Monday, October 20, 2014

వాడిపోయిన బృందావనం

వాడిపోయిన బృందావనం 

కూలిపోయిన మహా వృక్షాలు
 
అడ్డంగా విరిగి ముక్కలైన నగరపు పునాదులు..
ఏదో కార్చిచ్చు కౌగిలిలో నలిగి పోయినట్టు
 
ఏదో దయలేని ప్రళయం పరిహసించినట్టు 


ఏమిటీ ఉత్పాతమ్.. ఏమిటీ 
విధ్వంసం 
ఏదో శత్రు సైన్యం నగరాన్ని ఊచకోత కోసినట్టు

ప్రశాంతతే స్వభావం అయిన నగరమ్..
చిగురుటాకై నేల రాలింది
దారిలేకే వాడిపోయింది
ఎవరినో తప్పుపట్టడం తెలీని విశాఖ
తనలోకే తాను ముడుచుకుపోయింది 


ఎవరిని కదిపినా కన్నీళ్ళే
తమకోసం కాదు.. తమవాళ్ళ కోసమూ కాదు.
కేవలం తమ కలల నగరం కోసం.
 
కానీ, ప్రతీ విధ్వంసం మరో పుట్టుకకి నాంది
 
దేశమంటే మట్టి కానే కాదు
విశాఖ అంటే విరిగిన వృక్షాలో ..
కూలిన స్తంభాలో కాదు.
మన నగరమంటే మనమే 


ఒకరికొకరం సాయం చేసుకుంటూ
సంతోషాలని పంచుకుని పెంచుకుంటూ
శ్రమైక జీవన సౌందర్యాన్ని తెలిసి..
మనంగా కలిసి.. జనంగా మురిసి.. మెరిసి..
ప్రయోజనాన్ని, మనుగడ పరమార్థాన్ని
అనుదినం అన్వయించుకుంటూ
మరో నూతన విశాఖని ఆవిష్కరించుకుందాం
 
పెనుగాలికి చెదరని విశాఖని గుండెల్లో దాచుకుందాం.
 

Sunday, August 17, 2014

ప్యారిస్ లో అజ్ఞాత వాసం మరో నలభై రోజులు :-)


గత సంవత్సరం ఏప్రిల్ నుంచి, పారిస్ లో ఒంటరిగా బండి లాగిస్తున్నాను. మధ్య మధ్యలో ఇండియా వెళ్ళొచ్చినా పెద్దగా సేద తీరింది లేదు. మొన్నీమధ్యే మా ఆవిడ, బుడ్డోడు ఓ నెలరోజులు పారిస్ లో ఉండడం వల్ల, ఆ ఊపులో మరో నెల మెల్లగా లాగించేసాను. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం, వచ్చే నెల చివరికి నేను ఇండియా బయలు దేరాలి, మా ఆఫీసు వాళ్ళ బుర్రల్లో మరో మైండ్ బ్లోయింగ్ ఆలోచన వచ్చేలోపే మనం రిటర్న్ టికెట్ చేయించుకోవడం ఉత్తమమని, ఎన్నడూ లేంది, ఓ నెలన్నర ముందే ట్రావెల్ టీం వాళ్ళని సంప్రదించి టికెట్ బుక్ చేయించేసుకున్నాను. సెప్టెంబర్ 27 న తిరుగు ప్రయాణం. :-) ఎప్పడూ ఎమిరేట్స్ లేక ఖతార్ లో చేసే మావాళ్ళు ఈసారి ఎయిర్ ఇండియా టికెట్ చేతిలో పెట్టారు. డిల్లీలో ఓ మూడు గంటల కొలువు ఉండేలా ఉంది, కానీ ఏదో ఒకటి లెండి, ఇండియా వెళ్ళిపోతున్నాం అనే ఆలోచన ముందు ఈ తొక్కలో విషయాలు మనం పెద్ద పట్టించుకోం కదా.

ఇంక నా రోజుల లెక్క మొదలు, స్టైలు గా కౌంట్ డౌన్ అని పిలుచుకోవచ్చు. మా ఆవిడ అప్పుడే ఇండియా వచ్చాక వెయ్యాల్సిన ట్రిప్పులు వగైరాలు ప్లాన్ చేసేస్తోంది. కొన్ని సార్లు అంతర్జాతీయ విమాన టికెట్లే వీజీగా దొరుకుతాయేమో, మన IRCTC టికెట్ల కంటే. నేను రోజుకు ఓ నాలుగు సార్లు లెక్క పెట్టుకుంటూ, రోజులు ఇంతా డెడ్ స్లో గా కదలడానికి కారణాలు వెతుకుతుంటే, మా ఫ్రెంచ్ కొల్లీగ్స్ కూడా ఆటపట్టిస్తున్నారు, పారిస్ జైలు కాదు, నువ్వు ఖైదీవి అంతకంటే కాదు అని. కరష్టే లెండి కానీ ఏదో ఆవేశం.. చెన్నై లో దిగాకా అక్కడి తలనొప్పులు అక్కడ ఎలానో ఉంటాయి, ఓ నాలుగు రోజులు తరువాత పారిస్ గుర్తు వచ్చినా రావచ్చు గాక.. కానీ ఏదైనా మన దేశం లో సుఖం ఎక్కడా రాదు. కుటుంబం, చుట్టాలు.. మిత్రులు.. అన్నింటికీ మించి ఇది మనది అనే ఒక ఫీలింగ్. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలం అనే నమ్మకం. మనకంటూ ఓ నలుగురు ఉన్నారనే ధైర్యం.

