Saturday, May 18, 2013

జ్ఞాపకాల్లోని మనుషులు


జీవితపు ప్రయాణం లో ప్రతీ మజిలీ కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. వారిలో కొందరు మనతో కొన్ని రోజులు నడిచి, తర్వాత మాయమైపోతారు. ఆ కాస్త దూరం మన జీవితాల్ని పూర్తిగా ఆవరించినా, దూరమై,  వాళ్ళ దారుల్లో సాగిపోతారు. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మనతో వెన్నంటే ఉంటాయి ఎప్పటికీ. కాల ప్రవాహంలో జీవితం ఎన్నో మార్పులకి గురి అవుతుంది, మన ఆశలు, అభిప్రాయాలు, వ్యక్తిత్వం కూడా దానికి తగ్గట్టే పరిణామం చెందుతాయి. మంచికో, చెడుకో. తెలీకుండానే మనం ఎంతో మారతాం. కానీ మన జ్ఞాపకాల్లోని మనుషులు మారరు, అలానే ఉండిపోతారు. బహుశా మనం ఆ జ్ఞాపకాల్ని కొత్త అనుభవాలతో రీప్లేస్ చెయ్యకపోవడం వల్ల కావచ్చు. అందుకే వాళ్ళను గుర్తు తెచ్చుకుంటే, ఒక హాయి ఉంటుంది, ఆ బంధం ఎప్పుడూ పరిమళిస్తూనే కనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తుల జీవితాలు అలానే ఉండిపోవు, మన లానే వాళ్ళూ. మనం వీడ్కోలు చెప్పాక, ఎన్నో ఒడిదొడుకులని ఎదుర్కుని ఉంటారు, కష్ట నష్టాలని ఓర్చి ఉంటారు. ఎంతో మారి ఉంటారు. కానీ ఆ మార్పు మనం ఊహించలేం, అది మనకు అందనిది.

ఎప్పుడో ఆ వ్యక్తులు మళ్ళీ మన జీవితం లో తారసపడినప్పుడో, లేక, మనమే కావాలని కలవడానికి ప్రయత్నించినప్పుడో, ఒక వింత అనుభవం ఎదురౌతుంది. గతాన్ని నెమరవేసుకోవడం వరకూ బానే ఉంటుంది, ఇద్దరికీ అది ఒక్కటే. కాని అది గతమే, వర్తమానం కాదు. "మనం" అని కలిసి ఉన్న రెండు చేతుల్ని వూహించుకుంటే, ఇప్పుడు వాటి మధ్య దూరం ఒక ప్రపంచం అనిపిస్తుంది. ఇన్నాళ్ళూ మన ఊహలన్నీ తప్పా, ఇదా నిజం అని ఆశ్చర్యపోతాం. దిగాలు పడిపోతాం. ఒక నిరాశ ఆవహిస్తుంది. వాళ్ళకి కూడా అలానే అనిపిస్తుందేమో కూడా. మార్పు లేకుంటే ఎంత బావుంటుంది.. బాల్యం బాల్యం లానే ఎప్పటికీ ఉండిపోతే.. కానీ సాధ్యం కాదు. మారనది నశిస్తుంది అంటారు.. మారేది నశించకుండా ఉండిపోతోందా ?

అలాంటి సందర్భాల్లో, ఆ వ్యక్తిని మళ్ళీ కలవకపోతే, ఆ వ్యక్తి గురించి కొత్తగా ఏమీ తెలుసుకోకపోతే, ఎంత బావుండేది అనిపిస్తుంది నాకు. జ్ఞాపకాలే నిజం అనుకుని, వాటిలోనే సేదతీరడం ఎంత మేలో కదా.. మానవ సంబంధాల్లోకి లోతుగా వెళ్తే, ఏది నిజం ఏది అబద్దం. ఏమో. మనసు పొరల్లో ఎన్ని అసంపూర్ణ కవితలు, వాటికి ముగింపు లేకపోతేనే అందమేమో..

మొన్నెప్పుడో రాసుకున్నా.. ఈ వాక్యం.

"కనిపించిన ప్రతీ వ్యక్తిలోనూ నేను నిన్నే వెతికాను. కానీ నీలోనే నువ్వు మిగల్లేదు, నాలో నేనూ మిగల్లేదు. దేన్ని వెతుకుతున్నాను. ఎందుకు. "

(ఏదో ఆలోచిస్తూ, ఏదో రాసాను. అర్థం అయితే ఆనందమే. కాకపోతే, తిట్టుకోకండి, లైట్ గా తీసుకోండి. )

3 comments:

  1. చక్కగా రాసారు. నిజమే. కొన్ని జ్ఞాపకాలుగానే మిగిలిపోతే మనసుకి ఏ బాధా ఉండదు. చాలా గాప్ తర్వాత వాళ్ళని కలిసి , కలిసామన్న ఉత్సాహానికన్నా, కలవకుండా ఉంటేనే బాగుండును అనిపిస్తూ...మీరు రాసుకున్న వాక్యం నేను అనుకుంటున్నదానికి అక్షర రూపంలా ఉంది.

    ReplyDelete
  2. మీరు చెప్పింది నిజమేనండీ.. మీ పోస్టు చదువుతుంటే ఇదే ఇతివృత్తంతో అప్పుడెప్పుడో నేను రాసిన కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఆ కథ పేరు 'కాలం తెచ్చిన మార్పు'.

    ReplyDelete
  3. chala baga rasrandi idi nenu fb lo share cheskuni dachukunta

    ReplyDelete