Thursday, January 24, 2013

వారం అంటే 7 రోజులు కాదు.. నెల అంటే 150 యేళ్ళు


కళ్ళు కాదు నా మనో నేత్రం తెరుచుకుని ఇప్పుడు ప్రపంచాన్ని మరింత అర్థ వంతం గా చూడగల్గుతున్నాను. బుద్ధుడికి అదేదో చెట్టుక్రిందా, గాలికి సెంట్రల్ జైలు లోనూ జరిగిన జ్ఞానోదయం అనే ప్రక్రియ నాకు నిన్నటికి నిన్న (అంటే నిన్నే), ఆజాదు గారి స్టేట్మెంట్ వల్ల జరిగింది. ఆఫీసులో పని లేకా/పని ఉన్న చోట ఆఫీసు లేకా, గూగుల్ న్యూస్ లో న్యూ న్యూస్ లేకా, నా మానాన ఏదో తెలుగు సామెతలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న శుభతరుణంలోఈ సంఘటన సంభవించింది. ఇప్పుడు నలుపు నల్లగా ఉండదని, తెలుపంటే అసలు రంగే కాదని.. తెలుసుకున్నాను. ఇదో కొత్త అధ్యాత్మిక ఉద్యమం అనిపిస్తోంది నాకు..  లోకానికి కల్యాణం చెయ్యడానికి. (ఎక్కడైన ఫ్రీ ఫ్రీ గా ల్యాండ్ ఇస్తారంటే, ఓ ఒంటిస్థంభం మేడ కట్టేద్దాం, గాల్లో)

ఈ జ్ఞానోదయం ఏదైతే ఉందో, అది జరిగాక నాకు కళ్ళుమూసుకున్నా అంతా కనిపించేస్తోంది, నేను తెలుసుకున్న కొన్ని జ్ఞాన గుళికలు మచ్చుకు మీతో పంచేసుకుంటాను..

1. కాంగీ పార్టీ అంటే అసలు పార్టీ కాదు.. అది పీ. సీ సర్కార్ తాతకి ముత్తాత.. ఆ మాజిక్కుల కంఫ్యూజన్ లో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడేస్తారో పూరీ జగన్నాధ్ కి కూడా తెలీదు.

2. సమస్య అంటే, సమస్యే కాదు అసలు. మరి అలాంటప్పుడు దాని మీద నిర్ణయం అంటే ఎవడికి తెలుస్తుంది.. నిర్ణయమే సమస్య అయినప్పుడు.. "సమస్యే" పరిష్కారం అయిపోతుంది. (అర్థం కాకపోతే ఖలేజా సినిమా మళ్ళీచూడండి, అన్నీ అర్థం అవ్వకర్లేదు అని అర్థం అవుతుంది)

3. ఈ కాలం అని ఏదైతే ఉందో, అది రాజకీయాలకు అసలు వర్తించదు. ఒక రోజు అంటే అయిదేళ్ళు అని అర్థం. మిగతా లెక్కలు మీరు వేసుకోండి.

4. అధికారం ఒక విషం, విస్కీ బ్రాందీ లాగ అన్నమాట.. అందుకని దాన్ని బాయట ఎక్కడ తిరగనివ్వకూడదు.. నాయకులే బాగా ఎక్కించుకుని, దాచేయాలి.

5. మంత్రులు అంటే మంత్రులు కానే కాదు.. అదొక రకమైన తంత్ర విద్య, ఎవరికో గానీ వంటబట్టదు.

6. ఢిల్లీ అంటే సిల్లీ గల్లీ అని అర్థం. జంతర్మంతర్ పక్క సందులో ఉంటుంది అది, పిన్ కోడ్ కావాలంటే నోట్ చేసుకోండి.. - 420420

36. చివరిగా, ప్రభుత్వమంటే పాలనకు అనుకునేరు.. పక్షపాతానికి.. పక్షవాతానికి మధ్య జాయింటు వెంచరు అది.
(ఆరు తరువాత ముప్ఫై ఆరు ఎలా వచ్చింది అని మీరు ఆలోచిస్తున్నారంటే, మీకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు అని అర్థం. అజాదు గారిని సంప్రదించగలరు.. )

మరో మాట, ఈ విజ్ఞాన వికాసానికి మీరు నాకు థాంక్స్ లు వగైరాలు చెప్పక్కర్లేదు, మన ఒంటిస్థంభం మేడ ప్రక్కన మంచి స్థలాలు అమ్ముతున్నాం, కొనుక్కుని తరించండి.


