Sunday, May 4, 2014

నాలో నేను, ఓ స్మార్ట్ ఫోను


పని ఒత్తిడి, ఆసక్తి సన్నగిల్లడం వల్ల ఈ మధ్య బ్లాగు మొహం చూసిన పాపాన పోలేదు. ఎవరైనా మధ్య మధ్యలో ఓ లుక్కు వేసి తిట్టుకుని ఉంటే క్షమించగలరు. :-) ఏం చేస్తాం, రోడ్డు మీద కార్లు వెళ్తాయి కానీ.. కార్ల మీద రోడ్డు వెళ్ళలేదు కదా మరి. ;-)

ఇంతకీ ఈ పోస్ట్ ఎందుకు మొదలు పెట్టాను అంటే, నేనూ ఈ మధ్య ఒక స్మార్ట్ ఫోన్ కి అప్గ్రేడ్ అయ్యాను. ఆ సంగతులు మీతో చెప్పకుండా ఉండగలనా మరి.

మనకు మొదటి నుంచి మార్పు పెద్దగా రుచించదు, చిరంజీవి ధర్మమా అని, అసలు మార్పు అనే పదం వింటేనే, కడుపులో దేవినట్టు ఉంటుంది. ఏదైనా వస్తువు కొన్నానంటే, దాని ఫుల్ లైఫ్ ఓ, హాఫ్ లైఫ్ ఓ అయిపోయి, అది రిటైర్ అవ్వాలే కానీ, నేను మాత్రం రిటైర్మెంట్ ఇవ్వను. దానికి కారణం పొదుపో, మరి బద్దకమో నాకు క్లారిటీ లేదు. బద్ధకం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫర్ సప్పోజ్, కళ్ళద్దాలు మార్చి పాపం ఎనిమిదేళ్ళు అయ్యింది. ఇంక అసలు విషయానికి వస్తే, గత ఆరేళ్ళగా, నిర్విరామంగా, నేను నోకియా N73 ని వాడుతున్నాను. దాని టైర్లు, బ్రేకులు, ఇంజిన్ లు ఎన్ని పని చెయ్యడం మానేసినా, కొన్ని మార్చి, కొన్ని మార్చకుండా అలా గుట్టుగా నెట్టుకొస్తున్నాను. స్టైలుగా ఫోన్ చేసుకోడానికి, ఎప్పుడైనా మా ఆవిడ చేస్తే హలో అనడానికి.. మరీ విషమ పరిస్థితుల్లో జిమెయిల్ చెక్ చెయ్యడానికి ఆ ఫోన్ నాకు సౌకర్యంగానే ఉంది. ఇన్నేళ్ళగా పాటలు కూడా పాతవే వింటూ, నేనూ దాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇలా ఏదో టైం ని, టాక్ టైం ని మేనేజ్ చేస్తుంటే, ఈ స్మార్ట్ ఫోన్ల గోల మొదలు అయ్యింది నా ప్రాణానికి. మా ఆవిడదో స్మార్ట్ ఫోను, జగన్ అన్నయ్య లా అంతా రాస్తూనే పని కానివ్వాలి. మొన్నటికి మొన్న ఇండియా వచ్చినప్పుడు, మా బుడ్డోడి పాస్పోర్ట్ అప్లయ్ చెయ్యడానికి వెళ్తే, ఏదో చిన్న డౌట్ వస్తే, మా ఆవిడ స్టైలు గా గూగుల్ లో చెక్ చేసి, ఇలా ఇవ్వండి అని ఆ ఆఫేసు లో పని చేస్తున్న అతనికి ఒక ఆదేశం ఇచ్చింది. నేను డంగైపోయాను మరి. వాళ్ళ కజిన్స్ టీవీ పెడితే తెలిసే IPL స్కోరు కూడా whatsapp లోనే కనుక్కుంటారంట. మనవడు ఎలా ఉన్నాడు అని మా మామగారు whatsapp లో వైజాగ్ నుంచి మెసేజ్ పెట్టడం, మా ఆవిడ చెన్నైలో ఫోటో తీసి పంపేయడం.. ఇవన్నీ చూసి, నా ఫోన్ ని చూసుకుని, నేను ఎక్కాల్సిన బస్సు మిస్ అయ్యి యుగాలు దాటిపోయిందని గ్రహించుకున్నాను. మా బుడ్డోడు డైపర్ లేకుండా, నా చంకలో ఉన్న రిస్కీ క్షణంలో నాకు జ్ఞానోదయం అయ్యింది. మొన్నెవరో చెప్పినట్టు, బుర్రలో మేటర్ లేకపోయినా పర్లేదు, చేతిలో మాత్రం స్మార్ట్ ఫోన్ తప్పదు అని బోధపరుచుకున్నాను.

