Monday, February 16, 2015

బావుందనిపించే, పూరి మార్కు చిత్రం "టెంపర్"

ఈ మధ్య తెలుగు చిత్రాల్లో, దర్శకులేమో హీరోల్లా తమ మార్కు కోసం పరితపిస్తుంటే, హీరోలు దర్శకుల సినిమా ని తమ భుజాల మీద ఎత్తుకుని మోసుకెళ్తున్నారు. ఆ తరహా చిత్రమే టెంపర్ కూడా. నెలకి, నెలన్నరకీ కూడా కొత్త చిత్రం తీయగల పూరి జగన్, వొళ్ళు బాగా దగ్గర పెట్టుకుని తీసినట్టు అనిపించింది. మామోలంటే మామోలుగా ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియంది కాదు, చిత్రం ఓ 70 మార్కులు తెచ్చుకుంటే, మరో 30, ప్రేక్షకులే సులువుగా వేసేసి సంబరపడిపోతున్నారు, ఎందుకుంటే ఆ 70 తెచ్చుకునే సినిమాలే అరుదు అయిపోయాయి మరి. ఆ తోవలో చూస్తే, టెంపర్ మిమ్మల్ని ఆట్టే నిరాశ పెట్టదు.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, మా బుడ్డోడిని కూడా వెంట పెట్టుకుని, సతీ సమేతంగా నిన్న టెంపర్ ని ప్రోత్సహించాం. ఎక్కడంటారా, చెన్న పట్నంలో దేవీ సినీప్లెక్స్ అని చెప్పుకునే టూరింగ్ టాకీసు లో. అంత అభాండం ఎందుకు వేసానంటే, మా వాడు (ఇంకా రెండు నిండలేదు) పొరపాటున సీటు మీద నిలబడితే, వాడి బుర్ర కూడా మనకి ఎన్.టి.ఆర్ పక్కన స్క్రీన్ మీద అగుపడుతుంది. అంత బావుంది హాలు. మా వూర్లో జగదాంబ పేరుక్రిందే చలామణి అవుతున్న శారద, రమాదేవి థియేటర్స్ ని గుర్తిచేసింది ఈ దేవీ "బాల". ఓ.కే లెండి, మౌంట్ రోడ్ లో థియేటర్స్ ని నిర్వహించడమే గొప్ప విషయం, పార్కింగ్ కి ఇచ్చుకున్నా సంపాదన ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. ;-) కాబట్టి, ఆ విషయాన్ని మనం వీజీగా క్షమించేయచ్చు.
ఇంక చిత్రం విషయానికి వస్తే, పూరి, ఎన్.టి.ఆర్ చిత్రం అంటేనే ఎందుకో నేను పెద్దగా ఆశావహ దృక్పథం తో వెళ్ళలేదు. దర్శకుడు నాకు తెలిసిందే ప్రపంచం అని మరీ బలుపు తో సినిమా లో చూపిస్తే కొంచం విసుగు వస్తుంది. కానీ మనలో మన మాట, విలన్ ని వెర్రి వెంగళప్పను చేసే శ్రీను వైట్ల కంటే ఇదే నయం లెండి. తెలుగు సినిమా కథని ఇదీ అని రాయడానికి పూనుకోవడం, మైసూర్ బజ్జి లో మైసూర్ ని వర్ణించడం లాంటిది, ప్రయత్నిస్తాను. అనాధ గా పెరిగి, డబ్బు సంపాదించడానికి బావుంటుంది అని పోలీసు అయిన హీరో, విలన్ గాంగు కి తన వంతు సాయాలు చేస్తూ, హ్యాపీ గా ఉంటాడు. హీరోయిను తారసపడ్డం వరకూ క్లియర్ గానే ఉన్నా, ప్రేమలో ఎప్పుడు పడ్డాడో తెలీలేదు కానీ, "ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్" అని ఆక్రోశిస్తాడు ఓ ఫైట్ సీన్ లో. ఆ గర్ల్ ఫ్రెండ్ కాజల్, ఓ కోర రాని కోర్కె కోరడమూ.. ఆ పిల్ల కోసం మరో పిల్లని హీరో కాపడ్డమూ, ఆ తదుపరి పర్యవసానాల వల్ల హీరో మారిపోయి, విలన్లని అంతమొందించడమూ, సమాజాన్ని ఉధ్ధరించడమూ వగైరా వగైరా.
