Thursday, April 18, 2013

ప్యారిస్ లో శరవణా భవన్ :-)

చెన్నై నేలపై ఓ నాలుగు అడుగులు నడిచిన ఎవరికైనా శరవణా భవన్ తెలిసే తీరాలని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకున్న బ్రాంచ్ లు అన్ని మరి. ఈస్టు వెస్టు అని తేడా లేకుండా, చెన్నై లో నాలుగు వైపులా మనకి శరవణా భవన్లు దర్శనమిస్తాయి. ఇవి కాక ఆఫీసుల్లోనూ, IT పార్కుల్లోనూ వాళ్ళు నిర్వహించే కాంటీన్లు మరికొన్ని. బ్యాచలర్ గా చెన్నై వచ్చిన కొత్తలో నేను అశోక్ నగర్ దగ్గర్లో ఉండేవాణ్ణి, నా ప్రియమిత్రుడు అప్పటికే అక్కడ ఓ రూం లో ఉండడం వల్ల, నేనూ తనకి అతిధి గా వెళ్ళి, రూం మేట్ గా సెట్ అయ్యాను. వైజాగ్ నుంచి కోరమండల్ దిగిన రోజే, మా ఫ్రెండ్ నన్ను రాత్రి కాశీ థియేటర్ పక్కనే ఉన్న శరవణా భవన్ కి తీసుకువెళ్ళడం వల్లనేమో, నాకు ఆ రోజు నుంచీ శరవణా భవన్ తో ఒక అనుబంధం, ఆపేక్ష మరి. బ్రహ్మచారి గా రోడ్ల మీద తిన్న ఏడాదీ దాదాపుగా, ఉదయమూ రాత్రి నేను శరవణా భవన్ నే నమ్ముకున్నాను. నాకూ, నా స్నేహితుడికీ బాగా నచ్చే ఐటం, సాంబార్ వడ. :-) (మన పిజ్జాల భాషలో చెప్పాలంటే, విత్ ఉల్లిపాయ టాపింగ్)

పెళ్ళి చేసుకుని, చెన్నపురిలోనే ఓ మాదిరిగా సెటిల్ అయిపోయాక కూడా, నాకు శరవణా భవన్ ఎప్పుడూ మొదటి చాయిస్. ఏ పుట్టిన రోజు పార్టీకో, లేక ఏ NRI గారినో బయటకి తీసుకువెళ్ళాలనుకున్నా నేను మొదట దగ్గర్లో శరవణా భవన్ ఎక్కడుందా అని చూస్తాను. మా ఇంటికి దగ్గర్లో మైలాపూర్ లో పెద్ద బ్రాంచ్ ఉంది, మేము దాన్ని అలా ప్రొత్సహిస్తూనే ఉంటాం. ఒక వారం మా మామగారు మాకు పార్టీ అంటే, వచ్చే వారం మేము వాళ్ళకి ఇస్తుంటాం. ;-) ఏంటా అంత గొప్ప, అని మీరు కనుబొమ్మలు ఎగరెయ్యక్కర్లేదు.. చెప్తాను ఉండండి మరి. పోస్ట్ రాయడం అంటూ మొదలు పెట్టాక ఆ మాత్రం వివరాలు ఇవ్వకుండా ఉంటానా.. అన్నింటి కన్నా ప్రధమంగా పదార్థాలు బహు బాగుంటాయి. మన సౌత్ స్పెషాలిటీస్ అయితే మీరు ఇంక చూసుకోనక్కర్లేదు.. దోశల్లో రకరకాలు మరి ఇంక మీ/మీ జేబు ఓపిక. మన ప్లేట్ నుంచి పక్కనున్న గోడ దాటి అటువైపు మరో ప్లేటు లోకి తొంగి చూసేటంత పొడవైన దోశలు కూడా మిమ్మల్ని పలకరిస్తాయి. వాడు మెనూ లో పెట్టి వడ్డించిన ఐటం ఏదీ చెత్తలా ఉంది అని ఇంతవరకూ ఎప్పుడూ అనిపించలేదు. (గుజరాతీ వంటకాల మాట నేను ఎత్తను) నూడుల్స్, మంచూరియా లు కూడా ఎంచక్కా మన రుచుల్లోకి ఎదురొచ్చి, పాపం మనల్ని ఆట్టె ఇబ్బంది పెట్టవు. అవును, చైనీస్ అన్నామని నిజమైన చైనా భోజనం పెడితే చావమూ.. అక్కడ వైటర్స్ కి మంచి జీతాలు, PF లు వగైరాలు ఇస్తారని టాకు. ఆ కారణం వల్లో, మరి టిప్పుల మహత్యమో, వాళ్ళు ఎప్పుడూ ప్రసన్న వదనంతో మనకి కావాల్సినవి తెచ్చి వడ్డిస్తుంటారు. వాళ్ళ పై పర్యవేక్షణ కూడా మరీ ఎక్కువ, వజ్రాలు కోసే చోట కూడా అంత ఉండదేమో.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం.. దాని నేపథ్య సంగీతం ఎందుకంటే.. వచ్చేస్తున్నా.. వచ్చేస్తున్నా..

