Saturday, December 28, 2013

సామాన్యుడి రాజకీయాలు (ఆప్)


ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసాడు. ఈ మధ్య కాలంలో, నగదు, మద్యం పంచకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత అమ్ ఆద్మీ పార్టీ కే దక్కుతుంది. ఐ.ఐ.టి లో చదువుకుని, ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత స్థానంలో పని చేస్తూ, అవన్నీ వదులుకుని సమాచార హక్కు కార్యకర్తగా మొదలై, అన్నా హజారే అనుచరుడిగా ప్రాచుర్యం పొందిన కేజ్రీవాల్, పార్టీ ని ప్రకటించినప్పుడు ఎవరూ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మన ప్రజాస్వామ్యం మీద మన దగాకోరు నాయకులకు ఉన్న నమ్మకం అలాంటిది. కానీ తమకున్న ఏ ఆయుధాన్నీ వదలకుండా, "ఆప్" ఆనతి కాలంలోనే ఒక ప్రముఖ రాజకీయ శక్తిగా ఎదిగింది. అదే అపూర్వమైన విజయం. ప్రజలకు అర్థమయ్యేది, నచ్చేది మాట్లాడ్డం, మీడియా మెచ్చేది, చూపించేది చెయ్యడం.. ఈ రెండూ బాగా వంటబట్టించుకున్నాడు కేజ్రీవాల్. సోషల్ మీడియాని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. రాజకీయాల్లో ఒక్కోసారి "గత చరిత్ర" లేకపోవడమే పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. అంతిమ లక్ష్యాలు ఎంత గొప్పవి, ఉదాత్తమైనవి అయినా, జనాలని ఆకట్టుకోవాలంటే, ఓట్లు రాబట్టుకోవాలంటే కొన్ని నేలబారు హామీలు తప్పవు. ఆకలితో అలమటిస్తున్న వాడికి నోటికి అన్నం ముద్ద కావాలి, రూపాయి విదేశీ మారకపు విలువ పెంచుతామంటే లాగి ఒక్కటిస్తాడు. ఆ పరంగా చూస్తే, "ఆప్" మిగతా పార్టీలకు ఏమీ తక్కువ తినలేదు. కానీ మరీ దగుల్బాల్జీ నాయకుల్లా, లాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు ఇస్తామనలేదు. మంచి నీళ్ళు ఇస్తామన్నారు, కరెంటు చార్జీలు తగ్గిస్తామన్నారు. సాధ్యాసాధ్యాలు ప్రక్కన పెడితే, ఇలాంటివి ప్రజలకి అత్యంత అవసరమైనవే.

ఇంక ప్రభుత్వ ఏర్పాటు విషయానికి వస్తే, "ఆప్" తమ మనసులోని మాటే, ప్రజల నోట చెప్పించింది, అదికూడా వినూత్నమైన పద్దతుల్లో. నిజానికి షీలా దీక్షిత్ ని ఓడించడంతోనే తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఇంకా ఇప్పుడే పురుడు పోసుకున్న కొత్తపార్టీ, అన్ని స్థానాలు గెలవడం నిజంగానే సామాన్యమైన విషయం కాదు. చారిత్రాత్మికం అనే చెప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రజల్లో "ఆప్" పట్ల ఉన్న అంగీకారాన్ని సూచిస్తోంది. ఇప్పుడు మరలా ఎన్నికలు జరిపినా, ఆప్ కే పట్టం కడతారు. ఇప్పటికే కోట్లు ఖర్చుపెట్టిన మిగతా పార్టీల నేతలు మళ్ళీ అంతా ఖర్చుపెట్టనూ లేరు. అందుకే కాంగ్రెస్ మద్దతివ్వడం అనివార్యం అయ్యింది. తమకున్న కొద్దిపాటి సీట్లతో కాంగ్రెస్ "ఆప్" మీద పెత్తనం చేలాయిస్తుందా, దాన్ని ఆప్ భరిస్తుందా, అన్నది భవిష్యత్తే తేల్చాలి. కానీ ఆప్ చేసిన వాగ్దానాలలో కొన్ని నేరవేర్చినా, కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించలేని పరిస్థితి ఉత్పన్నం కావచ్చు.

