Tuesday, January 15, 2013

సీతమ్మ వాకిట్లో వేరు లేని చెట్టు..


అసలే సంక్రాంతి, దానికి తోడు తెలుగు లో రాక రాక వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం, వదులుకోలేం కదా.. ప్రోత్సహించాం, కొంచం లో బడ్జెట్లో. (చెన్నై కాసినో లో అని చదువుకోగలరు)

అన్ని నీతి శతకాల్లోనూ చెప్పినట్టు, హడావిడి మరీ ఎక్కువ అయితే "అసలు" మరి నల్లపూసే అయిపోతుంది. దిల్ రాజు గారి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సరిగ్గా అలానే ఉంది. బావులేదని చెప్పలేను, అలా అని గొప్పగా ఉందని అనడానికి మనసు రావడం లేదు. ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడానికి ఒప్పుకున్నప్పుడు ఇంకాస్త ఒళ్ళు జార్తపెట్టుకుని తీయాల్సింది అని మాత్రం అనిపించింది. శ్రీకాంత్ అడ్డాల మీద నాకు ఆట్టే నమ్మకం ఏమీ లేదు, కొత్త బంగారులోకం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడి ఇంటి పేరు లాగ పెట్టుకోడానికి బావుంటాయి కానీ, మరి దానికి తగ్గట్టే ఆ రెండింటి మీదా కొంచం ఫోకస్ పెట్టాలి. ఫ్యామిలీ డ్రామాలో కథ కి మరింత ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. సినిమా చూసాక ఇంటికి వెళ్ళి అయిడిల్ బ్రైన్ తీసి, కథేంటా అని మరోసారి చదువుకున్నాను, అర్థం చేసుకోడం లో నా పొరపాటు ఏమీ లేదని గ్రహించుకుని, కుదుట పడ్డాను.

ఉన్నది సరిగ్గా అర లైను కథ, కాబట్టి చెప్పి మీ ఆసక్తి ని మంట కలపను. కుటుంబ కథా చిత్రం అంటే ఒక పెద్ద కుటుంబం పెట్టేస్తే సరిపోతుందా ? ప్రధమార్థం అయ్యేవరకూ ఆ "విజయవాడ" వాళ్ళూ, ఈ ప్రకాష్ రాజ్ కుటుంబం ఎలా చుట్టాలో డౌట్ వస్తూనే ఉంది. అసలే నేను చుట్టరికాల్లో వీకు. మా ఆవిడ మధ్యలో ఒక క్లారిటీ ఇచ్చాక, ఇంక మళ్ళీ అడిగే ధైర్యం చెయ్యకుండా ఫాలో అయిపోయాను. టీవీ సీరియల్స్ పుణ్యమా అని ఒక రేంజ్ డ్రామా కి అలవాటు పడిపోయిన మన జనాలికి ఈ వేరు, తీరు లేని చెట్టుకథ ఎలా ఎక్కుతుంది అని అనుకున్నారో తెలీలేదు. "వేరు లేని" అని నోరు ఎందుకు పారేసుకున్నానంటే, ఒకటి రెండు పాత్రలకి మినహా మిగతా పాత్రలకి ఎక్కడా వేళ్ళూ, గోళ్ళూ లేవు.. అంతా పై పై ఆర్భాటమే. అప్పటికీ మంచి నటులను ఎంచుకోవడం వల్ల, పాపం వాళ్ళు యధాశక్తి ఆ పాత్రలకి ఒక స్థాయిని ఇవ్వడానికి ప్రయత్నించారు. మొదటి అర్థ భాగం బావుందనే ఫీలింగ్ తో ముగిస్తే, చివరకొచ్చేసరికి అదేంటీ ఇదేనా ఎండింగ్ అని అనిపించేలా తెర దించేసారు. (మా కాసినోలో దించడానికి అది కూడా లేదు.. దించారు అని మనమే అనుకుని బయటకి వచ్చేయాలి) సరిగ్గా నెక్స్ట్ సీరియల్ మొదలయ్యేముందు ఆగిపోయే డైలీ సీరియల్ లా. కొన్ని సన్నివేశాల్లో పెద్దోడు, చిన్నోడు ఇచ్చుకున్న సీరియస్ సంజాయిషీలు అర్థం కాక, అసలే ఊడిపోతున్న జుట్టుని పీక్కోలేకా, తెగ మథన పడిపోయాను అంటే మీరు నమ్మి తీరాలి.

