Sunday, April 21, 2013

ఫ్రెంచ్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


ప్యారిస్ లో ఉద్యోగం వెలగబెట్టాలంటే, వర్క్ పర్మిట్, వీసా లతో పాటూ అదేదో దిక్కుమాలిన కార్డ్ ఒకటి ఉండి తీరాలి. దాన్ని పొందడానికి పెద్ద తతంగమే ఉంది. ఇవన్నీ చూస్తుంటే, ఎందుకొచ్చిన బాధ ఇదంతా అని రోజుకోసారేనా అనిపిస్తోంది. ఆ రెసిడెంట్ కార్డ్ కి దరఖాస్తులో అతికించడానికి కొన్ని ఫొటోలు అవసరం, ఆ ఫొటో కి ఉండాల్సిన లక్షణాలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలీలేదు.

ఈ గొడవలన్నీ కొంచం ముందుగానే పసిగట్టి, నేను చెన్నై లోనే ఓ మాదిరి ఫొటో తీసుకునే బయలుదేరాను, ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ కంటే మా తమిళ ఫొటోగ్రాఫర్ తో అయితే మన అవసరం కొంచం సరిగ్గా చెప్పుకోవచ్చు కదా అని. ఆఫీసు ఉన్న IT పార్క్ లోనే ఒక ఫొటోగ్రాఫర్ ఉంటే, ఆయన్ని సంప్రదించి, బాబూ ఇదీ నాకు కావాల్సింది అని చెప్పబోతే, మీకెందుకు నేను తీస్తాను కదా, అని ఓ పదినిమషాల్లో నా చేతిలో కొన్ని ఫొటో లు పెట్టాడు. చూడ్డానికి నా ముఖం లానే ఉన్నాయి ఆ ఫొటోలు, అయినా ఫొటో లో మనం మరికాస్త అందం గా కూడా లేకపోతే ఎందుకు చెప్పండి డబ్బు తగలెయ్యడం. మనం ఉన్న పరిస్థితి వేరు కాబట్టి, అందం కన్నా సైజు, కొలతలు ముఖ్యం అని సరిబెట్టుకుని వాటినే  వీసా వగైరా కార్యక్రమాలకి వాడాను. ప్యారిస్ వచ్చాక ఈ కార్డ్ విషయమై అదే ఫొటో ని మా అఫీసు వాళ్ళకి పంపితే, అది నిబంధనలకు తగినట్టు లేదు అని తేల్చేసారు. అదేంటయ్యా, మరి అదే ఫొటో ఫ్రెంచ్ కాన్సులేట్ వాళ్ళకి సరిపోయిందిగా మా పుదుచ్చేరి లో అంటే, ఆ ఊసు మాకెందుకు, ఇది మాత్రం చెల్లదు అన్నారు. ఎందుకు అని నిలదీస్తే, మొహం కొలతలు సరిగ్గా లేవు అన్నారు. నా మొహమే అంతేమో అని తీవ్రంగా ఆలోచించి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను..

ప్రతీ డిప్రెషన్ ఏదో ఒక చోట ఆగాల్సిందే, అది దాని హక్కు. సో తేరుకుని, గూగుల్ ని ఆశ్రయిస్తే తేలిందేమిటంటే, ఈ ఫొటోల కి ఒక ISO స్టాండర్డ్ ఉండి ఏడ్చింది. (ISO/IEC 19794-5 2005) మొహం ఫొటోలో ఇంత భాగం ఉండాలి, మొత్తం ఫొటో సైజ్ ఇంతే ఉండాలి.. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ ఇలా ఉండకూడదు.. అలా ఉండకూడదు.. జుట్టు కళ్ళ మీద పడకూడదు.. మీరు నవ్వ కూడదు.. ఏడ్వకూడదు.. ఏడ్చినా కన్నీళ్ళు కనిపించకూడదు.. పళ్ళు ఉండచ్చు.. కానీ కనిపించడానికి వీల్లేదు. మీ బుస్కోటుకి బొత్తాయిలు ఆరే ఉండాలి.. మీ బెల్టు పొడవులోంచి షూ లేసుల పొడవుని తీసేస్తే మీ ముక్కు పొడవుకి సరిగ్గా సరిపోవాలి.. మరియు మీ బొంద.. మీ పిండాకుడు. (ఇంకా నయమే కనుబొమ్మల్లో ఇన్నే వెంట్రుకులుండాలి అనలేదు, లెక్కెట్టలేక చచ్చేవాణ్ణి. ) ఇవన్నీ చూసి నాకు ఫొటో అనే విషయం మీదే ఒక విరక్తి వచ్చేసింది. కానీ ఏంచేస్తాం... మరో మార్గం లేదే. సో ప్యారిస్ లో ఈ నూటా తొంభై నిబంధనలూ పాటిస్తూ ఫొటో తీసే సిద్దహస్తుడు ఎవరైనా ఉన్నాడా అని మళ్ళీ ఇంటర్నెట్ లోనే వెతికాను. వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ ని ఆంగ్లం లోకి తర్జుమా చేసుకుంటూ చూస్తే, తెలిసిందేంటంటే, ఒక తలమాసిన స్టూడియో ఉందని. ఫలానా ఫలానా మెట్రో స్తేషన్ల మధ్య వాళ్ళ అడ్రస్సు అని. ఆ వివరాలన్నీ ప్రింట్ చెసుకుని (ముప్ఫైలు దాటాక మనం మన మెమొరీ మీద ఆట్టే ఆధారపడ్డం విజ్ఞత అనిపించుకోదు.. :-) ) శనివారం నా స్వయంపాకం అయ్యాక తీరిగ్గా బయలుదేరి వెళ్ళాను.