ఆప్ వరకూ, ఇప్పటికే ఇంటి పోరులు మొదలయ్యాయి, కలిసి అరవడం లో ఉన్న సులువు, కలిసి పని చెయ్యడం లో ఉండకపోవచ్చు. ఈ అసమ్మతులు, అసంతృప్తులను కేజ్రీ వాల్ ఎలా నెట్టుకొస్తాడో వేచి చూడాలి. సిస్టం ని విమర్శించడం తేలిక, కానీ దాన్ని మార్చడం, లేదా ఉన్నంతలో మంచి పని చేయించడం చాలా కష్టతరం. ఎందుకంటే ఇప్పుడు మారింది కేవలం పాలకవర్గం, వాళ్ళ క్రింద పనిచేసే వ్యవస్థ పాతదే, రాత్రికి రాత్రి మారేదీ కాదు. ప్రతీ పనికి "నాకేంటి" అనే స్వభావాన్ని అలవర్చుకున్న పాలనా యంత్రాంగాన్ని కాస్తో, కూస్తో దారిలోకి తేగలిగితే సామాన్యుడు విజయం సాధించినట్టే. కేజ్రీవాల్ సింబాలిక్ గా చెప్పే విషయాలు (VIP హోదా వద్దనడం, మెట్రో లో ప్రయాణించడం.. మొదలైనవి) చూడ్డానికి బావున్నా, ప్రజలకి నిజమైన మేలు చేసేది మాత్రం, విధాన పరమైన మార్పులు, లాభాపేక్ష లేని పాలన. కాదు, మేమూ ఆ తానులోని ముక్కలమే అని "ఆప్" నిరూపిస్తే, రోజూ ఓడిపోతున్న మన ప్రజాస్వామ్యానికి మరో ఓటమిగా మిగిలిపోతుంది ఈ "ఆప్" గెలుపు.మనలో మన మాట, తెలుగు అసామాన్యుడు JP గారు, ఆప్ నుంచీ ఏమైనా పాఠాలు నేర్చుకున్నారో, లేదో మరి..

Friday, December 13, 2013

ఇదా మండేలాకు నివాళి ?


పోరాటాన్నే జీవితం చేసుకున్న మహోన్నత నాయకుడు మండేలా కు నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసిన సభకు ప్రపంచ నాయకులు ఎందరో విచ్చేశారు. మండేలా ఎలాంటి నాయకుడు.. ఎంతటి సంఘర్షణ, కార్యదీక్ష, అచీవ్ మెంట్.. మరణం ఎవరికైనా తప్పని ముగింపు, కానీ ఆ సందర్భానికి ఒక ఆర్ద్రత, భావోద్వేగం ఉన్నాయి. కోట్ల ప్రజల జీవితాలను, సమూలంగా మార్చేసిన నాయకుడు అస్తమిస్తే, అది ఒక సున్నితమైన సమయం. ఆ జాతికీ, దేశానికీ, మనం చెందకపోయినా, ఆ పరిస్థితిని గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ. మరీ ముఖ్యంగా దేశాధినేతలు ఎంత ఆదర్శంగా నిలవాలి.. అలాంటి సందర్భంలో క్రింద అటాచ్ చేసిన ఫోటో (సెల్ఫీ) తీసుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారా ? వాళ్ళు.. అమెరికా, డెన్మార్క్, ఇంగ్లాండు అధినేతలు. ప్రపంచాన్ని శాసించే ఒబామా, ఈ ఒక్క ఫోటోతో, తనను తాను ఎంతో చులకన చేసుకున్నాడు. ఏదో ఆకతాయి కుర్రాడు చేసాడు అని అనుకునే వీలులేని చర్య ఇది.

