Tuesday, March 17, 2015

ప్రేమ పరీక్షలు ??


శీర్షిక చూసి అదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ అనుకునేరు, అలాంటిదేం కాదు. ఉదయం కాఫీ తాగుతున్నప్పుడు, కంటికి కనిపించిన వార్త చదివేయడమే తప్ప, అది మనకి అవసరమా కాదా అని ఆలోచించే అలవాటు నాకు బొత్తిగా లేదు. అలానే ఈ రోజు ఈనాడు లో ఓ కధనం చదివా.. అదేదో దేశం లో శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి, ప్రేమ లో ఉన్న వాళ్ళ మెదడులో అవేవో భాగాలు బాగా చురుగ్గా ఉన్నాయి అని నిర్ధారించారంట. చెప్పకనే చెప్పిన విషయం ఏంటంటే, అంత పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతే తప్ప మన మెదడులో ఆ ప్రాంతాల్లో అంత చైతన్యం ఉండదంట.

ఇంతవరకూ బానే ఉంది, పేపర్ అన్న తరువాత ఏవేవో రాస్తుంటారు, కాఫీ తాగితే కేన్సర్ వస్తుంది అని ఒకసారి రాస్తే, తాగకపోతే గుండెపోటే గతి అని మరోసారి సెలవిస్తారు. మనం పెద్దగా సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే చావంటూ డోర్ బెల్లు కొట్టాక, మనం తొక్కలో ఫిల్టర్ కాఫీ తాగామా అని అడుగుతుందా పాడా. కానీ ఇప్పుడు పెనుభూతం లాంటి నా అనుమానం ఏంటంటే, రేప్పొద్దున్న ఏ అభాగ్యుడో తెలుసో, తెలీకో "ఐ లవ్ యూ" అని ఓ బ్యూటిఫుల్ యంగ్ గాళ్ దగ్గర కుండ బద్దలు కొట్టినప్పుడు, ఆ ఫ్యూచర్ ప్రేయసి, సైకిల్ గాప్ లో డాట్టారు అవతారం ఎత్తి, ఫలనా స్కాన్ సెంటర్ కి పోయి, ఈ ఈ ప్రేమ పరీక్షలు అన్నీ చేయించుకుని, రెండ్రోజుల తరువాత రిపోర్ట్స్ తో కనపడు అని సాగనంపితే మన వాడి పరిస్థితి ఏంటి.. అసలు ఏంటి అని నా గాభరా, కంగారు. ఇంకా బోలుడన్ని.

జీవితం అంటే జీవించడం అని.. ప్రేమ అంటే ప్రేమించడం అని, ఇలా అర్థం కానట్టుగా నిర్వచించుకోవాలే కానీ, ఇలా టెస్టులు గట్రా చేసుకోవాలంటే చస్తామా. ఇప్పుడు మాట విసురుకి, ఏ భార్యామణికో భర్తా రావు మీద రవ్వంత డవుట్ వచ్చి, అదేదో దిక్కుమాలిన డైలీ సీరియల్ దయవల్ల, అది కాస్తా డవుటున్నర అయ్యి, ఏకంగా ఆ MRI మెషీను ఏదో ఇంట్లో కొని పడేస్తే, ఆ భర్తగాడిని పగ వాడైనా పలకరించగలడా.. ప్రేమంటే ఏమైనా బౌండరీ లైను దగ్గర పట్టిన కాచా. థర్డ్ ఎంపైర్ కి స్టైలుగా ఇచ్చి, తేల్చమనడానికి. అయినా తరతరాలుగా ప్రేమికులు తమ హృదయాల్ని.. గుండెల్ని.. మనసుల్ని... కోసుకుని.. కాచుకునీ ప్రేమిస్తే.. ఇప్పుడు వాడెవడో వచ్చి అవన్నీ కాదంటూ, బుర్ర లో స్కాన్ చేస్తాననడం ఎంతవరకూ సమంజసం అని నేను సభాముఖంగా నిలదీసేస్తున్నాను. అదేదో సినిమాలో గాలి కనిపిస్తోందా అని AVS అన్నట్టుంది ఈ వ్యవహారం. పోనీ లోకల్ ప్రేమ గాళ్ళం మన సంగతి ప్రక్కన పెట్టండి, మన గ్లోబల్ ప్రేమ మూర్తులు అంటే, సెలబ్రిటీలు.. స్టార్లు.. గురువులు.. నాయకులు.. వాళ్ళ పరిస్థితి చూడండి ఇంక. ఓటరు మహాశయుడు, నన్ను ప్రేమించినట్టు నిరూపించుకో అప్పుడే ఓటు అంటే, డిపాజిట్లు దక్కేనా.

అయినా, చదివామా.. మరచిపోయామా అన్నట్టుండాలి.. నాకెందుకొచ్చిన ప్రేమ గోల చెప్పండి. సగం జీవితం అయిపోయినట్టే ఉంది, గట్టిగా "ఐ లవ్యూ" అని చెప్తే, మా ఆవిడ తను ఇచ్చింది కాఫీయేనా అని డవుటు పడుతుంది, అందుకని మనకి పెద్దగా వచ్చేదీ పోయేదీ ఏమీ లేదు. ఏదో సమాజం గురించే మరి ఈ వేదన. మా బుడ్డోడు పెద్దోడు అయ్యేసరికి ఇలాంటివి ఇంకెన్ని వస్తాయో ఏంటో, ఎదగడానికి ఎందుకురా తొందర అని ఊరకనే అన్నారా..

No comments:

Post a Comment