Tuesday, January 22, 2013

చౌతాలా కాలం.. (కలికాలం)

మన రాష్ట్రానికి (ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అనే చదువుకోండి ;-)) సంబంధించినంతవరకూ, జాతీయ నాయకుడి అవతారం లో అడపదడపా దర్శనమిచ్చే చౌతాలా గారికి పదేళ్ళ జైలు శిక్ష పడింది అని తెలుసుకుని షాకయ్యి, తేరుకుని రాయడం మొదలు పెట్టాను..

రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టడమే గొప్ప, ఆ కేసు చివరి వరకూ పోయి (అంతవరకూ సాక్ష్యులు క్షేమంగా ఉండి), ఇలా శిక్షలు ఖరారవ్వడం, ఏమిటో.. కలి కాలం కాకపోతే మరేమిటి. ఆయన గారు UPA భాగస్వామి అయ్యి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో తెలీదు మరి. ఇలాంటి సంఘటనలు  చూస్తుంటేనే ఇంకా మనదేశం లో న్యాయం ఏ మూలైనా బ్రతికి బట్ట కట్టిందా అని అనుమానం మొదలవుతుంది నాకు. బహుశా ఈ కేసు మరీ కళ్ళు - పిల్లి - పాలు కేసు అయ్యి ఉంటుంది. అయినా న్యాయ వ్యవస్థని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే, నాకు తెలిసి ఈ నాయకుల కేసులు తేలే  సరికి వాళ్ళు ఇంకా పై పై న్యాయస్థానాల్లో రిపోర్ట్ అయిపోతారు, చిత్ర గుప్తుడి ముందు. సో ఇక్కడ మనం వేసే శిక్షలు చూసి వాళ్ళ జగమంత కుటుంబాలు నవ్వుకుంటూ ఉంటాయి. ఇలా భూమ్మీదే శిక్షలు వేసే పరిస్థితి రావడం ఎంతైనా ముదావహం.

జగన్ మా పార్టీలోనే ఉంటే ఈ పాటికి CM అయ్యేవాడు అని ఆ మధ్య ఆజాదు గారు నోరు జారారు.. మాయవతి, ములాయం తరపున న్యాయవాదులే UPA లో భాగస్వాములని అని టాక్ ఉండనే ఉంది. ప్రజా ప్రతినిధులు, నోటికొచ్చింది అంతా వాగినా, చేతికొచ్చిందంతా మింగినా, చట్టం తన పని తాను  చేసుకుంటూ పోతుంది అని హాయిగా సెలవివ్వచ్చు. రైలుంది, పట్టాలున్నయి, రైలు దానికదే కదిలిపోతుంది అంటే మనం ముక్కున ఏం వెసుకుని ఆశ్చర్యపోవాలి ? నేరం జరిగిన క్షణం నుంచి, తీర్పు వరకూ అడుగడుగునా అవినీతిమరిగిన ఈ వ్యవస్థలో, దొరికిన వాడు ఉత్తమమైన దొంగ అని మురిసిపోవాలి  మనం. కొన్ని ప్రత్యేకమైన కేసుల్ని త్వరితం గా ముగించడానికి ఏర్పాటు చేసే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, రాజకీయాల్లో ఉన్న నేరస్థుల కోసం కూడా వేస్తే బావుణ్ణు. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పీడ వేగంగా విరగడ అవుతుంది.. కొత్తగా వచ్చేవాడు ఇంకాస్త భయపడతాడు.

ఇంకా సూపర్ అవిడియా ఇంకోటుంది,  నాయకుల నేరాల విచారణను ఏ సౌదీ కో అవుట్ సోర్స్ చేసామనుకోండి, అదిరిపోతుంది.

Tuesday, January 15, 2013

సీతమ్మ వాకిట్లో వేరు లేని చెట్టు..


అసలే సంక్రాంతి, దానికి తోడు తెలుగు లో రాక రాక వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం, వదులుకోలేం కదా.. ప్రోత్సహించాం, కొంచం లో బడ్జెట్లో. (చెన్నై కాసినో లో అని చదువుకోగలరు)