నా వరకూ, నేను మాటలు కంటే చేసే పనులే ముఖ్యం అనుకుంటాను, అడపదపా మన మీడియా ఓ చిన్న స్టేట్మెంట్ ని భూతద్దంలో చూపించడాన్ని నేను సమర్ధించను. కానీ ఈ ఫోటో చూసిన వెంటనే ఎందుకో మనసు చివుక్కుమంది. ఆ మాత్రం సీరియస్ లేని వాళ్ళు అలాంటి సభకు వెళ్ళనే కూడదు.

కొంచం అతిశయోక్తి అనిపించినా, నాకెందుకో, ఈ ఫోటో పాశ్చాత్య దేశాల అసలు నైజాన్ని, దృక్పథాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది అనిపించింది. ప్రాణాలకు ఖండాలు బట్టి విలువ కట్టే ఈ దేశాల మనసులు మారాలంటే, ఓ మండేలా.. ఓ మాహాత్ముడు సరిపోరు. చరిత్ర నేటికీ నిరూపిస్తున్నది అదే కాబోలు.


నిజానికి, "పేదరికం" దేశాల ఆర్థిక స్థితికి సంబంధించిన విషయం కాదు, సంస్కృతీ, విలువలకి సంబంధించినది అనుకుంటే.. మనకంటే పేద దేశాలు చాలానే ఉన్నట్టున్నాయి.

Sunday, December 8, 2013

ఆనందాల బ్రహ్మ


తనదైన శైలిలో డైలాగులు, గిలిగింతలు పెట్టే హావభావాలు, వీటికి తోడు తిరుగులేని టైమింగ్, వెరసి స్క్రీన్ మీద యిట్టె నవ్వులు పూయించే హాస్యవరపు - ధర్మవరపు, ఇకలేరు అంటే, ఒప్పుకోడానికి మనసు సిద్ధపడడం లేదు.

అప్పుడెప్పుడో నరేష్ సినిమాలో చిన్న సైజు విలన్ నుంచీ, నిన్నటి దూకుడు కూల్ బాబు వరకూ, ఎన్నో విలక్షణమైన పాత్రల్లో ఆయన అందించిన వినోదం నేనైతే ఎన్నటికి మరచిపోలేను. ఎన్నో ఏళ్ల నుంచీ అడపాదడపా సరదా వేషాలు వేస్తున్నా, "నువ్వు-నేను", "ఒక్కడు", లాంటి సినిమాలు ఆయనకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి, ఆ తరువాత ఆయన ఇంక వెనక్కి చూసుకోలేదు.

చలనచిత్రాలు ఆయనకి పేరు ప్రఖ్యాతులు తెచ్చినప్పటికీ, ఎందుకో నాకు మాత్రం, ఆయన తెలుగు మనసులు దోచుకున్నది టీవీ ద్వారానే అనిపిస్తుంది. ప్రభుత్వ గొంతు తప్ప, తమకంటూ ఒక విధానమే సరిగ్గా లేని రోజుల్లోనే దూరదర్శన్ ని సరదా దర్శన్ చేసిన ఘనత ఆయనదే. జంధ్యాల మార్కు క్లీన్ కామెడి ని తెలుగు టీవీ లోకి తెచ్చింది ఆయనే అనడంలో అనుమానమే లేదు.

నాకు బాగా గుర్తు, ఆనందో బ్రహ్మ ప్రారంభానికి ముందు, ఒక సీన్ చూపించేవారు.. - ఓ తండ్రి పిల్లాడిని ప్రక్కింటి వాళ్ళని అడిగి సుత్తి తెమ్మని పంపుతాడు, ఆ పిల్లాడు ఆ ఇల్లూ, ఈ ఇల్లూ తిరిగి, ఎవరూ ఇవ్వడం లేదని తండ్రికి చెప్తాడు. ఆ తండ్రి పెద్దగా నిట్టూర్చి, లోకం పోకడకి బాధపడి, చివరికి ఇంట్లో ఉన్న సుత్తిని తెమ్మంటాడు. :-) ఆ తండ్రి పాత్రలో గిలిగింతలు పెట్టిన ధర్మవరపుని మరచిపోగలమా ? సున్నితమైన హాస్యం, వెకిలితనం లేకుండా, వీలు ఉన్నంతవరకూ సమాజానికి ఉపయోగపడే సందేశం, ఇవి అన్నీ కలిసిన హాస్యపు విందులు ఎన్నో టీవీ ద్వారా అందించారు ఆయన. ఈ కోణంలో చూస్తే, ఆయన్ని హిందీ విలక్షణ నటుడు జస్పాల్ భట్టి తో పోల్చవచ్చేమో. (భట్టి కూడా ఓ రోడ్డు ప్రమాదం వల్ల అకస్మాత్తుగా మనకి దూరం అయ్యారు)

