Saturday, December 28, 2013

సామాన్యుడి రాజకీయాలు (ఆప్)


ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసాడు. ఈ మధ్య కాలంలో, నగదు, మద్యం పంచకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత అమ్ ఆద్మీ పార్టీ కే దక్కుతుంది. ఐ.ఐ.టి లో చదువుకుని, ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత స్థానంలో పని చేస్తూ, అవన్నీ వదులుకుని సమాచార హక్కు కార్యకర్తగా మొదలై, అన్నా హజారే అనుచరుడిగా ప్రాచుర్యం పొందిన కేజ్రీవాల్, పార్టీ ని ప్రకటించినప్పుడు ఎవరూ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మన ప్రజాస్వామ్యం మీద మన దగాకోరు నాయకులకు ఉన్న నమ్మకం అలాంటిది. కానీ తమకున్న ఏ ఆయుధాన్నీ వదలకుండా, "ఆప్" ఆనతి కాలంలోనే ఒక ప్రముఖ రాజకీయ శక్తిగా ఎదిగింది. అదే అపూర్వమైన విజయం. ప్రజలకు అర్థమయ్యేది, నచ్చేది మాట్లాడ్డం, మీడియా మెచ్చేది, చూపించేది చెయ్యడం.. ఈ రెండూ బాగా వంటబట్టించుకున్నాడు కేజ్రీవాల్. సోషల్ మీడియాని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. రాజకీయాల్లో ఒక్కోసారి "గత చరిత్ర" లేకపోవడమే పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. అంతిమ లక్ష్యాలు ఎంత గొప్పవి, ఉదాత్తమైనవి అయినా, జనాలని ఆకట్టుకోవాలంటే, ఓట్లు రాబట్టుకోవాలంటే కొన్ని నేలబారు హామీలు తప్పవు. ఆకలితో అలమటిస్తున్న వాడికి నోటికి అన్నం ముద్ద కావాలి, రూపాయి విదేశీ మారకపు విలువ పెంచుతామంటే లాగి ఒక్కటిస్తాడు. ఆ పరంగా చూస్తే, "ఆప్" మిగతా పార్టీలకు ఏమీ తక్కువ తినలేదు. కానీ మరీ దగుల్బాల్జీ నాయకుల్లా, లాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు ఇస్తామనలేదు. మంచి నీళ్ళు ఇస్తామన్నారు, కరెంటు చార్జీలు తగ్గిస్తామన్నారు. సాధ్యాసాధ్యాలు ప్రక్కన పెడితే, ఇలాంటివి ప్రజలకి అత్యంత అవసరమైనవే.

ఇంక ప్రభుత్వ ఏర్పాటు విషయానికి వస్తే, "ఆప్" తమ మనసులోని మాటే, ప్రజల నోట చెప్పించింది, అదికూడా వినూత్నమైన పద్దతుల్లో. నిజానికి షీలా దీక్షిత్ ని ఓడించడంతోనే తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఇంకా ఇప్పుడే పురుడు పోసుకున్న కొత్తపార్టీ, అన్ని స్థానాలు గెలవడం నిజంగానే సామాన్యమైన విషయం కాదు. చారిత్రాత్మికం అనే చెప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రజల్లో "ఆప్" పట్ల ఉన్న అంగీకారాన్ని సూచిస్తోంది. ఇప్పుడు మరలా ఎన్నికలు జరిపినా, ఆప్ కే పట్టం కడతారు. ఇప్పటికే కోట్లు ఖర్చుపెట్టిన మిగతా పార్టీల నేతలు మళ్ళీ అంతా ఖర్చుపెట్టనూ లేరు. అందుకే కాంగ్రెస్ మద్దతివ్వడం అనివార్యం అయ్యింది. తమకున్న కొద్దిపాటి సీట్లతో కాంగ్రెస్ "ఆప్" మీద పెత్తనం చేలాయిస్తుందా, దాన్ని ఆప్ భరిస్తుందా, అన్నది భవిష్యత్తే తేల్చాలి. కానీ ఆప్ చేసిన వాగ్దానాలలో కొన్ని నేరవేర్చినా, కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించలేని పరిస్థితి ఉత్పన్నం కావచ్చు.

ఆప్ వరకూ, ఇప్పటికే ఇంటి పోరులు మొదలయ్యాయి, కలిసి అరవడం లో ఉన్న సులువు, కలిసి పని చెయ్యడం లో ఉండకపోవచ్చు. ఈ అసమ్మతులు, అసంతృప్తులను కేజ్రీ వాల్ ఎలా నెట్టుకొస్తాడో వేచి చూడాలి. సిస్టం ని విమర్శించడం తేలిక, కానీ దాన్ని మార్చడం, లేదా ఉన్నంతలో మంచి పని చేయించడం చాలా కష్టతరం. ఎందుకంటే ఇప్పుడు మారింది కేవలం పాలకవర్గం, వాళ్ళ క్రింద పనిచేసే వ్యవస్థ పాతదే, రాత్రికి రాత్రి మారేదీ కాదు. ప్రతీ పనికి "నాకేంటి" అనే స్వభావాన్ని అలవర్చుకున్న పాలనా యంత్రాంగాన్ని కాస్తో, కూస్తో దారిలోకి తేగలిగితే సామాన్యుడు విజయం సాధించినట్టే. కేజ్రీవాల్ సింబాలిక్ గా చెప్పే విషయాలు (VIP హోదా వద్దనడం, మెట్రో లో ప్రయాణించడం.. మొదలైనవి) చూడ్డానికి బావున్నా, ప్రజలకి నిజమైన మేలు చేసేది మాత్రం, విధాన పరమైన మార్పులు, లాభాపేక్ష లేని పాలన. కాదు, మేమూ ఆ తానులోని ముక్కలమే అని "ఆప్" నిరూపిస్తే, రోజూ ఓడిపోతున్న మన ప్రజాస్వామ్యానికి మరో ఓటమిగా మిగిలిపోతుంది ఈ "ఆప్" గెలుపు.మనలో మన మాట, తెలుగు అసామాన్యుడు JP గారు, ఆప్ నుంచీ ఏమైనా పాఠాలు నేర్చుకున్నారో, లేదో మరి..

No comments:

Post a Comment