ఒంటరిగా ఉండడం నాకు ఇష్టమే, ఏదో ఒకటి చదువుకుంటూ, లేక ఎవరికీ అర్థంకానట్టుగా ఏదో ఒకటి రాసి పడేస్తూ మ్యానేజ్ అయిపోతాను. కానీ మరీ నెలలు తరబడి అంటే, అమ్మో, చాలా చాలా కష్టం. ఆఫీసులో కూడా పెద్దగా ఇంగ్లీష్ వినిపించదు. ఒక్కోసారి ఏదో వేరే గ్రహం మీద ఉన్న భావన కలుగుతుంది. నాలుగు రాళ్ళు మిగిలాయని అని ఆనందించినా, ఒక్కసారి ఏ రియల్ ఎస్టేట్ వెబ్సైటో తెరచి ధరలు చూస్తే, ఏడాది కాదు కదా, ఏభై ఏళ్ళు పారిస్ లో ఉన్నా, ఇండియా లో మాత్రం మనం మధ్యతరగతి గాళ్ళమే అని అర్థం అయిపోతుంది. త్రివిక్రం స్టైలు లో చెప్పాలంటే, బాగా చదివేసుకున్నాం అని అనుకున్న వాళ్ళంతా దేశాలు పట్టి తిరుగుతున్నారు, ఏదో ఓ లా డిగ్రీలు గట్టెక్కిన వాళ్ళు హ్యాపీ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ నాలిగింతలు సంపాదిస్తున్నారు. దూరపు కొండలు నునుపు లెండి, ఎవడి బాధలు వాడికుంటాయి, కాదనలేం.

నా వరకూ నాకు ముఖ్యం గా, తెల్లారే లేచి, అన్నం వండుకుని టప్పర్ వేర్ డబ్బాలో సద్దుకుంటూ, ఈ రోజు కందిపోడా, లేక ప్రియా పచ్చడా అనే మీమాంస నుంచి విముక్తి లభిస్తుంది. మా ఆవిడకి, మా బుడ్డోడి తొట్టతొలి చేష్టలు ఫొటోల్లోనో, వీడియోల్లోనో బంధించి నాకు పంపే శ్రమ మిగులుతుంది.

చెప్పడం మరచిపోయాను, మొన్నెప్పుడో 47 రోజుల లెక్క సరిపోయినప్పుడు, సింబాలిక్ గా ఉంటుందని మన పాత తెలుగు సినిమా 47 రోజులు మళ్ళీ చూసాను. పారిస్ ని బాగా చూపించారు, చాలా ప్రాంతాలు నాకు తెలిసినివే కావడం బానే ఉంది కానీ, పాపం జయప్రద కష్టాలు మాత్రం గుండెను బరువెక్కించేసాయి. ఆ రోజుల్లోనే (1980-81) ఒక తెలుగు సినిమా సింహ భాగం పారిస్ లో చిత్రీకరించడం, గొప్ప విషయమే.

Tuesday, July 1, 2014

హమ్మయ్యా అల్జీరియా ఓడిపోయింది!!

నిన్న జరిగిన ఫుట్ బాల్ మాచ్ లో అల్జీరియా జర్మనీ చేతిలో ఓటమి చవి చూసింది. చివరిదాకా ఎంతో ఉత్కంఠతో జరిగిన పోరాటంలో, జర్మనీ మొత్తానికి గట్టెక్కింది. ఇంతవరకూ బానే ఉంది, ఇందులో నాకు "హమ్మయ్యా" విషయం ఏంటా అనే కదా మీ పెను అనుమానం. చెప్తా.. చెప్తా..

పేరుకి పారిస్ లోనే ఉంటున్నా, నిజానికి నేను ఉన్న ఏరియా పేరు పోంథన్. అది ఒకప్పుడు పాపం ఓ చిన్న వూరు, పారిస్ పెద్దది అయ్యి, అయ్యి, ఇలా చుట్టూ ఉన్న ఎన్నో చిన్న వూళ్ళని తినేసింది. మన గ్రేటర్ భాగ్యనగరం లా అన్నమాట. పారిస్ కి అన్ని వైపులా ఉన్న మెట్రో రైళ్ళ వల్ల, ఎక్కడున్నా, పెద్దగా వ్యత్యాసం తెలియదు. ఈ పోంథన్ లో ఒకప్పుడు చిన్నా చితకా పరిశ్రమలు ఉండేవి, ఇప్పుడు అవన్ని మూతపడి, వాటి స్థానంలో బ్యాంకులు, వ్యాపార సంస్థలు, హొటల్స్ వచ్చేసాయి. కానీ ఎప్పటినుంచో స్థిరపడ్డ ఆఫ్రికన్స్ ఇంకా కనిపిస్తుంటారు. సెంట్రల్ పారిస్ లో కంటే, ఈ చుట్టూ ఉన్న ఊళ్ళలో వలస వచ్చి స్థిరపడ్డవారు ఎక్కువ. మా ఏరియాలో ఏం మహత్యమో కానీ, అల్జీరియా దేశానికి విపరీతమైన ఫాన్ ఫాలోయింగు. ఆ దేశం మాచ్ గెలిస్తే చాలు, మా హొటల్ ముందు అర్థరాత్రి పెద్ద యెత్తున సంబరాలు. సైకిళ్ళ మీద రోడ్డుకు అడ్డంగా విన్యాసాలు, బాణసంచా, మందు, చిందులు.. మొదటి రెండు సార్లు ఏదో ఫ్రాన్స్ ఆట గెలించిందేమో అనుకున్నా.. మూడో సారి తీక్షణం గా చూస్తే, ఆ జెండా రంగు వేరేగా ఉందనీ, డాన్సులు వేస్తున్న జనాల్లో కొన్ని రంగులే కనిపిస్తున్నాయని అర్థం అయ్యింది. గూగుల్ ని వాకబు చేస్టే అల్జీరియా సంగతి కొంచం బోధ పడింది. ఆఫీసులో మరి కాస్త భోగట్టా చేస్తే, అప్పుడు తెల్సింది, అల్జీరియాకి పారిస్ లో బోలుడంత అభిమానులున్నారని.

