Monday, December 28, 2015

కొన్ని మాటలు

కుంభవృష్టిలో నిలుచున్నా,
ఎండిన గుండె తడవ్వదు.
ఒంటరితనం.

----------

నీతోనూ లేను,
నువ్వు లేకుండానూ లేను.
గతం.
----------

దారులు నను చీల్చుకుపోతాయి..
మాటలు దాటుకుపోతాయి.
నీడలు జారుకుంటాయి.
దోబూచులాడుతూ..

వెలిగి ఆరుతూ..
నిలుచుండిపోయాను.
నేను మాత్రం ఒంటరిగా.
ఏ చీకటికో.. సాక్ష్యంగా.
లేదా ఏ గాయనికో.. గమనానికో.
బహుశా..

వీధి దీపం.

--------

మాటలతో దాచేసాను..
మౌనాన్ని.

--------

Tuesday, December 1, 2015

సుకుమారి 21F

మొన్న వారాంతంలో సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే ఇచ్చి నిర్మింప చేసిన కుమారి 21F చూసాను. ఈ మధ్య కాలం లో ఇంత డివైడడ్ టాక్ ఎక్కడా వినలేదు. కొందరు ఓహో సూపర్ అంటే, మరికొందరు చీ, థూ అని.

సినిమా కి పెద్దగా అంచనాలతో వెళ్ళలేదు నేను. ఇంటెర్వల్ ఫీలింగ్ అయితే, ఏముంది ఈ సినిమా లో ఓ నాలుగు పెద్దల సన్నివేశాలు తప్ప అనిపించింది. కానీ చివర్లో కొన్ని సీన్లు బానే వచ్చాయి. ఏదో చెప్పాలనుకున్నాడు అని మాత్రం అనిపించింది. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడే ఒక ఇంప్రెషన్ ని మిగులుస్తాయి, మరికొన్ని ఇంటికొచ్చాక.. ఇంకొన్ని మళ్ళీ మళ్ళీ చూసాక.. కానీ ఈ సినిమా విషయం లో నేను ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాను, చూసి నాలుగు రోజులు అవుతున్నా, బావుందా లేదా అని తేల్చుకోలేని స్థితి.

వాళ్ళు తీద్దామనుకున్నది, ముఖ్యం గా సుకుమార్ బుర్రలో ఉన్నది, స్క్రీన్ మీదకు చాలా మటుకు వచ్చిందనే చెప్పాలి. దీనికి కొంత మనం దర్శకుడిని, మరియు కేమెరా మాన్ రత్నవేలు ని అభినందించాలి. కథ ఆ మధ్య వచ్చిన ఫ్రెంచ్ సినిమా (Lila dit ça) కి కాపీ లానే ఉంది. హక్కులు తీసుకుని వాడుకుంటే ఇంకా బావుండేది. ఈ విషయం లో మనకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ, కొన్ని కథలు చిన్న నిడివితోనే బావుంటాయి. మరీ సాగదీస్తే అనవసరపు విషయం ఎక్కువ అయ్యి, అసలు మరుగున పడుతుంది. ఈ చిత్రం విషయం లో కూడా కొంత ఆ ప్రభావం కనిపిస్తుంది. “A” సర్టిఫికేట్ కోసమే తపన పడి కొన్ని సన్నివేశాలు తీసారేమో అనిపించింది. మెచ్చుకోదగ్గ అంశం, కథలో అవకాశం ఉన్నా అసభ్యతకు తావు ఇవ్వలేదు. ద్వంద్వార్ధాలు లేవు, అన్నీ డైరెక్ట్ మాటలే.

హీరోయిన్ పాత్రనే నమ్ముకున్న సినిమా ఇది. మిగతా రోల్స్ కేవలం పేరుకే. హీబా పటేల్ తన పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి. డబ్బింగ్, లిప్ సింక్ వగైరాలు కొంచం మెరుగ్గా ఉండి ఉంటే ఇంకా బావుండేదేమో. హీరో రాజ్ తరుణ్ తో పెద్ద ఇబ్బందేం లేదు. ముఖ్యమైన సంభాషణల్లో అరవకుండా, మాట్లాడ్డం నేర్చుకుంటే మనకు సులువు గా ఉంటుంది.

గుర్తించదగ్గ మరో అంశం, నెగిటివ్ కారెక్టర్ వేసిన నోయెల్ ది. తన పరిధిలో బాగా నటించాడు. కొన్ని మాటలు, చేతలు కొత్తగా ఉన్నాయి.

ఈ సినిమా ని సుకుమారే దర్శకత్వం వహించి వుంటే ఇంకా మెరుగైన ఫలితం వచ్చేదేమో. ఒక ఆబ్స్ ట్రాక్ట్ పెయింటింగ్ ని బాగా దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తోంది నాకు ఇప్పుడు. దూరం నుంచి చూస్తే నచ్చేదేమో.. లేక అది మామోలు పెయింటింగ్ అయితే అర్థం అయ్యేదేమో..

సినిమా చెత్తలా లేకుంటే చాలు నెత్తి మీద పెట్టుకునే పరిస్థితి లో ఉన్నాం కనుక, ఈ చిత్రం విజయం సాధించడం లో ఆశ్చర్యం ఏమీ లేదు.

Monday, November 9, 2015

నా కవిత, నా గొంతులో..

కవిత, కవి చేతి రాతలోనో, కవి గొంతులోనో, ఇంకా అర్థవంతం గా ఉంటుంది. కొన్ని సార్లు మాటలే కాదు, మౌనాన్ని కూడా వినాలి.

ప్రపంచ పదులు, గుల్జార్ కవితలు, కవి గొంతులో విని ఎన్ని వందల సార్లు మురిసిపోయానో నేను. కవి యొక్క గాత్ర ధర్మం కంటే, భావాన్ని వినగల్గితే, కవిత ఇంకా అందంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది.
ఎప్పటినుంచో, పోస్ట్ చేసే కవితలకి శబ్ధాన్ని జోడిద్దామనే ఆలోచన ఉన్నా, పెద్దగా ధ్యాస పెట్టలేదు. నిన్ననే సౌండ్ క్లౌడ్ అనే ఒక టూల్ తారసపడింది, మొదటి ప్రయత్నంగా, ఈ మధ్యే పోస్ట్ చేసిన "ఏం ప్రయాణమో ఇది" అనే కవితని, నా మాటల్లో రికార్డ్ చేసి క్రింద లింక్ చేస్తున్నాను. వీలు చూసుకుని ఓ లుక్కు వేయండి.

తెలుగు చదవడంలో ఇబ్బంది పడేవారికీ ఈ మార్గం ఉపయోగకరమే.

Sunday, November 1, 2015

ఏం ప్రయాణమో ఇది..