ఆ స్టూడియో ఏదో ఈ ఫొటోలకి ప్రసిద్ధి లా ఉంది, వచ్చిన  వాళ్ళ్లందరూ ఈ కేసులే. నేను నాకు కావాల్సిన ఫార్మాట్ వివరాలు కూడా  పట్టుకెళ్ళా, అవి చూపించబోతే, అక్కడ ఉన్న ఆవిడ, ఫ్రెంచ్ ఫార్మాటే కదా.. మాకు తెలుసు అంది. ఊపిరి పీల్చుకున్నానా, ఈ లోగా మరో ట్విస్టు, మీ కళ్ళజోడు తీసేయండి అంది. అమ్మా, మావోయిస్టులకి గన్నులా ఇవి నా శరీరం లో అంతర్భాగం, వాటిని ఎలా తీస్తాను అని ఒక వెర్రి ప్రశ్న సంధించాను. ఆవిడ చాల వీజీగా, ఫ్రెంచ్ వాళ్ళు కళ్ళద్దాలు ఉంటే ఒప్పుకోవడం లేదు, నాకు తెలుసు, తీసెయ్ అని ఒక ఆర్డరు వేసింది. ఏదైన తీసేవాడికి తీయించుకునేవాడు లోకువ కదా, అయితే ఓ.కే అని అరచి.. ఫొటో కార్యక్రమాన్ని ముగించాను. ఓ పదినిమషాలు ఆ సందులోనూ, ఈ సందులోనూ పచార్లు చేసి, ఇంత ఎండ ఉన్నా ఈ చలేమిటబ్బా అని ఆక్రోశించి, ఫొటోలు కల్లక్ట్ చేసుకున్నాను. ఫొటోలు బానే ఉన్నాయి, అసలే సులోచనాలు లేవు కదా, ఇంకాస్త ఇంపుగా ఉన్నాయి. నేను నా కళ్ళజోడుని ఓ సారి మళ్ళీ బాగా తుడిచి పెట్టుకుని ఫొటోలు చూసుకుని, అవి ఫార్మాట్ ఉన్నాయో లేదో తెలీకపోయినా, ఉన్నట్టే ఫీల్ అయ్యి, వెనక్కి బయలుదేరాను.

అదీ ప్రస్తుతానికి నా వీకెండ్ ప్రోగ్రెస్. వచ్చేవారమో ఎప్పుడో, ఫ్రెంచ్ ప్రభుత్వ ఆఫీసుకుపోయి ఈ ఫారాలు ఇచ్చి రావాలి.. అదేదో తిరుపతి వెంకన్న వద్ద లైనులా ఉంటుంది అని టాకు., ఏ తెల్లవారుజామునో కాలకృత్యాలు తీర్చుకుని, తలమీంచి స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని బయలుదేరాలేమో.. లేదా మరీ ముందు రోజు రాత్రే వెళ్ళమంటారో. మన ఖర్మ ఇలా కాల్తుంటే, కిరణ్ కుమర్ రెడ్డి మాత్రం ఏంచేస్తాడు..


ఓదార్పు కావాలి రా స్వామీ అంటే, ఓ టెంకి జెల్ల ఇచ్చుకున్నాడనీ.. ఈ బాధలన్ని మా ఆవిడకి చెప్పుకుంటే, దానికేముంది, వెనక్కి వచ్చేయి అని సలహా పడేసింది. మరి ఇంటి లోను మాటో ?  ;-)

2 comments:

  1. ఓదార్పు కావాలి రా స్వామీ అంటే, ఓ టెంకి జెల్ల ఇచ్చుకున్నాడనీ


    :-)

    ReplyDelete