ఏదైతేనేం అప్పటినించి అల్జీరియా మాచ్ ఉందంటే చాలు, మాకు గుండెల్లో మెట్రో రైళ్ళు టికెట్టు అడక్కుండానే పరిగెట్టెస్తున్నాయి. మా బుడ్డోడు పడుకోవడమే పదివేలు అనుకుంటే, వీళ్ళ గోలతో వాడు ఎక్కడ లేస్తాడో అనే భయం తో మేము ముందు లేచి కూర్చుంటున్నాం. వాడు లేవడు అన్నది వేరే సంగతి.

సో ఇందు మూలంగా, సవినయం గా నేను ఆనందిస్తున్నది ఏంటంటే, నిన్నటి మాచ్ తో అల్జీరియా ప్రపంచ కప్పు నుంచీ ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి, మరియు మన రియాలిటీ షోల్లో లాగ వైల్డు కార్డు వగైరాలు ఏమీ లేకపోవడం వల్ల, మాకు అర్థరాత్రి హడావిడి నుంచీ విముక్తి లభించిందని ఆశిస్తున్నాను.ఓడిపోయినందుకు ఎక్కడైనా కొవ్వొత్తు ప్రదర్శనలు జరిగాయేమో నా దృష్టిలో పడలేదు మరి.

ఏవేవో దేశాలన్నీ ఫిఫా లో దంచేస్తున్నాయి, మన దేశం ఏది అని మా ఆవిడ నన్ను రోజుకి నాలుగు సార్లు నిలదీసేస్తోంది. నేను ఏంచెయ్యగలను చెప్పండి, నాపేరు శ్రీనివాసన్ కాదు కదా.. అదే మొత్తుకుంటున్నాను. మా చెర్రీ గాడు ఏమైనా పెద్దయ్యాక ఇండియా తరపునో, మరి అప్పటికి ఏ చైనావో మనల్ని పూర్తిగా కలిపేసుకుంటే వాళ్ళ తరపునో ఫుట్ బాల్ ఆడి, అల్జీరియా మీద గెలిచి, ప్రతీకారాలు వగైరాలు తీర్చుకుంటాడేమో.. వేచి చూడాలి.

Wednesday, June 18, 2014

ప్యారిస్ లో చెర్రీ గాడుఅదేదో సినిమాలో వెంకటేష్ చెప్పినట్టు, నాకూ ఒక కల ఉంది. అంటే, వీడియో కాంఫరెన్సు లో చంద్ర బాబు తో మాట్లాడుతుంటే, చంద్ర మోహన్ పిలవడం కాదు లెండి. ఏదో ఫామిలీ టైపు కల .. మా చెర్రీ గాడి ఫస్టు బర్త్ డే ప్యారిస్ లో జరుపుకోవాలని. వాడి పేరు చెప్పుకుని మనం కేకులు లాగించడానికి ఎక్కడైన ఒక్కటే అయినా, నేను మళ్ళీ ఇండియా వెళ్ళొస్తా అంటే, మా ఆఫీసు వాళ్ళు నా పాస్పోర్ట్ నాకే తెలియకుండా చింపేసే ప్రమాదముంది.