అన్నీ ఫిర్యాదులేనా, అంటే, కొన్ని మంచి విషయాలూ ఉన్నాయండోయ్. అతికించే కామిడీ ట్రాకు లేదు, అవసరం లేని ఫైట్స్ లేవు.. ముఖ్యం గా కుటుంబ కథా చిత్రం అంటే ఎక్స్ పెక్ట్ చేసే, కర్చీఫ్ లు తడిపేసే కన్నీళ్ళు లేవు. .అవన్నీ లేకున్నా, ఆట్టే బోరుకొట్టకుండా సినిమా కదిలిపోతుంది. మహేష్ ఉన్న సీన్లు చాలా మటుకు బాగా ఆకట్టుకున్నాయి. మహేష్, వెంకీ ల ఫాన్స్ కి సినిమా లో ఏ లోటూ కనిపించకపోవచ్చు. పండగ పూటా బాగా బూరెలు, గారెలు లాగించి అలా నిద్ర మత్తులో సీట్లో చతికిలబడితే, మీరు తిన్నదానికి ఏమాత్రం ఇబ్బంది పెట్టదు ఈ సినిమా. ఆ మాత్రం భాగ్యానికి ఇంట్లో కూర్చుంటే సరిపోదా, అంటే అది మీ ఇష్టం మరి. ఈ సినిమా లో నాకు నచ్చిన మరో అంశం, సంక్రాంతి - 2 లా లేకపోవడం. (ఇప్పటికీ ఆ సంక్రాంతి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే, కడుపులో అదో వింత ఫీలింగ్.. ఏంచెప్పమంటారు)

చిన్న చిన్న ఆనందాలు జీవితానికి మెరుగులు దిద్దుతాయి, సందేహమే లేదు. కానీ వేసే ప్రతీ అడుగులోనూ తోడుగా నిలచేది నిలబెట్టేది గాఢమైన భాందవ్యాలు. వాటిని డ్రాయింగు రూంలోనే వెతికితే కనిపించవు. ఎంత పెద్ద ఉపద్రవం ఎదురొచ్చినా, ఒక్క తాటిపై ఒకరికొకరం నిలబడ్డం లోనూ, ఒక్కోసారి తమ జీవితాలనే పణంగా పెట్టడం లోనూ కుటుంబం అసలు విలువ బయట పడుతుంది. ఈ సినిమా మరి కాస్త లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసి ఉంటే, ఫలితం ఇంకాస్త మెరుగ్గా వచ్చేదేమో.

పాటలు పెద్ద గుర్తు లేవు, ఆ టైటిల్ సాంగు తప్ప. అలా అని మరీ ఘోరం గా లేవు లెండి. ఇళయరాజానో, కీరవాణినో పెట్టుకుని ఉంటే ఇంకా అర్థవంతమైన సంగీతం వచ్చేదేమో. ఇంక డవిలాగుల విషయానికొస్తే, కొన్ని మరీ స్పీడు గా ఉన్నాయి (ముఖ్యం గా మహేష్ వి), అర్థం కాలేదు. కొన్ని అర్థం అయ్యాయి, కాని వాటికి పెద్దగా అర్థమే లేదు. ఎక్కడైనా ఒకటి రెండు మంచి మాటలు ఉన్నాయేమో లెండి, గుర్తు రావడం లేదు అంతే.

మనకు ఉన్న రిస్క్ మన టికెట్ డబ్బులే కాబట్టి, ఓ సారి చూసి, మొస్తరుగా ఉంది అని అనుకుంటే సరిపోతుంది. మల్టీ స్టారర్ సినిమాలు చూడ్డం మన భాధ్యత అంట కదా ?

(హీరోల పాత్రలకి దాదాపు సినిమా అంతా పెద్దోడు (వెంకీ) చిన్నోడు (మహేష్) అని తప్ప, అసలు పేర్లు పెట్టి రిఫర్ చెయ్యకపోవడం వెనుక ఏమైన తాత్పర్యం, ప్రతిపదార్ధం ఉన్నాయేమొ, నాకు తెలీదు.. )

పుర్రెకో బుధ్ధి కాబట్టి, ఇవి కేవలం నా అభిప్రాయాలు, చదివి ఎవరూ నొచ్చుకోకండి మరి.

6 comments:

 1. నిజం చెప్పటానికి, వున్న విషయం ఉన్నట్లుగా చెప్పటం మన టీవి చానళ్ళ వంధి మాగధులకు ఎలానూ రాదు.

  నిజం చెప్పినందుకు ధన్యవాదములు

  ReplyDelete
 2. >>బావులేదని చెప్పలేను, అలా అని గొప్పగా ఉందని అనడానికి మనసు రావడం లేదు
  Exactly.... సినిమా గురించి ఉన్నదున్నట్టు రాసారు!

  ReplyDelete
 3. సరిగ్గా చెప్పారు.. నాకు కూడా అచ్చం మీలాగే అనిపించింది.. ఇప్పుడు మనకున్న హీరోలలో వెంకటేష్, మహేష్ నిజంగా మంచి నటులు.. వీళ్ళిద్దరే కాక, మరెందరో ఇంకెందరో ప్రముఖ నటులూ ఉండి కూడా సరిగా వాడుకోలేదు దర్శకుదు.. మంచి కధతో ఈ సినిమా చేసి ఉంటే ఎంతో బావుండేది.. మీరన్న పాజిటివ్ లన్నీ కరక్ట్. అవీ, పాత్రల్లో ఒదిగిన హీరోలూ ఈ సినిమాని కాపాడాయి..

  ReplyDelete