బ్రతికేస్తున్నా ఇరవై నాలుగు గంటలూ,
మనసుకి దగ్గరైన క్షణాలెన్ని..

అడుగులతో వేల మైళ్ళు దాటేసినా,
తగ్గిన దూరాలెన్ని..

అర్థం లేని మాటలు, అక్కర్లేని కన్నీళ్ళు,
ఎన్ని పారేసుకున్నా,
గుండెకి తోడుగా దొరికిన నేస్తాలెన్ని..

ఏం ప్రయాణమో ఇది, సాగే కొద్ది సన్నమైపోతోంది.
ఎదిగే కొద్ది ఒంటరైపోతోంది..

ఇదే జీవితం అని సరిపెట్టేసుకున్నా,
ఇలా కాదు, మారోలా అంటూ అనుక్షణం చంపుతుంది.

వూపిరిని వదిల్చేసుకున్నాక కూడా,
ఎవరెవరి జ్ఞాపకాల్లోనో బ్రతికించి..
మళ్ళీ చంపుతుంది.

Saturday, October 17, 2015

జ్ఞాపకాల జ్ఞాపకాలు..

జ్ఞాపకాల జ్ఞాపకాలు..

కొన్ని క్షణాలు, గుర్తే కాదు..
అనుక్షణం గుర్తుకు రావడమూ గుర్తే.

మనసు తలుపు తీసి తొంగి చూస్తే,
ఎంత తడో, గుండె నిలువెల్లా సేద తీరడానికి.

రేపు ఉందో, లేదో, ఎవరికైనా..
ఎవరికి తెలుసు ?
ఈ రోజంతా, నిన్నను గుర్తుకు తెచ్చుకుని బ్రతికేసాను.
అదే నేను.

కన్నీళ్ళ సావాసమే అయినా, గతం ఓదారుస్తుంది.
బహుశా నేనూ జీవించానని గుర్తు చేసి..

నిన్న, మొన్నల లెక్కలు ప్రక్కకు నెట్టి,
ఓ సారి వెనక్కి తిరిగి చూసుకుంటే,
గమ్యాలు, గాయాలు.. గెలుపోటములు.. ఏవీ అగుపడవు.
కనిపించేది అంతా, ప్రయాణమే.
అడపాదడపా ఆదరించే మజిలీలు.
అంతేనేమో జీవితం అంటే.
నిన్న లాగే, రేపూ ఓ రోజున గతం అయిపోడానికి.

కొన్ని క్షణాలు గుర్తుకు రావడమే కాదు..
గుర్తొచ్చి నడిపించడమూ గుర్తే.


Sunday, October 11, 2015

కౌముది లో నా కవిత


కొన్ని నెలల క్రితం నేను కౌముదికి పంపిన కవిత "గుప్పెడు చీకటి" ఈ నెల సంచికలో ప్రచురింప బడింది. వీలు చూసుకుని ఓ లుక్కు వేయండి.

కౌముది

Saturday, October 10, 2015

వెంటాడే చిత్రం "తల్వార్"


కొన్ని చిత్రాలు చూసిన తరువాత చాలా కాలం మన ఆలోచనల్లో వెంటాడుతూ ఉంటాయి. ఈ మధ్యే వచ్చిన "తల్వార్" అలాంటిదే.

కొన్నేళ్ళ క్రితం నొయిడా జంట హత్యల ఉదంతం తెలిసిందే. ఆ కేసు నేపధ్యాన్నే కథగా చేసుకుని మలచబడింది తల్వార్. నేరం, పోలీసు, పరిశోధన, వ్యవస్థ, దాని అవస్థ, ఈ అంశాలన్నిటి వెనుక, ఎక్కడో నక్కే న్యాయం. ఈ పరిస్థితి ని ఎలాంటి అనవసర హంగులు లేకుండా వీలైనంత నిజయితీగా చిత్రీకరించారు. సినిమా చూసినట్టు కాకుండా, ఎవరి జీవితంలోకో తొంగి చూసిన అనుభూతి కలుగుతుంది. ఇర్ఫాన్ ఖాన్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది. మనం అందరం గర్వించదగ్గ నటుడు అతను. పాత్రలోని భిన్న పార్శ్వాలని అకళింపు చేసుకుని, అవలీలగా దానికి తెర మీద జీవం పోసాడు.

చిత్రం మీకు వినోదాన్ని ఇవ్వదు, గుండెని నిలువెల్లా తడిమి, నిర్లిప్తత మిగులుస్తుంది, సరిగ్గా వాస్తవం లా.. 

Tuesday, September 1, 2015

కన్నీళ్ళు

కన్నీళ్ళు..
వెలుగే లేని గదిలోకి,
పరిగెత్తాను,
గుండె నిండా ఉన్న వేదనంతా,
వెలికి తరిమేద్దామని.
నన్ను చూసి నా కన్నీళ్ళు
సిగ్గుపడ్డాయేమో..
నేను లేని చోటు కావాలన్నాయి..
తాము బయటపడాలంటే..
ఎక్కడెక్కడో తిరిగాను.
నేను లేని నా కోసం.
దొరకనూ లేదు..
నా కన్నీళ్ళు నన్ను
వదలనూ లేదు.

Monday, May 18, 2015

గుండెని తడిమే చిత్రం - పీకు

గుండెని తడిమే చిత్రం - "పీకు"

హీరోలు, అనవసరపు పాటలు, అతికించిన కామిడీ, అర్థంలేని కథ.. ఈ గొడవలు ఏమీ లేకుండా, ఒ చిత్రం చూద్దామనుకుంటే, తప్పక చూడాల్సిన చిత్రం "పీకు".

సున్నితమైన కథాంశం, మనలాంటి మామోలు పాత్రలు, ఇది నిజమే అనిపించే చిత్రీకరణ వెరసి "పీకు". కొన్ని కథలు, నవ్విస్తూనే ఆలోచింప చేస్తాయి. పాత్రలతో పాటు, మనల్నీ కథలో కలిపేసుకుని, మనసంతా తడిమి, భాదో, సంతోషమో తెలియని అనుభూతిని మిగులుస్తాయి, ఎలా అంటే, సరిగ్గా జీవితం లాగ.

తిలక్ కవితలా, మధురాంతకం వారి కథలా.. నాకు అందమైన జ్ఞాపకం గా మిగిలిపోయింది ఈ సినిమా. విభినమైన చిత్రాలు ఎంజాయ్ చేసే వారు, తప్పక చూడాల్సిన చిత్రం ఇది. మిస్ కాకండి..

