Sunday, October 27, 2013

కర్మయోగికి అక్షర నివాళి


మా పెద్ద మామయ్య గొల్లపూడి సుబ్బారావు గారు, మొన్న బుధవారం స్వర్గస్తులయ్యారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు.

మెకానికల్ ఇంజినీరింగ్ లో ఐ.ఐ.టి లో డాక్టరేట్ పొందిన ఆయన, హిందూస్తాన్ మోటార్స్, BHPV, మొదలగు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసి, తరువాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జనరల్ మేనేజర్ గా చాలా ఏళ్ళు సేవలందించారు. పదవీ విరమణ అనంతరం వైజాగ్ గీతం లో ప్లేస్ మెంట్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు, తుది శ్వాశ విడిచేవరకూ.
 
ఒక్క వాక్యంలో ఆయన్ని పరిచయం చెయ్యాలంటే - ఎనలేని మేధస్సు, మొక్కవోని పట్టుదల, అఖుంటిత దీక్ష. దగ్గర నుంచీ ఆయన్ని చూసిన వాళ్ళెవరూ,  ఆయన్ని ఎప్పటికీ మరచిపోలేరు. సింహం లాంటి వ్యక్తిత్వం, తాను నమ్మినది చెయ్యడానికి ఎవరినీ ఖాతరు చేయ్యని తనం, ప్రతిఫలం ఆశించకుండా శ్రమించడం. చాలా మంది బ్రతకడానికి పని చేస్తారు. కొందరు పని చెయ్యడానికి బ్రతుకుతారు. ఈయనది మూడో దారి, "పనే నేను" అనుకునే తత్త్వం. దేవుడు, కుటుంబం, మానవ సంబంధాలు, పాప పుణ్యాలు, ఇలాంటివి ఆయన లిస్టు లో ఎక్కడో చివర ఉంటే ఉంటాయి. మా కజిన్స్ అందరికీ ఆయన రోల్ మోడల్. కేవలం చదువు ద్వారా ఏ స్థాయికి చేరుకోవచ్చు అన్నది ఆచరించి చూపించిన మార్గదర్శి. మా చిన్నతనం లో, ప్రతీ ఏడూ ఏదో ఒక పండగకి అందరినీ ఇంటికి పిలిచి, ఏవో ఒక కానుకలు ఇచ్చేవాడు. ఆ గిఫ్ట్ చేతిలో పెడుతూ ఆయన అడిగే ఒకే ఒక ప్రశ్న - "నువ్వు చేస్తున్న దానిలో నువ్వు ఫస్ట్ గా ఉన్నావా లేదా.. ? ". నేటికీ అదే ప్రశ్న ఆయనది. ఏ పని చేసినా పర్వాలేదు, కానీ అది అందరికంటే బాగా చెయ్యాలి. ఆది ఆయన ఫిలోసఫి. 

