుడే, తదుపరి టర్న్ అన్నయ్యదే అని అర్థం అయ్యింది. అసలు రాజకీయాల్లో అక్రమాస్తులకి కేసు ఏంటి చెప్పండి, లేని వాడు ఎవడు ? పొరపాటున ఎవడైనా బ్రతికి చెడ్డవాడు ఉంటే, వాడి మీద కేసు పెట్టాలి అసలు. టీం స్పిరిట్ పాడు చేస్తున్నందుకు..

దీన్ని మనం ఫిక్సింగ్ అని ఫీల్ అయిపోయి, మనసు బాధ పెట్టేసుకోకూడదు. మళ్ళీ అన్నయ్యే ఓదార్చాలి. అందుకని దీన్నంతా మనం ఒక రియాలిటి షో లా అనుకుని సంబరపడాలి, లైట్ గా తీసుకోవాలి. అంతా బావుంది కానీ, మళ్ళీ ఏ నాయకుడూ సిబిఐ దర్యాప్తు అని డిమాండ్ చెయ్యడు. అంతకంటే, హెడ్డు కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ నయం. రేపో మాపో గాలి గారి గాలి కూడా మారుతుంది, ఆయన మైనింగ్ కూడా సక్రమమే అని తేలిపోతుంది. మరీ కాదు, కూడదు, అడ్డొస్తున్నాయి అంటే, రాజ్యాంగాన్ని, IPC ని మార్చిపారేద్దాం. దానికేం భాగ్యం. రాస్తుంటే గుర్తొచ్చింది, మా తమిళ అమ్మ గారిది కూడా ఒక కేసు ఉండాలి, మరి అది మోడీ గారి చేతుల మీదుగా సక్రమం అవుతుందేమో. కొంచం వేచి చూడాలి.

Friday, September 20, 2013

ట్వీట్ల బాబు నాయడు


మోడీ గారి మహిమో, మరొకటో కానీ, బాబు గారు ట్విట్టర్ ఎకౌంటు(@ncbn) తెరిచారు. మామోలంటే మామోలుగా, "తెలియ చేసుకుంటున్నాను" టైపు బోరింగ్ మాటలు కాకుండా, ఏదైనా ఆసక్తికరంగా, ఉపయోగపడేవి రాస్తారో, లేదో చూడాలి మరి. నాకు ఎప్పటినుంచో ఒక డవుటు ఉండనే ఉంది, అసలు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరికీ ట్వీట డానికి టైం ఎక్కడ ఉంటుంది అని. ఈ వ్యవహారాలన్నింటికీ వేరే మనుషులు ఉంటారేమో లెండి.

సాయంత్రం, ఆఫీసు నుంచీ రూమ్ కి మెల్లగా నడుచుకుని వస్తుంటే, ఫాస్టు ఫాస్టు గా నాకో అవిడియా వచ్చింది. ఒకవేళ నిజంగానే మన బాబు గారి మనసులో మాటలు అలా స్ట్రెయిట్ గా ట్వీట్ల రూపంలో చెప్పేస్తే, ఎలా ఉంటుంది అని. ఓ నాలుగు, అయిదు ట్వీట్లు మనం వీజీగా గస్సింగ్ చేసేయచ్చు మరి.

"ఏం రెండు కళ్ళ సిద్ధాంతమో, నా ఖర్మ, 32 పళ్ళూ ఊడేలా ఉన్నాయి.. "

"వేళ కాని వేళ, ఆస్తులు ప్రకటించాను, బావుంది, కానీ అవి నిజమనుకుంటే ఎవడైనా పార్టీలో ఉంటాడా ? "

"బాబు లు పేర్లు చెప్పుకుని, వేల కోట్లు దండుకున్నారు. థూ నా బ్రతుకు, బాబు అని పేరు పెట్టుకుని ఏం పీకాను.. "

"ఆ వర్షం కురిసిన రాత్రి, మెరుపు మెరిసిన ఆ బలహీన క్షణంలో, కెసిఆర్ కి ఓ మంత్రి పదవి ఇచ్చేసి ఉంటేనా.. "

"జోళ్ళు కాదు, కాళ్ళు కూడా అరిగేలా తిరిగాను, అయిన ఎన్టీఆర్ విగ్రహం ముందు నిలబడితే ఎవరూ గుర్తుపట్టేలా లేరు.. "

"అయినా మా మామ, అంతమంది కృష్ణుల్నికన్నాడు కానీ, ఒక్క రాముడేనా కన్నాడా.. "

"టెక్నాలజీ.. టెక్నాలజీ.. అని ఊరేగితే.. ఏమైంది.. ట్విట్టర్ ఎకౌంటు మిగిలింది."

"నా వల్ల జాబులోచ్చినోల్లందరూ అమెరికా లో సెటిల్ అయిపోతే, ఫేస్బుక్ లో లైకులు, ట్విట్టర్ లో ట్రెండులు అయితే వస్తాయి కానీ, మరి వోట్లో ?"(సరదాగా రాసాను, సరదాగానే తీసుకోమని మనవి)

Monday, September 16, 2013

ప్రేమ - ద్వేషం


ఏదో పుస్తకంలో చదివాను, మనిషి జీవితంలో మరణం కంటే విషాదం, ప్రేమించ లేకపోవడం అని.

అందరి జీవితాలూ ఒకేలా ఉండవు, ఒకరిది దూదిపరుపు మీద నడక అయితే, మరొకరిది ముళ్ళదారిలో పయనం. మార్గం ఏదైనా, గమ్యం ఎంత గొప్పది అయినా, మధ్య దారిలో కొందరు తెలీకుండానే ప్రేమను దూరం చేసుకుంటారు. దానికి బోలుడు కారణాలు ఉండచ్చు, ఒంటరితనం, చేదు అనుభవాలు, తారసపడిన మనుషులు.. మొదలైనవి. కారణం ఏదైనా, ప్రేమను కోల్పోయాక, ఇంక మిగిలేది ఏమిటి ? ఎదుట వ్యక్తిలో ఎప్పుడూ తప్పులే ఎంచుతూపోతే, ద్వేషం తోనే మన మనసంతా నింపుకుంటే, జీవితానికి అసలు అర్థమే లేదు అనిపిస్తుంది నాకు. ద్వేషం మనకే మనం వేసుకునే శిక్ష. అనుకున్నది సాధించాలనే కసితో పాటూ, కాస్తంత ప్రేమనీ గుండెల్లో నింపుకుంటే, అడుగడుగులో పంచుతూపోతే మనతో ఉన్న నలుగురుకీ, అప్పుడే కదా ఈ ప్రయాణానికి ఒక అర్థం.

దారిపొడవునా ముళ్ళే కావొచ్చు, మలుపు మలుపుకీ గాయాలే స్వాగతించచ్చు, కానీ ఈ ధ్యాసలో పడి ప్రతీ మజిలీలో పలకరించే రోజా పూలను, వెన్నెల రాత్రి పాదాలను తడిపే మంచు ముత్యాలని చూడలేకపోతే, హృదయంలో దాచుకోలేకపోతే ఎంత విషాదమో కదా.

సుఖ దుఃఖాలు లేని జీవితం ఉంటుందా ? ఎదురు దెబ్బలు మనలో మనిషితనాన్ని పెంచాలి కాని, గుండెని రాయి చేయకూడదు. స్పందన లేని హృదయం కొట్టుకుని మాత్రం ఏం లాభం..

మొదటి వాక్యాన్నే నేను ఇలా రాసుకుంటాను..
"మరణం అంటే, మనం లేకపోవడం కాదు.. మన గుండెల్లో ప్రేమ లేకపోవడం.. "

ఏదో మూడ్ లో రాసాను లెండి, అర్థం అయితే ఆనందమే. :-)

Sunday, September 15, 2013

ప్యారిస్ లో వినాయకుడి ఊరేగింపు


పారిస్ గార్డె నార్డ్ ప్రాంతంలో వినాయకుడి ఆలయం ఉంది. ఆ ప్రాంతంలో శ్రీలంక తమిళులు ఎక్కువగా నివసిస్తారు. మన భారతీయ మార్కెట్ కూడా అదే మరి. మొన్న వినాయక చవితి సందర్భంగా, చవితికి ముందుగానే, ఒక పెద్ద ఊరేగింపు నిర్వహించారు. గతసారి పారిస్ వచ్చినప్పుడు, నేను ఈ వేడుక మిస్ అయ్యాను, ఈ సారి అందుకనే ముందే ఊరేగింపు షెడ్యూల్ అంతా చూసుని మరీ వెళ్లాను. చాలా వైభవంగా జరిగింది, మీరు నమ్మరు, ఆ ఏరియా (ఫ్రెంచ్ వాళ్ళు డ్రిస్ట్రిక్ట్ అంటారు) మొత్తం అన్ని రహదారులు బ్లాక్ చేసారు, వాహనాలు రాకుండా. ఆల్మోస్ట్ మా మైలాపూరు లో ఉత్సవాలు ఎలా జరుగుతాయో, అలా జరిగింది ఇక్కడ కూడా. రోడ్డు నిండా కొబ్బరికాయ గుట్టలు, హారతి ప్రసాదాలు, దారిపోడువునా బారులు తీరిన జన సందోహం. ఏంతో మంది ఫ్రెంచ్ వాళ్ళు కూడా పాలుపంచుకున్నారు, వాళ్ళకి తోడు యాత్రికులు. కొంత మంది భక్తులు, ఉచితం గా ఆహరం, పానీయాలు పంపిణీ చేసారు. నేను నా ఫోన్లో తీసుకున్న కొన్ని ఫోటోలు క్రింద అటాచ్ చేసాను చూడండి.Sunday, September 1, 2013

కౌముది లో నా మొదటి కథ


గత కొన్నేళ్ళగా, అడపాదడపా తోచింది "నా హరివిల్లు" లో రాసుకుంటున్నాను. కొన్ని కవితలు కౌముదిలో దర్సనమిచ్చాయి. ఈ మధ్య ఉద్యోగ రీత్యా పారిస్ రావడంతో, మామోలు కంటే ఇంకాస్త ఎక్కువ సమయమే చిక్కింది, రాసుకోడానికి, చదువుకోడానికి. సో ఓ చిన్న తుంటరి ఆలోచనని కథగా మలిచే ప్రయత్నం చేసాను. అలా తయారైన నా మొట్టమొదటి కథ "స్టింగ్ (స్టింక్) ఆపరేషన్", కౌముది సెప్టెంబర్ ఎడిషన్ లో ప్రచురింపబడింది.

తయారీ దశలోనే, చదివి భరించి, మెరుగుపరచడానికి తమ వంతు సహకారం అందించిన కృష్ణారావు-వందన దంపతులకు, ఈ కథకే కాదు, బ్లాగు మొదలు పెట్టినప్పటినుంచి నా ఫస్ట్ క్రిటిక్ గా ఉన్న మా ఆవిడ కజిన్ సృజన కి ధన్యవాదాలు. (మరీ ఇంత ఫార్మల్ గా అవసరమా అని నాకు తిట్లు ఖాయం :-))
"బావుందండి" అంటూ మొదట భరోసా ఇచ్చిన మధురవాణి గారికి, "మొదటి ప్రయత్నమే అయినా, బానే వచ్చింది" అంటూ ప్రోత్సహించిన కిరణ్ ప్రభ గారికి మరోసారి కృతజ్ఞతలు.

ఇక కథాంశం విషయానికి వస్తే, ఈ రోజుల్లో వార్తా చానళ్ళకి, ఎంటర్టైన్మెంట్ చానళ్ళకి పెద్దగా వ్యత్యాసం మిగల్లేదు. మన తెలుగు నాట ఈ వెర్రి మరీ ఎక్కువగా ఉంది. న్యూస్ ని రిపోర్ట్ చెయ్యడం కాకుండా, దాన్ని క్రియేట్ చెయ్యడమూ, అక్కర్లేని అర్థంలేని మెరుగులు దిద్దడమూ వాళ్ళ అలవాటుగా, మన గ్రహపాటుగా మారింది. ఒకప్పుడు ప్రింట్ లో వచ్చింది అంతా నిజమే అనుకునేవాణ్ణి, ఇప్పుడు దానికి విరుద్ధంగా, టీవీ లో వచ్చింది కనుక, అబద్దమే అయ్యుంటుంది అనిపిస్తోంది. స్టింగ్ ఆపరేషన్లు, ఒకరి స్టింగ్ మీద మరొకడి స్టింగు. చూపించే దృశ్యానికి, వినిపించే గొంతులకి ఏమాత్రం పొంతన ఉండదు, దానికి తోడు, ఏ సస్పెన్సు సినిమా నుంచో ఎత్తుకొచ్చిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం. వెరసి, "కాదేది స్టింగుకి అనర్హం" లా తయారయ్యింది. వీటికి తోడు, కన్నీళ్ళతోనూ, గిల్లికజ్జాలతోనూ కూడా TRP లు పెంచుకోవచ్చని నిరూపిస్తున్న రియాలిటీ షోలు. నాగరికత పేరుతో మనం ఉపకరణాలకి దగ్గరై, బాంధవ్యాలని దూరం చేసుకుంటుంటే, మనం పోగొట్టుకున్న ఎమోషన్స్ ని మనకే ప్యాక్ చేసి అమ్ముతున్నాయి ఈ షోలు. ఇందులో నటిస్తోంది, పాల్గొనే అభ్యర్దులో, న్యాయనిర్ణేతలో, లేక చప్పట్లు కొట్టి, ఈలలు వేసి జరుగుతున్న డ్రామాకి తమ సంఘీభావం తెలియజేసే ప్రేక్షకులో చెప్పలేం మనం. ఈ రెండు జాడ్యాలని స్పృశిస్తూ, కొంచం సరదా టోన్ లోనే కథగా రాయాలని చేసిన ప్రయత్నమే ఈ "స్టింగ్ (స్టింక్) ఆపరేషన్". ఎం.టెక్ వరకూ విశాఖలోనే చదువుకోవడంతో, నాకు
బాగా పరిచయం ఉన్న ఆ నేపథ్యం లోనే కధను చెప్పడం జరిగింది.

వీలుచూసుకుని ఓ లుక్కు వేయండి మరి. ( http://www.koumudi.net/ ) మొదటి కథ కదా, మొదటి కథ లానే ఉంటుంది అని గ్రహించగలరు.. :-)

Thursday, August 29, 2013

మద్రాస్ కెఫే (చిత్రం)ఒక్కోసారి ఏది నిజమో, ఏది అబద్దమో ఎవరికీ తెలీదు. ఎప్పటికీ. అలాంటి కథే మద్రాస్ కెఫే చిత్రానిది. శ్రీలంకలోని అంతర్యుద్ధం, ఊచకోత, భారత శాంతి సేన, దాని పర్యావసానంగా రాజీవ్ హత్య. ఈ నేపధ్యంలో తీయబడిన చిత్రం ఇది. అది "మన కథ" అనుకుంటే ఎంతగానో ప్రభావితం చేస్తుంది, మనం ఏమాత్రం సామీప్యం ఫీల్ అవ్వకపోయినా చూడదగిన చిత్రమే. ఓ కులం మీదో, వర్గం మీదో తీస్తేనే సినిమాలు విడుదల అవుతాయని నమ్మకం లేని ఈ రోజుల్లో, నిజాయితీగా, అనవసరపు వివాదాలకి తావివ్వకుండా చెప్పాలుకున్నది చెప్పగలగడం సామాన్యమైన విషయం కాదు. అందుకు ఖచ్చితం గా దర్శకుడిని అభినందించాలి. ఈ సినిమా తమిళనాడు లో ఎలాంటి భావోద్వేగాలను రేకెత్తిస్తుందో వేచి చూడాలి.

చిత్రం చూసిన వెంటనే నేను రాసుకున్న వాక్యం..

"కాటిన ఉదయించిన తొలి కిరణం, బహుశా నిజానిజాల జోలికి వెళ్ళదు. ఎందుకంటే, మరణానికి హృదయం లేదు. దాని ముంగిట మిగిలింది కేవలం ఆర్తనాదం."

Sunday, August 25, 2013

నా కలలు.. వాటి కళలు..