అన్ని నీతి శతకాల్లోనూ చెప్పినట్టు, హడావిడి మరీ ఎక్కువ అయితే "అసలు" మరి నల్లపూసే అయిపోతుంది. దిల్ రాజు గారి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సరిగ్గా అలానే ఉంది. బావులేదని చెప్పలేను, అలా అని గొప్పగా ఉందని అనడానికి మనసు రావడం లేదు. ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడానికి ఒప్పుకున్నప్పుడు ఇంకాస్త ఒళ్ళు జార్తపెట్టుకుని తీయాల్సింది అని మాత్రం అనిపించింది. శ్రీకాంత్ అడ్డాల మీద నాకు ఆట్టే నమ్మకం ఏమీ లేదు, కొత్త బంగారులోకం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడి ఇంటి పేరు లాగ పెట్టుకోడానికి బావుంటాయి కానీ, మరి దానికి తగ్గట్టే ఆ రెండింటి మీదా కొంచం ఫోకస్ పెట్టాలి. ఫ్యామిలీ డ్రామాలో కథ కి మరింత ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. సినిమా చూసాక ఇంటికి వెళ్ళి అయిడిల్ బ్రైన్ తీసి, కథేంటా అని మరోసారి చదువుకున్నాను, అర్థం చేసుకోడం లో నా పొరపాటు ఏమీ లేదని గ్రహించుకుని, కుదుట పడ్డాను.

ఉన్నది సరిగ్గా అర లైను కథ, కాబట్టి చెప్పి మీ ఆసక్తి ని మంట కలపను. కుటుంబ కథా చిత్రం అంటే ఒక పెద్ద కుటుంబం పెట్టేస్తే సరిపోతుందా ? ప్రధమార్థం అయ్యేవరకూ ఆ "విజయవాడ" వాళ్ళూ, ఈ ప్రకాష్ రాజ్ కుటుంబం ఎలా చుట్టాలో డౌట్ వస్తూనే ఉంది. అసలే నేను చుట్టరికాల్లో వీకు. మా ఆవిడ మధ్యలో ఒక క్లారిటీ ఇచ్చాక, ఇంక మళ్ళీ అడిగే ధైర్యం చెయ్యకుండా ఫాలో అయిపోయాను. టీవీ సీరియల్స్ పుణ్యమా అని ఒక రేంజ్ డ్రామా కి అలవాటు పడిపోయిన మన జనాలికి ఈ వేరు, తీరు లేని చెట్టుకథ ఎలా ఎక్కుతుంది అని అనుకున్నారో తెలీలేదు. "వేరు లేని" అని నోరు ఎందుకు పారేసుకున్నానంటే, ఒకటి రెండు పాత్రలకి మినహా మిగతా పాత్రలకి ఎక్కడా వేళ్ళూ, గోళ్ళూ లేవు.. అంతా పై పై ఆర్భాటమే. అప్పటికీ మంచి నటులను ఎంచుకోవడం వల్ల, పాపం వాళ్ళు యధాశక్తి ఆ పాత్రలకి ఒక స్థాయిని ఇవ్వడానికి ప్రయత్నించారు. మొదటి అర్థ భాగం బావుందనే ఫీలింగ్ తో ముగిస్తే, చివరకొచ్చేసరికి అదేంటీ ఇదేనా ఎండింగ్ అని అనిపించేలా తెర దించేసారు. (మా కాసినోలో దించడానికి అది కూడా లేదు.. దించారు అని మనమే అనుకుని బయటకి వచ్చేయాలి) సరిగ్గా నెక్స్ట్ సీరియల్ మొదలయ్యేముందు ఆగిపోయే డైలీ సీరియల్ లా. కొన్ని సన్నివేశాల్లో పెద్దోడు, చిన్నోడు ఇచ్చుకున్న సీరియస్ సంజాయిషీలు అర్థం కాక, అసలే ఊడిపోతున్న జుట్టుని పీక్కోలేకా, తెగ మథన పడిపోయాను అంటే మీరు నమ్మి తీరాలి.

అన్నీ ఫిర్యాదులేనా, అంటే, కొన్ని మంచి విషయాలూ ఉన్నాయండోయ్. అతికించే కామిడీ ట్రాకు లేదు, అవసరం లేని ఫైట్స్ లేవు.. ముఖ్యం గా కుటుంబ కథా చిత్రం అంటే ఎక్స్ పెక్ట్ చేసే, కర్చీఫ్ లు తడిపేసే కన్నీళ్ళు లేవు. .అవన్నీ లేకున్నా, ఆట్టే బోరుకొట్టకుండా సినిమా కదిలిపోతుంది. మహేష్ ఉన్న సీన్లు చాలా మటుకు బాగా ఆకట్టుకున్నాయి. మహేష్, వెంకీ ల ఫాన్స్ కి సినిమా లో ఏ లోటూ కనిపించకపోవచ్చు. పండగ పూటా బాగా బూరెలు, గారెలు లాగించి అలా నిద్ర మత్తులో సీట్లో చతికిలబడితే, మీరు తిన్నదానికి ఏమాత్రం ఇబ్బంది పెట్టదు ఈ సినిమా. ఆ మాత్రం భాగ్యానికి ఇంట్లో కూర్చుంటే సరిపోదా, అంటే అది మీ ఇష్టం మరి. ఈ సినిమా లో నాకు నచ్చిన మరో అంశం, సంక్రాంతి - 2 లా లేకపోవడం. (ఇప్పటికీ ఆ సంక్రాంతి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే, కడుపులో అదో వింత ఫీలింగ్.. ఏంచెప్పమంటారు)

