Thursday, August 29, 2013

మద్రాస్ కెఫే (చిత్రం)ఒక్కోసారి ఏది నిజమో, ఏది అబద్దమో ఎవరికీ తెలీదు. ఎప్పటికీ. అలాంటి కథే మద్రాస్ కెఫే చిత్రానిది. శ్రీలంకలోని అంతర్యుద్ధం, ఊచకోత, భారత శాంతి సేన, దాని పర్యావసానంగా రాజీవ్ హత్య. ఈ నేపధ్యంలో తీయబడిన చిత్రం ఇది. అది "మన కథ" అనుకుంటే ఎంతగానో ప్రభావితం చేస్తుంది, మనం ఏమాత్రం సామీప్యం ఫీల్ అవ్వకపోయినా చూడదగిన చిత్రమే. ఓ కులం మీదో, వర్గం మీదో తీస్తేనే సినిమాలు విడుదల అవుతాయని నమ్మకం లేని ఈ రోజుల్లో, నిజాయితీగా, అనవసరపు వివాదాలకి తావివ్వకుండా చెప్పాలుకున్నది చెప్పగలగడం సామాన్యమైన విషయం కాదు. అందుకు ఖచ్చితం గా దర్శకుడిని అభినందించాలి. ఈ సినిమా తమిళనాడు లో ఎలాంటి భావోద్వేగాలను రేకెత్తిస్తుందో వేచి చూడాలి.

చిత్రం చూసిన వెంటనే నేను రాసుకున్న వాక్యం..

"కాటిన ఉదయించిన తొలి కిరణం, బహుశా నిజానిజాల జోలికి వెళ్ళదు. ఎందుకంటే, మరణానికి హృదయం లేదు. దాని ముంగిట మిగిలింది కేవలం ఆర్తనాదం."

Sunday, August 25, 2013

నా కలలు.. వాటి కళలు..


నిద్ర సుఖం ఎరుగదు అంటారు, అది ఏమో గాని, సరైన నిద్ర లేనిదే సుఖం లేదు. కళ్ళు మూసిన వెంటనే అలా వాలిపోయే మహానుభావులు ఎంతో అదృష్టవంతులు. నాకు మాత్రం సుఖ నిద్ర కొంచం అందని ద్రాక్షే. అంటే, ఫుల్ గా అలసి సొలసిన రోజు పర్లేదు లెండి, కానీ మామోలు రోజులు మాత్రం, మన్మోహన్ సింగ్ నుంచీ, మొగలి రేకుల వరకూ.. ఒబామా నుంచీ ఆర్కే ఓపెన్ హార్ట్ వరకూ అన్నీ ఆలోచిస్తే తప్ప నిద్రాదేవి కరుణించదు. పక్క ఎక్కాకే ఎందుకో అవసరం లేనివన్నీ గుర్తొస్తాయి. "నిద్రపోతే మరచిపోగలను.. నిదుర రాదు.. మరచిపోతే నిద్రపోగలను.. మరపు రాదు.." ఈ టైపు లో ఎప్పటికో నిద్ర పడుతుందా, దాంట్లో మళ్ళీ బోలుడన్ని కలలు.. వాటి కళలు.. ఈ కల కళల మధ్య తెల్లారిపోతుంది.

వివరాల్లోకి వెళ్ళేముందు, అలా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కవర్ చేసి వద్దాం. చిన్నప్పుడు నిద్ర పట్టకపోవడం అంటూ పెద్దగా ఉండేది కాదు లెండి. కానీ కలలు మాత్రం విపరీతం. నిద్రలో మాట్లాడడం, లేచి కూర్చోవడం, వీలయితే నిల్చోవడం.. ఇవన్నీ పుట్టగానే పరమళించాయి. మా ఇంట్లో కూడా బాగా అలవాటయిపోయి, పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఓసారి అయితే, లేచే సరికి వేరే రూమ్ లో క్రింద పడుకుని ఉన్నా.. ఈ సదుపాయాలూ అన్నీ చూసి మా అమ్మగారు, మంచం క్రింద ఎత్తు కూడా తీయించేసారు. ఎప్పుడైనా మంచం మీద నిలబడితే ఫ్యాన్ తగులుతుందని ఆవిడ భయం. నాతో పాటుగా, ఈ కళలన్నీ పెరగకపోయినా, పూర్తిగా వదిలి మాత్రం వెళ్ళలేదు. బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, ఇదే భయంగా ఉండేది నాకు. పరీక్షలప్పుడు ప్రశ్నాపత్రాలు కనిపించేవి. కానీ ఒక్క ప్రశ్నా మరుసటి రోజు పేపర్లో వచ్చేది కాదు. వచ్చుంటే, నేను కూడా కాల జ్ఞానం కాకపోయినా, కనీసం కల జ్ఞానమైనా రాసేవాణ్ణి.