నిద్ర సుఖం ఎరుగదు అంటారు, అది ఏమో గాని, సరైన నిద్ర లేనిదే సుఖం లేదు. కళ్ళు మూసిన వెంటనే అలా వాలిపోయే మహానుభావులు ఎంతో అదృష్టవంతులు. నాకు మాత్రం సుఖ నిద్ర కొంచం అందని ద్రాక్షే. అంటే, ఫుల్ గా అలసి సొలసిన రోజు పర్లేదు లెండి, కానీ మామోలు రోజులు మాత్రం, మన్మోహన్ సింగ్ నుంచీ, మొగలి రేకుల వరకూ.. ఒబామా నుంచీ ఆర్కే ఓపెన్ హార్ట్ వరకూ అన్నీ ఆలోచిస్తే తప్ప నిద్రాదేవి కరుణించదు. పక్క ఎక్కాకే ఎందుకో అవసరం లేనివన్నీ గుర్తొస్తాయి. "నిద్రపోతే మరచిపోగలను.. నిదుర రాదు.. మరచిపోతే నిద్రపోగలను.. మరపు రాదు.." ఈ టైపు లో ఎప్పటికో నిద్ర పడుతుందా, దాంట్లో మళ్ళీ బోలుడన్ని కలలు.. వాటి కళలు.. ఈ కల కళల మధ్య తెల్లారిపోతుంది.

వివరాల్లోకి వెళ్ళేముందు, అలా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కవర్ చేసి వద్దాం. చిన్నప్పుడు నిద్ర పట్టకపోవడం అంటూ పెద్దగా ఉండేది కాదు లెండి. కానీ కలలు మాత్రం విపరీతం. నిద్రలో మాట్లాడడం, లేచి కూర్చోవడం, వీలయితే నిల్చోవడం.. ఇవన్నీ పుట్టగానే పరమళించాయి. మా ఇంట్లో కూడా బాగా అలవాటయిపోయి, పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఓసారి అయితే, లేచే సరికి వేరే రూమ్ లో క్రింద పడుకుని ఉన్నా.. ఈ సదుపాయాలూ అన్నీ చూసి మా అమ్మగారు, మంచం క్రింద ఎత్తు కూడా తీయించేసారు. ఎప్పుడైనా మంచం మీద నిలబడితే ఫ్యాన్ తగులుతుందని ఆవిడ భయం. నాతో పాటుగా, ఈ కళలన్నీ పెరగకపోయినా, పూర్తిగా వదిలి మాత్రం వెళ్ళలేదు. బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, ఇదే భయంగా ఉండేది నాకు. పరీక్షలప్పుడు ప్రశ్నాపత్రాలు కనిపించేవి. కానీ ఒక్క ప్రశ్నా మరుసటి రోజు పేపర్లో వచ్చేది కాదు. వచ్చుంటే, నేను కూడా కాల జ్ఞానం కాకపోయినా, కనీసం కల జ్ఞానమైనా రాసేవాణ్ణి.

పెళ్ళిలో, శాస్త్రానికి అప్పగింతలు అయిపోయాక, అసలు అప్పగింతలు హనీమూన్ కి ముందు మొదలైనప్పుడు (ఎందుకంటే, అప్పగించాల్సింది అబ్బాయిగాడినే అని నా మూఢ నమ్మకం మరి), మా అమ్మగారు మా ఆవిడకి కొంచం క్లారిటీ, ష్యూరిటీ ఇచ్చారు. కొన్నాళ్ళకి, మా ఆవిడ మెట్యూరిటీ కి నా కళలు అలవాటు అయిపోయాయి. ఎంతంటే, నేను మెలుకువగానే మాట్లాడుతున్నా, నిద్రలోనే మాట్లాడుతున్నానని అనుకుంటుంది అపుడప్పుడు. అలాంటప్పుడే, మనం "ఆహా నువ్వు అర్థాంగి గా లభించడం, ఎన్ని జన్మల పుణ్యమో కదా.. " అనేస్తూ ఉండాలి. పోనీలెండి, ఇప్పుడు పుణ్యం గురించి ఎందుకు గాని, మరీ తనకి నిద్రా భంగం చేస్తే మాత్రం, ఓ కసురు కసిరి, పడుకోండి అంటూ ఆదేశిస్తుంది. నిద్రలోనే ఉన్నా, భార్యా విదేయుణ్ణే కనుక, కిక్కురమనకుండా, మళ్ళీ పడుకుంటాను. ఒక్కోసారి నాకు పెను అనుమానం వచ్చేస్తూ ఉంటుంది, ఈ అప్రస్తుత ప్రసంగాలలో, ఏం చెప్పేస్తున్నానో అని. ఏ వీరోయిన్ పేరో చెప్తే నెట్టుకురావొచ్చు కాని, ఏ "నా ఆటోగ్రాఫ్" స్నేహితురాలి పేరో కలవరిస్తే, అమ్మో, మళ్ళీ మనకి కాఫీ నీళ్ళైనా పుడతాయా. ఏదో దేవుడికి, మనకి మరీ ఆ రేంజ్ ఫాక్షన్ తగాదాలు లేవు కాబట్టి, అలాంటి ట్విస్టులు ట్విస్టలేదు.

ఇంతకీ ఎలాంటి కలలు వస్తాయి అంటే, మీరు నమ్మరు రాని టాపిక్ లేదు. చదివిందే మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదివి ఎం.టెక్ పట్టా అందుకున్నా, "పరీక్షలు" మాత్రం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పటికీ. పరీక్షా కేంద్రానికి వెళ్తున్నప్పుడు బస్సులు, ట్రైన్లు, విమానాలు, వీలయితే ఆటోలు, రిక్షాలు, మిస్ అయిపోవడాలు.. ఒక చోటుకి బదులు మరో చోటుకి వెళ్ళడాలు.. ఇలాంటివి అన్నమాట. కొండలు, బండలు, పడిపోవడాలు, ఎగిరిపోవడాలు.. ఇలాంటివి కొన్నిసార్లు. మనకి తెలిసిన లాజిక్కులకి, చూసిన మాజిక్కులకి అతీతం గా ఉంటుంటాయి. ఏ ఆదివారం మధ్యాహ్నమో గంట పడుకుని లేస్తే , రెండు గంటల నిడివి కల గుర్తుండిపోతుంది. ఏంచేప్పమంటారు, కల చించుకుంటే, కళ్ళ మీద పడిందని.. ఒక్కోసారి ఓ పెద్ద ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది, నేనేమో ప్రాణాలని తెగించి అందరిని కాపాడేస్తుంటాను. ఏమిటి ఈ భ్రమ చెప్పండి, నిజంగా అలాంటిది ఏదైనా అయితే, ముందే పారిపోమూ. మరికొన్ని సార్లు మరీ ఘోరం ఏంటంటే, అసలు నా కలలో నేనే ఉండను. అది కల కాదు ఓ మోస్తరు సినిమా లా ఉంటుంది. మీకో శాంపిల్ ఇస్తాను ఉండండి, ఫ్రీ ఏ. (శాంపిల్ కదా)

ఓ ఊర్లో ఓ పెద్ద బ్యాంక్ దోపిడీ జరుగుతుంది. అదేదో ఖజానా అక్కడే ఉండడం వల్ల, పోయిన దాని విలువ కోట్లు ఉంటుంది. పదుల సంఖ్యలో బందిపోట్లు చేసిన ఈ దోపిడీ లో ఏ క్లూ దొరకదు. విచారణలో, ఆ దొంగలు కొందరు స్థానికులని కూడా కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయారని తెలుస్తుంది. కేసు ఎన్నేళ్ళు గడిచినా ఏ పురోగతీ సాధించదు. దొంగలు పట్టుకెళ్ళిన వాళ్ళ ఆచూకి కూడా తెలీదు. ఇంక కేసు మూసేద్దామనుకునే టైం కి, ఆ కేసు ఆఫీసర్ కి ఒక చిన్న అనుమానం వస్తుంది, ఈ దొంగతనం జరిగిన ప్రాంతానికి ఓ రెండు వందల కిలోమీటర్ల దూరం లోని ఒక గ్రామం మీద. ఎందుకంటే, ఏ ప్రత్యేక వనరులూ లేని ఆ గ్రామం కొన్నేళ్ళ లోనే ఏంతో అద్వితీయమైన అభివృద్ధి ని సాధిస్తుంది. స్కూళ్ళు, చెరువులు, రోడ్లు, కుటీర పరిశ్రమలు.. ఒకటేంటి అన్ని రంగాలలోనో ఏంతో పురోగమిస్తుంది, ఇదంతా కూడా ప్రభుత్వం నుంచీ ఏ సహకారం లేకుండా. ఇదెలా సాధ్యం అని తేల్చుకోడానికి ఆ గ్రామం వెళ్ళిన ఆఫీసర్ కి కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు తెలుస్తాయి. ఏళ్ల తరబడి కరువు, పేదరికం లో మ్రగ్గిన ఆ గ్రామస్తులు, కసితో, పట్టుదలతో ఓ ఏభైమంది ఒక బృందం గా ఏర్పడి, ఏంతో పకట్బందీగా ప్లాన్ చేసి ఆ బ్యాంకు ని దోచుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా, కొందరు ఏళ్ల తరబడి ఆ బ్యాంకు పరిసరాల్లోనే నివాసముండి, అక్కడ స్థానికులతో కలిసి పోతారు. దోపిడి అనంతరం ఆ సంపదని, వ్యక్తిగత ప్రయోజనాలకి వాడకుండా, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అదీ కల. ఇది కల కాబట్టి.. దీనికి శుభం కార్డులు, మెసేజ్ లు లేవు మరి. ఏదో పాత ఫ్లాపు హిందీ సినిమా లా లేదూ ? ఆ మధ్య తీస్మార్ ఖాన్ అనే హిందీ సినిమా చూస్తుంటే, నాకు నా కలే గుర్తొచ్చింది. అయినా హ్యాపీ గా నిద్రపోతుంటే, ఇంత పెద్ద పెద్ద కలలు అవసరమా చెప్పండి నాకు. అసలు ఓ చిన్న కామెడి ట్రాకు కూడా లేకుండా..

ఇలా కథలాంటి కలలు ఎప్పుడైనా వస్తుంటాయి. ఏ అర్థం లేనివి రోజూ వస్తాయి. ఇంకో వింత ఏంటంటే, అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు కలలో వస్తాయి. లేచే సరికి కొన్ని లైన్లు గుర్తుంటాయి కూడా. ఈ కలల గడబిడ లో లేవడాలు, కలలోని పాత్రలు నిజంగా కనిపించడాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యం గా పక్షులు వగైరాలు.. మొన్నటికి మొన్న చెన్నై వెళ్ళినప్పుడు, ఓ రోజు, నిద్రలోనే ఒక గదిలోంచి మరో గదికి వెళ్లి, మా బుడ్డోడు సరిగ్గా పడుకున్నాడో లేదో అని చూస్తున్నాను. మధ్య రూమ్ లో పడుకున్న మా మామయ్యగారు కంగారిపడితే, అప్పుడు మెలుకువ వచ్చింది నాకు. ఏదో కవరింగ్ ఇచ్చి, మళ్ళీ నా గదిలోకి వెళ్లి పడుకున్నా. ఈ మధ్య కొత్తగా వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, "ఇది కలే" అని కొన్ని సార్లు నాకే తెలిసిపోతోంది. సో నేనే లైట్ గా తీసుకుని పడుకుంటున్నాను. ఎప్పుడైనా పొరపాటున రాత్రంతా లేవకుండా బుద్ధిగా పడుకుంటే, మా ఆవిడ ఉదయాన్నే పరామర్శిస్తుంది.. ఏంటండి మధ్య రాత్రి లేవలేదు అని.. అదేదో రూపాయి మారకం విలువ పెరిగిపోయినట్టు.

ఆ మధ్య ఎప్పుడో మైగ్రైన్ కోసమని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నా నిద్ర బాధ చెప్పుకున్నాను. ఆయన అన్నీసావకాశం గా విని, కొన్ని కాగితం మీద కూడా రాసి.. ఇదంతా ఓకే, మీకు తదుపరి రోజు కూడా డిస్టర్బ్ అవుతోంది అంటే చెప్పండి, మాత్ర ఇస్తాను అని నాకు ఒక పండగ ఆఫర్ ఇచ్చాడు. వద్దులెండి నా బాధేదో నేనే పడతాను అన్నా. ఏ నాలిక్కి మందేస్తే ఏ నాలిక ఊడుతుందో ఎవరికి తెలుసు.. అదండీ సంగతి.. ప్రస్తుతానికి పారిస్ లో స్వయంపాకం పుణ్యమాని ఎలాగో అర్థాకలే కాబట్టి, నిద్రే సరిగ్గా లేదు, సో కల కళలు కూడా పెద్దగా లేవు.

Thursday, August 15, 2013

నేను, ప్యారిస్సు, ఓ ప్లాస్టిక్ కార్డు..


మొన్న పోస్ట్ లో నా అర్థం కాని కవిత చదివి మీకు నేను పారిస్ తిరిగి వచ్చేసానని తెలిసిపోయే ఉంటుంది. జూన్ లో మా ఆవిడ డెలివిరికి ఇండియా వెళ్లి, మా బుడ్డోడు పుట్టి నెలన్నర కావొస్తున్నా, వాడు ఇంకా కవితలూ, కాకరకాయలూ రాయకపోవడం తో హర్ట్ అయ్యి, ఇంకా నేను అక్కడే ఎదురు చూస్తే, మా ఫ్రెంచ్ వాళ్ళు నన్ను పూర్తిగా మరచిపోయే సదుపాయం ఉందని గుర్తెరిగి, ఓ పదిరోజుల క్రిందట పారిస్ వచ్చేసాను.

గతసారిలా కాకుండా, ఈ సారి కాస్త తక్కువ లగేజ్ తోనే బయలు దేరడం తో, బోర్డింగ్ కౌంటర్ వాడు వద్దన్నా, నేను హ్యాండ్ లగేజ్ వెయిట్ కూడా చూపించి, వాడిని భయపెట్టాను. నా దోహా ఫ్లైట్ టైం కి రావడం వలనా, హోటల్ రూమ్ కీస్ కూడా ఉండాల్సిన చోటే ఉండడం వలనా, ఈసారి నా పరాక్రమ ప్రతిభాపాటవాలు చూపించాల్సిన అవసరం పడలేదు. దేవుడు కూడా మనకి అలవాటైన తలనొప్పులని మళ్ళీ ఇవ్వడు. తెలుగు ప్రేక్షకుడిలా కొత్తదనం కోరుకుంటాడు కాబోలు.

ఇంతకీ టైటిల్ లో పెట్టిన ప్లాస్టిక్ కార్డు సంగతి ఏంటంటే, అదేదో పాత పోస్టులో మొత్తుకున్నట్టు, ఇక్కడ పని చెయ్యాలంటే, వర్క్ పర్మిట్ వీసాలతో పాటూ ఒక రెసిడెంట్ కార్డు తీసుకోవాలి. దానికోసమని నేను విశ్వ ప్రయత్నాలు, భగీరధ ప్రయత్నాలూ, ఆత్మహత్యలు లేని ఉద్యమాలు, వగైరాలు అన్ని చేసి, అది రాక, ఎప్పుడొస్తుందో కానరాక, "ఇక ఇంటికి ఏమని పోను" అని సోలో పాటలు పాడుకుంటుంటే.. మా ఫ్రెంచ్ బాసు కరిగి, కరుణించి, "దానికేముంది, ఆఫ్టరాల్, ఓ ప్లాస్టిక్ కార్డు కోసమని ఉండిపోతావా నువ్వు మీ ఆవిడ డెలివరీ కి వెళ్ళకుండా", అని ఆగ్రహించాడు. ఆగ్రహం ఎలా ఉన్నా, భావం నచ్చి, ముద్దొచ్చినప్పుడే కదా చంక ఎక్కాలి అని గ్రహించుకుని, "అదే కదా మరి నా బాధ కూడా.." అని వాపోయాను.  ప్రతీ దరిద్రానికి, అంత కంటే దరిద్రపుగొట్టు ఉపాయం ఒకటి ఉంటుంది కదా, ఆయనే మా ఇమ్మిగ్రేషన్ టీమ్స్ వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు, "ఉంది ఓ మార్గం, మీలా కార్డు లేకుండా, ఇండియా వెళ్ళాల్సిన వాళ్ళకి, ఓ పద్ధతి అంటూ ఏడిచింది" అన్నారు. ఏంటయ్యా అది, కొంచం నారద మహర్షి లా డిటైల్డ్ చెప్పండి అంటే..

