Monday, April 6, 2015

నూరు సంచికల "కౌముది"ఏప్రిల్ నెల సంచికతో "కౌముది" సెంచరీ మైలు రాయి దాటేసింది దిగ్విజయంగా. నెల నెలా తెలుగు సాహితీ వెన్నెలని విరజిమ్ముతూ, ఎన్నో ఖండాంతరాలను పలకరించి, పులకరింప చేసిన మన కౌముది మరెన్నో మైలు రాళ్ళు దాటాలని మనసారా కోరుకుంటున్నాను.

కొన్నేళ్ళ క్రితం, ఓ రోజు అంతర్జాలం లో తెలుగు వెలుగు ఎక్కడైనా కనిపిస్తుందా అని వెతుకుతుంటే దర్శనమిచ్చింది కౌముది. ఆ క్షణం నా అనుభూతి నాకు ఇంకా స్పష్టం గా గుర్తుంది, స్వీట్ షాప్ లో చిక్కుకుపోయిన కుర్రాడి పరిస్థితి అది. బహుశా అప్పటికి కౌముది ప్రారంభించి ఒకటి రెండు యేళ్ళు అయ్యుంటుంది. వెంటనే నేను చేసిన పని, ఆ పత్రిక ఎడిటర్ కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మైల్ పంపడం. అప్పటినుంచీ కౌముది ని రెగ్యులర్ గా ఫాలో అవుతూనే ఉన్నాను. గొల్లపూడి మారుతీ రావు గారి వ్యాసాలు, వంగూరి చిట్టెన్ రాజు గారు మరియు ఢొక్కా ఫణి గారు రాసే సరదా కబుర్లు, కథలు, కవితలు, పరిచయాలు, అభిప్రాయాలు.. ఎన్నో, నాకు నచ్చేవి. తెలుగు లో నాలుగు లైన్లు టైప్ చెయ్యడం ఎంత ప్రయాసో మనకి తెలియంది కాదు, ఇంతటి సంచిక ప్రతీ నెలా క్రమం తప్పక అచ్చ తెలుగు లో ఎలా కొలువు తీరుతోందో కిరణ్ ప్రభ గారికే తెలియాలి.

కేవలం భాష మీద ఉన్న మక్కువతో ఇంతటి పరిశ్రమని ఏళ్ళ తరబడి నిర్విరామంగా కొనసాగిస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. నాలా ఎప్పుడైనా నాలుగు ముక్కలు రాసే రచయితలకు ఎంత గొప్ప అవకాశం. ఎందరో ప్రఖ్యాత రచయితల పేర్ల మధ్య మన పేరూ కనిపించడం, ఎంతటి ప్రోత్సాహం. మరీ ముఖ్యం గా కిరణ్ ప్రభ గారి లో నేను ఎంతగానో నచ్చుకొనే విషయం, ఆయన స్పందించే తీరు. మీరు ఎప్పుడు మైల్ చెయ్యండి, ఒక రోజులో ఖచ్చితం గా ఆయన బదులిస్తారు. బ్లాగు లో కాకుండా బయట ప్రచురణకు పంపుదాం అని ఆలోచన వస్తే, నాకు తట్టే ఒకే పేరు, కౌముది. కిరణ్ ప్రభ గారి అభిప్రాయాలకు పరిమితం చెయ్యకుండా, పత్రికకే ఒక వ్యక్తిత్వం నిలబెట్టారు ఆయన, అందుకే కౌముది అందరి మన్ననలు పొందుతూ కొనసాగుతోంది.

ఎప్పుడో దశాబ్ధాల క్రితం కిరణ్ ప్రభ గారు ఆంధ్ర విశ్వ విద్యాలయం లో చదువుకునే రొజుల్లో, నిర్వహించిన రాత పత్రిక పేరు కూడా "కౌముది", ఇది యాధృచ్చికం కాదు లెండి.

మంచి ఆలోచన రావడం, అది కార్య రూపం దాల్చడం, అందరి మనసుల్నీ ఆకర్షించడం వరకూ ఒక ఎత్తు, అది అదే స్థాయిలో దినదిన ప్రవర్థమానమౌతూ యేళ్ళ తరబడి కొనసాగడం ఒక అద్భుతం. అందులోనూ, ఏ విధమైన ఫార్మల్ ఆర్గనైజేషన్ లేకుండా, కేవలం ఆసక్తి, నిబద్దత మరియు శ్రమ ఆయుధాలుగా..

ఈ అక్షర యజ్ఞం వెనుక అన్నీ తామై నడిపిస్తున్న కిరణ్ ప్రభ దంపతులకు మరొక్కసారి హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు.

No comments:

Post a Comment