 

Monday, May 4, 2015

గుండెలోకి చొచ్చుకుపోయే చక్కటి కవిత - "మా నాన్న"నిన్న మా అన్నయ్య పంపితే చదివాను, "ఆంధ్రప్రదేశ్" అనే పత్రికలో ప్రచురితమైన "మా నాన్న" అనే కవిత.
మమోలు మాటల్లోనే చెప్పినా ఎంతో లోతైన అనుభూతిని మిగిల్చింది ఈ కవిత. అమ్మ గురించిన కవితలు ఎన్నో చదివాను కానీ, నాన్నని వర్ణిస్తూ రాయబడ్డవి కాస్త తక్కువే అని చెప్పాలి.

భావుకత, అనుభవం సరైన పాళ్ళలో మేళవించిన కవయిత్రి తిరుమలాదేవి గారికి హృదయపూర్వకమైన అభినందనలు.

http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika/

 

Saturday, April 11, 2015

ఇంకా ఎన్ని జీవితాలు..

ఎంత వేగం అందుకోను..
నానుంచి నేను పారిపోడానికి.

ఎంత కాలం వేచిచూడను..
నిన్నను మళ్ళీ తెచ్చేసుకోడానికి.

ఎన్ని పుట్టిన రోజులు..
తిరిగి పుట్టేయడానికి.

ఎంతటి బంధాలు..
చావుని ఆపేయడానికి.

ఇంకా ఎన్ని జీవితాలు.
నేను లేకపోవడానికి.


Friday, April 10, 2015

ఇవేం CAPTCHA లు, నా మొహం (IRCTC వింతలు)


విషయం లోకి వెళ్ళేముందు చిన్న ఉపోద్ఘాతం ఇస్తాను. ఫాథర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ గా చెప్పుకోదగిన శాస్త్రజ్ఞుడు అలెన్ ట్యూరింగ్. ఆయన దశాబ్ధాల క్రితం ఒక చిన్న పరీక్షను ప్రతిపాదించాడు, దాని ముఖ్యోద్దేశం కంప్యూటర్ ని ఇంటెలిజెంట్ అని ఎప్పుడు అనచ్చు అని. మరీ లోతుల్లోకి వెళ్ళకుండా క్లుప్తం గా చెప్పుకుంటే, ట్యూరింగ్ ఏమన్నాడంటే, ఏ రోజు అయితే ఒక మనిషి తను నేరుగా చూడకుండా చేస్తున్న రెండు సంభాషణల్లో, ఏది కంప్యూటర్ తో, ఏది మనిషితో అని నిర్ధారణకు రాలేకపోతాడో, ఆ రోజు మనం ఆ కంప్యూటర్ ని తెలివైంది అని ప్రకటించచ్చు అన్నాడు. అంటే ఒక యంత్రం మనిషిలా పూర్తిగా ఇమిటేట్ చెయ్యగల్గిన నాడు అన్నమాట. (దీన్నే ఇమిటేషన్ గేం అని కూడా అంటారు) ఈ పరీక్ష ట్యూరింగ్ టెస్ట్ గా స్థిరపడింది.

యంత్రం తెలివి గురించి మరోసారి చర్చిద్దాం కానీ, ఇప్పుడు చాలా వెబ్ సైట్స్ కి వచ్చిన చిక్కు సరిగ్గా ఇలాంటిదే, తమ సైట్ ను వాడుతున్నది మనుషులా లేక, ఆటోమేటెడ్ ప్రోగ్రాం లా అని. ఈ వ్యత్యాసం వెబ్ సైట్లకు ముఖ్యమైనది. ఎందుకంటే  ఆటోమేటెడ్ ప్రోగ్రాం ల వల్ల వచ్చే తలనొప్పులు అనేకం. అందుకని సరిగ్గా మనం చెప్పుకున్న ట్యూరింగ్ టెస్ట్ కి ఆపోజిట్ టెస్ట్ ను వెబ్ సైట్లు వాడతాయి. అంటే ఒక మనిషి నేను యంత్రాన్ని కాదు మహా ప్రభో అని నిరూపించుకోవడం. ఇందుకు గానూ, మనిషికే తేలిక అయినవి, యంత్రాలకు సంక్లిష్టమైన ప్రశ్నలు పోర్టల్స్ లో పెట్టడం మనం చూస్తున్నాం. దీనికి వాడుక పేరు CAPTCHA (Completely Automated Public Turing test to tell Computers and Humans Apart).


వెబ్ లో పలు విధాలైన CAPTCHA లను చూసాను కానీ, మన IRCTC సైట్ లో వాడే అంత భయంకరమైనవి, మానావాతీతమైనవి ఎక్కడా చూడలేదు. ఏ తత్కాల్ టికెట్టు బుక్ చేద్దామనో, లేక ఆఖరి నిమషంలో టికెట్టు ప్రింట్ తీసుకుందామనో సైటు ఓపెన్ చేస్తే, ఒరేయ్ అబ్బాయి నువ్వు మనిషివా లేక యంత్రనివా నిరూపించికో అని ఒక దిక్కుమాలిన బొమ్మ వదుల్తుంది, అందులో అక్షరాలు రకరకాల విన్యాసాలు చేస్తూ, శ్రీనూ వైట్ల కధలా, అర్థం అయ్యీ, అవ్వకా మన బుర్ర ని ఫుల్ గా కంఫ్యూజన్ లో పడేస్తాయి. ఇందులో ఇందులో మనకో అదనపు సౌకర్యం CAPTCHA లు కేస్ సెన్సిటివ్ కూడాను. రెండు కేసుల్లోనూ ఒకేలా ఏడిచే అక్షరాలు వస్తే ఇంక మన బ్రతుకు బస్టాండే, కాదు కాదు ప్లాట్ ఫామే. నాకు తెలిసి, నేను మనిషినే అయినా, వాళ్ళ దృష్టిలో మానవమాత్రుడిగా రుజువు చేసుకునే అవకాశం ఉన్న బొమ్మ వచ్చే వరకూ, రిఫ్రెష్ కొట్టడం తప్ప మనకి మరో గత్యంతరం లేదు. ఈ లోగా మీ ఆవిడ ఫోన్ లో, ఏమండీ టికెట్టు బుక్ చేసారా లేదా అని నిలదీస్తే, ఇంక మీ పరిస్థితి ఆస్ట్రేలియా వాడికి కూడా వద్దే వద్దు.

ఏ హ్యాకర్ గాడో, లేక వాడి కజినో, ఏవో ప్రోగ్రాంస్ తో మన అతివిలువైన IRCTC సైట్ ని పాడుచేస్తారనే భయం ఉంటే ఉండచ్చు, నేను కాదనను, కానీ అందుకని ప్రతీ యూజర్ ని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకూ సమంజసం ?. రేపో మాపో ఈ-టికెట్టు కొన్నవాళ్ళు మనుషులే అని రైలు ప్రయాణం లో కూడా నిరూపించుకోమంటారేమో, నాకు తెలిసి యంత్రాలు టాయిలెట్లను వాడవు మరి.

