Thursday, January 24, 2013

వారం అంటే 7 రోజులు కాదు.. నెల అంటే 150 యేళ్ళు


కళ్ళు కాదు నా మనో నేత్రం తెరుచుకుని ఇప్పుడు ప్రపంచాన్ని మరింత అర్థ వంతం గా చూడగల్గుతున్నాను. బుద్ధుడికి అదేదో చెట్టుక్రిందా, గాలికి సెంట్రల్ జైలు లోనూ జరిగిన జ్ఞానోదయం అనే ప్రక్రియ నాకు నిన్నటికి నిన్న (అంటే నిన్నే), ఆజాదు గారి స్టేట్మెంట్ వల్ల జరిగింది. ఆఫీసులో పని లేకా/పని ఉన్న చోట ఆఫీసు లేకా, గూగుల్ న్యూస్ లో న్యూ న్యూస్ లేకా, నా మానాన ఏదో తెలుగు సామెతలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న శుభతరుణంలోఈ సంఘటన సంభవించింది. ఇప్పుడు నలుపు నల్లగా ఉండదని, తెలుపంటే అసలు రంగే కాదని.. తెలుసుకున్నాను. ఇదో కొత్త అధ్యాత్మిక ఉద్యమం అనిపిస్తోంది నాకు..  లోకానికి కల్యాణం చెయ్యడానికి. (ఎక్కడైన ఫ్రీ ఫ్రీ గా ల్యాండ్ ఇస్తారంటే, ఓ ఒంటిస్థంభం మేడ కట్టేద్దాం, గాల్లో)

ఈ జ్ఞానోదయం ఏదైతే ఉందో, అది జరిగాక నాకు కళ్ళుమూసుకున్నా అంతా కనిపించేస్తోంది, నేను తెలుసుకున్న కొన్ని జ్ఞాన గుళికలు మచ్చుకు మీతో పంచేసుకుంటాను..

1. కాంగీ పార్టీ అంటే అసలు పార్టీ కాదు.. అది పీ. సీ సర్కార్ తాతకి ముత్తాత.. ఆ మాజిక్కుల కంఫ్యూజన్ లో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడేస్తారో పూరీ జగన్నాధ్ కి కూడా తెలీదు.

2. సమస్య అంటే, సమస్యే కాదు అసలు. మరి అలాంటప్పుడు దాని మీద నిర్ణయం అంటే ఎవడికి తెలుస్తుంది.. నిర్ణయమే సమస్య అయినప్పుడు.. "సమస్యే" పరిష్కారం అయిపోతుంది. (అర్థం కాకపోతే ఖలేజా సినిమా మళ్ళీచూడండి, అన్నీ అర్థం అవ్వకర్లేదు అని అర్థం అవుతుంది)

3. ఈ కాలం అని ఏదైతే ఉందో, అది రాజకీయాలకు అసలు వర్తించదు. ఒక రోజు అంటే అయిదేళ్ళు అని అర్థం. మిగతా లెక్కలు మీరు వేసుకోండి.

4. అధికారం ఒక విషం, విస్కీ బ్రాందీ లాగ అన్నమాట.. అందుకని దాన్ని బాయట ఎక్కడ తిరగనివ్వకూడదు.. నాయకులే బాగా ఎక్కించుకుని, దాచేయాలి.

5. మంత్రులు అంటే మంత్రులు కానే కాదు.. అదొక రకమైన తంత్ర విద్య, ఎవరికో గానీ వంటబట్టదు.

6. ఢిల్లీ అంటే సిల్లీ గల్లీ అని అర్థం. జంతర్మంతర్ పక్క సందులో ఉంటుంది అది, పిన్ కోడ్ కావాలంటే నోట్ చేసుకోండి.. - 420420

36. చివరిగా, ప్రభుత్వమంటే పాలనకు అనుకునేరు.. పక్షపాతానికి.. పక్షవాతానికి మధ్య జాయింటు వెంచరు అది.
(ఆరు తరువాత ముప్ఫై ఆరు ఎలా వచ్చింది అని మీరు ఆలోచిస్తున్నారంటే, మీకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు అని అర్థం. అజాదు గారిని సంప్రదించగలరు.. )

మరో మాట, ఈ విజ్ఞాన వికాసానికి మీరు నాకు థాంక్స్ లు వగైరాలు చెప్పక్కర్లేదు, మన ఒంటిస్థంభం మేడ ప్రక్కన మంచి స్థలాలు అమ్ముతున్నాం, కొనుక్కుని తరించండి.


1 comment:

  1. 481. ఇది కామెంటు కాదు గాలిలో పెట్టిన దీపం

    ReplyDelete