Wednesday, February 4, 2015

పాపం నా బ్లాగు..

పారిస్ నుంచి చెన్నై వచ్చి నెలలు గడిచినా, నా బ్లాగు మొహం చూడ్డానికి అసలు సమయమే చిక్కడం లేదు. కొత్తగా ఏదో రాయడం మాట అటుంచండి, అసలు ఓపెన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం గగనం అయిపోయింది. అప్పట్లో కూడలి-మాలిక ఉండేవి, ఇప్పుడు ఏమున్నాయో అనే పరిస్థితిలో ఉన్నాను. కరువులో అధిక  మాసాలు, గోరుచుట్టుపై రోకలి పోట్లు, పెళ్ళాం వూర్లో లేనప్పుడు వాటర్ కాన్ ఖాళీ అవ్వడాలు  మనకి అలవాటే కానీ, ఈ సంసారమనే సాగరం లోతుపాతులే అంతు తెలీడం లేదు. 

చెర్రీ గాడితో పరుగులు, అడపాదడపా అనుకోని ప్రయాణాలు, ఇవి చాలవన్నట్టు, స్వైన్ ఫ్లూ అంత హై క్లాసు  కాకున్నా, మధ్య తరగతి ఫ్లూ జ్వరాలు, వాటి కజిన్స్.. ఇలాంటివి వెరసి నాకు నేనే దొరకనంత, నాకే నేను మిగలనంత బిజీ. 
ఎప్పుడైనా కాస్త టైం మిగిలితే, ఏ పుస్తకమో తీద్దామని కాస్త కక్కుర్తి పడినా, మా బుడ్డోడు దాని మీదే తన పరాక్రమం చూపించి నా ఆశని మొక్కగానే తుంచేస్తున్నాడు. నా దగ్గర ఉన్న ఆ నాలుగు పుస్తకాల రక్షణ నిమిత్తం, నేను వాటి జోలికి పోవడం లేదు. మనలో మన మాట, మా చెర్రీ గాడి పుణ్యమా అని నేను పుస్తక పఠనం తగ్గించడం పట్ల మా ఆవిడ హర్షం వ్యక్తీరిస్తున్నట్టే ఉంది. ఏంచేస్తాం, కొమ్ములు ఎప్పుడొచ్చినా వాడిగానే ఉంటాయి మరి, అవి వాటి నైజం. మరోవిషయం ఏంటంటే, ప్యారిస్ లో నా జీవనాధారం అయిన ల్యాప్ టాప్, చెన్నై వచ్చాక నేను మొహం చాటేయడం తో ఓ మాదిరిగా హర్ట్ అయ్యి, నాకు సమ్మె నోటీస్ ఇచ్చింది, అది కూడా పాత డేట్ వేసి. నేను తేరుకుని చూసేసరికి అవ్వాల్సిన డామేజీ అయిపోయింది. అందుకని ఇప్పుడు మనకి ఆవేశం వచ్చి రాద్దామన్న ఇంట్లో ఉపకరణాలు లేవు. బాబు గారు మన సింగపూర్ రేంజ్ రాజధానిలో ఒక బ్లాగుపురాన్ని కట్టించి నాలాంటి బ్లాగర్ గాళ్ళకి ఓ నాలుగు కంప్యూటర్లు పడేస్తే బావుణ్ణు, ఆ ప్రక్కనే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేస్తూ, బ్లాగుని కూడా ఉద్ధరిస్తాను.మనకి రాజధానుల మాట ఎందుకు గాని, ఈ మధ్య వార్తలు చూడాలన్నా చిరాకు వస్తోంది. జాతీయ చానల్స్ ఏమో భారత్ పాక్ క్రికెట్ మాచ్ కి రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నట్టు ఫీల్ అయ్యి అరుస్తుంటే, తెలుగు చానళ్ళేమో టెలీ షాపింగ్ వాళ్ళలా చెప్పిందే చెప్పి చెప్పి నరకం చూపిస్తున్నారు. ఇద్దరు చంద్రుళ్ళు ఉద్ధరిస్తున్నా మన చీకట్లు ఇప్పట్లో ఏమీ తొలగేలా లేవు. నాకెందుకో అక్కడ మోడి గారు, ఇక్కడ బాబు గారు, ఎన్నికలు అయిపోయి నెలలు గడుస్తున్నా, ఇంకా ఆ ప్రచారాల మూడ్ లోనే ఫిక్స్ అయిపోయారు అనిపిస్తోంది. వాటికి నేను అడ్డు చెప్పను కానీ, మరీ మ్యాటర్ విస్మరిస్తే, వోటర్ ఫీల్ అయ్యే అవకాశం మాత్రం బేషుగ్గా ఉంది. ఇప్పుడు మాటవరసకి వంటింట్లోంచి మీ శ్రీమతి ఏమండీ వంట గాస్ అయిపోయింది అంటే, మీరు చెయ్యాల్సింది ఏంటి ? గాస్ బుక్ చెయ్యడమా లేక కె.జీ బేసిన్ లో గాస్ నిల్వలు చెక్ చెయ్యడమా ? మన ప్రభుత్వాల పనీ ఇలానే ఉంది. ఓ.కే లెండి, ఏదో కాస్త అవకాశం దొరికి, ఈ నాలుగు లైన్లు రాసాను. మీలో ఎంతమందికి నా అక్షర ఘోషలు గుర్తున్నాయో తెలీదు, ఎవరైనా ఎప్పుడైనా పొరపాటునో, గ్రహపాటునో, వచ్చి ఏమిటి వీడు ఏమీ రాయడమే లేదు అని నొచ్చుకున్న సందర్భాలు ఉండి ఉంటే, మరి నేను క్షంతవ్యుణ్ణి, క్షమించేయండి. నెలకోసారి అయినా ఒక పోస్ట్ చేసేలా ఇంక కాస్త వేళ్ళు జార్త పెట్టుకుంటాను. మళ్ళీ మరో పోస్టులో కలుద్దాం.

2 comments:

  1. చాలా బాగుంది విజయ భాస్కర్ గారు.. You have the great ability to write with a dash of humour.

    ReplyDelete