రైళ్ళను ఉద్ధరిస్తామంటున్న, మోడీ గారో, లేక ఫలనా మంత్రి గారో ఓ సారి ఆన్-లైన్ లో తత్కాల్ టికెట్టు కొని తరిస్తే మన అవస్థ తెలుస్తుంది. లేక వాళ్ళు మనుషులు కాదని అయినా తేలిపోతుంది. ;-)

మచ్చుకు మీరు నొచ్చుకునే IRCTC CAPTRCHA లు కొన్ని..

 

Wednesday, April 8, 2015

మనిద్దరం..


మనిద్దరం..

మనిద్దరం కలిసి నడుస్తుంటే,
మధ్య దారిలో ఎక్కడో,
కాలం తప్పిపోయింది.

మనం వెతుక్కుంటూ..
చెరో దారీ అయ్యాం.
కాలం ఇద్దరికీ దొరికింది.

జీవితం ?

 

Monday, April 6, 2015

నూరు సంచికల "కౌముది"ఏప్రిల్ నెల సంచికతో "కౌముది" సెంచరీ మైలు రాయి దాటేసింది దిగ్విజయంగా. నెల నెలా తెలుగు సాహితీ వెన్నెలని విరజిమ్ముతూ, ఎన్నో ఖండాంతరాలను పలకరించి, పులకరింప చేసిన మన కౌముది మరెన్నో మైలు రాళ్ళు దాటాలని మనసారా కోరుకుంటున్నాను.

కొన్నేళ్ళ క్రితం, ఓ రోజు అంతర్జాలం లో తెలుగు వెలుగు ఎక్కడైనా కనిపిస్తుందా అని వెతుకుతుంటే దర్శనమిచ్చింది కౌముది. ఆ క్షణం నా అనుభూతి నాకు ఇంకా స్పష్టం గా గుర్తుంది, స్వీట్ షాప్ లో చిక్కుకుపోయిన కుర్రాడి పరిస్థితి అది. బహుశా అప్పటికి కౌముది ప్రారంభించి ఒకటి రెండు యేళ్ళు అయ్యుంటుంది. వెంటనే నేను చేసిన పని, ఆ పత్రిక ఎడిటర్ కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మైల్ పంపడం. అప్పటినుంచీ కౌముది ని రెగ్యులర్ గా ఫాలో అవుతూనే ఉన్నాను. గొల్లపూడి మారుతీ రావు గారి వ్యాసాలు, వంగూరి చిట్టెన్ రాజు గారు మరియు ఢొక్కా ఫణి గారు రాసే సరదా కబుర్లు, కథలు, కవితలు, పరిచయాలు, అభిప్రాయాలు.. ఎన్నో, నాకు నచ్చేవి. తెలుగు లో నాలుగు లైన్లు టైప్ చెయ్యడం ఎంత ప్రయాసో మనకి తెలియంది కాదు, ఇంతటి సంచిక ప్రతీ నెలా క్రమం తప్పక అచ్చ తెలుగు లో ఎలా కొలువు తీరుతోందో కిరణ్ ప్రభ గారికే తెలియాలి.

కేవలం భాష మీద ఉన్న మక్కువతో ఇంతటి పరిశ్రమని ఏళ్ళ తరబడి నిర్విరామంగా కొనసాగిస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. నాలా ఎప్పుడైనా నాలుగు ముక్కలు రాసే రచయితలకు ఎంత గొప్ప అవకాశం. ఎందరో ప్రఖ్యాత రచయితల పేర్ల మధ్య మన పేరూ కనిపించడం, ఎంతటి ప్రోత్సాహం. మరీ ముఖ్యం గా కిరణ్ ప్రభ గారి లో నేను ఎంతగానో నచ్చుకొనే విషయం, ఆయన స్పందించే తీరు. మీరు ఎప్పుడు మైల్ చెయ్యండి, ఒక రోజులో ఖచ్చితం గా ఆయన బదులిస్తారు. బ్లాగు లో కాకుండా బయట ప్రచురణకు పంపుదాం అని ఆలోచన వస్తే, నాకు తట్టే ఒకే పేరు, కౌముది. కిరణ్ ప్రభ గారి అభిప్రాయాలకు పరిమితం చెయ్యకుండా, పత్రికకే ఒక వ్యక్తిత్వం నిలబెట్టారు ఆయన, అందుకే కౌముది అందరి మన్ననలు పొందుతూ కొనసాగుతోంది.

ఎప్పుడో దశాబ్ధాల క్రితం కిరణ్ ప్రభ గారు ఆంధ్ర విశ్వ విద్యాలయం లో చదువుకునే రొజుల్లో, నిర్వహించిన రాత పత్రిక పేరు కూడా "కౌముది", ఇది యాధృచ్చికం కాదు లెండి.

మంచి ఆలోచన రావడం, అది కార్య రూపం దాల్చడం, అందరి మనసుల్నీ ఆకర్షించడం వరకూ ఒక ఎత్తు, అది అదే స్థాయిలో దినదిన ప్రవర్థమానమౌతూ యేళ్ళ తరబడి కొనసాగడం ఒక అద్భుతం. అందులోనూ, ఏ విధమైన ఫార్మల్ ఆర్గనైజేషన్ లేకుండా, కేవలం ఆసక్తి, నిబద్దత మరియు శ్రమ ఆయుధాలుగా..

ఈ అక్షర యజ్ఞం వెనుక అన్నీ తామై నడిపిస్తున్న కిరణ్ ప్రభ దంపతులకు మరొక్కసారి హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు.

Monday, March 30, 2015

మా బుడ్డోడు నేర్పినవి..

మా బుడ్డోడు నేర్పినవి..

పడిపోయినా అడుగు ఆపక్కర్లేదని..
ఎగిరే పక్షికే కాదు.. అస్తమించే సుర్యుడికీ టాటా చెప్పాలని..
పాట ఏదైనా మనకొచ్చిన నాట్యం చెయ్యొచ్చని..
అప్పుడప్పుడు సరదాగా నాలుగడుగులు వెనక్కి వెయ్యచ్చని..
చిరునవ్వులు పంచడానికి పరిచయం అక్కర్లేదని..
గాయాలని తడుముకుని ఏడవద్దని..
చందమామని క్రిందకి రమ్మని రోజూ పిలవచ్చని..

చెప్పడానికి మాటలెందుకని..

Monday, March 23, 2015

కొన్ని మాటలు.. (చిట్టి పొట్టి కవితలు)


---

గతానికి ఎదురీత.
చీకట్లో.. కలలో.
కలవరింతతో.