ఏదో కాలం ఓ మాదిరిగా కలిసొచ్చి, మరీ నడిచొచ్చే కొడుకు కాకపోయినా, విస్తారంగా ప్రాకిరే మూడ్ లో ఉన్న మా బుడ్డోడు, మా ఆవిడా ప్యారిస్ చేరుకున్నారు మొన్న శుక్రవారం. నా గ్రహాల మాట ఎలా ఉన్నా, మా ఆవిడ గ్రహాలు బానే ఉండి, వాళ్ళ టికెట్, మా ఫ్రెంచ్ కొలీగ్ ఒక అతను వచ్చే విమానంలోనే, తీయించగలిగాను. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు పడ్డా, మా వాళ్ళు నవ్వుతూనే ప్యారిస్ ఎయిర్ పోర్టు ని పావనం చేసారు. నేను కూడా టేప్ రికార్డర్ని ని పట్టుకెళ్ళా, అవసరమైతే ఇండియాని ని దాంట్లో పెట్టి ఓ పాతికేళ్ళు ఫాస్టు ఫార్వార్డ్ చేద్దామని. కానీ మీకు తెలియందేముంది .. బుడ్డోడిని స్టైలు గా ఎత్తుకుని, లగేజుని అంతా మా ఫ్రెంచ్ కొలీగ్ తో నెట్టిస్తూ ఎంట్రీ ఇచ్చి, మా ఆవిడ ఫాస్ట్ గా ఫార్వార్డు అవ్వాల్సింది ఏమైనా ఉంటే, అది నేనే అని గ్రహించుకునేలా చేసింది. నాకు తెలిసి మా తెల్ల స్నేహితుడు, మరో పదేళ్ళు పెళ్ళి గురించి పీడకలలో కూడా ఆలోచించడు. ఓ.కే.. ఆ మాటరు మనకేల .. కిక్కో, కక్కో వచ్చాక ఆగుతుందా ..

సో ప్రస్తుతానికి పసందైన ఇంటి భోజనం .. సాయంత్రాలు షికార్లు .. విహారాలు .. బానే నడుస్తున్నాయి. మా వాడిని వదిల్తే పాకురుకుంటూ ఈఫిల్ టవర్ కూడా ఎక్కేసేలా ఉన్నాడు. నడవ మంటే మాత్రం, నాలుగు అడుగులు వేసి, డైపర్ తో పాటూ మెల్లగా నేల మీద ల్యాండ్ అయిపోతున్నాడు. ఎవడి సౌకర్యం వాడిది .. ఏమనగలం. మరికొన్ని వారాలు, ప్యారిస్ లో మరి ఎక్కడ చూసిన మేమే కనిపించే అవకాశం పుష్కలం గా ఉంది.

* ఆల్డా గురించి నన్ను అడక్కండి. 

Thursday, June 5, 2014

నా నడక..

నాకు నడక రానే లేదు.
అడుగు అడుగులో పడిలేస్తూ ఉంటాను..
కానీ నా నడక ఆగలేదు.

నా పరుగు వేగంగా లేదు..
మలుపు మలుపులో చతికిలబడిపోతాను.
కానీ పరుగు మానలేదు.

నా ప్రయాణానికి దిశ లేదు.
ప్రతీ మజిలీలో దిక్కు మారిపోతాను.
కానీ పయనం ఆపేయ్యలేదు.

నాకు గమ్యమంటూ లేదు..
అనుక్షణం... లేని అర్థమేదో వెతుకుతుంటాను..
కానీ కలల్ని చిదిమెయ్యలేదు.

నాకు జీవితం అక్కర్నే లేదు..
ప్రతిపూటా భారంగా కదులుతుంటాను..
కానీ దాన్ని మధ్యలోనే ముగించేయలేదు.


అంతా అబద్దమే అని లోలోపలే నమ్మేస్తూ.

అంతా నిజమే అని బయట నన్నే నమ్మించేస్తుంటాను.

కానీ నమ్మకం చావనివ్వలేదు. ఇంకా.

Sunday, May 4, 2014

నాలో నేను, ఓ స్మార్ట్ ఫోను


పని ఒత్తిడి, ఆసక్తి సన్నగిల్లడం వల్ల ఈ మధ్య బ్లాగు మొహం చూసిన పాపాన పోలేదు. ఎవరైనా మధ్య మధ్యలో ఓ లుక్కు వేసి తిట్టుకుని ఉంటే క్షమించగలరు. :-) ఏం చేస్తాం, రోడ్డు మీద కార్లు వెళ్తాయి కానీ.. కార్ల మీద రోడ్డు వెళ్ళలేదు కదా మరి. ;-)

ఇంతకీ ఈ పోస్ట్ ఎందుకు మొదలు పెట్టాను అంటే, నేనూ ఈ మధ్య ఒక స్మార్ట్ ఫోన్ కి అప్గ్రేడ్ అయ్యాను. ఆ సంగతులు మీతో చెప్పకుండా ఉండగలనా మరి.