ఆయన కెరీర్ అంతా ఒక్క ఎత్తైతే, గీతం లో ప్లేస్ మెంట్ ఆఫీసర్ గా ఆయన కాంట్రిబ్యూషన్ మరొక రేర్ అచీవ్మెంట్. వేలమంది విద్యార్థులు ఆయనవల్ల, ఆయన నిబద్దత వలనా, లాభ పడ్డారు. విశాఖకు, మరీ ముఖ్యంగా గీతం కు కార్పొరేట్ వరల్డ్ లో ఒక స్థాయి ని నిర్మించడం లో ఆయన చేసిన కృషి అద్వితీయమైనది. కాంపస్ లో ఉద్యోగాలు రానివాళ్ళకి, బయట ప్లేస్ అయ్యేలా ప్రోత్సాహం, కాంటాక్ట్స్, రికమండేషన్ లెటర్స్ ఇచ్చి మరీ పంపేవారు. TCS రామదొరై, సత్యం రామలింగరాజు వంటివారు ఆయనకి వ్యక్తిగతం గా పరిచయస్తులు. ఇంటర్వ్యూలు కండక్ట్ చెయ్యడానికి వచ్చే HR ఉద్యోగులు ఆయనతో మాట్లాడడానికి భయపడడం నేను కళ్లారా చూసాను. దూసుకుపోయే ఆయన తత్వంతో కలిసి పనిచెయ్యడం చాలా కష్టమే, కానీ ఆయన పనితనానికి, నైపుణ్యానికి దాసోహం అనక తప్పదు. నాకు బాగా గుర్తు, ఒక ఏడు ప్రాంగణ నియామకాలు జరుగుతున్న సమయంలోనే మా మామయ్య US వెళ్ళాల్సిన అవసరం పడింది, కూతురు గురించి. వెళ్ళలేదు. తరువాత కలిసినప్పుడు నేను ఆ మాటే అడిగితే. ఆయన ఇచ్చిన జవాబు.. - "అక్కడ నా ఒక్క కూతురికోసం నేను వెళ్ళిపోతే, ఇక్కడ వందల మంది పిల్లల సంగతి ఏంటి". కుటుంబం గా ఆయన ధోరణి అంగీకరించడం కష్టమే, కానీ ఆయన బుర్రలో మరో ఆలోచనకి చోటు లేదు. కొన్నేళ్ళ క్రితం, ICU లో ఉండగా, స్పృహ వచ్చిన వెంటనే, అదేదో కంపెని కి లిస్టు పంపాలని ఆత్రుత పడి, ప్రక్కనే ఉన్న మా అమ్మగారి చేత ఆయన అసిస్టెంట్ కి ఫోన్ చేయించడం నాకు తెలుసు. ఇదెక్కడి చోద్యం అని డాక్టర్స్ కూడా ముక్కున వేలు వేసుకున్నారంట.

ఆయనలో భయం నేను ఎన్నడూ చూడలేదు. ఏదో పొందాలనే ఆశ కానీ, ఇంత సాధించాను అనే గర్వం కానీ, వెతికినా ఆయనలో మనకి కనిపించదు. శారీరక బాధ ఏదీ ఆయన్ని క్రుంగ దీయలేదు. రోజుకి మూడు పూటలా డయాలసిస్ చేసుకుంటూ, గీతం కి వెళ్లి వచ్చేవాడు. ఇందాక మా అత్తతో ఫోన్ లో మాట్లాడుతుంటే చెప్తున్నారు, మొన్న వారం, శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతూ, ఆక్సిజెన్ మీద ఉండి, ఆ సిలెండర్ ని వెంట తీసుకుని కాలేజి కి వెళ్ళనివ్వమని అడిగారంట, ఆయనకి బాలేదని అమెరికా నుంచీ ఆఘమేఘాల మీద వచ్చిన కొడుకుని. సింహం లా బ్రతికాడు, అలానే తరలి వెళ్ళిపోయాడు. ఎందరి గుండెల్లోనో చెదరని చైతన్యంగా నిరంతరం వెలుగుతూనే ఉంటాడు.

కొందరి జీవితాలకి మరణం ముగింపు కాదు. అది మరొక్కసారి రుజువు చేసాడు మా మామయ్య. ఆయన్ని తెలిసిన వాళ్ళందరికీ, గుప్పెడు జ్ఞాపకాలు మిగిల్చాడు. గుండెడు ధైర్యం కూడాను.

Saturday, October 26, 2013

ఏవో కొన్ని మాటలు..


బ్లాగు లో ఏదైనా రాసి పోస్ట్ చెయ్యాలనే ఆసక్తి సన్నగిల్లుతోంది. ఎందుకనో. కొంతవరకూ ఈ పారిస్ రొటీన్ లైఫ్ వల్ల కావచ్చు. ఆఫీసు, రూమ్, వండుకోవడం, కడుక్కోవడం.. వగైరా.. వగైరా..