---

నీ కళ్ళతో ఏంచూస్తాను..
నా లోపల్లోకి.
గుడ్డి చూపులు.

---

నువ్వు నేను గెలిచానన్నావ్..
ఇంకో నువ్వు నేను ఓడానన్నావ్..
నేను బ్రతికి.. పొయాను..
అంతే.

---

వెతకడమే సుఖం.
భయం లేదు.
ఏదో పోగొట్టుకుంటానేమో అని.

---

జీవితం లో అన్నీ రెండే..
నిండా భిన్నమైనవి..
వెలుగు చీకట్లు..
సుఖ దుఖాలు..
నేను, నీ దృష్టిలో నేను.

---

తేదీలు మారాయి..
మనుషులూ.. మాటలూనూ..
మారనది రాతే.
డైరీ.

----

పందెంలో,
గెలుపు ఇచ్చేబహుమతి.
ఒంటరి తనం.
---

Thursday, March 19, 2015

ఆలీ బాబూ, కొంచం కంట్రోల్..మొన్నెప్పుడో అల్లు అర్జున్ చిత్రం ఆడియో విడుదల వేడుకలో, కమీడియన్ ఆలీ అన్న వెకిలి మాటలకి నొచ్చుకుని, ప్రోగ్రాం అయ్యాక యాంకర్ సుమ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అని గాలి వార్త. ఈ సంఘటన నిజా నిజాలు మనకు తెలీదు కానీ, నా మటుకు మాఇంట్లోనే చాలా సార్లు ఆలీ మాటలకి, చేష్టలకి ఇబ్బంది పడ్డాం, విసుక్కున్నాం, ఛీ అనుకున్నాం. కుటుంబం అందరం కలిసి చూసే కార్యక్రమాల్లో అక్కర్లేని, వెకిలి హాస్యం, ద్వంద్వార్ధ సంభాషణలు రోత పుట్టిస్తాయి.

బహుశా ఆలీ కి ఉన్న చనువుతో బయట ఎంతో మంది ప్రముఖులతో అలానే మాట్లాడతాడేమో, అది ఆయన ఇష్టం, కానీ నలుగురూ పాలుపంచుకునే కార్యక్రమాల్లో నోటిని కాస్త కంట్రోల్ లో ఉంచుకుంటే మర్యాదగా ఉంటుంది. నటుడి గా ఆలి అంటే నాకూ అభిమానమే, కానీ మరీ ఇంత దిగజారి ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది ? మరీ ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెట్టేలా, కించపరిచేలా మాట్లాడ్డం ఖచ్చితం గా ఖండించాల్సిన విషయం. ఎంతో పాపులారిటీ ఉన్న నటులే ఇలా మాట్లాడితే, రోడ్డున పోయే పొకిరి ఇంకెలా మాట్లాడతాడు ?

సెలబ్రిటీ బాబులు, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఏంచేసుకున్నా మాకు అక్కర్లేదు, బయట మాత్రం కొంచం వళ్ళు జాగర్త పెట్టుకుని ఉంటే బావుంటుంది, మీరు చేసింది అంతా కరక్టే అనీ, అలా చెయ్యడం గొప్ప అనీ అనుకుని, అనుకరించే జనాలకు సమాజం లో కొదవ లేదు.
 

Tuesday, March 17, 2015

ప్రేమ పరీక్షలు ??


శీర్షిక చూసి అదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ అనుకునేరు, అలాంటిదేం కాదు. ఉదయం కాఫీ తాగుతున్నప్పుడు, కంటికి కనిపించిన వార్త చదివేయడమే తప్ప, అది మనకి అవసరమా కాదా అని ఆలోచించే అలవాటు నాకు బొత్తిగా లేదు. అలానే ఈ రోజు ఈనాడు లో ఓ కధనం చదివా.. అదేదో దేశం లో శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి, ప్రేమ లో ఉన్న వాళ్ళ మెదడులో అవేవో భాగాలు బాగా చురుగ్గా ఉన్నాయి అని నిర్ధారించారంట. చెప్పకనే చెప్పిన విషయం ఏంటంటే, అంత పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతే తప్ప మన మెదడులో ఆ ప్రాంతాల్లో అంత చైతన్యం ఉండదంట.

ఇంతవరకూ బానే ఉంది, పేపర్ అన్న తరువాత ఏవేవో రాస్తుంటారు, కాఫీ తాగితే కేన్సర్ వస్తుంది అని ఒకసారి రాస్తే, తాగకపోతే గుండెపోటే గతి అని మరోసారి సెలవిస్తారు. మనం పెద్దగా సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే చావంటూ డోర్ బెల్లు కొట్టాక, మనం తొక్కలో ఫిల్టర్ కాఫీ తాగామా అని అడుగుతుందా పాడా. కానీ ఇప్పుడు పెనుభూతం లాంటి నా అనుమానం ఏంటంటే, రేప్పొద్దున్న ఏ అభాగ్యుడో తెలుసో, తెలీకో "ఐ లవ్ యూ" అని ఓ బ్యూటిఫుల్ యంగ్ గాళ్ దగ్గర కుండ బద్దలు కొట్టినప్పుడు, ఆ ఫ్యూచర్ ప్రేయసి, సైకిల్ గాప్ లో డాట్టారు అవతారం ఎత్తి, ఫలనా స్కాన్ సెంటర్ కి పోయి, ఈ ఈ ప్రేమ పరీక్షలు అన్నీ చేయించుకుని, రెండ్రోజుల తరువాత రిపోర్ట్స్ తో కనపడు అని సాగనంపితే మన వాడి పరిస్థితి ఏంటి.. అసలు ఏంటి అని నా గాభరా, కంగారు. ఇంకా బోలుడన్ని.

