Sunday, September 29, 2013

ది లంచ్ బాక్స్ (హిందీ చలనచిత్రం)


ఈ మధ్యే "ది లంచ్ బాక్స్" అనే హిందీ చలన చిత్రం విడుదల అయ్యింది. నిన్ననే చూసాను, నాకు చాలా నచ్చింది. ఆఫ్ బీట్ సినిమాల టేస్ట్ ఉన్న ప్రేక్షకులు అస్సలు మిస్ అవ్వకూడని చిత్రం ఇది. తీసుకున్న కథాంశం చిన్నదే అయినా, చెప్పిన విధానం, చిత్రీకరణ అద్భుతం గా ఉన్నాయి. సినిమా మొత్తం చూసాక, ఒక మంచి కవిత చదివిన అనుభూతి మిగులుతుంది. చిత్రంలోని పాత్రలు, మన ఆలోచనల్లో కొంతకాలం ఉండిపోయి, మనల్ని పలకరిస్తూ ఉంటాయి, పరిచయస్తుల్లా.

భర్త నుంచీ రవ్వంత అనురాగం కూడా లభించక, అల్లాడుతున్న ఒక గృహిణి "యిలా" (నిమ్రత్ కౌర్), శ్ర్రీమతి ని కోల్పోయి, ఒంటరితనంలోనే తన అస్తిత్వాన్ని సృష్టించుకుని, రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, "సాజన్ ఫెర్నాండెజ్" (ఇర్ఫాన్ ఖాన్).. ఈ రెండు పాత్రలతోనే ఈ కథంతా నడుస్తుంది. యిలా తన భర్తకి పంపిన లంచ్ బాక్స్, పొరపాటున సాజన్ కి చేరడం తో కథ మొదలౌతుంది. తరువాత, వాళ్ళిద్దరి మధ్యా, ఆ బాక్స్ ద్వారానే జరిగిన సంభాషణ, క్రమేణా ఏర్పడిన అనుబంధం అదీ మిగిలిన చిత్రం. సీన్ బై సీన్ చెప్పిన కథకంటే, బిట్వీన్ ది లైన్స్ మనకి మనం ఫీల్ అయ్యే కథే ఎక్కువ. మానవ జీవితంలోని సంక్లిష్టత, ఆశలు, భావోద్వేగాలను దర్శకుడు రితేష్ బాత్రా ఒడిసిపట్టుకుని చిత్రం గా చెప్పగలగడం, సామాన్యమైన విషయం కాదు. అంతర్జాతీయ సినిమాల్లో ఇలాంటి కథలు మనకి అప్పుడప్పుడు కనిపిస్తున్నా, బాలీవుడ్ కి కాస్త క్రొత్త అనే చెప్పాలి. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి కూడా. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, "You've Got Mail" అనే ఆంగ్ల చిత్రాన్ని గుర్తు చేస్తాయి. అంతర్లీనం గా ఉన్న ఆర్ద్రత "దోభీ ఘాట్" ని గుర్తు చేస్తుంది.

కథను ప్రక్కన పెడితే, చిత్రీకరణ ఎంతో నిజాయితీగా, సహజసిద్ధం గా ఉంది. చాలా సీన్లు బహిరంగ ప్రదేశాల్లో, మామోలు జనం మధ్య తీసినట్టు అనిపించింది. ఎలా షూట్ చేసారో మరి. ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. కథలో కొంత నాటకీయత కనిపించినా, అది మనకి అసందర్భంగా అనిపించిదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటుడు ఇర్ఫాన్ ఖాన్ గురించి. నా దృష్టిలో భారత దేశం గర్వించదగ్గ కళాకారుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకడు. నసీరుద్దిన్ షా, అనుపంఖేర్, ఓంపురి ల సరసన నిలబెడతాను నేను ఇర్ఫాన్ ఖాన్ ని. ఏ పాత్ర పోషించినా మనకి పాత్ర తప్ప అతడు కనిపించడు. ఎంత విభిన్నమైన పాత్ర అయినా, స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని, దానికి జీవం పోస్తాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే, మన చిత్రాల్లో నటులు కంటే స్టార్లు ఎక్కువ. వాళ్ళ చుట్టూ, చిత్ర పరిశ్రమ ప్రదక్షణాలు చేస్తూ ఉంటుంది. ఇర్ఫాన్ లాంటి నటుడుకు మంచి చిత్రం దొరకాలే కానీ, ఆస్కార్ అందనిదేమీ కాదు అని నా అభిప్రాయం.

తిరిగి సినిమా విషయానికి వస్తే, పేరు ఇంకేదైనా పెట్టి ఉండాల్సింది అనిపించింది నాకు. ఎందుకంటే, మొదట నేను అదేదో చిన్నపిల్లల సినిమా అనుకున్నా. :-) తెలుగులో ఈ సినిమా వస్తే, టైటిల్ ఏం పెట్టొచ్చు అని ఆలోచిస్తే, నాకు తట్టిన పేరు - "మౌన సంభాషణ". (అయినా, తెలుగు సినిమా టైటిల్ తెలుగులో పెట్టనిస్తారా, డవుటే.. )

ఇలాంటి సినిమాలు ఎప్పుడో గాని రావు, వీలయితే తప్పక చూడండి. 

7 comments:

 1. I have seen this movie and loved it.. Good review

  ReplyDelete
 2. will watch soon...interesting review n suitable title for tel version.

  ReplyDelete
 3. సినిమా బాగుంది. నాకు నచ్చింది.రియాలిటి కి దూరం గా అనిపించింది.
  కాని... natural flow of emotions when the lady has no one to share her grief అనిపించింది. worth watching unlike today's commercial non sense movies.

  ReplyDelete
 4. @జలతారు వెన్నెల, కరెక్ట్ గా చెప్పారండి. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 5. సర్ .. మీ విశ్లేషణ బాగుంది. మౌన సంభాషణ టైటిల్ కూడా బాగుంది .. కానీ తెలుగులో తీసే దమ్మున్న దర్శకుడు లేడు. ఉన్నా అతనికి నిర్మాత సహకరించడు. సినిమాలో కనిపించే చిన్న సీన్లు అక్కడి వాతావరణానికే సరిపోయినట్టు అతికాయి. దీన్ని ఇక్కడ తీస్తే బాగోదని నా అభిప్రాయం.
  శ్రీనుపైండ్ల

  ReplyDelete