అదేదో యుగం లో వాడెవడో కన్సల్టెంట్ కి ఇలాంటి కష్టమే వస్తే, అప్పుడు వాడు ఇక్కడ ఏ వ్రతాలూ చెయ్యకుండా, ముందు ఇండియా వెళ్ళిపోయాట్ట. తరువాత వస్తున్నప్పుడు, ఇండియా లోనే ఫ్రెంచ్ ఎంబెసీ వాళ్ళని కలిసి మొరపెట్టుకుంటే, "రిటర్న్ వీసా" అనే ఒక ప్రత్యేకమైన వీసా ఇచ్చారట. ఈ  తొక్కలో వీసా నాలా ఎవడో చుక్కల్లో చంద్రుడికి తప్ప అవసరం పడదు కనుక, అది ఎలా అప్లై చెయ్యాలో మా వాళ్ళకీ సరిగ్గా తెలీదు. ఒకరు నెల అంటే, మారోళ్ళు మూడు నెలలు పడుతుంది అని భయపెట్టారు.
ఈ టీవీ9 అన్వేషణ కొనసాగుతున్న టైం లోనే, మా ఫ్రెంచ్ ఇమ్మిగ్రేషన్ లో ఒక ఆవిడ, ఆ రిటర్న్ వీసా ఇక్కడ కూడా ఇస్తారు అంది. మనం పొద్దు ఎప్పుడూ ఎరగం కదా, మర్నాడే ఇక్కడి ఫ్రెంచ్ ఆఫీసుకు పోయి, నా బాధ చెప్పుకున్నాను. (ఓ మూడు గంటలు లైన్లో నిలబడి) వాళ్ళు అంతా తీక్షణంగా విని, అలాంటివి అన్నీ మేము ఇవ్వమోచ్ అని ఫ్రెంచ్ కుండ బద్దలు కొట్టారు. అలా ఆ ముచ్చటా తీర్చుకున్నాను.

ఇంక ఇలా కాదు అని, ఏది అయితే అది అయ్యిందని, ఇండియా బయలుదేరి వచ్చేసాను. మా బుడ్డోడు పుట్టిన వారానికి మా వాళ్ళని కలిసి నా పరిస్థితి విన్నవించుకున్నాను.  మా వాళ్ళు వేళ్ళు, కాళ్ళు అన్నీ లెక్కపెట్టుకుని, నా చేత ఓ మూడు నాలుగు వేరే వేరే దరఖాస్తులు నింపించేసారు. అప్పాయింట్మెంట్ రోజు ఆ వీసా అప్లికేషను సెంటర్ కే పోయి, వాళ్ళకి నాకు కావాల్సిన వీసా గురించి వివరించాను. వాళ్ళకీ పెద్దగా అవగాహన లేదు, అక్కడ ఉన్న వాళ్ళ  పై అధికారులతో సంప్రదించి నాకో మార్గం చూపించారు. అన్ని డాక్యుమెంట్లతో పాటూ, జెరాక్స్ మెషిన్ లో ఓ తెల్లకాగితం అడిగి తీసుకుని, కవితాత్మకంగా ఓ ప్రేమ లేఖ కూడా రాసి, నా దరఖాస్తు తో జోడించి మరీ సబ్మిట్ చేసాను.

అందరి దేవుళ్ళపై భారం ఉంచి, హై కమాండు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహించడానికి సిద్దంగా ఉన్నాను. ఓ రెండు వారాలు గడిచాయి, ఏ సౌండూ లేదు. నేను ఇంక చెన్నై లోనే "అంకితం.. మీకే అంకితం.." అని పాటలు పాడుకుంటూ ఉండగా, నా గ్రహాలూ ఏమనుకున్నాయో పాపం.. కాస్త అనుకూలించాయి. ఓ రెండ్రోజులకి నా వీసా వచ్చింది. మళ్ళీ మా ఫ్రెంచ్ బాసులతో తేదీలు డిస్కస్ చేసుకుని, మా కంపెనీ ప్రాసెస్ ప్రకారం ఆ రిక్వెస్ట్‌లు, వగైరాలు రైజ్ చేసి.. మొత్తానికి పారిస్ లో వచ్చి పడ్డాను.

ఇంక నా ప్లాస్టిక్ కార్డు విషయానికి వస్తే, ఏ ప్రోగ్రెస్సు లేదు. ఇష్యూ అయ్యి ఉంటే వాళ్ళు ఒక లెటర్ నా హోటల్ కి పంపి ఉండాలి, అది జరగలేదు. ఇంకా నయమే దాని కోసం ఎదురు చూస్తూ పారిస్ లో ఉండిపోయి ఉంటే, ఈ లోగా మా బుడ్డోడు పది పాసయిపోయి "ఎవడివిరా బచ్చా నువ్వు.." అని అచ్చాగా నిలదీసేవాడు. ఇక్కడికి వచ్చాక, దాని అంతం.. క్షణక్షణం చూద్దామని ఓ మెయిల్ సందించాను ఇక్కడి ప్రభుత్వ ఆఫీసుకి. "అయ్యా, అమ్మా, నేను రెసిడెంట్ కార్డు కి అప్లై చేసి మూడు నెలలు కావొస్తోంది.. ఇంకా రాలేదు. కాయా పండా.. కాస్త అదైనా చెప్పి మాకు ముక్తి ప్రసాదించగలరు" అని.  ఆ మెయిల్ పంపిన మూడో రోజు అనుకుంటా, తీరిగ్గా ఓ రిప్లై ఇచ్చారు... మీ కార్డు ముక్క రెడీ, వచ్చి తీసుకునిపొండి అని. ఇంక నా సంగతి చెప్పాలా, ఆ రాత్రంతా, కార్డు గురించే కళలు, కలలు. "ఇంకా తెలవారదేమీ.. ఈ చీకటి విడిపోదేమీ.." అని ఘంటసాల, SPB గొంతులు నేనే పాడుకుని.. తెల్లవారుజామునే ఆ ఆఫీసుకి పరిగెట్టాను. ఓ రెండు గంటల లైను ప్రయాణం తరువాత, కౌంటర్ చేరుకున్నాను. కౌంటర్ లో ఉన్న ప్రెంచ్ పొన్ను, అంతా బావుంది కాని, రెవిన్యూ స్టాంపులు ఏవి అంది.. ఎప్పుడో రెంట్ రసీదుల మీద దొంగ సంతకాలు పెడుతున్నప్పుడు తప్ప, మనం రెవిన్యూ స్టాంపు ని బాగా దగ్గరగా చూసింది లేదు. ఫ్రెంచ్ స్టాంపులతో అసలే పరిచయం లేదు. కాష్ ఉంది, నేను కాష్ కడతాను అన్నాను, "నో నో" అంది. నేను దీనాతి దీనంగా, అంటే మన RAC బెర్తు కోసం TT ని చూసినట్టు అన్నమాట, అక్కడే నిలబడ్డాను. "ఇలా కాదు, ఈ సందు చివరనే ఆ స్టాంపులు దొరుకుతాయి, తెచ్చుకుని రా" అంది. మరి లైను అన్నా.. "స్టాంపులు కొనుక్కుని డైరెక్ట్ గా కౌంటర్ కి వచ్చేయి" అని భరోసా ఇచ్చింది.

ముందు కౌంటర్ బయటకి వచ్చి, అక్కడే ఉన్న ఓ లావు పాటి పోలిసావిడని ఆ స్టాంపుల ఆఫీసు గురించి అడిగాను. నెక్స్ట్ బిల్డింగే, దాన్ని ట్రెజరీ పబ్లిక్ అంటారు అంది. మా వూర్లో కూడా అంతే లెండి అనుకుని, ఆ ట్రెజరీ కి వెళ్లి స్టాంపులు కొనుక్కున్నాను. తిరిగి కౌంటర్ కి వచ్చి, వాటిని సమర్పించుకుని, నా కార్డు సాధించుకున్నాను. నేను అనుకున్నట్టే, అది ఓ మూడు అంగుళాల ప్లాస్టిక్ ముక్క. ఇంకా ఘోరం ఏంటంటే, నా ఏభై అక్షరాల పూర్తి పేరు వాళ్లకి పొడుగు అయిపోయినట్టుంది.. భాస్కర్ ని కాస్త.. భాకర్ అని రాసారు. ఎదో ఒకటి ఏడిచారు అనుకుని.. పెళ్లి కార్డులా మళ్ళీ మళ్ళీ చూసుకుని, మురిసిపోయి, సిగ్గుతో మొగ్గలు, పువ్వులూ వగైరాలు అన్నీ అయిపోయి, పాస్ పోర్ట్ తో పాటూ జార్తగా పెట్టుకుని, ఆఫీసుకు వచ్చేసాను. (వచ్చే మార్చి వరకూ ఇక్కడ ఉండటానికి, మధ్యలో ఇండియా వెళ్ళినా,  వీసా బాధ లేకుండా తిరిగి రాడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది అన్నమాట)

అదీ నా ప్లాస్టిక్ కార్డు ముక్క వృత్తాంతం. చదివిన వాళ్ళకి.. విన్న వాళ్ళకి.. చదివి ఛీ అనుకున్నవాళ్లకి.. మీ మీ పాస్ పోర్టులు.. వీసాలు.. ఆధార్ కార్డులు.. అలాంటివి అన్నీ.. త్వరగా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి ఈ కార్డు ముక్క నేను సాధించిన శుభ ముహూర్తాన, ఫ్రెంచ్ వాళ్ళు నా మీద ప్రేమతో ఐఫిల్ టవర్ ఏమైనా రాసిచ్చేస్తారేమో తెలీదు. కనుక్కోవాలి. ఒకవేళ వాళ్లిచ్చినా, మనమే ముక్కలూ.. చెక్కలూ అవుతున్న పరిస్థితిలో ఉన్నాం, ఎక్కడ పెట్టుకోవాలి అని మరో ఉద్యమం వస్తుంది, వద్దనేస్తా లెండి.


మరో మాటండోయ్, ఫ్రెంచ్ ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్రెంచ్ తప్ప మరో భాష మాట్లాడరు. మనం మాక్సిమం సైగలతోనూ, పొడి పొడి ఇంగ్లీష్ మాటలతోనూ నెట్టుకురావాలి.

Sunday, August 11, 2013

ప"రాయి" మనిషి


నటన.
నాలోనే.. నేనే..
అలుపెరుగక నటిస్తుంటాను.
కాస్త పోగొట్టుకుంటే చాలు..
పడాలి కదా అని బాధ పడిపోతుంటాను..
ఏం పొందినా.. సంతోషం తెచ్చి అతికించుకుంటాను.
నవ్వే లేని చిరునవ్వులకి కొదవే లేదు..
కన్నీళ్లు లేకపోయినా,
ఒదార్పుని ఆస్వాదిస్తాను.
ఆపద ముంచుకొస్తే,
లేని భయం నింపేసుకుంటాను.
గుండె కాలకున్నా..
కళ్ళల్లో మంటలు రగిలిస్తాను.
లోపల తడి చుక్కే లేకున్నా..
ధారలుగా ప్రేమ వర్షిస్తాను.

నేను ఎంత గొప్ప నటుణ్ణో..
నటనే జీవితం చేసుకున్నాను.

నేను నవ నవీన మానవుణ్ణి,
జీవించడానికి అస్సలు సమయమే లేని వాణ్ణి..
స్థిత ప్రజ్ఞుణ్ణి కాను..
మరలతో మనుగడ వెతుక్కున్న..
"మర"మనిషిని..
మరణాన్ని గెలవాలని,
బ్రతకడమే మానేసిన ప"రాయి" మనిషిని.

Monday, July 22, 2013

ఓం - ఓన్లీ 3D


కళ్యాణ్  రామ్ మరీ ప్రతీ చానల్ లోనూ మొత్తుకుంటున్నాడనీ, మా బుడ్డోడు కాస్త బానే పడుకుంటూ, పరోక్షం గా మమ్మల్ని సేదతీరమని ప్రోత్సహిస్తున్నాడనీ, నేనూ మా ఆవిడ నిన్న చెన్నై అభిరామి థియేటర్ లో ఓం 3D కి వెళ్లి వచ్చామ్.

తెలుగు లో 3D సినిమా చూద్దాం అనే ఆవేశం ఉన్న నా లాంటి వాళ్ళు ఒకసారి చూడొచ్చు. కానీ, ఆ సినిమా లోంచి 3D ని తీసేస్తే ఇంకేమీ పెద్దగా మిగలదు. మూడో డైమెన్షన్ కి కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి, మొదటి రెండూ మరచి పొయినట్టున్నారు. కథ అదేదో పాత ఫ్లాపు యాక్షన్ సినిమా లా, బోలుడన్ని అర్థం లేని ట్విస్టులతో తెగ విసిగిస్తుంది. అయినా ఓకే అని సద్దుకుపొవచ్చు. మనకున్న సహనం అలాంటిది. కానీ నటన మరియు స్క్రీన్ ప్లే ఘోరాతి ఘోరం. సినిమా అంత ఆర్భాటం గా తీసినప్పుడు ఇంకాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎంత 3D అయితే మాత్రం సినిమా సినిమా యే కదా. మరీ టీవీ సీరియల్ పాటి క్వాలిటీ లేకపోతే ఎలా ?

కొన్ని సినిమాలు  మొదటి పది నిమషాల్లో నే ఫ్లాపు ముద్ర వేసేసుకుంటాయి. ఈ చిత్రం కూడా అలానే మొదలవుతుంది. కానీ కొన్ని సీన్లలో పాపం బానే తీసాడేమో అనిపించేలా కనిపించి చివరకి "ఏదో ఉంది లే " అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ నా బొందో అని కష్టపడినట్టే ఉంది. కానీ అతని స్క్రీన్ ప్రేజెంసే అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. హీరో నటనే తేలిపోతే దాని ప్రభావం మిగతా పాత్రల మీద కనిపిస్తుంది. అసలు వ్యవహారం బావుండి ఉంటే, ట్విస్టులు, మరియు 3D నిజంగానే అసెట్ అయ్యేవి. ఏ ఒక్క పాత్రా మనసుకి హత్తుకునేలా లేదు. డైరెక్టర్ మొదటి ప్రయత్నం అనుకొని సద్దుకుపోవాలేమో.

సినిమా మొదటి నుంచి చివరి వరకూ నాకు బాగా చిరాకు తెప్పించింది మాత్రం హీరో ఫాదర్ పాత్రలో నిన్నటి తరం హీరో కార్తీక్, ఎందుకు చేసాడో కానీ, ఒక్క సీన్లోనూ లిప్ మూమెంట్ సరిగ్గా లేదు, అదేదో ఒరియా సినిమా కి మలయాళం డబ్బింగ్ చెప్పినట్టు. దానికి తోడు ఘంటసాల  రత్నకుమార్ సంగతి తెలిసిందే, పది పైసలకి రూపాయి ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు గొంతులో. కార్తీక్ కి బదులు, నాజర్ నో, ప్రకాష్ రాజ్ నో, అంత స్థోమత లేకపోతే కనీసం శరత్ బాబు నో పెట్టుకుంటే, సినిమా ఇంకా చాలా మెరుగ్గా వచ్చేది. కొన్ని సన్నివేశాల్లో, "అభినందన" లో నటించింది ఈ కార్తీక్ ఏనా అనిపించింది.

సినిమా చూసాక నాకొచ్చిన మరో ముఖ్యమైన డవుట్, అసలు సినిమా పేరు "ఓం" అని ఎందుకు పెట్టారని.. నా నమ్మకం ఏంటంటే, వాళ్ళే ఆ ప్రశ్న మనల్ని అడిగి, ఏ పదిరోజుల వేడుకలోనో, కాస్తో కూస్తో కారణం చెప్పగలిగిన వాడికి 3D కళ్ళద్దాలు బహుమతి గా ఇస్తారేమో అని. అంతకు మించి మరో అవకాశం నాకైతే కనిపించడం లేదు.