చిన్న చిన్న ఆనందాలు జీవితానికి మెరుగులు దిద్దుతాయి, సందేహమే లేదు. కానీ వేసే ప్రతీ అడుగులోనూ తోడుగా నిలచేది నిలబెట్టేది గాఢమైన భాందవ్యాలు. వాటిని డ్రాయింగు రూంలోనే వెతికితే కనిపించవు. ఎంత పెద్ద ఉపద్రవం ఎదురొచ్చినా, ఒక్క తాటిపై ఒకరికొకరం నిలబడ్డం లోనూ, ఒక్కోసారి తమ జీవితాలనే పణంగా పెట్టడం లోనూ కుటుంబం అసలు విలువ బయట పడుతుంది. ఈ సినిమా మరి కాస్త లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసి ఉంటే, ఫలితం ఇంకాస్త మెరుగ్గా వచ్చేదేమో.

పాటలు పెద్ద గుర్తు లేవు, ఆ టైటిల్ సాంగు తప్ప. అలా అని మరీ ఘోరం గా లేవు లెండి. ఇళయరాజానో, కీరవాణినో పెట్టుకుని ఉంటే ఇంకా అర్థవంతమైన సంగీతం వచ్చేదేమో. ఇంక డవిలాగుల విషయానికొస్తే, కొన్ని మరీ స్పీడు గా ఉన్నాయి (ముఖ్యం గా మహేష్ వి), అర్థం కాలేదు. కొన్ని అర్థం అయ్యాయి, కాని వాటికి పెద్దగా అర్థమే లేదు. ఎక్కడైనా ఒకటి రెండు మంచి మాటలు ఉన్నాయేమో లెండి, గుర్తు రావడం లేదు అంతే.

మనకు ఉన్న రిస్క్ మన టికెట్ డబ్బులే కాబట్టి, ఓ సారి చూసి, మొస్తరుగా ఉంది అని అనుకుంటే సరిపోతుంది. మల్టీ స్టారర్ సినిమాలు చూడ్డం మన భాధ్యత అంట కదా ?

(హీరోల పాత్రలకి దాదాపు సినిమా అంతా పెద్దోడు (వెంకీ) చిన్నోడు (మహేష్) అని తప్ప, అసలు పేర్లు పెట్టి రిఫర్ చెయ్యకపోవడం వెనుక ఏమైన తాత్పర్యం, ప్రతిపదార్ధం ఉన్నాయేమొ, నాకు తెలీదు.. )

పుర్రెకో బుధ్ధి కాబట్టి, ఇవి కేవలం నా అభిప్రాయాలు, చదివి ఎవరూ నొచ్చుకోకండి మరి.

Monday, January 14, 2013

ట్వీట్లండీ ట్వీట్లు.. వేడి వేడిగా.. (స్టాకు పాతదీ.. పోస్టు కొత్తదీనూ) -3రాయక రాయక పోస్ట్ చేస్తూ ఈ ఓల్డు స్టాకు ఎందుకంటారా, మళ్ళీ కాస్త రెగ్యులర్ గా రాద్దామనే ఆలోచన అయితే పుట్టింది, సో ముందు ఒక పోస్ట్ చేద్దాం అని ఈ కక్కుర్తి. :-) అమెరికా నుంచి స్నేహితొడకరు ఫోన్ చేసి నా బ్లాగు గురించి తరచి తరచి అడగడంతో నాలో కాస్త ఉత్సాహం పొంగుకొచ్చింది, ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

ఇంక ట్వీట్ల విషయానికొస్తే, పట్టుమని పదిమంది కూడా నన్ను ట్విట్టర్లో ఫాలో అవ్వరు, మరి ఇంక ఎందుకు ట్వీట్ చెయ్యడం అంటారా, ఎవరూ చదవరని తెలిసినప్పుడు మరికాస్త ఫ్రీగా రాసుకోవచ్చు. ఆ క్షణం అనిపించిన ఆలోచనలను. కొంతకాలం తరువాత మనమే మళ్ళీ చదువుకుంటే ఒక మంచి అనుభూతి. వర్తమానం కంటే గతం ఎప్పుడూ అందంగానే ఉంటుంది, తెలిసిందే కదా..అద్దం లో మొహం బాలేదని అద్దాన్ని సరిదిద్దుతాం మనం.