పెళ్ళిలో, శాస్త్రానికి అప్పగింతలు అయిపోయాక, అసలు అప్పగింతలు హనీమూన్ కి ముందు మొదలైనప్పుడు (ఎందుకంటే, అప్పగించాల్సింది అబ్బాయిగాడినే అని నా మూఢ నమ్మకం మరి), మా అమ్మగారు మా ఆవిడకి కొంచం క్లారిటీ, ష్యూరిటీ ఇచ్చారు. కొన్నాళ్ళకి, మా ఆవిడ మెట్యూరిటీ కి నా కళలు అలవాటు అయిపోయాయి. ఎంతంటే, నేను మెలుకువగానే మాట్లాడుతున్నా, నిద్రలోనే మాట్లాడుతున్నానని అనుకుంటుంది అపుడప్పుడు. అలాంటప్పుడే, మనం "ఆహా నువ్వు అర్థాంగి గా లభించడం, ఎన్ని జన్మల పుణ్యమో కదా.. " అనేస్తూ ఉండాలి. పోనీలెండి, ఇప్పుడు పుణ్యం గురించి ఎందుకు గాని, మరీ తనకి నిద్రా భంగం చేస్తే మాత్రం, ఓ కసురు కసిరి, పడుకోండి అంటూ ఆదేశిస్తుంది. నిద్రలోనే ఉన్నా, భార్యా విదేయుణ్ణే కనుక, కిక్కురమనకుండా, మళ్ళీ పడుకుంటాను. ఒక్కోసారి నాకు పెను అనుమానం వచ్చేస్తూ ఉంటుంది, ఈ అప్రస్తుత ప్రసంగాలలో, ఏం చెప్పేస్తున్నానో అని. ఏ వీరోయిన్ పేరో చెప్తే నెట్టుకురావొచ్చు కాని, ఏ "నా ఆటోగ్రాఫ్" స్నేహితురాలి పేరో కలవరిస్తే, అమ్మో, మళ్ళీ మనకి కాఫీ నీళ్ళైనా పుడతాయా. ఏదో దేవుడికి, మనకి మరీ ఆ రేంజ్ ఫాక్షన్ తగాదాలు లేవు కాబట్టి, అలాంటి ట్విస్టులు ట్విస్టలేదు.

ఇంతకీ ఎలాంటి కలలు వస్తాయి అంటే, మీరు నమ్మరు రాని టాపిక్ లేదు. చదివిందే మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదివి ఎం.టెక్ పట్టా అందుకున్నా, "పరీక్షలు" మాత్రం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పటికీ. పరీక్షా కేంద్రానికి వెళ్తున్నప్పుడు బస్సులు, ట్రైన్లు, విమానాలు, వీలయితే ఆటోలు, రిక్షాలు, మిస్ అయిపోవడాలు.. ఒక చోటుకి బదులు మరో చోటుకి వెళ్ళడాలు.. ఇలాంటివి అన్నమాట. కొండలు, బండలు, పడిపోవడాలు, ఎగిరిపోవడాలు.. ఇలాంటివి కొన్నిసార్లు. మనకి తెలిసిన లాజిక్కులకి, చూసిన మాజిక్కులకి అతీతం గా ఉంటుంటాయి. ఏ ఆదివారం మధ్యాహ్నమో గంట పడుకుని లేస్తే , రెండు గంటల నిడివి కల గుర్తుండిపోతుంది. ఏంచేప్పమంటారు, కల చించుకుంటే, కళ్ళ మీద పడిందని.. ఒక్కోసారి ఓ పెద్ద ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది, నేనేమో ప్రాణాలని తెగించి అందరిని కాపాడేస్తుంటాను. ఏమిటి ఈ భ్రమ చెప్పండి, నిజంగా అలాంటిది ఏదైనా అయితే, ముందే పారిపోమూ. మరికొన్ని సార్లు మరీ ఘోరం ఏంటంటే, అసలు నా కలలో నేనే ఉండను. అది కల కాదు ఓ మోస్తరు సినిమా లా ఉంటుంది. మీకో శాంపిల్ ఇస్తాను ఉండండి, ఫ్రీ ఏ. (శాంపిల్ కదా)