ఒక్కోసారి దేనికోసమో ఎదురు చూస్తున్నట్టే ఉంటుంది, దేనికోసమో తెలీదు. మరోసారి, దేనికిదంతా అనిపిస్తుంది, కానీ పరుగు ఆగదు. ఏకాంతానికి, ఒంటరితనానికి మధ్య ఆత్రంగా నిలబడిన క్షణం, గుండె జ్ఞాపకాల కోసం నిలువెల్లా వెతుక్కుంటుంది. స్పందించడం మానేస్తే, ప్రపంచం ఆగిపోయినట్టు.. హడావిడి రహదారిలో ఒంటరిగా వేసే అడుగులు. చెవులను తాకుతూనే ఉంటాయి వేల గొంతులు, మాటలు వినిపించవు. సూర్యోదయం, వెనువెంటనే మరో సూర్యోదయం.. కాలం కదులుతూనే ఉంది. ముందుకో. మరి వెనక్కో. చావులు.. పుట్టుకలూ.. అన్ని ఫోన్లే చెప్తుంటే.. ఎవరికోసం ఈ దూరం.. ఎవరికి దగ్గర..
జీవితం కోసం.. జీవితం వదిలి.. జీవితం వెనుక.. తెలియని ప్రయాణం. అదే గమ్యం అనుకుంటూ.

ఈ మధ్య రాసుకున్న కొన్ని మాటలు..  అర్థాల కోసం వెతక్కండి.


మరణం భయపెడుతుంది.
భయం..
చంపుతుంది.


నాకంటూ..
ఒక ప్రపంచం కావాలి.
నేను అనే ఆలోచన లేనిది. 


ఒంటరి కిటికీ..
రోజంతా ఎదురుచూస్తుంది.
నా చూపుల కోసం.


నిన్న, నేడు నడుస్తున్నాయి..
రేపటి, గతంలో,
కలిసిపోడానికి.


అన్నీ ఉన్నట్టు..
ఏదీ లేనట్టు మరుక్షణం.
గుండెలో ఎండమావులు.


                                    (The Eiffel Tower seen from the Palais de Chaillot. Image by Pete Seaward.)

Sunday, October 6, 2013

పారిస్ లో "వైట్ నైట్"


ఈ రోజు శనివారం,  పారిస్ లో వైట్ నైట్ (Nuit Blanche) జరుపుకుంటున్నారు. అనగా, రాత్రంతా రవాణా సదుపాయం ఉంటుంది. మ్యూజియంలు, ఆర్ట్ గాలరీస్ వగైరాలు రాత్రంతా తెరిచే ఉంటాయి. మరీ ముఖ్యంగా, ఈ రోజు రాత్రి ప్రవేశం ఉచితం. ఇవి కాక కొన్ని ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, షో లు కూడా నిర్వహిస్తున్నారు. మామోలుగానే ఇక్కడ జనాలకి సాయంత్రమే తెలవారుతుంది, ఇంక ఇలాంటి వేడుక ఉంటే వేరే చెప్పాలా.. నిజంగానే ఈ రాత్రి చీకటి పడేలా లేదు. రోడ్లు, ట్రైన్లు, టూరిస్ట్ ప్రదేశాలు, అన్నీ కళకళ లాడుతున్నాయి. వాతావరణం కూడా బావుంది, మరీ వణికించే చలి కాకుండా. మా ఫ్రెంచ్ స్నేహితులు కొందరితో కలిసి నేనూ ఒకటి రెండు మ్యూజియంలు, కొన్ని ప్రదర్శనలు చూసి, బయట జనాల ఉత్సాహానికి ముచ్చటగా ఉన్నా, మరీ శివరాత్రి చెయ్యలేక, ఎంత కాదనుకున్నా పరాయి దేశం, మరీ రిస్క్ ఎందుకు అని, మనసుతో సహా, ఏదీ పారేసుకోకుండా, జార్తగా రూమ్ కి ఇప్పుడే చేరుకున్నాను. మా జనాలు మాత్రం రాత్రి అంతు చూసేలానే ఉన్నారు.

వైట్ నైట్ ని తెలుగులో "శ్వేత రాత్రి" అంటే ఎలా ఉంటుంది అంటారు ? మరీ అదేదో మలయాళం డబ్బింగ్ సినిమా పేరు లా ఉంది అంటారా ? :-)