**********

నన్ను నీలో పారేసుకుని నాలో వెతుక్కుంటున్నాను

**********

గెలుపు ని నీడల్లో వెతకను నేను

**********

ఎంత దూరం దాటాం అన్నది కాదు.. ఎన్ని అడుగుల ముద్రలు నిలిచిపోయాయన్నది ముఖ్యం..

**********

ఒక్కోసారి వేదనని కన్నీళ్ళతో కొలవలేం.

**********

ఏదో కోల్పోతామనే భయంతో మనం జీవితాన్నే పోగొట్టుకుంటాం

**********

ఆగిపోయాకే అర్థమయ్యింది.. నేను వేసిన అడుగులకి అర్థమే లేదని.

**********

జ్ఞానానికి, అనుభవానికి మధ్య దూరం.. తీరానికి కెరటానికి ఉండేలాంటిదే కదా..

**********

చీకటికి నేను భయపడను.. నన్ను భయపెట్టేది నా అంధత్వమే.

**********

జీవితాన్ని "క్షణాల్లో" పారేసుకుని "జ్ఞాపకాల్లో" వెతుక్కుంటాం.. ఎంతటి అమాయకులం మనం.

**********

రాలే కన్నీటి బొట్లు, రాసుకుని దాచుకోవాల్సిన మాటలు..

**********

జీవితం తనదైన శైలిలో పాఠాలు నేర్పుతూనే ఉంటుంది, మనం నేర్చుకునే మూడ్ లో ఉన్నా, లేకున్నా. :-)

**********

పొందడంలో ఆనందం ఉంది.. పోగొట్టుకోవడంలో అనుభవం ఉంది. ఏది ఎక్కువ విలువైనది ?

**********

జీవితం - గుప్పెడు జ్ఞాపకాల కోసం నూరేళ్ళ పోరాటం.

**********

ప్రేమ కన్నా ద్వేషాన్ని బాగా వ్యక్తం చేస్తాం మనం. ఆర్ద్రం కన్నా కోపాన్ని..

**********

అమ్మతో మాట్లాడని రోజు అసంపూర్ణం గా అనిపిస్తుంది.. పంచుకోని ఆనందానికి అర్థమే లేదనిపిస్తుంది..
ఆమె అంతరంగం అంతేలేని సాగరం.. ఆమె జీవితం.. తరచి చూసుకోవాల్సిన పుస్తకం. 
దేవుడు ఎప్పుడూ నాకు ఎదురుపడనేలేదు... అమ్మ నా చేయి ఎప్పుడూ వదలనేలేదు.

**********

ఆకశానికి దిక్కులు వెలుగు చీకట్లు..
జీవితానికి దిక్కులు గెలుపు ఓటములు..

**********

కాలం కెరటాల మధ్య ఇంకా ఎన్ని రంగు కళ్ళజోళ్ళు పారేసుకోవాలి ? తెల్లటి వెలుగు పరిచయం కావడానికి ..

**********

వేదాంత ధోరణిలో మునిగిపోడానికి భగవద్గీత చదవనక్కర్లేదు, అర్థరాత్రి ఓ గంట విద్యుత్ కోత చాలు.

**********

నీ కన్నీరుని నీ కంట పడకుండానే మాయం చేసేందుకు, నీ పెదవులపై వెన్నెల చిరునవ్వునై నేను వెలుగుతూ వేచి చూస్తాను.

**********

ఒక్కోసారి జ్ఞాపకాల ఉప్పెన నన్ను ఎంతగా ముంచెత్తుతుందంటే, వర్తమానాన్ని ఒప్పుకోడానికి మనసు సిద్ధపడదు. ఆ క్షణం, కాలం ఓడిపోవాల్సిందే.

**********

తల్లిదండ్రులు పిల్లల్ని అన్-కండిషనల్ గా ప్రేమిస్తారు, పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని సరిగ్గా అలానే ప్రేమిస్తారు. ;-)

**********
అన్నట్లు చెప్పడమే మరచిపోయానండోయ్.. సంక్రాంతి శుభాకాంక్షలు!!