ఓ ఊర్లో ఓ పెద్ద బ్యాంక్ దోపిడీ జరుగుతుంది. అదేదో ఖజానా అక్కడే ఉండడం వల్ల, పోయిన దాని విలువ కోట్లు ఉంటుంది. పదుల సంఖ్యలో బందిపోట్లు చేసిన ఈ దోపిడీ లో ఏ క్లూ దొరకదు. విచారణలో, ఆ దొంగలు కొందరు స్థానికులని కూడా కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయారని తెలుస్తుంది. కేసు ఎన్నేళ్ళు గడిచినా ఏ పురోగతీ సాధించదు. దొంగలు పట్టుకెళ్ళిన వాళ్ళ ఆచూకి కూడా తెలీదు. ఇంక కేసు మూసేద్దామనుకునే టైం కి, ఆ కేసు ఆఫీసర్ కి ఒక చిన్న అనుమానం వస్తుంది, ఈ దొంగతనం జరిగిన ప్రాంతానికి ఓ రెండు వందల కిలోమీటర్ల దూరం లోని ఒక గ్రామం మీద. ఎందుకంటే, ఏ ప్రత్యేక వనరులూ లేని ఆ గ్రామం కొన్నేళ్ళ లోనే ఏంతో అద్వితీయమైన అభివృద్ధి ని సాధిస్తుంది. స్కూళ్ళు, చెరువులు, రోడ్లు, కుటీర పరిశ్రమలు.. ఒకటేంటి అన్ని రంగాలలోనో ఏంతో పురోగమిస్తుంది, ఇదంతా కూడా ప్రభుత్వం నుంచీ ఏ సహకారం లేకుండా. ఇదెలా సాధ్యం అని తేల్చుకోడానికి ఆ గ్రామం వెళ్ళిన ఆఫీసర్ కి కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు తెలుస్తాయి. ఏళ్ల తరబడి కరువు, పేదరికం లో మ్రగ్గిన ఆ గ్రామస్తులు, కసితో, పట్టుదలతో ఓ ఏభైమంది ఒక బృందం గా ఏర్పడి, ఏంతో పకట్బందీగా ప్లాన్ చేసి ఆ బ్యాంకు ని దోచుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా, కొందరు ఏళ్ల తరబడి ఆ బ్యాంకు పరిసరాల్లోనే నివాసముండి, అక్కడ స్థానికులతో కలిసి పోతారు. దోపిడి అనంతరం ఆ సంపదని, వ్యక్తిగత ప్రయోజనాలకి వాడకుండా, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అదీ కల. ఇది కల కాబట్టి.. దీనికి శుభం కార్డులు, మెసేజ్ లు లేవు మరి. ఏదో పాత ఫ్లాపు హిందీ సినిమా లా లేదూ ? ఆ మధ్య తీస్మార్ ఖాన్ అనే హిందీ సినిమా చూస్తుంటే, నాకు నా కలే గుర్తొచ్చింది. అయినా హ్యాపీ గా నిద్రపోతుంటే, ఇంత పెద్ద పెద్ద కలలు అవసరమా చెప్పండి నాకు. అసలు ఓ చిన్న కామెడి ట్రాకు కూడా లేకుండా..

ఇలా కథలాంటి కలలు ఎప్పుడైనా వస్తుంటాయి. ఏ అర్థం లేనివి రోజూ వస్తాయి. ఇంకో వింత ఏంటంటే, అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు కలలో వస్తాయి. లేచే సరికి కొన్ని లైన్లు గుర్తుంటాయి కూడా. ఈ కలల గడబిడ లో లేవడాలు, కలలోని పాత్రలు నిజంగా కనిపించడాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యం గా పక్షులు వగైరాలు.. మొన్నటికి మొన్న చెన్నై వెళ్ళినప్పుడు, ఓ రోజు, నిద్రలోనే ఒక గదిలోంచి మరో గదికి వెళ్లి, మా బుడ్డోడు సరిగ్గా పడుకున్నాడో లేదో అని చూస్తున్నాను. మధ్య రూమ్ లో పడుకున్న మా మామయ్యగారు కంగారిపడితే, అప్పుడు మెలుకువ వచ్చింది నాకు. ఏదో కవరింగ్ ఇచ్చి, మళ్ళీ నా గదిలోకి వెళ్లి పడుకున్నా. ఈ మధ్య కొత్తగా వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, "ఇది కలే" అని కొన్ని సార్లు నాకే తెలిసిపోతోంది. సో నేనే లైట్ గా తీసుకుని పడుకుంటున్నాను. ఎప్పుడైనా పొరపాటున రాత్రంతా లేవకుండా బుద్ధిగా పడుకుంటే, మా ఆవిడ ఉదయాన్నే పరామర్శిస్తుంది.. ఏంటండి మధ్య రాత్రి లేవలేదు అని.. అదేదో రూపాయి మారకం విలువ పెరిగిపోయినట్టు.