అఫీసులో రాస్తూ (ఇంట్లో రాయడానికి మా బుడ్డోడు టైం ఎక్కడిస్తున్నాడు) ఇంతకంటే ఎక్కువ రాస్తే, సమాజం హర్షించదు కాబట్టి ఇంక ఆపేస్తున్నాను. మళ్ళీ నాది అదే మాట, మీకు 3D వెర్రి ఉంటే చూడండి, లేకపోతే హాయిగా ఇంట్లో ఏ పాత సినిమ నో ఇస్తాడు టీవీ లో తీరిగ్గా చూసేయండి. (నిన్న ఇంటికి వచ్చాక మేము మిస్సమ్మ చూసి కొంచం తేరుకున్నాం)

Wednesday, July 17, 2013

వాడు ఒక్కడే!!

ఎవడి పేరు చెప్తే, మా ఇంట్లోనే కాక పక్కింట్లోనూ సునామి వస్తుందో..
ఎవడి కను సైగ, కటిక చీకట్లోనూ మా చేత "ఢీ" డాన్సులు వేయిస్తుందో..

ఎవడి గొంతు వింటే మాఇంట్లో పాడుతా తీయగా మ్యూట్ అయిపోతుందో,
ఎవడి ఏడుపు పది శృతుల్లో సేం టైం మమ్మల్ని స్పేస్ వాక్ చేయిస్తుందో..

ఎవడి చిన్న కదిలిక కలలోనూ నన్ను పాల తిత్తి కోసం వెతికిస్తుందో..
ఎవడి ఎక్స్ ప్రెషన్స్ దశావతారాల్లో విశ్వరూపాన్ని చూపిస్తాయో..

వాడే.. వాడే..
మా చెర్రీ గాడు..

వాడి నిద్ర కానరాని ఎడారి. వాడి ఏడుపు పరిగెత్తించే గోదారి..
వయసు సరిగ్గా లెక్కడితే ఓ పాతిక రోజులు.. కానీ వాడి పరాక్రమనికి లేవు హద్దులు..

Friday, July 5, 2013

కౌముదిలో నా కవిత


పారిస్ అజ్ఞాత వాసంలో ఉండగా రాసిన కవిత ఒకటి ("కవితెవరిది") కౌముది కి పంపాను. ఈ నెల ఎడిషన్‌లో ప్రచురితమైంది.

Saturday, June 22, 2013

నాన్ననయ్యానోచ్!!నిన్న శుక్రవారం, 4:04PM కి, మాకు అబ్బాయి పుట్టాడు. జీవితం మరో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఎన్ని రంగులో.. అపురూపమైన క్షణాలు, కలకాలం దాచుకోవాల్సిన జ్ఞాపకాలు. మీ అందరి ఆశీస్సులు వాడికి ఉండాలని కోరుకుంటూ.. (మా ఫ్రెంచ్ బాసుల పుణ్యమా అని, నేనూ ప్యారిస్ నుంచి మొన్న ఆదివారమే చెన్నై చేరుకున్నాను లెండి సకాలంలో. )  లేలేత పూబాలలా ఉన్న వాడిని, ఫొటోల్లో బంధించేందుకు ఇంకా ధైర్యం చాల్లేదు. మరికొన్ని రోజుల్లో, ఫొటో తీసి, మీతో పంచుకుంటాను.


Friday, June 7, 2013

ఉత్తినే..


ఉత్తినే ఓ మాట జారేస్తాం..
గుండెల్లో ముళ్ళు గుచ్చేస్తూ..

ఉత్తినే ఓ నవ్వు పారేస్తాం..
లోని అసూయని దాచేస్తూ..

ఉత్తినే ఓ ఓదార్పు పలికేస్తాం..
లేని సానుభూతి నటిస్తూ..

ఉత్తినే ఓ అతికించిన కన్నీటిబొట్టు..
ఉత్తినే ఓ అబద్దపు కౌగిలి.


ఉత్తినే మాట మార్చేస్తాం..
ఉత్తినే బాటా మారిపోతాం..

ఉత్తినే ఆశలు కల్పిస్తాం..
ఉత్తినే అఖాతంలోకి తోసేస్తాం..

ఉత్తినే పరిగెడతాం.. ఎందుకో..
అందుకే ఉత్తినే ఆగిపోతాం.

అంతా.. ఉత్తినే..
ఎవరో అన్నట్టు..
చావే లేనట్టు బ్రతికేస్తాం..
బ్రతకే లేనట్టు మరణిస్తాం.
ఉత్తినే.


ఉత్తినే కొన్ని చేస్తాం..
కొన్నింటికి జీవితాంతం ఎదురుచూస్తాం.
ఉత్తినే.

Saturday, June 1, 2013

కష్టం చిక్కబడ్డప్పుడు


కష్టం చిక్కబడ్డప్పుడు.
కన్నీటి గుటకలతో గుండెని నింపేస్తాను.
నా బాధంతా, బాధ పడుతున్నాననే..
ఆ రాత్రి కరగదు. కాలం ఆగిపోయినట్టు..
నిన్నటి వెలుగు కొసలు వెతుక్కుంటాను.
ఆ ఒంటరి క్షణాల్లో, ఎన్ని యుగాలు.
గుప్పెడు మాత్రలు చాల్తాయా..
నిజాన్ని కలగా మార్చేయడానికి ?
ఎంత వేగం సరిపోతుంది..
నా నుంచి నేను పారిపోడానికి..

ఓర్చి, ఓర్చి, ఊరించి..
వేదన ఉప్పెనై ముంచెత్తినప్పుడు,
నా కంట పడకుండా, మనసారా,
ఏడ్చేస్తాను, గదిలో నా కన్నీళ్ళ కల్లాపు.
ఆహా.. ఎంతటి ఓదార్పు. అదో విజయ గాధ.
మళ్ళీ గుండె ఖాళీ,
కొత్త బట్టలు కడతాను ఆశకి.
మరో మలుపుకి స్వాగతం.
తెలవారుతుంది. అందుకే.

వెలుగు చీకట్లు, కాలానికి అస్తిత్వాన్ని ఇస్తాయి.
సుఖ దుఖాలు నా జీవితానికి.

Friday, May 24, 2013

R.I.P మొగలి రేకులు


భూమితో పాటే పుట్టి ఉంటావు,
డిష్షులతో, కేబుళ్ళతో ఇరగ పెరిగి,
మా ఆడుగులో అడుగు కలిపావ్.
నీకు కష్టమైతే మాతో కన్నీరు పెట్టించావ్.
సంతోషాల్ని కమెర్షియల్ బ్రేకుల్లో ఇచ్చావ్.
మా నేలబారు బ్రతుక్కి,
పగలు, ప్రతీకారాలు పరిచయం చేసావ్.
తరాలు మార్చావ్, తలలు మార్చావ్..
అయినా కోత మారలేదు, మా రాత మారలేదు.

ఆగిపోతావేమో అని ఆశ పడినప్పుడల్లా,
"నాన్నా పులి" కథే గుర్తు చేసావ్.
మా సహనానికీ, నీ సాగదీతకీ,
జరిగిన ఈ పోరాటంలో..
నువ్వు ఓడి మమ్మల్ని గెలిపించావ్.
అంతేనా ? ఏమో..
మేము పోగొట్టుకున్న అరగంటల్ని,
మరి వడ్డీతో అందిస్తావా ?
టీవీలో లో దూరం అయ్యావు కానీ..
మా బుర్రల్లో ఉండక చస్తావా.
నువ్వు ఎక్కడున్నా, నువ్వు చేసిన ఈ మేలు..
మా రూముల్లో టీవీలు ఉన్నంతకాలం..
మా చేతుల్లో రిమోట్లు ఉన్నంతకాలం..
గుర్తు చేసుకుంటూనే ఉంటాం..
నువ్వు చేసిన గాయాలు తడుముకుంటూనే ఉంటాం.

నీ ఆత్మ శాంతికై,
టీవీ ని రెండు నిమషాలు,
మ్యూట్ లో పెడుతూ..
నీ అభిమాన బాధితులు.

Saturday, May 18, 2013

జ్ఞాపకాల్లోని మనుషులు


జీవితపు ప్రయాణం లో ప్రతీ మజిలీ కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. వారిలో కొందరు మనతో కొన్ని రోజులు నడిచి, తర్వాత మాయమైపోతారు. ఆ కాస్త దూరం మన జీవితాల్ని పూర్తిగా ఆవరించినా, దూరమై,  వాళ్ళ దారుల్లో సాగిపోతారు. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మనతో వెన్నంటే ఉంటాయి ఎప్పటికీ. కాల ప్రవాహంలో జీవితం ఎన్నో మార్పులకి గురి అవుతుంది, మన ఆశలు, అభిప్రాయాలు, వ్యక్తిత్వం కూడా దానికి తగ్గట్టే పరిణామం చెందుతాయి. మంచికో, చెడుకో. తెలీకుండానే మనం ఎంతో మారతాం. కానీ మన జ్ఞాపకాల్లోని మనుషులు మారరు, అలానే ఉండిపోతారు. బహుశా మనం ఆ జ్ఞాపకాల్ని కొత్త అనుభవాలతో రీప్లేస్ చెయ్యకపోవడం వల్ల కావచ్చు. అందుకే వాళ్ళను గుర్తు తెచ్చుకుంటే, ఒక హాయి ఉంటుంది, ఆ బంధం ఎప్పుడూ పరిమళిస్తూనే కనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తుల జీవితాలు అలానే ఉండిపోవు, మన లానే వాళ్ళూ. మనం వీడ్కోలు చెప్పాక, ఎన్నో ఒడిదొడుకులని ఎదుర్కుని ఉంటారు, కష్ట నష్టాలని ఓర్చి ఉంటారు. ఎంతో మారి ఉంటారు. కానీ ఆ మార్పు మనం ఊహించలేం, అది మనకు అందనిది.

ఎప్పుడో ఆ వ్యక్తులు మళ్ళీ మన జీవితం లో తారసపడినప్పుడో, లేక, మనమే కావాలని కలవడానికి ప్రయత్నించినప్పుడో, ఒక వింత అనుభవం ఎదురౌతుంది. గతాన్ని నెమరవేసుకోవడం వరకూ బానే ఉంటుంది, ఇద్దరికీ అది ఒక్కటే. కాని అది గతమే, వర్తమానం కాదు. "మనం" అని కలిసి ఉన్న రెండు చేతుల్ని వూహించుకుంటే, ఇప్పుడు వాటి మధ్య దూరం ఒక ప్రపంచం అనిపిస్తుంది. ఇన్నాళ్ళూ మన ఊహలన్నీ తప్పా, ఇదా నిజం అని ఆశ్చర్యపోతాం. దిగాలు పడిపోతాం. ఒక నిరాశ ఆవహిస్తుంది. వాళ్ళకి కూడా అలానే అనిపిస్తుందేమో కూడా. మార్పు లేకుంటే ఎంత బావుంటుంది.. బాల్యం బాల్యం లానే ఎప్పటికీ ఉండిపోతే.. కానీ సాధ్యం కాదు. మారనది నశిస్తుంది అంటారు.. మారేది నశించకుండా ఉండిపోతోందా ?

అలాంటి సందర్భాల్లో, ఆ వ్యక్తిని మళ్ళీ కలవకపోతే, ఆ వ్యక్తి గురించి కొత్తగా ఏమీ తెలుసుకోకపోతే, ఎంత బావుండేది అనిపిస్తుంది నాకు. జ్ఞాపకాలే నిజం అనుకుని, వాటిలోనే సేదతీరడం ఎంత మేలో కదా.. మానవ సంబంధాల్లోకి లోతుగా వెళ్తే, ఏది నిజం ఏది అబద్దం. ఏమో. మనసు పొరల్లో ఎన్ని అసంపూర్ణ కవితలు, వాటికి ముగింపు లేకపోతేనే అందమేమో..

మొన్నెప్పుడో రాసుకున్నా.. ఈ వాక్యం.

"కనిపించిన ప్రతీ వ్యక్తిలోనూ నేను నిన్నే వెతికాను. కానీ నీలోనే నువ్వు మిగల్లేదు, నాలో నేనూ మిగల్లేదు. దేన్ని వెతుకుతున్నాను. ఎందుకు. "

(ఏదో ఆలోచిస్తూ, ఏదో రాసాను. అర్థం అయితే ఆనందమే. కాకపోతే, తిట్టుకోకండి, లైట్ గా తీసుకోండి. )

Sunday, May 12, 2013

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు


అమ్మకి కానుకగా ఇద్దామని,
ఓ కొత్త జీవితాన్ని తెచ్చాను..
తన కాళ్ళ ముందుంచితే,
నావైపు నవ్వుతూ చూసింది.
నా గతం లోంచి ఓ నాలుగు జ్ఞాపకాలు..
తీసి.. ఇదీ నాకు కావాల్సిన జీవితం.
అంది. నాకు అర్థం అయ్యింది.

ఆమె గది నిండా మా ఫొటోలు...
గుండె నిండా మా జ్ఞాపకాలు.
ఆమెకి వర్తమానం..
నిన్న ని గుర్తు చేసే ఒక సాధనం.
అంతే.

అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నా భార్యను చూస్తుంటే అర్థమౌతోంది, "అమ్మ", బిడ్డ పుట్టడానికి తొమ్మిది నెలల ముందే పుడుతోందని.

Tuesday, May 7, 2013

పార్లమెంట్ లో NTR (రెండు కోణాలు)

ఈ రోజు ఆన్ లైన్ లో ఈనాడు పేపర్ తిరగేస్తుంటే క్రింది రెండు చిత్రాలు కనిపించాయి. NTR పెట్టిన టాంక్ బండ్ విగ్రహాలన్నీ NTR లానే ఉంటాయి అనేవారు, అలాగే ఈ NTR విగ్రహానికి చెయ్యి సైజు కాస్త పెద్దగా ఉందేమో.

రాజకీయల్లో ఏది తప్పు ? ఏది ఒప్పు ? ఎవరికి తెలుసు ?

మీరు ఏమనుకోండి, పురంధరేశ్వరి కవిత మాత్రం, నువ్వు నాకు నచ్చావ్ ని గుర్తు చేసింది.
వీటికి ఏం పేరు పెట్టను ?


కలవడం లో ఏముంది..
కలిసి నడవడం లో ఉంది,
రైలు పట్టాలు.

---

చీకటికి ఎన్ని కిటికీలో.
తొలి కిరణాలకోసం..
ఎదురు చూపులు.

---

నువ్వు లేని వెలితిని..
నాతోనే పూరించా.
ఒంటరితనం.

---

సొంతం కానిదేదీ.
చివరకు మిగలదు.
జీవితం.

---

మౌనం సంభాషిస్తే..
మాటలకి..
మోక్షం.

---

దేవుడు పుట్టే ఉంటాడు,
మనిషిగా.
అమ్మ కోసం.

---

ఆకాశం వయసు..
లెక్క కడుతున్నాయి.
కెరటాలు.

---రూం కి వచ్చాక ఏమీ తోచలేదు.. ఏవో ఆలోచనలు.. రాసుకున్నాను.
వీటికి ఏం పేరు పెట్టను ?

Saturday, May 4, 2013

గతం కష్టం జ్ఞాపకం ఇష్టం


దూకుడు లో MS నారాయణ అన్నట్టు, పడిన అవమానాలు/బాధలు ఫ్యూచర్ లో చెప్పుకోడానికి బావుంటాయి. కష్టాలు అంటే, చిన్నప్పుడు స్కూలుకు అయిదు మైళ్ళు నడిచి వెళ్ళే వాణ్ణని, ఏ వీధి దీపం క్రిందో IAS కి ప్రిపేర్ అయ్యానని.. మొదటి జీతం మూడుంపావలా అని.. ఇలాంటివన్నమాట. జీవితం లో పైకి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక విధం గా గతం లో కష్ట పడ్డవారే. (అందుకని కష్ట పడ్డవారంతా పైకి వచ్చేస్తారా అంటే,  చెప్పలేం మరి)

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే గతం చేదుదే అయినా, స్మృతి మధురం గా ఉంటుంది. ఇప్పుడు నాకొచ్చిన చేదు గతం ఏంటా అని మీరు డవుటు పడకముందే నేను మీకు వివరాలు ఇచ్చేస్తాను. ప్యారిస్ వచ్చి నెల దాటింది, రావడమే ఓ మంచి షాకు తో వచ్చాను. ఆ కిక్కు ఇప్పుడు పూర్తిగా దిగి పోవడం తో, మీతో ఆ అనుభవాన్ని పంచుకుంటున్నానన్నమాట.