అతడు లో, షేవింగ్ క్రీం తో బ్రెష్ చేసుకుంటూ, "ఇలాంటివి మన వూరిలో ఎందుకు దొరకడం లేదు", అని ఆశ్చర్యపోయినా, ఫ్యామిలీ సర్కస్ లో, కోటా శ్రీనివాసరావు ని వెంట ఉంటూనే ఓ ఆటాడుకున్నా, మరో చిత్రంలో, "మేమూ అవుతాం బాబు, ప్రిన్సిపాళ్ళం" అన్నా, ఆయనకే చెల్లింది.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికంగా మనకి దూరం అయినా, తెలుగు ప్రేక్షక హృదయాల్లో నిండు నూరేళ్ళు జీవిస్తారు, గుర్తొచ్చినప్పుడల్లా, నవ్విస్తూనే గుండె బరువెక్కిస్తారు.

Monday, December 2, 2013

నా రెండవ కథ కౌముది లో :-)


ఆ మధ్య ఎప్పుడో రాసిన నా రెండో కథ "అహం బ్రహ్మాస్మి", ఈ నెల కౌముదిలో ప్రచురింపబడింది.

వీలు చూసుకుని ఒక లుక్కు వేయగలరు. అనుకున్న ఆలోచనని కథగా మలచడంలో ఇంకా బుడి బుడి అడుగుల స్టేజీలోనే ఉన్నాను కనుక, ఏ అంచనాలూ లేకుండా చదివితే మంచిది మరి. :-)

మోనా లిసా పునః దర్శనం (ప్యారిస్ కబుర్లు)


2009 లో పారిస్ వచ్చినప్పుడే, ప్రపంచ ప్రఖ్యాత louvre మ్యుజియం ని సందర్శించాను. ముఖ్యంగా మోనా లిసా చిత్రరాజాన్ని. ఈ మధ్యే, మా కొల్లీగ్స్ ఇద్దరు పారిస్ రావడం తో, వాళ్ళని తీసుకుని ఈ రోజు మళ్ళీ louvre కి వెళ్లాను. ఈ రోజే ఎందుకంటే, ప్రతీ నెలా, మొదటి ఆదివారం మ్యుజియం ప్రవేశం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ...

louvre ఒక సముద్రం లాంటిది, దాంట్లో.. ఈదుతూ.. ఈదుతూ.. తీరం తెలీక ఏ తెలియని యుగంలోనో కొట్టు మిట్టాడుతుంటే, మనకి మన టైం బావుంటే, మోనా లిసా పెయింటింగ్ సైన్ బోర్డ్ కనిపిస్తుంది. అలానే మేమూ, బహుదూరపు బాటసారుల్లా మోనా లిసా ని చేరుకుని, దర్శన భాగ్యం పొందాం. ఓ పెద్ద హాలు, ఒక ఖాళీ గోడ, మధ్యలో కాస్త క్రిందగా, అద్దాల వెనుక ఒక మోస్తరు సైజు చిత్ర పటం. (అంతకంటే పెద్దగా మన ఇళ్ళల్లో టీవీలు ఉంటున్నాయి, అంటే మీరు నమ్మాలి) మొదటి సారి చూసిన ఎవరికైనా, నిట్టుర్పే మిగులుతుంది. నాకు ఇదివరకు చూసిన జ్ఞాపకం బానే ఉంది కనుక, నేను చాలా సాదా సీదా అంచనాలతో వెళ్లాను. ఓ మంచి పెయింటింగ్ అని అనుకుని చూస్తే మాత్రం, ఒక మాజిక్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కళ్ళు, చిరునవ్వు. ఆ జన సందోహం మధ్య (చైనీయులు అని చదువుకోండి) మరీ, మీరూ మోనా లిసా మాట్లాడుకోవాలి అంటే చెప్పలేను కానీ, కళ్ళతో సంభాషించగలిగితే, మోనా లిసా మీకు ఒక అనుభూతి ని ఖచ్చితంగా మిగులుస్తుంది.