ఆ మధ్య ఎప్పుడో మైగ్రైన్ కోసమని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నా నిద్ర బాధ చెప్పుకున్నాను. ఆయన అన్నీసావకాశం గా విని, కొన్ని కాగితం మీద కూడా రాసి.. ఇదంతా ఓకే, మీకు తదుపరి రోజు కూడా డిస్టర్బ్ అవుతోంది అంటే చెప్పండి, మాత్ర ఇస్తాను అని నాకు ఒక పండగ ఆఫర్ ఇచ్చాడు. వద్దులెండి నా బాధేదో నేనే పడతాను అన్నా. ఏ నాలిక్కి మందేస్తే ఏ నాలిక ఊడుతుందో ఎవరికి తెలుసు.. అదండీ సంగతి.. ప్రస్తుతానికి పారిస్ లో స్వయంపాకం పుణ్యమాని ఎలాగో అర్థాకలే కాబట్టి, నిద్రే సరిగ్గా లేదు, సో కల కళలు కూడా పెద్దగా లేవు.

Thursday, August 15, 2013

నేను, ప్యారిస్సు, ఓ ప్లాస్టిక్ కార్డు..


మొన్న పోస్ట్ లో నా అర్థం కాని కవిత చదివి మీకు నేను పారిస్ తిరిగి వచ్చేసానని తెలిసిపోయే ఉంటుంది. జూన్ లో మా ఆవిడ డెలివిరికి ఇండియా వెళ్లి, మా బుడ్డోడు పుట్టి నెలన్నర కావొస్తున్నా, వాడు ఇంకా కవితలూ, కాకరకాయలూ రాయకపోవడం తో హర్ట్ అయ్యి, ఇంకా నేను అక్కడే ఎదురు చూస్తే, మా ఫ్రెంచ్ వాళ్ళు నన్ను పూర్తిగా మరచిపోయే సదుపాయం ఉందని గుర్తెరిగి, ఓ పదిరోజుల క్రిందట పారిస్ వచ్చేసాను.

గతసారిలా కాకుండా, ఈ సారి కాస్త తక్కువ లగేజ్ తోనే బయలు దేరడం తో, బోర్డింగ్ కౌంటర్ వాడు వద్దన్నా, నేను హ్యాండ్ లగేజ్ వెయిట్ కూడా చూపించి, వాడిని భయపెట్టాను. నా దోహా ఫ్లైట్ టైం కి రావడం వలనా, హోటల్ రూమ్ కీస్ కూడా ఉండాల్సిన చోటే ఉండడం వలనా, ఈసారి నా పరాక్రమ ప్రతిభాపాటవాలు చూపించాల్సిన అవసరం పడలేదు. దేవుడు కూడా మనకి అలవాటైన తలనొప్పులని మళ్ళీ ఇవ్వడు. తెలుగు ప్రేక్షకుడిలా కొత్తదనం కోరుకుంటాడు కాబోలు.

