Sunday, September 1, 2013

కౌముది లో నా మొదటి కథ


గత కొన్నేళ్ళగా, అడపాదడపా తోచింది "నా హరివిల్లు" లో రాసుకుంటున్నాను. కొన్ని కవితలు కౌముదిలో దర్సనమిచ్చాయి. ఈ మధ్య ఉద్యోగ రీత్యా పారిస్ రావడంతో, మామోలు కంటే ఇంకాస్త ఎక్కువ సమయమే చిక్కింది, రాసుకోడానికి, చదువుకోడానికి. సో ఓ చిన్న తుంటరి ఆలోచనని కథగా మలిచే ప్రయత్నం చేసాను. అలా తయారైన నా మొట్టమొదటి కథ "స్టింగ్ (స్టింక్) ఆపరేషన్", కౌముది సెప్టెంబర్ ఎడిషన్ లో ప్రచురింపబడింది.

తయారీ దశలోనే, చదివి భరించి, మెరుగుపరచడానికి తమ వంతు సహకారం అందించిన కృష్ణారావు-వందన దంపతులకు, ఈ కథకే కాదు, బ్లాగు మొదలు పెట్టినప్పటినుంచి నా ఫస్ట్ క్రిటిక్ గా ఉన్న మా ఆవిడ కజిన్ సృజన కి ధన్యవాదాలు. (మరీ ఇంత ఫార్మల్ గా అవసరమా అని నాకు తిట్లు ఖాయం :-))
"బావుందండి" అంటూ మొదట భరోసా ఇచ్చిన మధురవాణి గారికి, "మొదటి ప్రయత్నమే అయినా, బానే వచ్చింది" అంటూ ప్రోత్సహించిన కిరణ్ ప్రభ గారికి మరోసారి కృతజ్ఞతలు.

ఇక కథాంశం విషయానికి వస్తే, ఈ రోజుల్లో వార్తా చానళ్ళకి, ఎంటర్టైన్మెంట్ చానళ్ళకి పెద్దగా వ్యత్యాసం మిగల్లేదు. మన తెలుగు నాట ఈ వెర్రి మరీ ఎక్కువగా ఉంది. న్యూస్ ని రిపోర్ట్ చెయ్యడం కాకుండా, దాన్ని క్రియేట్ చెయ్యడమూ, అక్కర్లేని అర్థంలేని మెరుగులు దిద్దడమూ వాళ్ళ అలవాటుగా, మన గ్రహపాటుగా మారింది. ఒకప్పుడు ప్రింట్ లో వచ్చింది అంతా నిజమే అనుకునేవాణ్ణి, ఇప్పుడు దానికి విరుద్ధంగా, టీవీ లో వచ్చింది కనుక, అబద్దమే అయ్యుంటుంది అనిపిస్తోంది. స్టింగ్ ఆపరేషన్లు, ఒకరి స్టింగ్ మీద మరొకడి స్టింగు. చూపించే దృశ్యానికి, వినిపించే గొంతులకి ఏమాత్రం పొంతన ఉండదు, దానికి తోడు, ఏ సస్పెన్సు సినిమా నుంచో ఎత్తుకొచ్చిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం. వెరసి, "కాదేది స్టింగుకి అనర్హం" లా తయారయ్యింది. వీటికి తోడు, కన్నీళ్ళతోనూ, గిల్లికజ్జాలతోనూ కూడా TRP లు పెంచుకోవచ్చని నిరూపిస్తున్న రియాలిటీ షోలు. నాగరికత పేరుతో మనం ఉపకరణాలకి దగ్గరై, బాంధవ్యాలని దూరం చేసుకుంటుంటే, మనం పోగొట్టుకున్న ఎమోషన్స్ ని మనకే ప్యాక్ చేసి అమ్ముతున్నాయి ఈ షోలు. ఇందులో నటిస్తోంది, పాల్గొనే అభ్యర్దులో, న్యాయనిర్ణేతలో, లేక చప్పట్లు కొట్టి, ఈలలు వేసి జరుగుతున్న డ్రామాకి తమ సంఘీభావం తెలియజేసే ప్రేక్షకులో చెప్పలేం మనం. ఈ రెండు జాడ్యాలని స్పృశిస్తూ, కొంచం సరదా టోన్ లోనే కథగా రాయాలని చేసిన ప్రయత్నమే ఈ "స్టింగ్ (స్టింక్) ఆపరేషన్". ఎం.టెక్ వరకూ విశాఖలోనే చదువుకోవడంతో, నాకు
బాగా పరిచయం ఉన్న ఆ నేపథ్యం లోనే కధను చెప్పడం జరిగింది.

వీలుచూసుకుని ఓ లుక్కు వేయండి మరి. ( http://www.koumudi.net/ ) మొదటి కథ కదా, మొదటి కథ లానే ఉంటుంది అని గ్రహించగలరు.. :-)

3 comments:

 1. ​ఇప్పటి వార్తాచానాళ్ళ ప్రహసనాలని తలపిస్తూ ​మీరు రాసిన కథ బాగుంది సరదాగా.. మీ కలం నుంచి మరిన్ని కథలు రావాలని ఆశిస్తూ.. అభినందనలు ​భాస్కర్ గారూ! ​:-)​

  ReplyDelete
 2. కథ వెనుక కథ అక్కడ కౌముదిలో చదివాను కదాని ఇక్కడ బ్లాగులో మీరు రాసింది పూర్తిగా చదవలేదు ఇందాక.. :P
  చదివి అభిప్రాయం చెప్పడమేమంత భాగ్యమండీ.. :-)​

  ReplyDelete
 3. వినాయక చవితి శుభాకాంక్షలు
  http://brundavanam.org/publications.html

  ReplyDelete