చెన్నై నుంచి ప్యారిస్ కి రోజూ విమానాలు నడిపే సంస్థల్లో, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌లైన్స్ ప్రముఖమైనవి. ఓ పదో పరకో తక్కువ అని మా ఆఫీసు వాళ్ళు ఖతార్ లో నా టికెట్ బుక్ చేసారు. ఖతార్ లో అయితే వెయిట్ లిమిట్ ఓ అయిదు కేజీలు ఎక్కువ అని నేనూ సంబర పడ్డాను. (ఇంకాస్త ఎక్కువ సాంబార్ పొడి తెచ్చుకోవచ్చని.. ;-) ) ఇంతవరకూ బానే ఉంది, ఎయిర్ పోర్ట్ కి వచ్చి బోర్డింగ్ ప్యాస్ తీసుకుందామని చూస్తే, వాళ్ళ లైన్ మరీ ఘోరం గా ఉంది. అదేదో మానవ DNA నిర్మాణాన్ని స్యిములేట్ చేస్తున్నట్టు.. ఆ లైనులో నా సూట్‌కేసులు తోసుకుంటూ, పక్క వాళ్ళవి తన్నుకుంటూ, ఓ గంటన్నరకి కౌంటర్ ని చేరుకున్నాను. బరువు కాస్త అటూ ఇటూ గా ఉన్నా, ఏదో చిన్న సద్దుబాటు చేసి, ఓ.కే అనిపించుకున్నా. అప్పుడు చెప్పారు బ్రేకింగ్ న్యూస్.. విమానం ఒక గంటన్నర లేట్ అని.. నేను చెన్నై లో ఎక్కే ఫ్లయిట్ దోహా (ఆహా కాదు, దోహా.. అదో ఊరు. ) వరకే వెళ్తుంది, అక్కడ ప్యారిస్ కి మరో విమానం ఎక్కాలి. అదే మాట కౌంటర్లో ఉన్న వాడికి చెప్తే, అదేం పర్లేదు, నేను మీకు రెండు బోర్డింగ్ ప్యాస్లూ ఇక్కడే ఇస్తున్నా కదా.. దోహా వాళ్ళు చూసుకుంటారు అన్నాడు. ఇంకేమంటాం, కంగారు తో కూడిన భయం నుంచి వచ్చే తెగింపుతో, బయలుదేరాను.

అనుకున్నట్టే, దోహా కి ఓ రెండుగంటలు లేట్ గా చేరింది మా విమానం. నేను ఎక్కాల్సిన ప్యారిస్ ఫ్లయిట్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది కూడా. కానీ నాలాంటి కనెక్టింగ్ బాధితులు చాలా మందే ఉన్నారు, అందరూ ఎయిర్ లైను వాడి పై కేకలు.. వగైరాలు. నేనూ నాకు కనిపించిన ఒక ఖతార్ ఉద్యోగి తో నా పరిస్థితి విన్నవించుకున్నాను. శాంతియుతం గానే. అసలే అది దోహా, (డైరెక్ట్ గా కాదు కదా, మ్యాప్‌లో కూడా ఎప్పుడూ చూసి ఎరగను.. ) మనం ఎంత మంచిగా ఉంటే మనకే అంత మంచిది కదా. ఓ అరగంట అలా తచ్చాడాక, అరిచిన వాళ్ళకీ, అరవని వాళ్ళకీ అందరికీ ఒక విమానం లోనే ప్యారిస్ వెళ్ళడానికి బోర్డింగ్ ప్యాస్లు చేతిలో పెట్టాడు. అది ఓ నాలుగైదు గంటల తరువాత మొదలువుతుంది. అంతవరకూ అక్కడే శబ్ధం రాకుండా చెక్క భజన చేస్తూ కూర్చున్నా. ఏమైన తిందామంటే వాళ్ళ కరెన్సీ ఏమిటో తెలీదు.. ఒ షాపులో కనుక్కుంటే, రూపాయిలు కూడా తీసుకుంటారని అర్థం అయ్యింది. ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తిన్నాను. టాయిలెట్స్ క్లీన్ చేస్తున్న వాళ్ళు మహేష్ బాబు గురించి అచ్చ తెలుగు లో ముచ్చటిస్తుంటే, భాషొత్సాహం (ఇలాంటి పదం ఉందో లేదో అని మీరు ఆలోచించకూడదు మరి) కలిగి, కాసేపటికి తేరుకుని ఫ్లయిట్ ఎక్కాను.

సో ప్యారిస్ వచ్చేసరికి రాత్రి అయిపోయింది. చీకటి, బాగా చలి, కనిపించిన ఓ ట్యాక్సీ తీసుకుని హొటెల్ కి బయలు దేరాను. ఆ రోజు ఆదివారం కావడం తో, హొటెల్ వాళ్ళు ముందే చెప్పారు, రిసెప్షన్ ఉండదు అని. ఏవో రెండు యాక్సస్ కోడ్స్, తాళం చెవి ఉన్న బాక్సు ఎలా తెరవాలి, ఇలాంటి వివరాలు అన్నీ ఈ మెయిలు లోనే తెలియచేసారు. ట్యాక్సీ లో ఉండగానే, ఆ కాగితాలు బయట పెట్టుకుని రెడీ అయ్యాను. GPS లో రూట్ చూస్తూ నడుపుతున్నాడు ఆ  ట్యాక్సీ డ్రైవర్, చెన్నై లా వీళ్ళు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతారా అనుకున్నా. (మా ఆటో వాళ్ళైతే రూట్స్ కనిపెడతారు.. రోడ్డుకూడా లేని చోట కూడా) ఎయిర్‌పోర్టు నుంచి ఆట్టే సమయం పట్టలేదు, హొటల్ చేరుకోడానికి. లగేజీ మెల్లగా దింపుకుని, ఓ రెండు యాక్సస్ కొడ్స్ కొట్టి, హొటల్ లోకి వచ్చాను. హొటల్ బయట కాని, లోపల కాని పిట్ట మనిషి లేడు. అదేదో వేరే గ్రహం మీద కానీ ల్యాండయ్యామా అనిపించింది. మరి అలా అనుకున్నా, కనీసం గ్రహాంతర వాసులేనా నా కోసం వెయిట్ చేస్తూ ఉండాలి కదా.. అదీ లేదు..   హొటల్ వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం, మొదటి అంతస్తు కి పోయి, లగేజీ తో సహా, తాళాల డబ్బా కోసం వెతికా. కనిపించింది, ఒకటి కాదు ఓ పదున్నాయి. నాకు వాళ్ళు చెప్పిన నంబరు ఏడు, మరియు దానికో కోడ్ ఉంది.. 7777*7#  ఇలాంటిదన్నమాట. స్టైలు గా కొట్టి, డబ్బా తెరిచానా.. గుండె గొంతులోకి వచ్చి పడింది. (నితిన్ నెక్స్ట్ సినిమా పేరు  కాదు. ) నా రూం కీ అందులో లేదు. డబ్బా ఖాళీగా వెక్కిరిస్తోంది. మూసి మళ్ళీ తెరిచాను.. (ఏదో PC సర్కార్ మ్యాజిక్ లా ఏమైనా ప్రత్యక్షం అవుతుందేమో అని సిన్న ఆశ) అదే పరిస్థితి. ఏంచెయ్యాలో పాలుపోలేదు. కాఫీ కూడాపోలేదు.. :) ఏ మాయదారి కలలోనో, అంటే ఏ రాం గోపాల్ వర్మ సినిమా చూసి పడుకున్న రోజో తప్ప, ఇలాంటి సంఘటనలు, ఇంత డ్రామా మన సగటు జీవితాలకి ఎక్కడ అలవాటు ఉంది. అదే మా చెన్నై లో అయితే, పక్కింట్లో తాళాలిచ్చి బయలు దేరుతాం... హొటల్ వాళ్ళు నా రూం నంబరు ముందే చెప్పారు.. ఆ రూం ఎక్కడ ఉందా అని చూసాను, రూం ఉంది, లాక్ చేసే ఉంది.. చిన్నప్పుడు లెక్కలు నేర్పిన మాస్టారిని గుర్తు తెచ్చుకుని, ఈ మధ్యే పరమపదించిన శకుంతల దేవి గారిని కూడా స్మరించుకుని.. ఏడవ నంబర్ బాక్స్ కి కోడ్ 7 తో ఉంటే, ఒకటో నంబరు బాక్స్ కి కోడ్ 1 తోనే కదా ఉండాలి అని రీలైజ్ అయ్యి.. ఆ డబ్బా కూడా ఓపెన్ చేసాను.. దాంట్లో వేరే ఏదో కీ ఉంది. వీడు వాడు కాకపోతే, వాడు వేరే ఎవరో అయ్యి ఉండాలి కదా.. మిగతా అన్ని డబ్బాలూ తెరిచి చూసాను, కొన్ని ఖాళీవి.. మరికొన్ని వాటిల్లో ఏవో తాళాలు ఉన్నాయి. కానీ దేంట్లోనూ నా రూం కీ మాత్రం ఉండి చావలేదు.

ఆ లగేజీలు మోసుకుని మళ్ళీ క్రిందకి వచ్చాను, ఎవరూ లేరు. చీకటి, నేను ఉన్న చోట మాత్రం లైట్స్ వెలుగుతున్నాయి, అది కూడా ఆటోమేటిక్ గా. వెనకాల నేపధ్య సంగీతం లేదని తప్ప, సీను ఏ సస్పెన్సె సినిమాకీ తక్కువగా లేదు. హొటల్ వాడి నంబరు ఉంది.. కానీ నాదగ్గర ఫ్రెంచ్ ఫోన్ లేదు.. బయట ఎవరినైనా అడుగుదామంటే ఎవరూ కనిపించడం లేదు. దానికి తోడు పొరపాటున ఎవడైనా ప్రత్యక్షం అయినా, ఈ ప్యారిస్ లో ఇంగ్లీష్ ఎవరూ మాట్లాడరు. అంతా ఫ్రెంచే. మరోవైపు చలి తాట తీస్తోంది. ఇలాంటి సమయల్లోనే నిజాన్ని కలగా చేసుకోడానికి ఓ తొక్కలో సదుపాయం ఉండాలంటాను నేను. ఏదైతే అయ్యిందని.. లగేజీ అక్కడే ఓ పక్కన పెట్టి, బయటకి వచ్చాను. కాస్త దూరం లో ఏదో రెస్టారెంట్ లాంటిది కనిపిస్తోంది. దాంట్లోకి చొరబడ్డాను, అక్కడ ఉన్న ఆవిడకి నా ఈమెయిలు ప్రింట్ ని చూపిస్తూ, మీ సహాయం కావాలి అని అడిగాను. గుడ్డిలో మెల్ల లా ఆ మెయిల్ లో మేటర్ ఇంగ్లీష్ లోనూ, ఫ్రెంచ్ లోనూ ఉంది. ఆవిడ ఆ పేపర్ చూసి, కీ బాక్స్ లో ఉంటుంది అంది, అమ్మా, ఆ బాక్స్ ఖాళీ గా ఉంది అని సైగలతో చెప్పడానికి ప్రయత్నించాను. కొంచం సఫలీ కృతుణ్ణి అయ్యాను, ఆవిడకి నా బాధ అర్థం అయ్యింది. నేను ఏంచెయ్యను అనే టైప్ లుక్ ఇచ్చింది, మీ ఫోను ఒకసారి వాడుకోవచ్చా అని అడిగాను.  నా వైపు కొంచం అనుమానంగా చూసి, ఆవిడే తన మొబైల్ నుంచి ఆ హొటల్ వాడికి ఫోన్ చేసింది. మొదట కలవలేదు, తరువాత దొరికింది, వాడితో మాట్లాడి మళ్ళీ అదే ముక్క. బాక్స్ లో కీ ఉంటుంది అని. బాక్సు ఉంది, కానీ దాంట్లో ప్యారిస్ లో పుట్టి పెరిగిన పిల్ల గాలి తప్ప, కీ కాదు కదా, కీ చైన్ కూడా లేదు అని మరోసారి బావురుమన్నాను. మళ్ళీ వాళ్ళిద్దరూ ఫ్రెంచ్ లో చర్చలు జరిపారు. కొంతసేపటికి ఫోన్ నాకు అందించింది ఆవిడ. ఇప్పుడు నేను ఫ్రెంచ్ లో అక్షరాబ్యాసం చెయ్యాలా అని నిర్ఘాంతపోయేలోపే, ఫోన్లో వాడు వాడికొచ్చిన నాలుగు ముక్కల ఇంగ్లీష్ లో మొదలుపెట్టాడు. ఏక్కడో పొరపాటు జరిగింది, మీకు వేరే రూం ఇస్తాను అన్నాడు. గుండె గొంతులోంచి ఓ రెండు అంగుళాలు క్రిందకి జరిగింది.. OK అన్నా, మీరు తెరిచిన ఏడో బాక్సు లాంటిదే అక్కడ మరో బాక్సు ఉంది, దానికి ఓ సీక్రెట్ కోడ్ ఉంది అని చెప్పడం మొదలుపెట్టేటప్పటికి. ఇంకేం చెప్పక్కేర్లేదు, ఆ డబ్బాలు అన్నీ నేను తెరిచి చూసినవే అనబోయి, నాలిక్కరుచుకుని, వాడు చెప్పిన సూచనలు మర్యాదగా విని ఫోన్ పెట్టేసాను. ఆ రెస్టారెంట్ ఆవిడకి ఎంత కృతజ్ఞతా పూర్వకం గా థ్యాంక్స్ చెప్పానంటే, మరి మాటల్లో చెప్పలేను. ఫోన్ కాల్ కి డబ్బులు ఇవ్వబోయాను, ఆవిడ వారించింది. మరోసారి ధన్యవాదాలు చెప్పుకుని బయటకొచ్చాను. జార్తగా హొటల్ కి వచ్చి, ముందుగా లగేజీ ఉందా లేదో చూసుకున్నా, అది సేఫ్. ఆ ఒకటో నంబరు బాక్సు ఓపెన్ చేసి,  అందులో ఉన్న తాళం చెవి తీసుకుని, నాలుగో అంతస్తు లో ఉన్న రూం కి వెళ్ళి కూల బడ్డాను. అదీ నా మొదటి రోజు ఎపిసోడ్ ప్యారిస్ లో. ఓ రెండ్రోజుల తర్వాత, నాకు ఇవ్వాల్సిన రూం ఇచ్చారనుకోండి.

Tuesday, April 23, 2013

ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు.. ;-)

ఏ లక్స్ సోపో, సైకిల్ అగరబత్తో, లేక ఏ చందనా బ్రదర్సో అనుకుంటే మీరు పిజ్జా మీద కాలేసినట్టే. కనీసం కింగ్ ఫిషర్ వాటర్ బ్యాటిల్సో, రాయల్ స్టాగ్ మ్యూజిక్ CD లో, లేక మెక్ డొవెల్ నంబర్ వన్ సోడా ఏమో అనుకున్నా మీది చారిత్రాత్మిక తప్పిదమే మరి. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అచ్చం గా మన అబ్కారీ శాఖ వారు సమర్పిస్తున్నారు. అంటే మన ఎవర్ గ్రోయింగ్ ఎక్సైజ్ డిపర్ట్మెంట్ వాళ్ళు అన్నమాట.

ఎన్నడూ లేనిది ఒక కార్యక్రమాన్ని వాళ్ళు స్పాన్సర్ చెయ్యడం ఏంటా అనే కదా మీ DTS డౌటూ. మరి ఆ షో విశిష్టత, విషయ సాంద్రత, విస్తృతి, వికారం అలాంటివి..