మనకు మొదటి నుంచి మార్పు పెద్దగా రుచించదు, చిరంజీవి ధర్మమా అని, అసలు మార్పు అనే పదం వింటేనే, కడుపులో దేవినట్టు ఉంటుంది. ఏదైనా వస్తువు కొన్నానంటే, దాని ఫుల్ లైఫ్ ఓ, హాఫ్ లైఫ్ ఓ అయిపోయి, అది రిటైర్ అవ్వాలే కానీ, నేను మాత్రం రిటైర్మెంట్ ఇవ్వను. దానికి కారణం పొదుపో, మరి బద్దకమో నాకు క్లారిటీ లేదు. బద్ధకం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫర్ సప్పోజ్, కళ్ళద్దాలు మార్చి పాపం ఎనిమిదేళ్ళు అయ్యింది. ఇంక అసలు విషయానికి వస్తే, గత ఆరేళ్ళగా, నిర్విరామంగా, నేను నోకియా N73 ని వాడుతున్నాను. దాని టైర్లు, బ్రేకులు, ఇంజిన్ లు ఎన్ని పని చెయ్యడం మానేసినా, కొన్ని మార్చి, కొన్ని మార్చకుండా అలా గుట్టుగా నెట్టుకొస్తున్నాను. స్టైలుగా ఫోన్ చేసుకోడానికి, ఎప్పుడైనా మా ఆవిడ చేస్తే హలో అనడానికి.. మరీ విషమ పరిస్థితుల్లో జిమెయిల్ చెక్ చెయ్యడానికి ఆ ఫోన్ నాకు సౌకర్యంగానే ఉంది. ఇన్నేళ్ళగా పాటలు కూడా పాతవే వింటూ, నేనూ దాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇలా ఏదో టైం ని, టాక్ టైం ని మేనేజ్ చేస్తుంటే, ఈ స్మార్ట్ ఫోన్ల గోల మొదలు అయ్యింది నా ప్రాణానికి. మా ఆవిడదో స్మార్ట్ ఫోను, జగన్ అన్నయ్య లా అంతా రాస్తూనే పని కానివ్వాలి. మొన్నటికి మొన్న ఇండియా వచ్చినప్పుడు, మా బుడ్డోడి పాస్పోర్ట్ అప్లయ్ చెయ్యడానికి వెళ్తే, ఏదో చిన్న డౌట్ వస్తే, మా ఆవిడ స్టైలు గా గూగుల్ లో చెక్ చేసి, ఇలా ఇవ్వండి అని ఆ ఆఫేసు లో పని చేస్తున్న అతనికి ఒక ఆదేశం ఇచ్చింది. నేను డంగైపోయాను మరి. వాళ్ళ కజిన్స్ టీవీ పెడితే తెలిసే IPL స్కోరు కూడా whatsapp లోనే కనుక్కుంటారంట. మనవడు ఎలా ఉన్నాడు అని మా మామగారు whatsapp లో వైజాగ్ నుంచి మెసేజ్ పెట్టడం, మా ఆవిడ చెన్నైలో ఫోటో తీసి పంపేయడం.. ఇవన్నీ చూసి, నా ఫోన్ ని చూసుకుని, నేను ఎక్కాల్సిన బస్సు మిస్ అయ్యి యుగాలు దాటిపోయిందని గ్రహించుకున్నాను. మా బుడ్డోడు డైపర్ లేకుండా, నా చంకలో ఉన్న రిస్కీ క్షణంలో నాకు జ్ఞానోదయం అయ్యింది. మొన్నెవరో చెప్పినట్టు, బుర్రలో మేటర్ లేకపోయినా పర్లేదు, చేతిలో మాత్రం స్మార్ట్ ఫోన్ తప్పదు అని బోధపరుచుకున్నాను.

సో ఆండ్రాయిడ్ కి ఇంకా మారకతప్పదు అని నిర్ణయం తీసుకున్న ఆ శుభతరుణం లోనే, నా పాత నోకియా ఫోన్ జాయ్ స్టిక్ కూడా పనిచెయ్యడం మానేసింది. అది నేను ఫోన్ చెయ్యకుండానే, రీ డైల్ చేసెయ్యడం, వచ్చిన కాల్ నేను ఎత్తకుండానే, అదే ఎత్తి మాట్లాడ్డం వగైరాలు చెయ్యడం మొదలు పెట్టింది. ఇంక మార్పు రావాలి.. మార్పు కావాలి అని స్మార్ట్ ఫోన్ల సెర్చ్ మొదలు పెట్టా. తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని అందరినీ సంప్రదించాను. అదో పెద్ద ప్రపంచం, ఇంతకంటే పోతీస్ లో చీర సెలక్షన్ వీజీ ఏమో. అసలు ఈ ఫోన్లలో కెమెరాలు పెడుతున్నారో, కెమెరాల్లో ఫోన్లు అతికిస్తున్నారో తెలీడం లేదు. ఏది అయితేనేం, శ్రీకృష్ణ కమీషన్ లా, నేనూ కొన్ని ఆప్షన్స్ ఇచ్చుకున్నాను. అవి samsung s4 మినీ, మోటో జి, నెక్సస్ 5. వీటి మధ్య అన్ని పోలికలు సరిచూసుకున్నాక, అంతర్జాతీయంగా రేట్లు కూడా విశ్లేషించి, నెక్సస్ ఫోన్ ని అమెరికా నుంచి తెప్పించుకుందామని డిసైడ్ అయ్యా. ఏదో ఆఫీసు పని మీద వస్తున్న పెద్దన్న చెవిలో ఈ సంగతి పడేసా. వాడు కాస్తా ఆ ఫోన్ నేను మాట్లాడుతున్నప్పుడే ఆర్డర్ చేసి, లగ్గేజ్ లో మాత్రం పెట్టడం బేషుగ్గా మర్చిపోయాడు. ఇండియా వచ్చాక గుర్తుకు తెచ్చుకుని, ఎలాగోలా మరొకరి చేత తెప్పించి, నేను సరిగ్గా పారిస్ బయలు దేరే రోజు నా చేతిలో పెట్టాడు. నేను డాలర్లు, రూపాయలు, అంటుంటే, ఇచ్చావు లే డబ్బు, అని ఆ ఒక్కటి అడక్కు స్టైలు డవిలాగు చెప్పి, అది కానుక అని తేల్చేసాడు. ఈ విషయంలో మనకి పెద్దగా ఆత్మాభిమానాలు, వాటి బంధువులు లేకపోయినా, సిగ్గుతో కూడిన మొహమాటం వలన వచ్చిన ఆశ్చర్యంతో వాడిని వారించే ప్రయత్నం చేసి ఓటమిని ఒప్పేసుకున్నాను. సో ఇలా నాకూ ఒక స్మార్ట్ ఫోన్ స్మార్ట్ గా చేతిలో వచ్చి పడింది.