సో ఆండ్రాయిడ్ కి ఇంకా మారకతప్పదు అని నిర్ణయం తీసుకున్న ఆ శుభతరుణం లోనే, నా పాత నోకియా ఫోన్ జాయ్ స్టిక్ కూడా పనిచెయ్యడం మానేసింది. అది నేను ఫోన్ చెయ్యకుండానే, రీ డైల్ చేసెయ్యడం, వచ్చిన కాల్ నేను ఎత్తకుండానే, అదే ఎత్తి మాట్లాడ్డం వగైరాలు చెయ్యడం మొదలు పెట్టింది. ఇంక మార్పు రావాలి.. మార్పు కావాలి అని స్మార్ట్ ఫోన్ల సెర్చ్ మొదలు పెట్టా. తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని అందరినీ సంప్రదించాను. అదో పెద్ద ప్రపంచం, ఇంతకంటే పోతీస్ లో చీర సెలక్షన్ వీజీ ఏమో. అసలు ఈ ఫోన్లలో కెమెరాలు పెడుతున్నారో, కెమెరాల్లో ఫోన్లు అతికిస్తున్నారో తెలీడం లేదు. ఏది అయితేనేం, శ్రీకృష్ణ కమీషన్ లా, నేనూ కొన్ని ఆప్షన్స్ ఇచ్చుకున్నాను. అవి samsung s4 మినీ, మోటో జి, నెక్సస్ 5. వీటి మధ్య అన్ని పోలికలు సరిచూసుకున్నాక, అంతర్జాతీయంగా రేట్లు కూడా విశ్లేషించి, నెక్సస్ ఫోన్ ని అమెరికా నుంచి తెప్పించుకుందామని డిసైడ్ అయ్యా. ఏదో ఆఫీసు పని మీద వస్తున్న పెద్దన్న చెవిలో ఈ సంగతి పడేసా. వాడు కాస్తా ఆ ఫోన్ నేను మాట్లాడుతున్నప్పుడే ఆర్డర్ చేసి, లగ్గేజ్ లో మాత్రం పెట్టడం బేషుగ్గా మర్చిపోయాడు. ఇండియా వచ్చాక గుర్తుకు తెచ్చుకుని, ఎలాగోలా మరొకరి చేత తెప్పించి, నేను సరిగ్గా పారిస్ బయలు దేరే రోజు నా చేతిలో పెట్టాడు. నేను డాలర్లు, రూపాయలు, అంటుంటే, ఇచ్చావు లే డబ్బు, అని ఆ ఒక్కటి అడక్కు స్టైలు డవిలాగు చెప్పి, అది కానుక అని తేల్చేసాడు. ఈ విషయంలో మనకి పెద్దగా ఆత్మాభిమానాలు, వాటి బంధువులు లేకపోయినా, సిగ్గుతో కూడిన మొహమాటం వలన వచ్చిన ఆశ్చర్యంతో వాడిని వారించే ప్రయత్నం చేసి ఓటమిని ఒప్పేసుకున్నాను. సో ఇలా నాకూ ఒక స్మార్ట్ ఫోన్ స్మార్ట్ గా చేతిలో వచ్చి పడింది.

ఆ రోజే ప్రయాణం, సో దాన్ని శోధించే టైము, ఓపిక లేక, పారిస్ వచ్చాక డబ్బా ఓపెన్ చేసాను. ఫోన్ బావుంది. మా ఆవిడా ఎప్పుడూ స్కైప్ లో అందుబాటులో ఉంటుంది కదా, "ఆన్ చెయ్యండి ఇంకా బావుంటుంది అంది", ఈ అవిడియా కూడా బానే ఉంది, అని ఓ సిమ్ము కార్డు జార్తగా పెట్టి, ఆన్ చేశా. నా కార్డులో బాలన్స్ నా కార్డే తినేసిందని తెలుసుకుని, మా ఆవిడనే ఒక ఫోను కొట్టమన్నాను. మనం కొట్టమనాలే కానీ, కాదనంటుందా, కాల్ చేసింది. నల్లటి స్క్రీన్ మీద రెండు రంగులు కనిపించాయి, రెండూ నొక్కా, ప్రయోజనం లేదు. మా ఆవిడ కోప్పడేలోపే, మనమే పరిస్థితి చెప్పడం మేలని విషయం చెప్పాను. మధ్యలో ఉన్న వృత్తం నుంచి రైట్ సైడ్ కి లాగండి అంది, ఓకే, అలాగే, అని ఫాలో అయ్యి, కాల్ అటెండ్ చెయ్యగలిగాను. ఆ ముహూర్తం షాట్ అయ్యాక, దాన్ని మళ్ళీ పొందికగా డబ్బాలో దాచేసి, ఆఫీసుకు వెళ్ళిపోయాను. ఈ నెక్సస్ ఫోన్ లో మీరు ఎంచేయ్యాలన్నా, గూగుల్ ఎకౌంటుతో సింక్ చేసి చస్తుంది. సో తప్పక, నెట్ కి కనెక్ట్ చేసి ఆ ముచ్చటా కానిచ్చాను. కొత్త ఫోను, మన మాటా, పాటా ఎలా రికార్డు అవుతుందో చూసుకోవద్దూ.. ఎలా చెయ్యడం, రికార్డింగ్ అప్లికేషను లేదే.. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ట. ఇలా ప్రతీ పనికి మనం ఒక ఆప్ ని పొంది సాధించుకోవాలి అని అర్థం అయ్యింది.

మొత్తానికి ఈ వారంలో, ఫోటోలు తీయడం, పంపడం, పాటలు రికార్డు చేసుకోవడం, రింగర్ ఆపడం మొదలైనవి తెలుసుకుని, ఫోన్ ని ఆఫీసుకు తీసుకెళ్ళే ధైర్యాన్ని సంపాదించాను. whatsapp కూడా ఇంస్టాల్ చేసాను. చూడాలి ఫ్యూచర్ ఎంత స్మార్ట్ గా ఉండబోతోందో. మా ఫ్రెంచ్ టీం మేట్స్ అందరూ, అలా ఫోన్లు రాస్తూనే ఉంటారు పాపం. నేనూ వాళ్ళతో పాటు నా ఫోను రాసుకుంటూ, వాళ్ళలో ఒక్కణ్ణి అయ్యి తరిస్తాను. మీరు అడక్కపోయినా, నేను చెప్పకుండా ఉంటానా, నా పాత నోకియా ఫోన్ ని కూడా నాతోనే తెచ్చుకున్నాను, అసలే పారిస్ లో మ్యూజియమ్స ఎక్కువ, చెప్పలేం కదా, ఏ మ్యూజియమ్ వాళ్ళో అడిగినా అడగచ్చు.