ఆ పోటీలేని మేటి ప్రోగ్రాం నుంచీ మీకు బ్రహ్మాండమైన విషయాల పట్ల ఒక లోతైన అవగాహన వస్తుంది. మచ్చుకు కొన్ని వదుల్తాను. (అన్నీ చెప్పే ఓపిక నాకున్నా, తీరిక మీకుండద్దూ)

ప్రముఖ కమేడియన్ M.S నారాయణ గారు, మందు ఎప్పుడు మొదలు పెట్టారు.. రోజుకు ఎంత తాగుతారు. తాగుడు వల్ల ఆయనకి వచ్చిన లాభాలు.. డబ్బు ఉంటే ఎలా తాగచ్చు.. డబ్బు లేకపోతే ఎలా మేనేజ్ చెయ్యాలి. మత్తులో మీరు ఎలాంటి ఘనమైన నిర్ణయాలు తీసుకుని జీవితం లో పైపైకి రావచ్చు..  ఇలాంటివి..

KCR గారి ఓపిక వెనుక అసలు రహస్యం ఏంటి, వాళ్ళింట్లో తాగుడుకి ఉన్న ప్రాధాన్యత, వైభవం ఎలాంటివి. తరతరాలుగా తాగుడు అనే ఒక గొప్ప అలవాటు ప్రజల జీవితాలతో ఎంతగా ముడిపడిపోయింది. రోజంతా శ్రమైక జీవనం గడిపే లీడర్స్ కి మద్యం ఎంత మంచి విశ్రాంతిని ఇస్తుంది.. మరుసటి రోజు మళ్ళీ ప్రజా సేవకే పునరంకితం అవ్వడానికి.. ఇవన్నీ..

మరియు.. నాగార్జున వారానికి ఎన్ని బీర్లు వేస్తాడు.. మంచింగ్ ఏంటి.. రాజీవ్ కనకాల పార్టీల సంగతి.. రాంగోపాల్ వర్మ హైదరాబాదు వస్తే ఎవరితో తాగుతాడు.. వగైరా.. వగైరా.. ఇవన్నీ ఫ్రీ మీకు.

ఇంతకీ ఇది ఏ కార్యక్రమం ?

యూ ట్యూబ్ లో కొన్ని ఎపిసోడ్స్ చూసే నేను ఇంత తెలుసుకున్నానంటే, డైరెక్ట్ గా టీవీ లో చూసే సౌభాగ్యం ఉన్న మీకెందుకు తెలీదూ.. బాగా గుర్తుకు తెచ్చుకోండి..

ఓపెన్ హార్ట్ అని కాకుండా, ఓపెన్ లివర్ అని పెడితే ఎలా ఉండేదంటారు ?

(కొన్ని ఎపిసోడ్లు బానే ఉన్నాయి, కానీ ఇలాంటి అక్కర్లేని విషయాలకి ప్రాముఖ్యత తగ్గిస్తే మంచిది అని నా అభిప్రాయం)

Sunday, April 21, 2013

ఫ్రెంచ్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


ప్యారిస్ లో ఉద్యోగం వెలగబెట్టాలంటే, వర్క్ పర్మిట్, వీసా లతో పాటూ అదేదో దిక్కుమాలిన కార్డ్ ఒకటి ఉండి తీరాలి. దాన్ని పొందడానికి పెద్ద తతంగమే ఉంది. ఇవన్నీ చూస్తుంటే, ఎందుకొచ్చిన బాధ ఇదంతా అని రోజుకోసారేనా అనిపిస్తోంది. ఆ రెసిడెంట్ కార్డ్ కి దరఖాస్తులో అతికించడానికి కొన్ని ఫొటోలు అవసరం, ఆ ఫొటో కి ఉండాల్సిన లక్షణాలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలీలేదు.

ఈ గొడవలన్నీ కొంచం ముందుగానే పసిగట్టి, నేను చెన్నై లోనే ఓ మాదిరి ఫొటో తీసుకునే బయలుదేరాను, ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ కంటే మా తమిళ ఫొటోగ్రాఫర్ తో అయితే మన అవసరం కొంచం సరిగ్గా చెప్పుకోవచ్చు కదా అని. ఆఫీసు ఉన్న IT పార్క్ లోనే ఒక ఫొటోగ్రాఫర్ ఉంటే, ఆయన్ని సంప్రదించి, బాబూ ఇదీ నాకు కావాల్సింది అని చెప్పబోతే, మీకెందుకు నేను తీస్తాను కదా, అని ఓ పదినిమషాల్లో నా చేతిలో కొన్ని ఫొటో లు పెట్టాడు. చూడ్డానికి నా ముఖం లానే ఉన్నాయి ఆ ఫొటోలు, అయినా ఫొటో లో మనం మరికాస్త అందం గా కూడా లేకపోతే ఎందుకు చెప్పండి డబ్బు తగలెయ్యడం. మనం ఉన్న పరిస్థితి వేరు కాబట్టి, అందం కన్నా సైజు, కొలతలు ముఖ్యం అని సరిబెట్టుకుని వాటినే  వీసా వగైరా కార్యక్రమాలకి వాడాను. ప్యారిస్ వచ్చాక ఈ కార్డ్ విషయమై అదే ఫొటో ని మా అఫీసు వాళ్ళకి పంపితే, అది నిబంధనలకు తగినట్టు లేదు అని తేల్చేసారు. అదేంటయ్యా, మరి అదే ఫొటో ఫ్రెంచ్ కాన్సులేట్ వాళ్ళకి సరిపోయిందిగా మా పుదుచ్చేరి లో అంటే, ఆ ఊసు మాకెందుకు, ఇది మాత్రం చెల్లదు అన్నారు. ఎందుకు అని నిలదీస్తే, మొహం కొలతలు సరిగ్గా లేవు అన్నారు. నా మొహమే అంతేమో అని తీవ్రంగా ఆలోచించి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను..

ప్రతీ డిప్రెషన్ ఏదో ఒక చోట ఆగాల్సిందే, అది దాని హక్కు. సో తేరుకుని, గూగుల్ ని ఆశ్రయిస్తే తేలిందేమిటంటే, ఈ ఫొటోల కి ఒక ISO స్టాండర్డ్ ఉండి ఏడ్చింది. (ISO/IEC 19794-5 2005) మొహం ఫొటోలో ఇంత భాగం ఉండాలి, మొత్తం ఫొటో సైజ్ ఇంతే ఉండాలి.. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ ఇలా ఉండకూడదు.. అలా ఉండకూడదు.. జుట్టు కళ్ళ మీద పడకూడదు.. మీరు నవ్వ కూడదు.. ఏడ్వకూడదు.. ఏడ్చినా కన్నీళ్ళు కనిపించకూడదు.. పళ్ళు ఉండచ్చు.. కానీ కనిపించడానికి వీల్లేదు. మీ బుస్కోటుకి బొత్తాయిలు ఆరే ఉండాలి.. మీ బెల్టు పొడవులోంచి షూ లేసుల పొడవుని తీసేస్తే మీ ముక్కు పొడవుకి సరిగ్గా సరిపోవాలి.. మరియు మీ బొంద.. మీ పిండాకుడు. (ఇంకా నయమే కనుబొమ్మల్లో ఇన్నే వెంట్రుకులుండాలి అనలేదు, లెక్కెట్టలేక చచ్చేవాణ్ణి. ) ఇవన్నీ చూసి నాకు ఫొటో అనే విషయం మీదే ఒక విరక్తి వచ్చేసింది. కానీ ఏంచేస్తాం... మరో మార్గం లేదే. సో ప్యారిస్ లో ఈ నూటా తొంభై నిబంధనలూ పాటిస్తూ ఫొటో తీసే సిద్దహస్తుడు ఎవరైనా ఉన్నాడా అని మళ్ళీ ఇంటర్నెట్ లోనే వెతికాను. వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ ని ఆంగ్లం లోకి తర్జుమా చేసుకుంటూ చూస్తే, తెలిసిందేంటంటే, ఒక తలమాసిన స్టూడియో ఉందని. ఫలానా ఫలానా మెట్రో స్తేషన్ల మధ్య వాళ్ళ అడ్రస్సు అని. ఆ వివరాలన్నీ ప్రింట్ చెసుకుని (ముప్ఫైలు దాటాక మనం మన మెమొరీ మీద ఆట్టే ఆధారపడ్డం విజ్ఞత అనిపించుకోదు.. :-) ) శనివారం నా స్వయంపాకం అయ్యాక తీరిగ్గా బయలుదేరి వెళ్ళాను.

ఆ స్టూడియో ఏదో ఈ ఫొటోలకి ప్రసిద్ధి లా ఉంది, వచ్చిన  వాళ్ళ్లందరూ ఈ కేసులే. నేను నాకు కావాల్సిన ఫార్మాట్ వివరాలు కూడా  పట్టుకెళ్ళా, అవి చూపించబోతే, అక్కడ ఉన్న ఆవిడ, ఫ్రెంచ్ ఫార్మాటే కదా.. మాకు తెలుసు అంది. ఊపిరి పీల్చుకున్నానా, ఈ లోగా మరో ట్విస్టు, మీ కళ్ళజోడు తీసేయండి అంది. అమ్మా, మావోయిస్టులకి గన్నులా ఇవి నా శరీరం లో అంతర్భాగం, వాటిని ఎలా తీస్తాను అని ఒక వెర్రి ప్రశ్న సంధించాను. ఆవిడ చాల వీజీగా, ఫ్రెంచ్ వాళ్ళు కళ్ళద్దాలు ఉంటే ఒప్పుకోవడం లేదు, నాకు తెలుసు, తీసెయ్ అని ఒక ఆర్డరు వేసింది. ఏదైన తీసేవాడికి తీయించుకునేవాడు లోకువ కదా, అయితే ఓ.కే అని అరచి.. ఫొటో కార్యక్రమాన్ని ముగించాను. ఓ పదినిమషాలు ఆ సందులోనూ, ఈ సందులోనూ పచార్లు చేసి, ఇంత ఎండ ఉన్నా ఈ చలేమిటబ్బా అని ఆక్రోశించి, ఫొటోలు కల్లక్ట్ చేసుకున్నాను. ఫొటోలు బానే ఉన్నాయి, అసలే సులోచనాలు లేవు కదా, ఇంకాస్త ఇంపుగా ఉన్నాయి. నేను నా కళ్ళజోడుని ఓ సారి మళ్ళీ బాగా తుడిచి పెట్టుకుని ఫొటోలు చూసుకుని, అవి ఫార్మాట్ ఉన్నాయో లేదో తెలీకపోయినా, ఉన్నట్టే ఫీల్ అయ్యి, వెనక్కి బయలుదేరాను.

అదీ ప్రస్తుతానికి నా వీకెండ్ ప్రోగ్రెస్. వచ్చేవారమో ఎప్పుడో, ఫ్రెంచ్ ప్రభుత్వ ఆఫీసుకుపోయి ఈ ఫారాలు ఇచ్చి రావాలి.. అదేదో తిరుపతి వెంకన్న వద్ద లైనులా ఉంటుంది అని టాకు., ఏ తెల్లవారుజామునో కాలకృత్యాలు తీర్చుకుని, తలమీంచి స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని బయలుదేరాలేమో.. లేదా మరీ ముందు రోజు రాత్రే వెళ్ళమంటారో. మన ఖర్మ ఇలా కాల్తుంటే, కిరణ్ కుమర్ రెడ్డి మాత్రం ఏంచేస్తాడు..


ఓదార్పు కావాలి రా స్వామీ అంటే, ఓ టెంకి జెల్ల ఇచ్చుకున్నాడనీ.. ఈ బాధలన్ని మా ఆవిడకి చెప్పుకుంటే, దానికేముంది, వెనక్కి వచ్చేయి అని సలహా పడేసింది. మరి ఇంటి లోను మాటో ?  ;-)

Thursday, April 18, 2013

ప్యారిస్ లో శరవణా భవన్ :-)

చెన్నై నేలపై ఓ నాలుగు అడుగులు నడిచిన ఎవరికైనా శరవణా భవన్ తెలిసే తీరాలని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకున్న బ్రాంచ్ లు అన్ని మరి. ఈస్టు వెస్టు అని తేడా లేకుండా, చెన్నై లో నాలుగు వైపులా మనకి శరవణా భవన్లు దర్శనమిస్తాయి. ఇవి కాక ఆఫీసుల్లోనూ, IT పార్కుల్లోనూ వాళ్ళు నిర్వహించే కాంటీన్లు మరికొన్ని. బ్యాచలర్ గా చెన్నై వచ్చిన కొత్తలో నేను అశోక్ నగర్ దగ్గర్లో ఉండేవాణ్ణి, నా ప్రియమిత్రుడు అప్పటికే అక్కడ ఓ రూం లో ఉండడం వల్ల, నేనూ తనకి అతిధి గా వెళ్ళి, రూం మేట్ గా సెట్ అయ్యాను. వైజాగ్ నుంచి కోరమండల్ దిగిన రోజే, మా ఫ్రెండ్ నన్ను రాత్రి కాశీ థియేటర్ పక్కనే ఉన్న శరవణా భవన్ కి తీసుకువెళ్ళడం వల్లనేమో, నాకు ఆ రోజు నుంచీ శరవణా భవన్ తో ఒక అనుబంధం, ఆపేక్ష మరి. బ్రహ్మచారి గా రోడ్ల మీద తిన్న ఏడాదీ దాదాపుగా, ఉదయమూ రాత్రి నేను శరవణా భవన్ నే నమ్ముకున్నాను. నాకూ, నా స్నేహితుడికీ బాగా నచ్చే ఐటం, సాంబార్ వడ. :-) (మన పిజ్జాల భాషలో చెప్పాలంటే, విత్ ఉల్లిపాయ టాపింగ్)

పెళ్ళి చేసుకుని, చెన్నపురిలోనే ఓ మాదిరిగా సెటిల్ అయిపోయాక కూడా, నాకు శరవణా భవన్ ఎప్పుడూ మొదటి చాయిస్. ఏ పుట్టిన రోజు పార్టీకో, లేక ఏ NRI గారినో బయటకి తీసుకువెళ్ళాలనుకున్నా నేను మొదట దగ్గర్లో శరవణా భవన్ ఎక్కడుందా అని చూస్తాను. మా ఇంటికి దగ్గర్లో మైలాపూర్ లో పెద్ద బ్రాంచ్ ఉంది, మేము దాన్ని అలా ప్రొత్సహిస్తూనే ఉంటాం. ఒక వారం మా మామగారు మాకు పార్టీ అంటే, వచ్చే వారం మేము వాళ్ళకి ఇస్తుంటాం. ;-) ఏంటా అంత గొప్ప, అని మీరు కనుబొమ్మలు ఎగరెయ్యక్కర్లేదు.. చెప్తాను ఉండండి మరి. పోస్ట్ రాయడం అంటూ మొదలు పెట్టాక ఆ మాత్రం వివరాలు ఇవ్వకుండా ఉంటానా.. అన్నింటి కన్నా ప్రధమంగా పదార్థాలు బహు బాగుంటాయి. మన సౌత్ స్పెషాలిటీస్ అయితే మీరు ఇంక చూసుకోనక్కర్లేదు.. దోశల్లో రకరకాలు మరి ఇంక మీ/మీ జేబు ఓపిక. మన ప్లేట్ నుంచి పక్కనున్న గోడ దాటి అటువైపు మరో ప్లేటు లోకి తొంగి చూసేటంత పొడవైన దోశలు కూడా మిమ్మల్ని పలకరిస్తాయి. వాడు మెనూ లో పెట్టి వడ్డించిన ఐటం ఏదీ చెత్తలా ఉంది అని ఇంతవరకూ ఎప్పుడూ అనిపించలేదు. (గుజరాతీ వంటకాల మాట నేను ఎత్తను) నూడుల్స్, మంచూరియా లు కూడా ఎంచక్కా మన రుచుల్లోకి ఎదురొచ్చి, పాపం మనల్ని ఆట్టె ఇబ్బంది పెట్టవు. అవును, చైనీస్ అన్నామని నిజమైన చైనా భోజనం పెడితే చావమూ.. అక్కడ వైటర్స్ కి మంచి జీతాలు, PF లు వగైరాలు ఇస్తారని టాకు. ఆ కారణం వల్లో, మరి టిప్పుల మహత్యమో, వాళ్ళు ఎప్పుడూ ప్రసన్న వదనంతో మనకి కావాల్సినవి తెచ్చి వడ్డిస్తుంటారు. వాళ్ళ పై పర్యవేక్షణ కూడా మరీ ఎక్కువ, వజ్రాలు కోసే చోట కూడా అంత ఉండదేమో.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం.. దాని నేపథ్య సంగీతం ఎందుకంటే.. వచ్చేస్తున్నా.. వచ్చేస్తున్నా..