ఇంతకీ టైటిల్ లో పెట్టిన ప్లాస్టిక్ కార్డు సంగతి ఏంటంటే, అదేదో పాత పోస్టులో మొత్తుకున్నట్టు, ఇక్కడ పని చెయ్యాలంటే, వర్క్ పర్మిట్ వీసాలతో పాటూ ఒక రెసిడెంట్ కార్డు తీసుకోవాలి. దానికోసమని నేను విశ్వ ప్రయత్నాలు, భగీరధ ప్రయత్నాలూ, ఆత్మహత్యలు లేని ఉద్యమాలు, వగైరాలు అన్ని చేసి, అది రాక, ఎప్పుడొస్తుందో కానరాక, "ఇక ఇంటికి ఏమని పోను" అని సోలో పాటలు పాడుకుంటుంటే.. మా ఫ్రెంచ్ బాసు కరిగి, కరుణించి, "దానికేముంది, ఆఫ్టరాల్, ఓ ప్లాస్టిక్ కార్డు కోసమని ఉండిపోతావా నువ్వు మీ ఆవిడ డెలివరీ కి వెళ్ళకుండా", అని ఆగ్రహించాడు. ఆగ్రహం ఎలా ఉన్నా, భావం నచ్చి, ముద్దొచ్చినప్పుడే కదా చంక ఎక్కాలి అని గ్రహించుకుని, "అదే కదా మరి నా బాధ కూడా.." అని వాపోయాను.  ప్రతీ దరిద్రానికి, అంత కంటే దరిద్రపుగొట్టు ఉపాయం ఒకటి ఉంటుంది కదా, ఆయనే మా ఇమ్మిగ్రేషన్ టీమ్స్ వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు, "ఉంది ఓ మార్గం, మీలా కార్డు లేకుండా, ఇండియా వెళ్ళాల్సిన వాళ్ళకి, ఓ పద్ధతి అంటూ ఏడిచింది" అన్నారు. ఏంటయ్యా అది, కొంచం నారద మహర్షి లా డిటైల్డ్ చెప్పండి అంటే..

అదేదో యుగం లో వాడెవడో కన్సల్టెంట్ కి ఇలాంటి కష్టమే వస్తే, అప్పుడు వాడు ఇక్కడ ఏ వ్రతాలూ చెయ్యకుండా, ముందు ఇండియా వెళ్ళిపోయాట్ట. తరువాత వస్తున్నప్పుడు, ఇండియా లోనే ఫ్రెంచ్ ఎంబెసీ వాళ్ళని కలిసి మొరపెట్టుకుంటే, "రిటర్న్ వీసా" అనే ఒక ప్రత్యేకమైన వీసా ఇచ్చారట. ఈ  తొక్కలో వీసా నాలా ఎవడో చుక్కల్లో చంద్రుడికి తప్ప అవసరం పడదు కనుక, అది ఎలా అప్లై చెయ్యాలో మా వాళ్ళకీ సరిగ్గా తెలీదు. ఒకరు నెల అంటే, మారోళ్ళు మూడు నెలలు పడుతుంది అని భయపెట్టారు.
ఈ టీవీ9 అన్వేషణ కొనసాగుతున్న టైం లోనే, మా ఫ్రెంచ్ ఇమ్మిగ్రేషన్ లో ఒక ఆవిడ, ఆ రిటర్న్ వీసా ఇక్కడ కూడా ఇస్తారు అంది. మనం పొద్దు ఎప్పుడూ ఎరగం కదా, మర్నాడే ఇక్కడి ఫ్రెంచ్ ఆఫీసుకు పోయి, నా బాధ చెప్పుకున్నాను. (ఓ మూడు గంటలు లైన్లో నిలబడి) వాళ్ళు అంతా తీక్షణంగా విని, అలాంటివి అన్నీ మేము ఇవ్వమోచ్ అని ఫ్రెంచ్ కుండ బద్దలు కొట్టారు. అలా ఆ ముచ్చటా తీర్చుకున్నాను.

ఇంక ఇలా కాదు అని, ఏది అయితే అది అయ్యిందని, ఇండియా బయలుదేరి వచ్చేసాను. మా బుడ్డోడు పుట్టిన వారానికి మా వాళ్ళని కలిసి నా పరిస్థితి విన్నవించుకున్నాను.  మా వాళ్ళు వేళ్ళు, కాళ్ళు అన్నీ లెక్కపెట్టుకుని, నా చేత ఓ మూడు నాలుగు వేరే వేరే దరఖాస్తులు నింపించేసారు. అప్పాయింట్మెంట్ రోజు ఆ వీసా అప్లికేషను సెంటర్ కే పోయి, వాళ్ళకి నాకు కావాల్సిన వీసా గురించి వివరించాను. వాళ్ళకీ పెద్దగా అవగాహన లేదు, అక్కడ ఉన్న వాళ్ళ  పై అధికారులతో సంప్రదించి నాకో మార్గం చూపించారు. అన్ని డాక్యుమెంట్లతో పాటూ, జెరాక్స్ మెషిన్ లో ఓ తెల్లకాగితం అడిగి తీసుకుని, కవితాత్మకంగా ఓ ప్రేమ లేఖ కూడా రాసి, నా దరఖాస్తు తో జోడించి మరీ సబ్మిట్ చేసాను.

