Sunday, December 8, 2013

ఆనందాల బ్రహ్మ


తనదైన శైలిలో డైలాగులు, గిలిగింతలు పెట్టే హావభావాలు, వీటికి తోడు తిరుగులేని టైమింగ్, వెరసి స్క్రీన్ మీద యిట్టె నవ్వులు పూయించే హాస్యవరపు - ధర్మవరపు, ఇకలేరు అంటే, ఒప్పుకోడానికి మనసు సిద్ధపడడం లేదు.

అప్పుడెప్పుడో నరేష్ సినిమాలో చిన్న సైజు విలన్ నుంచీ, నిన్నటి దూకుడు కూల్ బాబు వరకూ, ఎన్నో విలక్షణమైన పాత్రల్లో ఆయన అందించిన వినోదం నేనైతే ఎన్నటికి మరచిపోలేను. ఎన్నో ఏళ్ల నుంచీ అడపాదడపా సరదా వేషాలు వేస్తున్నా, "నువ్వు-నేను", "ఒక్కడు", లాంటి సినిమాలు ఆయనకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి, ఆ తరువాత ఆయన ఇంక వెనక్కి చూసుకోలేదు.

చలనచిత్రాలు ఆయనకి పేరు ప్రఖ్యాతులు తెచ్చినప్పటికీ, ఎందుకో నాకు మాత్రం, ఆయన తెలుగు మనసులు దోచుకున్నది టీవీ ద్వారానే అనిపిస్తుంది. ప్రభుత్వ గొంతు తప్ప, తమకంటూ ఒక విధానమే సరిగ్గా లేని రోజుల్లోనే దూరదర్శన్ ని సరదా దర్శన్ చేసిన ఘనత ఆయనదే. జంధ్యాల మార్కు క్లీన్ కామెడి ని తెలుగు టీవీ లోకి తెచ్చింది ఆయనే అనడంలో అనుమానమే లేదు.

నాకు బాగా గుర్తు, ఆనందో బ్రహ్మ ప్రారంభానికి ముందు, ఒక సీన్ చూపించేవారు.. - ఓ తండ్రి పిల్లాడిని ప్రక్కింటి వాళ్ళని అడిగి సుత్తి తెమ్మని పంపుతాడు, ఆ పిల్లాడు ఆ ఇల్లూ, ఈ ఇల్లూ తిరిగి, ఎవరూ ఇవ్వడం లేదని తండ్రికి చెప్తాడు. ఆ తండ్రి పెద్దగా నిట్టూర్చి, లోకం పోకడకి బాధపడి, చివరికి ఇంట్లో ఉన్న సుత్తిని తెమ్మంటాడు. :-) ఆ తండ్రి పాత్రలో గిలిగింతలు పెట్టిన ధర్మవరపుని మరచిపోగలమా ? సున్నితమైన హాస్యం, వెకిలితనం లేకుండా, వీలు ఉన్నంతవరకూ సమాజానికి ఉపయోగపడే సందేశం, ఇవి అన్నీ కలిసిన హాస్యపు విందులు ఎన్నో టీవీ ద్వారా అందించారు ఆయన. ఈ కోణంలో చూస్తే, ఆయన్ని హిందీ విలక్షణ నటుడు జస్పాల్ భట్టి తో పోల్చవచ్చేమో. (భట్టి కూడా ఓ రోడ్డు ప్రమాదం వల్ల అకస్మాత్తుగా మనకి దూరం అయ్యారు)

అతడు లో, షేవింగ్ క్రీం తో బ్రెష్ చేసుకుంటూ, "ఇలాంటివి మన వూరిలో ఎందుకు దొరకడం లేదు", అని ఆశ్చర్యపోయినా, ఫ్యామిలీ సర్కస్ లో, కోటా శ్రీనివాసరావు ని వెంట ఉంటూనే ఓ ఆటాడుకున్నా, మరో చిత్రంలో, "మేమూ అవుతాం బాబు, ప్రిన్సిపాళ్ళం" అన్నా, ఆయనకే చెల్లింది.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికంగా మనకి దూరం అయినా, తెలుగు ప్రేక్షక హృదయాల్లో నిండు నూరేళ్ళు జీవిస్తారు, గుర్తొచ్చినప్పుడల్లా, నవ్విస్తూనే గుండె బరువెక్కిస్తారు.

1 comment:

  1. ధర్మవరపు సుబ్రహ్మణ్యం విలక్షణ దేహభాషతో,పరిపూర్ణ టైమింగ్ కల సంభాషణలతో,ఆయనకోసం ప్రత్యేకంగా మలచిన సినిమా పాత్రలతో విశిష్టంగా విభిన్నంగా ప్రఫుల్లంగా ప్రస్ఫుటంగా తెర మీద రాణించారు! ఆయన్ని క్యాన్సర్ భూతం మింగేయడం దారుణం!

    ReplyDelete