మీకు గత టపా లో విన్నవించుకున్నట్టు, ప్రస్తుతానికి ప్యారిస్ లో ఉన్నాను. మన జనాలు ఎక్కువగా ఉండే చోటుకి ప్రతీ వారంతం వెళ్ళి రావడం ఒక ఆనవాయితీ. ఆ పనిలో మొన్నోసారి పర్యటన చేస్తుంటే, శరవణా భవన్ కనిపించింది. మరి ఇంకో క్షణం ఆలోచించకుండా లోపలికి చొరబడ్డాను. "వాంగ.. వాంగ.. ఉక్కారంగా" అని వెల్కం. వెంట్రుకలు నిక్కబొడుచుకోలేదు కానీ, అంతపనీ అయ్యింది. హోటల్ ఖాళీ గా ఉంది, మధ్యలో వైను బ్యాటిల్స్ (ప్యారిస్ కదా మరి, మంచి నీళ్ళు లేకుండా అయీనా షాపు నడపచ్చేమో.. కానీ.. ) ఠీవిగా ఒక మసాల దోశ ఆరగించి, రూపాయల్లో చూస్తే కాస్త భారీగానే సమర్పించుకుని బయటపడ్డాను. దోశ బానే ఉంది, మన చెన్నై రుచి లేకపోయినా, పర్వాలేదు. (సింగపూర్, మలేసియాల్లోనూ నాకు అలానే అనిపించింది) హొటలే అంత ఖాళీ గా ఉంది అని కొంచం హర్ట్ అయ్యా, అంటే నేను వెళ్ళింది కూడా వేళ కాని వేళ లెండి. అయినా,  నేను ఎక్కడికి వెళ్ళినా, అక్కడో శరవణా భవన్ కనిపించడం ఏంటి చెప్పండి.. ఇదేదో జన్మ జన్మల సంబంధమే అని నేను కీబోర్డు నొక్కి వక్కణిస్తున్నాను. ప్యారిస్ లో కూడ దోశలు అమ్ముతున్నప్పుడు, మా విశాఖపట్నం లో ఎందుకు బ్రాంచ్ పెట్టలేదని నేను యాజమన్యాన్ని ప్రశ్నిస్తున్నాను. (ఆంధ్రాలో ఎటు చూసినా, వైన్ షాపులు, నాన్-వెజ్ పార్సిల్స్., అందుకే న్యూస్ చానల్స్ పెరిగిపోతున్నట్టున్నాయి రోజు రోజుకీ)

నిన్నటికి నిన్న మళ్ళీ అదే రోడ్డు లో వెళ్ళినప్పుడు, ఉందా, జనాలు లేక ఎత్తేసారా అని ఓ లుక్ వేసాను, కొంచం భయం గానే. మీరు నమ్మరు, హోటల్ తెరిచి ఉండటమే కాదు, లోపలికి వెళ్ళడానికి క్యూ ఉంది.. కుదుట పడ్డాను, శరవణా భవనా మజాకా.. (ఫొటో కూడా తీసాను చూడండి)

మరో మాట, ఈ పక్క రాష్ట్రాలనుంచి వచ్చిన వాళ్ళకీ, దేశాలు పట్టి పోయిన వాళ్ళకీ, ఈ పేర్లు గుర్తుండి చావవు. వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు, శరవణన్ భవన్ అనీ,.. లేక శరవణా స్టోర్స్ అనీ అంటుంటారు. మనసు చివుక్కుమంటుంది. ఇంకా నయమే శర్వానంద్ భవన్ అనలేదు అని సర్ది చెప్పుకుంటాను. వాళ్ళందరికీ ఇదే మనవి. పేరు బాగా గుర్తు పెట్టుకోండి మరి. ఏ ఆటో వాడికో ఇలా చెప్పేరనుకోండి, ఆవడి కవతలెక్కడో వదిలి వస్తాడు, సరిపోతుంది. 

(అవునూ ఇన్నీ రాసి మరో ముఖ్య విషయం మరచిపోయాను, మొన్నెప్పుడో మన విదేశాంగ శాఖవాళ్ళు శరవణా భవన్ వాళ్ళని సంప్రదించారట. బాబూ శ్రీలంకలో తమిళుల కోసం ఓ నాలుగు హొటెళ్ళు తెరవండి, పరిస్థితులు కొంచం మెరుగు అవుతాయేమో అని.. మా వాళ్ళు తెలివైన వాళ్ళు, అబ్బే మాకు ఆ సరదా/దురదా లేదు అని తేల్చేసారంట. లంక అని పేరుంటే, మన గోదారి జిల్లాల మీద కూడా దండెత్తే మూడ్ లో ఉన్నారు ఇప్పుడు తమిళనాడు జనం, ఈ టైం లో శరవణా భవన్ కి అంతటి రిస్క్ ఎందుకు చెప్పండి.. దోశ పెనం మీద పడ్డా, పెనం దోశ మీద పడ్డా కాలేది దోశే కదా.. ;-) )

Wednesday, April 17, 2013

నాలో నేను (ప్యారిస్ లో :-) )


ఆఫీసు పని నిమిత్తమై పారిస్ వచ్చాను. సో ప్రస్తుతానికి మరికొన్ని నెలలు, నాతో నేనే. బహుశా బ్లాగు కూడా కొంచం ఎక్కువగా అప్డేట్ చేస్తానేమో. మొదట కొన్ని రోజులు భయంకరంగా ఉన్నా, మెల్లగా ఒక్కణ్ణే ఉండటానికి అలవాటు పడుతున్నాను. ఎంతంటే "ప్రేమ కంటే మనిషికి కావాల్సింది ఏకాంతం" అనే అంత. జీవితం అనే పరుగులో, మనం అనే అస్థిత్వం పోగొట్టుకోడానికి ఎంతో సేపు పట్టదు, అందుకే అప్పుడప్పుడు ఏకాంతం కూడా అవసరమే. మనల్ని మనం గుర్తు చేసుకోడానికి. మనకి కావాల్సిన వారందరూ ఎల్ల వేళలా మనతోనే ఉండాలి అని అనుకోవడం కూడా స్వార్థమే. ఎవరి బాట వారిది. మనతో లేనంత మాత్రాన దూరమూ అవ్వరు. (మనస్పూర్తిగా చెప్తున్నాను ఈ మాట)

యూ ట్యూబ్ లో మంచి సినిమాలు చూస్తున్నా, మొగలిరేకుల ప్రోగ్రెస్ మా ఆవిడ చెప్తోంది. (మూణ్ణెల్లకోసారి సరిపోతుందేమో ? )

మన వాతావరణం కాదు.. మన పద్దతులు లేవు.. మనల్ని మనం వెతుక్కోడానికి ఇంతకంటే అనువు మరేది ?

జీవితం అంటే అందని గమ్యం అనుకున్నాను..
జీవితం అంటే తరగని పరుగు అనుకున్నాను..
కానీ జీవితం అంటే వేసే ఒక అడుగు..
తెలుసుకున్నాను.. కటిక చీకట్లో.

Sunday, March 3, 2013

మహా నిర్-మాన సేన!!మొన్నెప్పుడో ఒక వింత వార్త గురించి చదివి నవ్వు ఆగలేదు. మీతో ఆ వివరాన్ని పంచుకోవాలని మొదలు పెట్టా..

రాజకీయాల్లో బందులు, సమ్మెలు షరా మామోలే. ఆసుపత్రిలో సూదులు, మందులు లా.. అప్పుడప్పుడు ఏ ప్రభుత్వ విధానాన్నో, లేక మరేదో అలసత్వాన్నో ఎండగడుతూ... వాళ్ళ భావాలని ఎలుగెత్తి చాటడం ప్రతిపక్షాల జన్మ హక్కు. మనం కూడా అలాంటి సందర్భాల్లో వాళ్ళ గుండెల్లోని బాధని అర్థం చేసుకుని సహకరిస్తూ ఉంటాం. ఫర్ సప్పోజ్, ఏ రౌడీ మూకో షాపు మీద దండెత్తితే, మూసుకోక మరేం చెయ్యగలం. బస్సులు తిరగవు అంటే, సుష్టుగా భోజనం చేసి ఇంట్లో రెస్టు తీసుకుంటాం. రోడ్డు మీద తిరిగితే బళ్ళు కాల్చేస్తాం అని చెప్పాక కూడా, అప్పటికే మండుతున్న పెట్రోల్ ని బండిలో నింపుకుని బయట తిరిగడానికి మనం ఏమైనా స్వాతిముత్యాలమా.. స్వయం కృషి గాళ్ళం. మరీ అవసరం అయితే పాత చొక్కా వేసుకుని, పర్సుని ప్యాంటు సీక్రెట్ పాకెట్ లో దోపేసుకుని ఆటో లో స్టైలు గా వెళ్ళిపోతాం.

ఇదంతా మామోలే కదా, ఈ ఓల్డ్ గోల్డ్ విషయాలు పనిగట్టుకుని ఆదివారం పూటా చెప్పడమెందుకు అని అంటారనే, అసలు విషయం లోకి వచ్చేస్తున్నాను. మొన్నెప్పుడో మన రాజ్ థాక్రే నిర్మాణ సేన కి ఇలాంటి కష్టమే వచ్చి పడింది. వాళ్ళ నిరసన గట్టిగా చూపించాలి.. కాని ఎవడూ దొరకడం లేదు, కనీసం ఒక బండో, బస్సో, కాలుద్దామంటే ఏదీ అగుపించడం లేదు. మరీ సైకిల్ గాలి తీయడమో, ఆటో అద్దాలు పగలగొట్టడమో చీప్ గా ఉంటుంది. అన్నయ్య హర్ట్ అయ్యే ప్రమాదముంది..ఆ బాధని తెలియచెయ్యడానికి మరో బందు అంటే చస్తాం.. రోజు నడిచిపోతోంది, ఎక్కడా నిరసన జ్వాలల సెగ తగలడం లేదు, కానీసం ఓ మారుమూల హిందీ చానల్లో కూడా ఏమీ కవరేజ్ లేదు. సాయంత్రం అయిపోతే, స్టేటస్ కాల్ లో అన్నయ్యకి ఎలా గొంతు వినిపించడం.. ఎన్ని తగలెట్టార్రా అంటే, ఏమీ లేదని ఎలా చెప్పడం. పగవాడికి కూడా రాని కష్టం కదా మరి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే మనం కిడ్నీ, వీలైతే లివర్ కూడా కుదిపి ఆలోచించాలి. మన నిర్- మాన సేన వాళ్ళు అదే చేసారు, జేబుల్లో ఉన్న కాస్తో కూస్తో పోగు చేసారు, పక్క వాడి జేబులూ ఖాళీ చేసారేమో తెలీదు మరి. ఓ ముప్ఫై వేలు కుదిరాక, గుట్టుగా రొడ్డు సైడు పాత కార్ల దుకాణం కి పోయారు, అప్పుడే బతికి బట్ట కట్టిన ఓ మోస్తరు మారుతీ కారుని కొన్నారు.. మెయిన్ రోడ్డు మీదకు తోసుకువచ్చారో, తోలుకొచ్చారో మనకు అప్రస్తుతం. మిగతా పావలా అర్థా తో పెట్రోల్ కొని, కారుని ఆర్భాటం గా కాల్చేసారు. బోలుడంత కవరేజీ, మైలేజీ. కనీసం జిల్లా ఎడిషన్ లో వార్త ఖాయం చేసుకున్నారు. (మా జయమ్మ లా, అన్నయ్యే ఏ వీడియో కాంఫరెన్సు ద్వారానో ముట్టించాడేమో కూడా) కొన్న కారుకి ఇన్సూరెన్సు లాంచానాలు కూడా పూర్తి చేసి, వెనక జేబులేమైనా నింపుకున్నారేమో తెలుసుకోవాలి.

పద్ధతి వింతగా ఉన్నా, తాత్పర్యం బావుంది. అవును, మన కడుపు మండితే, మరెవడి కారో ఎందుకు మండాలి.. లేక అసలే దిక్కు లేని ఏ RTC బస్సో ఎందుకు కాలాలి. మీరూ ఆలోచించండి, నిరసన చేద్దామనుకున్న వారు, నాజూగ్గా, ఏ డిపో కో పోయి, అయ్యా మాకు కాలం చెల్లిన ఒక బస్సుని పడేయండి కాల్చి పోతాం, పెట్రోల్ ఖర్చులు మావే అని బావురమంటే, మనం ఏమైనా కాదంటామ. ఓహో, అలాగే కానీయండి అని, క్రీస్తు పూర్వం నుంచి సేవలందించి, ఈ మధ్యే అస్త్ర సన్యాసం చేసిన ఓ నాలుగు చక్రాల వాహనాన్ని వాళ్ళ మొహన పడేస్తాం. వాళ్ళిచ్చిన కాస్తో, కూస్తో, కార్మికుల ఖాతాలో వేసేస్తాం. ఇలాంటి కార్య క్రమాలకు ప్రభుత్వం తన వంతు సహకారం అందించాలని మనం ఇప్పుడు విన్నవించుకోవాలి. (కిసాన్ కాల్ సెంటర్ లాంటి అదిరిపడే టీవీ ప్రకటనలు చేయిస్తే ఇంకా మంచిది) నేను కూడా నా పాత పల్సర్ ని రెడీ గా పెడతాను, ఈ సారి ఎప్పుడైనా కుష్బూ నోరు తెరిచిందా, నా పల్సర్ కి మోక్షం లభించి తీరాల్సిందే. (ఆ డబ్బు తో నా కొత్త ఆక్టివా కి కానీసం సీటు కవరు కొనుక్కోనూ... )

మీరూ ఈ మాట మనసులో పెట్టుకోండి, మన రాష్ట్రం లో బందులుకీ, రాబందులుకీ ఏం కొదవ ?

Saturday, February 2, 2013

ఎగిరే రెక్కలే ఉంటే..


నాకు ఎంతగానో నచ్చే ఈ కవిత ని నా మాటల్లో రాసే ప్రయత్నం చేసాను.

Would that I had wings to fly to you...
Expecting nothing more than the gift of seeing you go about your day,
carrying out your ordinary routine, while I remain unseen....
watching over you,as would an angel of tender compassion.
When night falls, still I would remain, and across your lips,
place the hint of a featherlight kiss to erase your worries....
replacing them with undisturbed peace.


Wishing that somewhere in the realm of dreams and imagination,
you might find a place where both spirit and the physical are allowed to meet,
if only once in a lifetime.... Where you could simply hold me...
and I, of course, would feel it.


ఎగిరే రెక్కలే ఉండి ఉంటే.. నీ దరికి చేరేందుకు..
కేవలం నిన్ను చూడాలని.. అదే వరంగా కోరుకుని,
నీ రోజులో నువ్వు సాగిపోతుంటే,నీ అడుగడుగులో నేను..
నీకు కనిపించకుండా.. కానీ నీతోనే అనుక్షణం.
వీక్షిస్తూ.. వెంబడిస్తూ.. నీ అణువణువునీ..
ఏ అలసిన సాయంత్రమో, కాలం జ్ఞాపకాల్లో సేదతీరుతుంటే..
చీకటింట.. ఇంకా నేను నీ వద్దే..ప్రక్కనే..
నీ పెదవులపై మృదువైన సంతకం ఉంచి.. నీ బాధలన్ని మటుమాయం చేసి..
ఇకపై చెదరని ప్రశాంతతని నీ మనసంతా నింపి..

ఎక్కడో.. ఏ కలల విలాసంలోనో.. వినీలాల కవతల..
స్వప్నం సత్యం అయ్యే చోట.. మనిద్దరం కలిసే చోట..
బహుశా ఒకే ఒక్కసారి ఈ జీవితానికి; చాలాదూ... ?
ఎక్కడైతే నువ్వు నాకు తోడుగా ఉంటావో.. నా చేతిని గట్టిగా పట్టుకుని..
మరి నేను.. ఆ స్పర్శలో తనివితీరా కరిగిపోతూ..