జీవితం అంటే జీవించడం అని.. ప్రేమ అంటే ప్రేమించడం అని, ఇలా అర్థం కానట్టుగా నిర్వచించుకోవాలే కానీ, ఇలా టెస్టులు గట్రా చేసుకోవాలంటే చస్తామా. ఇప్పుడు మాట విసురుకి, ఏ భార్యామణికో భర్తా రావు మీద రవ్వంత డవుట్ వచ్చి, అదేదో దిక్కుమాలిన డైలీ సీరియల్ దయవల్ల, అది కాస్తా డవుటున్నర అయ్యి, ఏకంగా ఆ MRI మెషీను ఏదో ఇంట్లో కొని పడేస్తే, ఆ భర్తగాడిని పగ వాడైనా పలకరించగలడా.. ప్రేమంటే ఏమైనా బౌండరీ లైను దగ్గర పట్టిన కాచా. థర్డ్ ఎంపైర్ కి స్టైలుగా ఇచ్చి, తేల్చమనడానికి. అయినా తరతరాలుగా ప్రేమికులు తమ హృదయాల్ని.. గుండెల్ని.. మనసుల్ని... కోసుకుని.. కాచుకునీ ప్రేమిస్తే.. ఇప్పుడు వాడెవడో వచ్చి అవన్నీ కాదంటూ, బుర్ర లో స్కాన్ చేస్తాననడం ఎంతవరకూ సమంజసం అని నేను సభాముఖంగా నిలదీసేస్తున్నాను. అదేదో సినిమాలో గాలి కనిపిస్తోందా అని AVS అన్నట్టుంది ఈ వ్యవహారం. పోనీ లోకల్ ప్రేమ గాళ్ళం మన సంగతి ప్రక్కన పెట్టండి, మన గ్లోబల్ ప్రేమ మూర్తులు అంటే, సెలబ్రిటీలు.. స్టార్లు.. గురువులు.. నాయకులు.. వాళ్ళ పరిస్థితి చూడండి ఇంక. ఓటరు మహాశయుడు, నన్ను ప్రేమించినట్టు నిరూపించుకో అప్పుడే ఓటు అంటే, డిపాజిట్లు దక్కేనా.

అయినా, చదివామా.. మరచిపోయామా అన్నట్టుండాలి.. నాకెందుకొచ్చిన ప్రేమ గోల చెప్పండి. సగం జీవితం అయిపోయినట్టే ఉంది, గట్టిగా "ఐ లవ్యూ" అని చెప్తే, మా ఆవిడ తను ఇచ్చింది కాఫీయేనా అని డవుటు పడుతుంది, అందుకని మనకి పెద్దగా వచ్చేదీ పోయేదీ ఏమీ లేదు. ఏదో సమాజం గురించే మరి ఈ వేదన. మా బుడ్డోడు పెద్దోడు అయ్యేసరికి ఇలాంటివి ఇంకెన్ని వస్తాయో ఏంటో, ఎదగడానికి ఎందుకురా తొందర అని ఊరకనే అన్నారా..

Monday, February 16, 2015

బావుందనిపించే, పూరి మార్కు చిత్రం "టెంపర్"

ఈ మధ్య తెలుగు చిత్రాల్లో, దర్శకులేమో హీరోల్లా తమ మార్కు కోసం పరితపిస్తుంటే, హీరోలు దర్శకుల సినిమా ని తమ భుజాల మీద ఎత్తుకుని మోసుకెళ్తున్నారు. ఆ తరహా చిత్రమే టెంపర్ కూడా. నెలకి, నెలన్నరకీ కూడా కొత్త చిత్రం తీయగల పూరి జగన్, వొళ్ళు బాగా దగ్గర పెట్టుకుని తీసినట్టు అనిపించింది. మామోలంటే మామోలుగా ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియంది కాదు, చిత్రం ఓ 70 మార్కులు తెచ్చుకుంటే, మరో 30, ప్రేక్షకులే సులువుగా వేసేసి సంబరపడిపోతున్నారు, ఎందుకుంటే ఆ 70 తెచ్చుకునే సినిమాలే అరుదు అయిపోయాయి మరి. ఆ తోవలో చూస్తే, టెంపర్ మిమ్మల్ని ఆట్టే నిరాశ పెట్టదు.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, మా బుడ్డోడిని కూడా వెంట పెట్టుకుని, సతీ సమేతంగా నిన్న టెంపర్ ని ప్రోత్సహించాం. ఎక్కడంటారా, చెన్న పట్నంలో దేవీ సినీప్లెక్స్ అని చెప్పుకునే టూరింగ్ టాకీసు లో. అంత అభాండం ఎందుకు వేసానంటే, మా వాడు (ఇంకా రెండు నిండలేదు) పొరపాటున సీటు మీద నిలబడితే, వాడి బుర్ర కూడా మనకి ఎన్.టి.ఆర్ పక్కన స్క్రీన్ మీద అగుపడుతుంది. అంత బావుంది హాలు. మా వూర్లో జగదాంబ పేరుక్రిందే చలామణి అవుతున్న శారద, రమాదేవి థియేటర్స్ ని గుర్తిచేసింది ఈ దేవీ "బాల". ఓ.కే లెండి, మౌంట్ రోడ్ లో థియేటర్స్ ని నిర్వహించడమే గొప్ప విషయం, పార్కింగ్ కి ఇచ్చుకున్నా సంపాదన ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. ;-) కాబట్టి, ఆ విషయాన్ని మనం వీజీగా క్షమించేయచ్చు.
ఇంక చిత్రం విషయానికి వస్తే, పూరి, ఎన్.టి.ఆర్ చిత్రం అంటేనే ఎందుకో నేను పెద్దగా ఆశావహ దృక్పథం తో వెళ్ళలేదు. దర్శకుడు నాకు తెలిసిందే ప్రపంచం అని మరీ బలుపు తో సినిమా లో చూపిస్తే కొంచం విసుగు వస్తుంది. కానీ మనలో మన మాట, విలన్ ని వెర్రి వెంగళప్పను చేసే శ్రీను వైట్ల కంటే ఇదే నయం లెండి. తెలుగు సినిమా కథని ఇదీ అని రాయడానికి పూనుకోవడం, మైసూర్ బజ్జి లో మైసూర్ ని వర్ణించడం లాంటిది, ప్రయత్నిస్తాను. అనాధ గా పెరిగి, డబ్బు సంపాదించడానికి బావుంటుంది అని పోలీసు అయిన హీరో, విలన్ గాంగు కి తన వంతు సాయాలు చేస్తూ, హ్యాపీ గా ఉంటాడు. హీరోయిను తారసపడ్డం వరకూ క్లియర్ గానే ఉన్నా, ప్రేమలో ఎప్పుడు పడ్డాడో తెలీలేదు కానీ, "ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్" అని ఆక్రోశిస్తాడు ఓ ఫైట్ సీన్ లో. ఆ గర్ల్ ఫ్రెండ్ కాజల్, ఓ కోర రాని కోర్కె కోరడమూ.. ఆ పిల్ల కోసం మరో పిల్లని హీరో కాపడ్డమూ, ఆ తదుపరి పర్యవసానాల వల్ల హీరో మారిపోయి, విలన్లని అంతమొందించడమూ, సమాజాన్ని ఉధ్ధరించడమూ వగైరా వగైరా.
ప్రధమార్థం రొటీనే, పూరి యాస/శ్వాస కనిపించినా, వినోదాత్మకంగానే ఉంది. సెకెండ్ హాఫ్ మాత్రం సీరీయస్ గానే తీసాడు. బిజినెస్ మ్యాన్ లాంటి చిత్రాలతో పోలిస్తే, కొంచం సిన్సియర్ గానే ప్రయత్నించాడు అనిపించింది. సినిమా చివర్లో కోర్ట్ సీన్లు బాగా పండాయి, బహుశా కొంత క్రెడిట్ రచయిత వక్కంతం వంశీ కి ఇవ్వాలేమో. ఎన్.టి.ఆర్ గురించి చెప్పడానికి ఏముంది, ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఎన్.టి.ఆర్ కు ఉన్న ఈజ్ అద్భుతమైనది. దర్శకుడు అనుకున్న ఎమోషన్, సమపాళ్ళలో స్క్రీన్ మీద క్యారీ చెయ్యగలిగాడు. కథనంలో అంత కన్విక్షన్ లేకపోయినా, ఎన్.టి.ఆర్ నటనతో మనకు ఆ లోపం పెద్దగా కనిపించదు. కొన్ని మామోలు సన్నివేశాలని కథలో అబ్సార్బ్ చేసుకున్న తీరు చాలా బావుంది. తనదైన శైలి నటనతో ఎప్పటిలానే పోసాని ఆకట్టుకుంటాడు. కొన్ని డైలాగ్స్ లో మనకి పాత్రలకంటే పూరి జగనే కనిపిస్తాడు, ఇది మనకి అలవాటే. సమాజం లో నెగిటివిటీ ని ఆకర్షణీయంగా, రొమాంటిసైజ్ చేసి చూపించే దర్శకులు, అంటే, ముఖ్యంగా వర్మ స్కూల్ వాళ్ళు, మంచిని చూపించే సీన్లల్లో ఎందుకనో తేలిపోతారు. ఆ కొరతను ఈ సినిమా లో జగన్ అధిగమించాడు కొంతవరకూ. ఇంకా లోతుగా వెళ్ళొచ్చేమో, కానీ అప్పుడు సినిమా కమర్షియల్ గా ఆడకపోవచ్చు. ఆ మధ్య ఎప్పుడో ఓ చిన్న వెలుగు వెలిగి తరువాత అరకొర పాత్రలకు పరిమితం అయిన సోనియా అగర్వాల్ ని ఈ చిత్రం లో ఎందుకు ఇరికించాడో పూరి కే తెలియాలి. ఇంకాస్త నటన, డవిలాగులు వచ్చిన నటి ఎవరు చేసినా ఆ పాత్ర మనకి కనిపించేది. పూరి అన్ని సినిమాల్లానే ఈ సినిమా లో కూడా నాకు విసుగొచ్చే అంశం లైటింగ్/సెట్స్, కొన్ని సన్నివేశాలు రియాలిటీ కి దగ్గరగా తీస్తేనే ఆకట్టుకుంటాయి, ఈ విషయంలో మన దర్శకులు తమిళ దర్శకులు నుంచి నేర్చుకోవల్సింది చాలానే ఉంది.
మిగతా విషయాలకి వస్తే, పాటలు ఆవరేజ్ గా ఉన్నాయి, ఎక్కువ సార్లు వింటే ఏమైన నచ్చుతాయేమో తెలీదు. కథని సమకూర్చిన వంశీని ప్రశంసించాలి, రొటీన్ మాఫియా కథలు కాకుండా ఇలాంటి అంశాన్ని ఎంచుకోవడం ఆహ్వానించదగ్గ అంశం. పోసాని - ఎన్.టి.ఆర్ మధ్య సంభాషణలు చాలా బాగా వచ్చాయి. ఎన్.టి.ఆర్/పూరి ఫాన్స్ తప్పక చూడచ్చు, నాలాంటి సగటు ప్రేక్షకులు చూస్తే వచ్చే నష్టమేమీ లేదు, అలా అని మరీ బ్లాకు లో గట్రా కొనుక్కుని వెళ్ళక్కర్లేదు, నాలుగు రోజుల తరువాత చూడండి.
సినిమాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న హీరోలు అకస్మాత్తుగా మారిపోయినట్టు, సమాజంలో కూడా జరిగితే బావుణ్ణు, కాజల్ అగర్వాళ్ళు ఇంకా చాలా మంది కావాలేమో మరి..
(ఇది చిత్ర సమీక్ష కాదు, కేవలం నా స్పందన, మీకు మరోలా అనిపించే అవకాశం పుష్కళంగా ఉంది)