మీకు గత టపా లో విన్నవించుకున్నట్టు, ప్రస్తుతానికి ప్యారిస్ లో ఉన్నాను. మన జనాలు ఎక్కువగా ఉండే చోటుకి ప్రతీ వారంతం వెళ్ళి రావడం ఒక ఆనవాయితీ. ఆ పనిలో మొన్నోసారి పర్యటన చేస్తుంటే, శరవణా భవన్ కనిపించింది. మరి ఇంకో క్షణం ఆలోచించకుండా లోపలికి చొరబడ్డాను. "వాంగ.. వాంగ.. ఉక్కారంగా" అని వెల్కం. వెంట్రుకలు నిక్కబొడుచుకోలేదు కానీ, అంతపనీ అయ్యింది. హోటల్ ఖాళీ గా ఉంది, మధ్యలో వైను బ్యాటిల్స్ (ప్యారిస్ కదా మరి, మంచి నీళ్ళు లేకుండా అయీనా షాపు నడపచ్చేమో.. కానీ.. ) ఠీవిగా ఒక మసాల దోశ ఆరగించి, రూపాయల్లో చూస్తే కాస్త భారీగానే సమర్పించుకుని బయటపడ్డాను. దోశ బానే ఉంది, మన చెన్నై రుచి లేకపోయినా, పర్వాలేదు. (సింగపూర్, మలేసియాల్లోనూ నాకు అలానే అనిపించింది) హొటలే అంత ఖాళీ గా ఉంది అని కొంచం హర్ట్ అయ్యా, అంటే నేను వెళ్ళింది కూడా వేళ కాని వేళ లెండి. అయినా,  నేను ఎక్కడికి వెళ్ళినా, అక్కడో శరవణా భవన్ కనిపించడం ఏంటి చెప్పండి.. ఇదేదో జన్మ జన్మల సంబంధమే అని నేను కీబోర్డు నొక్కి వక్కణిస్తున్నాను. ప్యారిస్ లో కూడ దోశలు అమ్ముతున్నప్పుడు, మా విశాఖపట్నం లో ఎందుకు బ్రాంచ్ పెట్టలేదని నేను యాజమన్యాన్ని ప్రశ్నిస్తున్నాను. (ఆంధ్రాలో ఎటు చూసినా, వైన్ షాపులు, నాన్-వెజ్ పార్సిల్స్., అందుకే న్యూస్ చానల్స్ పెరిగిపోతున్నట్టున్నాయి రోజు రోజుకీ)

నిన్నటికి నిన్న మళ్ళీ అదే రోడ్డు లో వెళ్ళినప్పుడు, ఉందా, జనాలు లేక ఎత్తేసారా అని ఓ లుక్ వేసాను, కొంచం భయం గానే. మీరు నమ్మరు, హోటల్ తెరిచి ఉండటమే కాదు, లోపలికి వెళ్ళడానికి క్యూ ఉంది.. కుదుట పడ్డాను, శరవణా భవనా మజాకా.. (ఫొటో కూడా తీసాను చూడండి)

మరో మాట, ఈ పక్క రాష్ట్రాలనుంచి వచ్చిన వాళ్ళకీ, దేశాలు పట్టి పోయిన వాళ్ళకీ, ఈ పేర్లు గుర్తుండి చావవు. వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు, శరవణన్ భవన్ అనీ,.. లేక శరవణా స్టోర్స్ అనీ అంటుంటారు. మనసు చివుక్కుమంటుంది. ఇంకా నయమే శర్వానంద్ భవన్ అనలేదు అని సర్ది చెప్పుకుంటాను. వాళ్ళందరికీ ఇదే మనవి. పేరు బాగా గుర్తు పెట్టుకోండి మరి. ఏ ఆటో వాడికో ఇలా చెప్పేరనుకోండి, ఆవడి కవతలెక్కడో వదిలి వస్తాడు, సరిపోతుంది. 

(అవునూ ఇన్నీ రాసి మరో ముఖ్య విషయం మరచిపోయాను, మొన్నెప్పుడో మన విదేశాంగ శాఖవాళ్ళు శరవణా భవన్ వాళ్ళని సంప్రదించారట. బాబూ శ్రీలంకలో తమిళుల కోసం ఓ నాలుగు హొటెళ్ళు తెరవండి, పరిస్థితులు కొంచం మెరుగు అవుతాయేమో అని.. మా వాళ్ళు తెలివైన వాళ్ళు, అబ్బే మాకు ఆ సరదా/దురదా లేదు అని తేల్చేసారంట. లంక అని పేరుంటే, మన గోదారి జిల్లాల మీద కూడా దండెత్తే మూడ్ లో ఉన్నారు ఇప్పుడు తమిళనాడు జనం, ఈ టైం లో శరవణా భవన్ కి అంతటి రిస్క్ ఎందుకు చెప్పండి.. దోశ పెనం మీద పడ్డా, పెనం దోశ మీద పడ్డా కాలేది దోశే కదా.. ;-) )

3 comments:

  1. శరవణ భవన్ లో మీరు చెప్పినట్టు టిపినీలు బాగనెఉన్తయి గాని భోజనం అంత బాగోదు .నాకు ఇష్టమయినది మినీ టిఫిన్స్ అంటే ఒక రకం కాకుండా అన్ని రకాల తీపిని సామ్పుల్స్ రుచి చూసి వచ్చే వాడిని .

    ReplyDelete
  2. your narration is style is good.. :) Post chAlA bAgundi. sorry for commenting in english.

    ReplyDelete
  3. భలేగా రాసారు. మేమూ మా తమ్ముడి దగ్గరకు చెన్నై వెళ్ళినప్పుడల్లా అన్నానగర్ శరవణ భవన్ కి దాదాపు రోజూ వెళతాము. నాకూ బాగా నచ్హుతుంది కానీ చాలా గోలగా వుంటుంది. హొటలు కాస్త ప్రశాంతంగా వుంటే బావుంటుంది నాకు. మీ అదౄష్టం అక్కదా మీ "శరవణ భవన్" కనిపించినందుకు.

    ReplyDelete