పెయింటింగ్ అందంతో పాటూ, వచ్చిన ప్రాచుర్యం (చోరీ కి గురికావడం.. వగైరా. వగైరా.) కూడా మోనా లిసా కి ఆభారణాలు అయ్యాయి. నిజానికి డావిన్స్కి చిత్రించిన ఎన్నో అద్భుతాలతో పోలిస్తే, మోనా లిసా ఒక సాధారణ చిత్రమే. అదే హాలులో, ఎందరో చిత్రకారుల అందమైన పెయింటింగ్స్ ఉన్నా, టూరిస్ట్లు పెద్దగా వాటిని పట్టించుకున్నట్టు కనపడరు. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మోనాలిసా కి సరిగ్గా ఎదురుగా ఒక గోడ నిండా ఉన్న "The Wedding Feast at Cana - Paolo Veronese" పెయింటింగ్. చాలా పెద్ద చిత్రం, ఇట్టే మన మనసుని దోచుకుంటుంది.

ఈసారి, louvre సాగర మధనం లో నాకు కాస్త తృప్తిని ఇచ్చిన మరో అంశం, ఈజిప్షియన్ మమ్మీ. అద్దాల పెట్టెలో, నిజంగా ఉన్నది ఒరిజినల్ మమ్మీ ఏ నా, అనే అనుమానం మనకి కలగక మానదు. నాకూ అదే అణుమానం వచ్చింది, మరీ ఇలా మామోలు వాతావరణం లో ఎలా ఉంచేస్తారు అని. అక్కడ ఉన్న గైడ్ ని అడిగితే, నిజమైనదే, ఇక్కడ ఉన్నవి అన్నీ అసలు సిసలైనవే అని సమాధానం వచ్చింది. ఓహో అనుకుని, మరో సారి చూసి, టాటా బైబై చెప్పేసాం.

మనలో మన మాట, మా కొల్లీగ్స్ తీసిన వందల ఫొటోలకి, నాకు కెమెరా, ఫోటో, అనే రెండు మాటల మీద విరక్తి వచ్చేసింది. నాసా వాళ్ళు కూడా అన్ని ఫోటోలు తీసి ఉండరని నా గట్టి దృఢ పిచ్చి నమ్మకం. ఈ విషయం మీద వేరేగా ఎప్పుడో నా గోడు మీకు చెప్పుకుంటా కానీ.. మరీ ఇంత ఘోరం అయితే ఎలా అండి బాబూ.. అమ్మో.. ఈ డిజిటల్ కెమెరా కనిపెట్టినోడిని ప్లాష్ లైట్ తో చంపేయాలి అసలు. ఫోటోలు జ్ఞాపకాలని గుర్తుచేస్తాయి, సందేహమే లేదు., కానీ ముందు ఆ క్షణాన్ని మనసారా అనుభవించాలి కదా. ఏమో లెండి, ఎవరి ఇంటరెస్ట్ వాళ్ళది, నేను మాత్రం కెమెరా పట్టుకెళ్ళ లేదు, వాళ్ళు తీసిన వందల, వేల ఫోటోలలో, ఏ మూలో కనిపించకపోతానా..


(louvre ఉచ్చారణ ని తెలుగు లో సరిగ్గా రాయలేక, ఫ్రెంచ్ లోనే ఉంచేసాను, గమనించగలరు., వీజీగా కావాలనుకుంటే, లూర్ అని చదువుకోండి :) )