Tuesday, February 10, 2015

అసామాన్య విజయం

దిల్లీ లో ఆప్ విజయం ఏ కోణం లోంచి చూసినా అసామాన్యమైనదే. ఇంతటి ఘనమైన విజయాన్ని ఆప్ ఎలా సఫలీకృతం చేసుకుంటుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకోడానికి, పనితీరుతో ప్రసన్నం చేసుకోడానికి చాల వ్యత్యాసం ఉంది. ఈ తేడాని మోడి గారు ఇప్పటికే గ్రహించుకుని ఉంటారు. ఉద్యమాల్లో ముందుండే కేజ్రీవాల్ గెలవడం శుభ పరిణామమే, అవినీతిలో కూరుకుపోయిన రెండు అతి పెద్ద పార్టీలను నామ రూపాల్లేకుండా మట్టికరిపించడం చరిత్ర లో నిలచిపోయే ఘట్టం. ప్రభుత్వం అనే తుప్పు పట్టిన ఇనుప చట్రం లో ఈ ఆవేశాలు మరియు ఆదర్శాలు ఎంతవరకూ ఫలితాలిస్తాయో కానీ, ఆప్ గెలుపు ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఇంకా అవకాశం ఉందని నిరూపించింది.
దిల్లీ ఎన్నికలు దేశ గమనాన్ని నిర్దేశించవు, కానీ ఆప్ ఓడిపోయి ఉంటే, కొంతైనా నిజాయితీతో మరొకరు పార్టీ పెట్టే ధైర్యం చెయ్యరు. లోక్‌సత్తా లేక మరొకటో ఈ రోజు కాకపోయినా, రేపయినా జనం లో బలం పుంజుకోగలదని ఈ ఎన్నిక తేట తెల్లం చేసింది. దిల్లీ లో జరిగింది దేశం అంతా వచ్చే ఏడు జరిగిపోతుందని కాదు కానీ, ఇంక ఎక్కడా జరగదు అని అనుకోవడం కూడా అమాయకత్వమే. వందల, వేల కోట్ల అవినీతి పార్టీలు ఆప్ ని రెండు కోట్లకి బోనులో నిలబెట్టడం కాస్త వింతగానే కనిపించినా, ఆప్ కి అదొక హెచ్చరిక. ఆప్ లాంటి పార్టీకి ఉన్న మద్దతు అల్లా మిగతా పార్టీలపై ప్రజలకున్న అసహ్యం. అధికార మదంతోనో, లేక తమ సర్వైవల్ కోసమో విలువలకి ఏమాత్రం తిలోదకాలు ఇచ్చినా, ప్రజల మద్దతు ఇప్పుడు వచ్చినంత వేగంగానూ మాయమౌతుంది.
మోడి గారు, కేంద్రం, మరింత ఒళ్ళు  దగ్గర పెట్టుకుని పని చెయ్యకపోతే, దేశం లో దిల్లీలు మరిన్ని తయారవుతాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో BJP కి వరమయ్యింది UPA 2 యొక్క దగుల్బాల్జీ పాలన. ఈ అయిదేళ్ళలో NDA ఏదో ఒకటి ఉద్ధరించామనిపించుకోకపోతే వచ్చే ఎన్నికలు అగ్నిపరిక్షే.