అందరి దేవుళ్ళపై భారం ఉంచి, హై కమాండు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహించడానికి సిద్దంగా ఉన్నాను. ఓ రెండు వారాలు గడిచాయి, ఏ సౌండూ లేదు. నేను ఇంక చెన్నై లోనే "అంకితం.. మీకే అంకితం.." అని పాటలు పాడుకుంటూ ఉండగా, నా గ్రహాలూ ఏమనుకున్నాయో పాపం.. కాస్త అనుకూలించాయి. ఓ రెండ్రోజులకి నా వీసా వచ్చింది. మళ్ళీ మా ఫ్రెంచ్ బాసులతో తేదీలు డిస్కస్ చేసుకుని, మా కంపెనీ ప్రాసెస్ ప్రకారం ఆ రిక్వెస్ట్లు, వగైరాలు రైజ్ చేసి.. మొత్తానికి పారిస్ లో వచ్చి పడ్డాను.

ఇంక నా ప్లాస్టిక్ కార్డు విషయానికి వస్తే, ఏ ప్రోగ్రెస్సు లేదు. ఇష్యూ అయ్యి ఉంటే వాళ్ళు ఒక లెటర్ నా హోటల్ కి పంపి ఉండాలి, అది జరగలేదు. ఇంకా నయమే దాని కోసం ఎదురు చూస్తూ పారిస్ లో ఉండిపోయి ఉంటే, ఈ లోగా మా బుడ్డోడు పది పాసయిపోయి "ఎవడివిరా బచ్చా నువ్వు.." అని అచ్చాగా నిలదీసేవాడు. ఇక్కడికి వచ్చాక, దాని అంతం.. క్షణక్షణం చూద్దామని ఓ మెయిల్ సందించాను ఇక్కడి ప్రభుత్వ ఆఫీసుకి. "అయ్యా, అమ్మా, నేను రెసిడెంట్ కార్డు కి అప్లై చేసి మూడు నెలలు కావొస్తోంది.. ఇంకా రాలేదు. కాయా పండా.. కాస్త అదైనా చెప్పి మాకు ముక్తి ప్రసాదించగలరు" అని.  ఆ మెయిల్ పంపిన మూడో రోజు అనుకుంటా, తీరిగ్గా ఓ రిప్లై ఇచ్చారు... మీ కార్డు ముక్క రెడీ, వచ్చి తీసుకునిపొండి అని. ఇంక నా సంగతి చెప్పాలా, ఆ రాత్రంతా, కార్డు గురించే కళలు, కలలు. "ఇంకా తెలవారదేమీ.. ఈ చీకటి విడిపోదేమీ.." అని ఘంటసాల, SPB గొంతులు నేనే పాడుకుని.. తెల్లవారుజామునే ఆ ఆఫీసుకి పరిగెట్టాను. ఓ రెండు గంటల లైను ప్రయాణం తరువాత, కౌంటర్ చేరుకున్నాను. కౌంటర్ లో ఉన్న ప్రెంచ్ పొన్ను, అంతా బావుంది కాని, రెవిన్యూ స్టాంపులు ఏవి అంది.. ఎప్పుడో రెంట్ రసీదుల మీద దొంగ సంతకాలు పెడుతున్నప్పుడు తప్ప, మనం రెవిన్యూ స్టాంపు ని బాగా దగ్గరగా చూసింది లేదు. ఫ్రెంచ్ స్టాంపులతో అసలే పరిచయం లేదు. కాష్ ఉంది, నేను కాష్ కడతాను అన్నాను, "నో నో" అంది. నేను దీనాతి దీనంగా, అంటే మన RAC బెర్తు కోసం TT ని చూసినట్టు అన్నమాట, అక్కడే నిలబడ్డాను. "ఇలా కాదు, ఈ సందు చివరనే ఆ స్టాంపులు దొరుకుతాయి, తెచ్చుకుని రా" అంది. మరి లైను అన్నా.. "స్టాంపులు కొనుక్కుని డైరెక్ట్ గా కౌంటర్ కి వచ్చేయి" అని భరోసా ఇచ్చింది.