Thursday, January 24, 2013

వారం అంటే 7 రోజులు కాదు.. నెల అంటే 150 యేళ్ళు


కళ్ళు కాదు నా మనో నేత్రం తెరుచుకుని ఇప్పుడు ప్రపంచాన్ని మరింత అర్థ వంతం గా చూడగల్గుతున్నాను. బుద్ధుడికి అదేదో చెట్టుక్రిందా, గాలికి సెంట్రల్ జైలు లోనూ జరిగిన జ్ఞానోదయం అనే ప్రక్రియ నాకు నిన్నటికి నిన్న (అంటే నిన్నే), ఆజాదు గారి స్టేట్మెంట్ వల్ల జరిగింది. ఆఫీసులో పని లేకా/పని ఉన్న చోట ఆఫీసు లేకా, గూగుల్ న్యూస్ లో న్యూ న్యూస్ లేకా, నా మానాన ఏదో తెలుగు సామెతలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న శుభతరుణంలోఈ సంఘటన సంభవించింది. ఇప్పుడు నలుపు నల్లగా ఉండదని, తెలుపంటే అసలు రంగే కాదని.. తెలుసుకున్నాను. ఇదో కొత్త అధ్యాత్మిక ఉద్యమం అనిపిస్తోంది నాకు..  లోకానికి కల్యాణం చెయ్యడానికి. (ఎక్కడైన ఫ్రీ ఫ్రీ గా ల్యాండ్ ఇస్తారంటే, ఓ ఒంటిస్థంభం మేడ కట్టేద్దాం, గాల్లో)

ఈ జ్ఞానోదయం ఏదైతే ఉందో, అది జరిగాక నాకు కళ్ళుమూసుకున్నా అంతా కనిపించేస్తోంది, నేను తెలుసుకున్న కొన్ని జ్ఞాన గుళికలు మచ్చుకు మీతో పంచేసుకుంటాను..

1. కాంగీ పార్టీ అంటే అసలు పార్టీ కాదు.. అది పీ. సీ సర్కార్ తాతకి ముత్తాత.. ఆ మాజిక్కుల కంఫ్యూజన్ లో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడేస్తారో పూరీ జగన్నాధ్ కి కూడా తెలీదు.

2. సమస్య అంటే, సమస్యే కాదు అసలు. మరి అలాంటప్పుడు దాని మీద నిర్ణయం అంటే ఎవడికి తెలుస్తుంది.. నిర్ణయమే సమస్య అయినప్పుడు.. "సమస్యే" పరిష్కారం అయిపోతుంది. (అర్థం కాకపోతే ఖలేజా సినిమా మళ్ళీచూడండి, అన్నీ అర్థం అవ్వకర్లేదు అని అర్థం అవుతుంది)

3. ఈ కాలం అని ఏదైతే ఉందో, అది రాజకీయాలకు అసలు వర్తించదు. ఒక రోజు అంటే అయిదేళ్ళు అని అర్థం. మిగతా లెక్కలు మీరు వేసుకోండి.

4. అధికారం ఒక విషం, విస్కీ బ్రాందీ లాగ అన్నమాట.. అందుకని దాన్ని బాయట ఎక్కడ తిరగనివ్వకూడదు.. నాయకులే బాగా ఎక్కించుకుని, దాచేయాలి.

5. మంత్రులు అంటే మంత్రులు కానే కాదు.. అదొక రకమైన తంత్ర విద్య, ఎవరికో గానీ వంటబట్టదు.

6. ఢిల్లీ అంటే సిల్లీ గల్లీ అని అర్థం. జంతర్‌మంతర్ పక్క సందులో ఉంటుంది అది, పిన్ కోడ్ కావాలంటే నోట్ చేసుకోండి.. - 420420

36. చివరిగా, ప్రభుత్వమంటే పాలనకు అనుకునేరు.. పక్షపాతానికి.. పక్షవాతానికి మధ్య జాయింటు వెంచరు అది.
(ఆరు తరువాత ముప్ఫై ఆరు ఎలా వచ్చింది అని మీరు ఆలోచిస్తున్నారంటే, మీకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు అని అర్థం. అజాదు గారిని సంప్రదించగలరు.. )

మరో మాట, ఈ విజ్ఞాన వికాసానికి మీరు నాకు థాంక్స్ లు వగైరాలు చెప్పక్కర్లేదు, మన ఒంటిస్థంభం మేడ ప్రక్కన మంచి స్థలాలు అమ్ముతున్నాం, కొనుక్కుని తరించండి.


Tuesday, January 22, 2013

చౌతాలా కాలం.. (కలికాలం)

మన రాష్ట్రానికి (ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అనే చదువుకోండి ;-)) సంబంధించినంతవరకూ, జాతీయ నాయకుడి అవతారం లో అడపదడపా దర్శనమిచ్చే చౌతాలా గారికి పదేళ్ళ జైలు శిక్ష పడింది అని తెలుసుకుని షాకయ్యి, తేరుకుని రాయడం మొదలు పెట్టాను..

రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టడమే గొప్ప, ఆ కేసు చివరి వరకూ పోయి (అంతవరకూ సాక్ష్యులు క్షేమంగా ఉండి), ఇలా శిక్షలు ఖరారవ్వడం, ఏమిటో.. కలి కాలం కాకపోతే మరేమిటి. ఆయన గారు UPA భాగస్వామి అయ్యి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో తెలీదు మరి. ఇలాంటి సంఘటనలు  చూస్తుంటేనే ఇంకా మనదేశం లో న్యాయం ఏ మూలైనా బ్రతికి బట్ట కట్టిందా అని అనుమానం మొదలవుతుంది నాకు. బహుశా ఈ కేసు మరీ కళ్ళు - పిల్లి - పాలు కేసు అయ్యి ఉంటుంది. అయినా న్యాయ వ్యవస్థని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే, నాకు తెలిసి ఈ నాయకుల కేసులు తేలే  సరికి వాళ్ళు ఇంకా పై పై న్యాయస్థానాల్లో రిపోర్ట్ అయిపోతారు, చిత్ర గుప్తుడి ముందు. సో ఇక్కడ మనం వేసే శిక్షలు చూసి వాళ్ళ జగమంత కుటుంబాలు నవ్వుకుంటూ ఉంటాయి. ఇలా భూమ్మీదే శిక్షలు వేసే పరిస్థితి రావడం ఎంతైనా ముదావహం.

జగన్ మా పార్టీలోనే ఉంటే ఈ పాటికి CM అయ్యేవాడు అని ఆ మధ్య ఆజాదు గారు నోరు జారారు.. మాయవతి, ములాయం తరపున న్యాయవాదులే UPA లో భాగస్వాములని అని టాక్ ఉండనే ఉంది. ప్రజా ప్రతినిధులు, నోటికొచ్చింది అంతా వాగినా, చేతికొచ్చిందంతా మింగినా, చట్టం తన పని తాను  చేసుకుంటూ పోతుంది అని హాయిగా సెలవివ్వచ్చు. రైలుంది, పట్టాలున్నయి, రైలు దానికదే కదిలిపోతుంది అంటే మనం ముక్కున ఏం వెసుకుని ఆశ్చర్యపోవాలి ? నేరం జరిగిన క్షణం నుంచి, తీర్పు వరకూ అడుగడుగునా అవినీతిమరిగిన ఈ వ్యవస్థలో, దొరికిన వాడు ఉత్తమమైన దొంగ అని మురిసిపోవాలి  మనం. కొన్ని ప్రత్యేకమైన కేసుల్ని త్వరితం గా ముగించడానికి ఏర్పాటు చేసే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, రాజకీయాల్లో ఉన్న నేరస్థుల కోసం కూడా వేస్తే బావుణ్ణు. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పీడ వేగంగా విరగడ అవుతుంది.. కొత్తగా వచ్చేవాడు ఇంకాస్త భయపడతాడు.

ఇంకా సూపర్ అవిడియా ఇంకోటుంది,  నాయకుల నేరాల విచారణను ఏ సౌదీ కో అవుట్ సోర్స్ చేసామనుకోండి, అదిరిపోతుంది.

Tuesday, January 15, 2013

సీతమ్మ వాకిట్లో వేరు లేని చెట్టు..


అసలే సంక్రాంతి, దానికి తోడు తెలుగు లో రాక రాక వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం, వదులుకోలేం కదా.. ప్రోత్సహించాం, కొంచం లో బడ్జెట్లో. (చెన్నై కాసినో లో అని చదువుకోగలరు)

అన్ని నీతి శతకాల్లోనూ చెప్పినట్టు, హడావిడి మరీ ఎక్కువ అయితే "అసలు" మరి నల్లపూసే అయిపోతుంది. దిల్ రాజు గారి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సరిగ్గా అలానే ఉంది. బావులేదని చెప్పలేను, అలా అని గొప్పగా ఉందని అనడానికి మనసు రావడం లేదు. ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడానికి ఒప్పుకున్నప్పుడు ఇంకాస్త ఒళ్ళు జార్తపెట్టుకుని తీయాల్సింది అని మాత్రం అనిపించింది. శ్రీకాంత్ అడ్డాల మీద నాకు ఆట్టే నమ్మకం ఏమీ లేదు, కొత్త బంగారులోకం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడి ఇంటి పేరు లాగ పెట్టుకోడానికి బావుంటాయి కానీ, మరి దానికి తగ్గట్టే ఆ రెండింటి మీదా కొంచం ఫోకస్ పెట్టాలి. ఫ్యామిలీ డ్రామాలో కథ కి మరింత ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. సినిమా చూసాక ఇంటికి వెళ్ళి అయిడిల్ బ్రైన్ తీసి, కథేంటా అని మరోసారి చదువుకున్నాను, అర్థం చేసుకోడం లో నా పొరపాటు ఏమీ లేదని గ్రహించుకుని, కుదుట పడ్డాను.

ఉన్నది సరిగ్గా అర లైను కథ, కాబట్టి చెప్పి మీ ఆసక్తి ని మంట కలపను. కుటుంబ కథా చిత్రం అంటే ఒక పెద్ద కుటుంబం పెట్టేస్తే సరిపోతుందా ? ప్రధమార్థం అయ్యేవరకూ ఆ "విజయవాడ" వాళ్ళూ, ఈ ప్రకాష్ రాజ్ కుటుంబం ఎలా చుట్టాలో డౌట్ వస్తూనే ఉంది. అసలే నేను చుట్టరికాల్లో వీకు. మా ఆవిడ మధ్యలో ఒక క్లారిటీ ఇచ్చాక, ఇంక మళ్ళీ అడిగే ధైర్యం చెయ్యకుండా ఫాలో అయిపోయాను. టీవీ సీరియల్స్ పుణ్యమా అని ఒక రేంజ్ డ్రామా కి అలవాటు పడిపోయిన మన జనాలికి ఈ వేరు, తీరు లేని చెట్టుకథ ఎలా ఎక్కుతుంది అని అనుకున్నారో తెలీలేదు. "వేరు లేని" అని నోరు ఎందుకు పారేసుకున్నానంటే, ఒకటి రెండు పాత్రలకి మినహా మిగతా పాత్రలకి ఎక్కడా వేళ్ళూ, గోళ్ళూ లేవు.. అంతా పై పై ఆర్భాటమే. అప్పటికీ మంచి నటులను ఎంచుకోవడం వల్ల, పాపం వాళ్ళు యధాశక్తి ఆ పాత్రలకి ఒక స్థాయిని ఇవ్వడానికి ప్రయత్నించారు. మొదటి అర్థ భాగం బావుందనే ఫీలింగ్ తో ముగిస్తే, చివరకొచ్చేసరికి అదేంటీ ఇదేనా ఎండింగ్ అని అనిపించేలా తెర దించేసారు. (మా కాసినోలో దించడానికి అది కూడా లేదు.. దించారు అని మనమే అనుకుని బయటకి వచ్చేయాలి) సరిగ్గా నెక్స్ట్ సీరియల్ మొదలయ్యేముందు ఆగిపోయే డైలీ సీరియల్ లా. కొన్ని సన్నివేశాల్లో పెద్దోడు, చిన్నోడు ఇచ్చుకున్న సీరియస్ సంజాయిషీలు అర్థం కాక, అసలే ఊడిపోతున్న జుట్టుని పీక్కోలేకా, తెగ మథన పడిపోయాను అంటే మీరు నమ్మి తీరాలి.

అన్నీ ఫిర్యాదులేనా, అంటే, కొన్ని మంచి విషయాలూ ఉన్నాయండోయ్. అతికించే కామిడీ ట్రాకు లేదు, అవసరం లేని ఫైట్స్ లేవు.. ముఖ్యం గా కుటుంబ కథా చిత్రం అంటే ఎక్స్ పెక్ట్ చేసే, కర్చీఫ్ లు తడిపేసే కన్నీళ్ళు లేవు. .అవన్నీ లేకున్నా, ఆట్టే బోరుకొట్టకుండా సినిమా కదిలిపోతుంది. మహేష్ ఉన్న సీన్లు చాలా మటుకు బాగా ఆకట్టుకున్నాయి. మహేష్, వెంకీ ల ఫాన్స్ కి సినిమా లో ఏ లోటూ కనిపించకపోవచ్చు. పండగ పూటా బాగా బూరెలు, గారెలు లాగించి అలా నిద్ర మత్తులో సీట్లో చతికిలబడితే, మీరు తిన్నదానికి ఏమాత్రం ఇబ్బంది పెట్టదు ఈ సినిమా. ఆ మాత్రం భాగ్యానికి ఇంట్లో కూర్చుంటే సరిపోదా, అంటే అది మీ ఇష్టం మరి. ఈ సినిమా లో నాకు నచ్చిన మరో అంశం, సంక్రాంతి - 2 లా లేకపోవడం. (ఇప్పటికీ ఆ సంక్రాంతి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే, కడుపులో అదో వింత ఫీలింగ్.. ఏంచెప్పమంటారు)

చిన్న చిన్న ఆనందాలు జీవితానికి మెరుగులు దిద్దుతాయి, సందేహమే లేదు. కానీ వేసే ప్రతీ అడుగులోనూ తోడుగా నిలచేది నిలబెట్టేది గాఢమైన భాందవ్యాలు. వాటిని డ్రాయింగు రూంలోనే వెతికితే కనిపించవు. ఎంత పెద్ద ఉపద్రవం ఎదురొచ్చినా, ఒక్క తాటిపై ఒకరికొకరం నిలబడ్డం లోనూ, ఒక్కోసారి తమ జీవితాలనే పణంగా పెట్టడం లోనూ కుటుంబం అసలు విలువ బయట పడుతుంది. ఈ సినిమా మరి కాస్త లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసి ఉంటే, ఫలితం ఇంకాస్త మెరుగ్గా వచ్చేదేమో.

పాటలు పెద్ద గుర్తు లేవు, ఆ టైటిల్ సాంగు తప్ప. అలా అని మరీ ఘోరం గా లేవు లెండి. ఇళయరాజానో, కీరవాణినో పెట్టుకుని ఉంటే ఇంకా అర్థవంతమైన సంగీతం వచ్చేదేమో. ఇంక డవిలాగుల విషయానికొస్తే, కొన్ని మరీ స్పీడు గా ఉన్నాయి (ముఖ్యం గా మహేష్ వి), అర్థం కాలేదు. కొన్ని అర్థం అయ్యాయి, కాని వాటికి పెద్దగా అర్థమే లేదు. ఎక్కడైనా ఒకటి రెండు మంచి మాటలు ఉన్నాయేమో లెండి, గుర్తు రావడం లేదు అంతే.

మనకు ఉన్న రిస్క్ మన టికెట్ డబ్బులే కాబట్టి, ఓ సారి చూసి, మొస్తరుగా ఉంది అని అనుకుంటే సరిపోతుంది. మల్టీ స్టారర్ సినిమాలు చూడ్డం మన భాధ్యత అంట కదా ?

(హీరోల పాత్రలకి దాదాపు సినిమా అంతా పెద్దోడు (వెంకీ) చిన్నోడు (మహేష్) అని తప్ప, అసలు పేర్లు పెట్టి రిఫర్ చెయ్యకపోవడం వెనుక ఏమైన తాత్పర్యం, ప్రతిపదార్ధం ఉన్నాయేమొ, నాకు తెలీదు.. )

పుర్రెకో బుధ్ధి కాబట్టి, ఇవి కేవలం నా అభిప్రాయాలు, చదివి ఎవరూ నొచ్చుకోకండి మరి.