ఆ రోజే ప్రయాణం, సో దాన్ని శోధించే టైము, ఓపిక లేక, పారిస్ వచ్చాక డబ్బా ఓపెన్ చేసాను. ఫోన్ బావుంది. మా ఆవిడా ఎప్పుడూ స్కైప్ లో అందుబాటులో ఉంటుంది కదా, "ఆన్ చెయ్యండి ఇంకా బావుంటుంది అంది", ఈ అవిడియా కూడా బానే ఉంది, అని ఓ సిమ్ము కార్డు జార్తగా పెట్టి, ఆన్ చేశా. నా కార్డులో బాలన్స్ నా కార్డే తినేసిందని తెలుసుకుని, మా ఆవిడనే ఒక ఫోను కొట్టమన్నాను. మనం కొట్టమనాలే కానీ, కాదనంటుందా, కాల్ చేసింది. నల్లటి స్క్రీన్ మీద రెండు రంగులు కనిపించాయి, రెండూ నొక్కా, ప్రయోజనం లేదు. మా ఆవిడ కోప్పడేలోపే, మనమే పరిస్థితి చెప్పడం మేలని విషయం చెప్పాను. మధ్యలో ఉన్న వృత్తం నుంచి రైట్ సైడ్ కి లాగండి అంది, ఓకే, అలాగే, అని ఫాలో అయ్యి, కాల్ అటెండ్ చెయ్యగలిగాను. ఆ ముహూర్తం షాట్ అయ్యాక, దాన్ని మళ్ళీ పొందికగా డబ్బాలో దాచేసి, ఆఫీసుకు వెళ్ళిపోయాను. ఈ నెక్సస్ ఫోన్ లో మీరు ఎంచేయ్యాలన్నా, గూగుల్ ఎకౌంటుతో సింక్ చేసి చస్తుంది. సో తప్పక, నెట్ కి కనెక్ట్ చేసి ఆ ముచ్చటా కానిచ్చాను. కొత్త ఫోను, మన మాటా, పాటా ఎలా రికార్డు అవుతుందో చూసుకోవద్దూ.. ఎలా చెయ్యడం, రికార్డింగ్ అప్లికేషను లేదే.. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ట. ఇలా ప్రతీ పనికి మనం ఒక ఆప్ ని పొంది సాధించుకోవాలి అని అర్థం అయ్యింది.

మొత్తానికి ఈ వారంలో, ఫోటోలు తీయడం, పంపడం, పాటలు రికార్డు చేసుకోవడం, రింగర్ ఆపడం మొదలైనవి తెలుసుకుని, ఫోన్ ని ఆఫీసుకు తీసుకెళ్ళే ధైర్యాన్ని సంపాదించాను. whatsapp కూడా ఇంస్టాల్ చేసాను. చూడాలి ఫ్యూచర్ ఎంత స్మార్ట్ గా ఉండబోతోందో. మా ఫ్రెంచ్ టీం మేట్స్ అందరూ, అలా ఫోన్లు రాస్తూనే ఉంటారు పాపం. నేనూ వాళ్ళతో పాటు నా ఫోను రాసుకుంటూ, వాళ్ళలో ఒక్కణ్ణి అయ్యి తరిస్తాను. మీరు అడక్కపోయినా, నేను చెప్పకుండా ఉంటానా, నా పాత నోకియా ఫోన్ ని కూడా నాతోనే తెచ్చుకున్నాను, అసలే పారిస్ లో మ్యూజియమ్స ఎక్కువ, చెప్పలేం కదా, ఏ మ్యూజియమ్ వాళ్ళో అడిగినా అడగచ్చు.

Sunday, March 16, 2014

అడుగడుగునా..


అడుగడుగునా..

ఇందాకే "ఒక్కడున్నాడు" చిత్రంలోని "అడుగడుగునా" పాట విన్నాను. ఎంతటి చక్కని భావం. ఈ పోస్ట్ రాయడం మొదలు పెట్టాను..

"అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు..
కోరిన తీరాన్నే చేరుకునే వరకు.."

"ఓ నిమిషమైన నిదరపోవా.. నిలవనీవే.. నిరీక్షణమా...
నే వెతుకుతున్నా ఎదుట పడవేం తొలి వెలుగు తీరమా.."

"నా దిగులు మంటే తగులుతుంటే.. రగలవేం కాలమా.."