Wednesday, February 4, 2015

పాపం నా బ్లాగు..

పారిస్ నుంచి చెన్నై వచ్చి నెలలు గడిచినా, నా బ్లాగు మొహం చూడ్డానికి అసలు సమయమే చిక్కడం లేదు. కొత్తగా ఏదో రాయడం మాట అటుంచండి, అసలు ఓపెన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం గగనం అయిపోయింది. అప్పట్లో కూడలి-మాలిక ఉండేవి, ఇప్పుడు ఏమున్నాయో అనే పరిస్థితిలో ఉన్నాను. కరువులో అధిక  మాసాలు, గోరుచుట్టుపై రోకలి పోట్లు, పెళ్ళాం వూర్లో లేనప్పుడు వాటర్ కాన్ ఖాళీ అవ్వడాలు  మనకి అలవాటే కానీ, ఈ సంసారమనే సాగరం లోతుపాతులే అంతు తెలీడం లేదు. 

చెర్రీ గాడితో పరుగులు, అడపాదడపా అనుకోని ప్రయాణాలు, ఇవి చాలవన్నట్టు, స్వైన్ ఫ్లూ అంత హై క్లాసు  కాకున్నా, మధ్య తరగతి ఫ్లూ జ్వరాలు, వాటి కజిన్స్.. ఇలాంటివి వెరసి నాకు నేనే దొరకనంత, నాకే నేను మిగలనంత బిజీ. 
ఎప్పుడైనా కాస్త టైం మిగిలితే, ఏ పుస్తకమో తీద్దామని కాస్త కక్కుర్తి పడినా, మా బుడ్డోడు దాని మీదే తన పరాక్రమం చూపించి నా ఆశని మొక్కగానే తుంచేస్తున్నాడు. నా దగ్గర ఉన్న ఆ నాలుగు పుస్తకాల రక్షణ నిమిత్తం, నేను వాటి జోలికి పోవడం లేదు. మనలో మన మాట, మా చెర్రీ గాడి పుణ్యమా అని నేను పుస్తక పఠనం తగ్గించడం పట్ల మా ఆవిడ హర్షం వ్యక్తీరిస్తున్నట్టే ఉంది. ఏంచేస్తాం, కొమ్ములు ఎప్పుడొచ్చినా వాడిగానే ఉంటాయి మరి, అవి వాటి నైజం. మరోవిషయం ఏంటంటే, ప్యారిస్ లో నా జీవనాధారం అయిన ల్యాప్ టాప్, చెన్నై వచ్చాక నేను మొహం చాటేయడం తో ఓ మాదిరిగా హర్ట్ అయ్యి, నాకు సమ్మె నోటీస్ ఇచ్చింది, అది కూడా పాత డేట్ వేసి. నేను తేరుకుని చూసేసరికి అవ్వాల్సిన డామేజీ అయిపోయింది. అందుకని ఇప్పుడు మనకి ఆవేశం వచ్చి రాద్దామన్న ఇంట్లో ఉపకరణాలు లేవు. బాబు గారు మన సింగపూర్ రేంజ్ రాజధానిలో ఒక బ్లాగుపురాన్ని కట్టించి నాలాంటి బ్లాగర్ గాళ్ళకి ఓ నాలుగు కంప్యూటర్లు పడేస్తే బావుణ్ణు, ఆ ప్రక్కనే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేస్తూ, బ్లాగుని కూడా ఉద్ధరిస్తాను.మనకి రాజధానుల మాట ఎందుకు గాని, ఈ మధ్య వార్తలు చూడాలన్నా చిరాకు వస్తోంది. జాతీయ చానల్స్ ఏమో భారత్ పాక్ క్రికెట్ మాచ్ కి రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నట్టు ఫీల్ అయ్యి అరుస్తుంటే, తెలుగు చానళ్ళేమో టెలీ షాపింగ్ వాళ్ళలా చెప్పిందే చెప్పి చెప్పి నరకం చూపిస్తున్నారు. ఇద్దరు చంద్రుళ్ళు ఉద్ధరిస్తున్నా మన చీకట్లు ఇప్పట్లో ఏమీ తొలగేలా లేవు. నాకెందుకో అక్కడ మోడి గారు, ఇక్కడ బాబు గారు, ఎన్నికలు అయిపోయి నెలలు గడుస్తున్నా, ఇంకా ఆ ప్రచారాల మూడ్ లోనే ఫిక్స్ అయిపోయారు అనిపిస్తోంది. వాటికి నేను అడ్డు చెప్పను కానీ, మరీ మ్యాటర్ విస్మరిస్తే, వోటర్ ఫీల్ అయ్యే అవకాశం మాత్రం బేషుగ్గా ఉంది. ఇప్పుడు మాటవరసకి వంటింట్లోంచి మీ శ్రీమతి ఏమండీ వంట గాస్ అయిపోయింది అంటే, మీరు చెయ్యాల్సింది ఏంటి ? గాస్ బుక్ చెయ్యడమా లేక కె.జీ బేసిన్ లో గాస్ నిల్వలు చెక్ చెయ్యడమా ? మన ప్రభుత్వాల పనీ ఇలానే ఉంది. ఓ.కే లెండి, ఏదో కాస్త అవకాశం దొరికి, ఈ నాలుగు లైన్లు రాసాను. మీలో ఎంతమందికి నా అక్షర ఘోషలు గుర్తున్నాయో తెలీదు, ఎవరైనా ఎప్పుడైనా పొరపాటునో, గ్రహపాటునో, వచ్చి ఏమిటి వీడు ఏమీ రాయడమే లేదు అని నొచ్చుకున్న సందర్భాలు ఉండి ఉంటే, మరి నేను క్షంతవ్యుణ్ణి, క్షమించేయండి. నెలకోసారి అయినా ఒక పోస్ట్ చేసేలా ఇంక కాస్త వేళ్ళు జార్త పెట్టుకుంటాను. మళ్ళీ మరో పోస్టులో కలుద్దాం.