ప్రధమార్థం రొటీనే, పూరి యాస/శ్వాస కనిపించినా, వినోదాత్మకంగానే ఉంది. సెకెండ్ హాఫ్ మాత్రం సీరీయస్ గానే తీసాడు. బిజినెస్ మ్యాన్ లాంటి చిత్రాలతో పోలిస్తే, కొంచం సిన్సియర్ గానే ప్రయత్నించాడు అనిపించింది. సినిమా చివర్లో కోర్ట్ సీన్లు బాగా పండాయి, బహుశా కొంత క్రెడిట్ రచయిత వక్కంతం వంశీ కి ఇవ్వాలేమో. ఎన్.టి.ఆర్ గురించి చెప్పడానికి ఏముంది, ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఎన్.టి.ఆర్ కు ఉన్న ఈజ్ అద్భుతమైనది. దర్శకుడు అనుకున్న ఎమోషన్, సమపాళ్ళలో స్క్రీన్ మీద క్యారీ చెయ్యగలిగాడు. కథనంలో అంత కన్విక్షన్ లేకపోయినా, ఎన్.టి.ఆర్ నటనతో మనకు ఆ లోపం పెద్దగా కనిపించదు. కొన్ని మామోలు సన్నివేశాలని కథలో అబ్సార్బ్ చేసుకున్న తీరు చాలా బావుంది. తనదైన శైలి నటనతో ఎప్పటిలానే పోసాని ఆకట్టుకుంటాడు. కొన్ని డైలాగ్స్ లో మనకి పాత్రలకంటే పూరి జగనే కనిపిస్తాడు, ఇది మనకి అలవాటే. సమాజం లో నెగిటివిటీ ని ఆకర్షణీయంగా, రొమాంటిసైజ్ చేసి చూపించే దర్శకులు, అంటే, ముఖ్యంగా వర్మ స్కూల్ వాళ్ళు, మంచిని చూపించే సీన్లల్లో ఎందుకనో తేలిపోతారు. ఆ కొరతను ఈ సినిమా లో జగన్ అధిగమించాడు కొంతవరకూ. ఇంకా లోతుగా వెళ్ళొచ్చేమో, కానీ అప్పుడు సినిమా కమర్షియల్ గా ఆడకపోవచ్చు. ఆ మధ్య ఎప్పుడో ఓ చిన్న వెలుగు వెలిగి తరువాత అరకొర పాత్రలకు పరిమితం అయిన సోనియా అగర్వాల్ ని ఈ చిత్రం లో ఎందుకు ఇరికించాడో పూరి కే తెలియాలి. ఇంకాస్త నటన, డవిలాగులు వచ్చిన నటి ఎవరు చేసినా ఆ పాత్ర మనకి కనిపించేది. పూరి అన్ని సినిమాల్లానే ఈ సినిమా లో కూడా నాకు విసుగొచ్చే అంశం లైటింగ్/సెట్స్, కొన్ని సన్నివేశాలు రియాలిటీ కి దగ్గరగా తీస్తేనే ఆకట్టుకుంటాయి, ఈ విషయంలో మన దర్శకులు తమిళ దర్శకులు నుంచి నేర్చుకోవల్సింది చాలానే ఉంది.
మిగతా విషయాలకి వస్తే, పాటలు ఆవరేజ్ గా ఉన్నాయి, ఎక్కువ సార్లు వింటే ఏమైన నచ్చుతాయేమో తెలీదు. కథని సమకూర్చిన వంశీని ప్రశంసించాలి, రొటీన్ మాఫియా కథలు కాకుండా ఇలాంటి అంశాన్ని ఎంచుకోవడం ఆహ్వానించదగ్గ అంశం. పోసాని - ఎన్.టి.ఆర్ మధ్య సంభాషణలు చాలా బాగా వచ్చాయి. ఎన్.టి.ఆర్/పూరి ఫాన్స్ తప్పక చూడచ్చు, నాలాంటి సగటు ప్రేక్షకులు చూస్తే వచ్చే నష్టమేమీ లేదు, అలా అని మరీ బ్లాకు లో గట్రా కొనుక్కుని వెళ్ళక్కర్లేదు, నాలుగు రోజుల తరువాత చూడండి.
సినిమాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న హీరోలు అకస్మాత్తుగా మారిపోయినట్టు, సమాజంలో కూడా జరిగితే బావుణ్ణు, కాజల్ అగర్వాళ్ళు ఇంకా చాలా మంది కావాలేమో మరి..
(ఇది చిత్ర సమీక్ష కాదు, కేవలం నా స్పందన, మీకు మరోలా అనిపించే అవకాశం పుష్కళంగా ఉంది)

1 comment:

  1. Well said. I felt the same but Climax is very ROUTINE, should be something surprising, but pre-Climax is really surprising and NTR is really good.

    ReplyDelete