గుండెల్ని హత్తుకునేలా లేవూ వాక్యాలు.
నాకు ఎప్పుడూ అనిపిస్తుంది, ఎందరితోనో కలిసి నడుస్తున్నా, చేతులు జట్టు కడతాయమో కానీ.. అడుగులు ఎప్పుడూ ఒంటరివే అని. ఎక్కడ మొదలౌతామో, ఎక్కడకి చివరకు చేరుకుంటామో, అదే "చివర" అని ఎందుకు ఒప్పేసుకుంటామో.. కానీ, జీవితపు అసలు విలువ ఎందులో ? నడకలోనా ? గమ్యంలోనా ?. ఎన్ని సార్లు ముళ్ళు గుచ్చుకున్నా, అడుగుని ఆగిపోనివ్వలేం. గాయాలు మానిపోతాయి, నేర్చుకున్న పాఠాలు మాత్రం తుదివరకూ మనతోనే ఉండిపోతాయి. ఏ తెలియని మలుపులు లేకపోతే ఇంకా పయనానికి అర్థమేది. ఆటంకాలు, అడ్డొచ్చే బండరాళ్ళు.. ఇవన్నీ బ్రతుకు రుచి పెంచేవే నిజానికి. ఏ ఒంటరి రాత్రో కళ్ళు మూతపడక, మనతో మనం మాట్లాడుకునప్పుడు.. ఓ సంతృప్తిని మిగిల్చేవే.. ఓదార్చేవే..

గెలుపా, ఓటమా, లెక్కపెట్టకుండా, ఒంటరిగానైనా.. నెమ్మదిగానైనా.. ఎన్నిసార్లు పడిపోయినా.. సహనంతో, ప్రేమతో, తిరిగి లేచి, ఆగకుండా వేసే అడుగు చేరలేని తీరమేది.. ఒకవేళ చేరకున్నా.. పోయేదేముంది.. ?

జీవితం ఎన్నో అనుభవాలని పరిచయం చేస్తుంది.. కానీ కొన్ని అనుభవాలు అసలు జీవితాన్ని పరిచయం చేస్తాయి.

ఏదో పాట విన్న ఆవేశం లో పోస్ట్ చేసేసాను. అర్థవంతంగా లేకపోతే లైట్ గా తీసుకోండి. :-)

మరో చిన్న మాట.. "అడుగడుగునా.. పడి లేచినా ఆపే వీల్లేదే పరుగు" అన్నా బానే ఉందేమో కదా..

Sunday, March 9, 2014

నాలా నేను.. నా ఒంటరితనం


నాలా నేను.. నా ఒంటరితనం,

నేను ఒక్కణ్ణే..
నాతో ఎవరూ లేరని కాదు..
నేను ఒక్కణ్ణే..
నాకు ఎవ్వరూ వద్దని కాదు..

కానీ..
నేను ఒక్కణ్ణే..
ఎందుకంటే..

నేను ఒక్కణ్ణే..
వెనక్కి తిరిగి బాగా చూసుకుంటే..
మొదలయ్యిన చోట..

నేను ఒక్కణ్ణే..
ముందుకు వెతుక్కుంటే..
అలసి తుదిగా మిగిలేచోట..

నేను ఒక్కణ్ణే..

ఎందుకంటే..
నాలో ఇంకెవ్వరికి చోటుంది..
నేను నేను గానే మిగిలాక.. ?

ఎందుకంటే..
నాతో వేసే మరో అడుగు ఏది..
నేను చివరిగా ఆగిపోయాక ?

నేను ఒక్కణ్ణే...

ఎందుకంటే..
ఎవ్వరో లేక అని కాదు..
ఎవ్వరూ "నా"లో రాలేరని..

"నేను" అన్నదే ఒంటరిది అని..

నేను ఒక్కణ్ణే
ఎందుకంటే..
అది "నేను" కాబట్టి ?

Wednesday, February 26, 2014

నువ్వు

నువ్వు

నీకు దగ్గరవ్వడం ఎంత తేలికో...
నీ వైపుగా వేసే అడుగులు అన్నీనావేగా మరి..
అందుకేనేమో నీకు దూరమవ్వడం కూడా అంత తేలిక...

కెరటాల మీద ఒడుపుగా,
నేను నడిచిపోతుంటే.. ఒంటరిగా..
పండు వెన్నెల్లో.. మండుటెండల్లో..
విస్పోటనంలో.. నిశ్శబ్దంలో..
మౌనంలో.. మధనంలో.. నాలో..
ఆకాశం చివరన సముద్రాల్ని తడుముకుంటూ..
నీ వెంట నేను చేసేది ఆరని పరుగు.
ఎవరో నన్ను తరుముతున్నట్టు.. నీ వెంట.
ఒంపైన క్షణాలన్నీ.. జ్ఞాపకాలై.
గుండె ఒంట్లో ఒదిగి పోతుంటాయి.
మిగిలినదంతా గతం. కేవలం.

అడుగు దూరంలో నువ్వు..
మన మధ్య ప్రయాణం అనంతం.
కాదు.. కాదు.. నా జీవితం.
నిన్ను పొందకపోవడమే నా అస్తిత్వం కాబోలు.
నాకు అందకపోవడం నీది.

నువ్వు నా "గమ్యానివే"..
లేకుంటే, మనం వేరుగా ఎలా ఉంటాం ?
ఎందుకుంటాం.

Sunday, February 23, 2014

నాన్న


నాన్న

నాన్నని అయిన ఎనిమిది నెలలకి  అర్థం అయ్యింది..
ఎనిమిదేళ్ళ వయసులో నేను పోగొట్టుకున్నదేమిటో..
కొన్ని మళ్ళీ మళ్ళీ పొందగలం..
కొన్ని ఒక్కసారే.. పొందినా..
చేజారిపోయినా...