ముందు కౌంటర్ బయటకి వచ్చి, అక్కడే ఉన్న ఓ లావు పాటి పోలిసావిడని ఆ స్టాంపుల ఆఫీసు గురించి అడిగాను. నెక్స్ట్ బిల్డింగే, దాన్ని ట్రెజరీ పబ్లిక్ అంటారు అంది. మా వూర్లో కూడా అంతే లెండి అనుకుని, ఆ ట్రెజరీ కి వెళ్లి స్టాంపులు కొనుక్కున్నాను. తిరిగి కౌంటర్ కి వచ్చి, వాటిని సమర్పించుకుని, నా కార్డు సాధించుకున్నాను. నేను అనుకున్నట్టే, అది ఓ మూడు అంగుళాల ప్లాస్టిక్ ముక్క. ఇంకా ఘోరం ఏంటంటే, నా ఏభై అక్షరాల పూర్తి పేరు వాళ్లకి పొడుగు అయిపోయినట్టుంది.. భాస్కర్ ని కాస్త.. భాకర్ అని రాసారు. ఎదో ఒకటి ఏడిచారు అనుకుని.. పెళ్లి కార్డులా మళ్ళీ మళ్ళీ చూసుకుని, మురిసిపోయి, సిగ్గుతో మొగ్గలు, పువ్వులూ వగైరాలు అన్నీ అయిపోయి, పాస్ పోర్ట్ తో పాటూ జార్తగా పెట్టుకుని, ఆఫీసుకు వచ్చేసాను. (వచ్చే మార్చి వరకూ ఇక్కడ ఉండటానికి, మధ్యలో ఇండియా వెళ్ళినా,  వీసా బాధ లేకుండా తిరిగి రాడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది అన్నమాట)

అదీ నా ప్లాస్టిక్ కార్డు ముక్క వృత్తాంతం. చదివిన వాళ్ళకి.. విన్న వాళ్ళకి.. చదివి ఛీ అనుకున్నవాళ్లకి.. మీ మీ పాస్ పోర్టులు.. వీసాలు.. ఆధార్ కార్డులు.. అలాంటివి అన్నీ.. త్వరగా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి ఈ కార్డు ముక్క నేను సాధించిన శుభ ముహూర్తాన, ఫ్రెంచ్ వాళ్ళు నా మీద ప్రేమతో ఐఫిల్ టవర్ ఏమైనా రాసిచ్చేస్తారేమో తెలీదు. కనుక్కోవాలి. ఒకవేళ వాళ్లిచ్చినా, మనమే ముక్కలూ.. చెక్కలూ అవుతున్న పరిస్థితిలో ఉన్నాం, ఎక్కడ పెట్టుకోవాలి అని మరో ఉద్యమం వస్తుంది, వద్దనేస్తా లెండి.


మరో మాటండోయ్, ఫ్రెంచ్ ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్రెంచ్ తప్ప మరో భాష మాట్లాడరు. మనం మాక్సిమం సైగలతోనూ, పొడి పొడి ఇంగ్లీష్ మాటలతోనూ నెట్టుకురావాలి.

Sunday, August 11, 2013

ప"రాయి" మనిషి


నటన.
నాలోనే.. నేనే..
అలుపెరుగక నటిస్తుంటాను.
కాస్త పోగొట్టుకుంటే చాలు..
పడాలి కదా అని బాధ పడిపోతుంటాను..
ఏం పొందినా.. సంతోషం తెచ్చి అతికించుకుంటాను.
నవ్వే లేని చిరునవ్వులకి కొదవే లేదు..
కన్నీళ్లు లేకపోయినా,
ఒదార్పుని ఆస్వాదిస్తాను.
ఆపద ముంచుకొస్తే,
లేని భయం నింపేసుకుంటాను.
గుండె కాలకున్నా..
కళ్ళల్లో మంటలు రగిలిస్తాను.
లోపల తడి చుక్కే లేకున్నా..
ధారలుగా ప్రేమ వర్షిస్తాను.

నేను ఎంత గొప్ప నటుణ్ణో..
నటనే జీవితం చేసుకున్నాను.

నేను నవ నవీన మానవుణ్ణి,
జీవించడానికి అస్సలు సమయమే లేని వాణ్ణి..
స్థిత ప్రజ్ఞుణ్ణి కాను..
మరలతో మనుగడ వెతుక్కున్న..
"మర"మనిషిని..
మరణాన్ని గెలవాలని,
బ్రతకడమే మానేసిన ప"రాయి" మనిషిని.