కోల్పోయిన బంధానికి...
రుచే చూడని కొన్ని అనుభవాలకి..
ఆ దైవాన్ని ప్రశ్నించాలనిపిస్తున్నా..
ఇన్నేళ్ళ ప్రయాణంలో ఆ లోటే తెలియనివ్వని అమ్మకి..
దాసోహం అనాలనిపించింది.
ఈ క్షణం నాలో ఉప్పెనై వెల్లువెత్తిన ఈ కన్నీరు.. వేదన.. 
ఆమె ఒక జీవితం మోసింది.. దాచింది.
ఇంకించేసుకుంది. తనలో.

కాలం మనది కానే కాదు.. కానీ జీవితం మనదే.
పరిస్థితులు మనచేతిలో ఎన్నడూ లేవు.. ఉండవు,
కానీ ప్రతిస్పందన మనదే. బహుశా..

నేర్చుకోవడం అంటే..
ఉన్నది ఏదో.. తెలుసుకోవడమే..
కాబోలు. అదేనేమో బ్రతికేయడం అంటే..
జీవించడం అంటే.

Tuesday, February 18, 2014

ప్రపంచం ఒంటరైనప్పుడు..ప్రపంచం ఒంటరైనప్పుడు..

ఏ అర్థరాత్రో.. చీకటి తప్ప మరేదీ కనిపించని క్షణం..
నా గదిలో.. నన్ను నేను వెతుక్కుంటూ..
నాలో నేను నడిచిపోతున్నప్పుడు..
ప్రపంచం ఒంటరైపోతుంది.

కాలపు చట్రాల్లో నలిగి..
మనసుల ఇరుకు సందుల్లో ఊరేగి..
ఉత్తినే ఊపిరి బిగపెట్టి పరిగెడుతూ..
అంతలోనే ఆగిపోయి వెనక్కి చూసుకుంటూ.
ఆశల మజిలీల్లో.. నిస్పృహతో జట్టు కడుతూ..
అబద్దాలో.. నిజాలో.. తేలని అనుభవాల మధ్య.
తన చరిత తానే రచించుకుంటూ..
తన భవిత తానే చెరిపేసుకుంటూ..
పాపం ప్రపంచం ఒంటరైపోతుంటుంది.

గుప్పెడు కన్నీళ్లను చేతబట్టుకుని..
నేనున్నాను అనే ఓదార్పుకోసం..
రాత్రంతా.. రోజంతా..నిరంతరం..
ఆ దారులన్నీ.. వినువీధులన్నీ..
తిరిగి.. అలసి.. వేసారి..
నాకు ఎదురుపడుతూ ఉంటుంది..
నా గుండెలోకి తొంగి చూస్తుంది.
ఎందుకనో.
ఎంత ఒంటరిదో ఈ ప్రపంచం...

తనకు తాను తప్ప..
నిలువ నీడైనా లేనిది..
తనలో తనకి తప్ప..
వేరెవ్వరికీ చోటే ఇవ్వలేనిది.
ఎంత ఒంటరిదో ఈ ప్రపంచం.
పాపం.

Friday, February 14, 2014

నిద్ర లేని రాత్రులు..


ఒక్కోసారి గతం నాపై ఉప్పెనై విరుచుకుపడుతుంది..
జ్ఞాపకం నేనే నిజం.. అంటూ..
నిశ్శబ్దంగా నన్ను ఆక్రమించుకుంటుంది.
నా ఆశల కొసల్ని వేళ్ళతో పెకిలిస్తూ..
మొదళ్ళకే  తిరిగి ముక్కలు చేస్తూ..
చిగురిస్తున్న కొమ్మల్ని.. చీల్చేస్తూ..
నిట్టనిలువనా..

ఎందుకు నేనే..
ఎందుకు నేనే వర్షించాలి అన్ని కన్నీళ్లు...
ఎందుకు నేనే.. ఎందుకని నేనే..
మరణించాలి.. అన్ని మార్లూ..

ఏదో తెలియని పోరాటాన్ని.. ఎదలోనే ఎదుర్కుంటూ..
ఏదో తరగని పయనాన్ని నాలోనే నేను వెతుక్కుంటూ..
అనుక్షణం.. గెలుస్తూ.. ఓడిపోతూ.. ఆగక..

జీవితానికి పెద్దగా అర్థమే లేదని..
అనుదినం అర్థం చేసుకుంటూ..
అయినా..
దానికే అనుక్షణం అర్పించుకుంటూ..
ఒక యోగిలా.. పిచ్చివాడిలా.. రాయిలా.. రాలే చినుకులా..
నాలోనే... నాతోనే.. నేనే..
అన్నీ అనుభవించేస్తూ.. త్యజించేస్తూ..
బేధాన్ని చెరిపేస్తూ..

నదిలా.. నావలా.. అలలా.. కలలా..
లేనే లేని తీరం వైపు.. వడి వడిగా..
అక్కర్లేని అడుగులు అల్లుకుంటూ..
ప్రేమతో..
నిట్టూర్పుతో..
అందరితో..
ఒక్కడినే..
ఒంటరిగా..

నిద్ర అంటూ.. లేని చీకట్ల సాక్షిగా..
అవి రాత్రులే అని బ్రమపడుతూ..
మైకంలో.