Friday, April 10, 2015

ఇవేం CAPTCHA లు, నా మొహం (IRCTC వింతలు)


విషయం లోకి వెళ్ళేముందు చిన్న ఉపోద్ఘాతం ఇస్తాను. ఫాథర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ గా చెప్పుకోదగిన శాస్త్రజ్ఞుడు అలెన్ ట్యూరింగ్. ఆయన దశాబ్ధాల క్రితం ఒక చిన్న పరీక్షను ప్రతిపాదించాడు, దాని ముఖ్యోద్దేశం కంప్యూటర్ ని ఇంటెలిజెంట్ అని ఎప్పుడు అనచ్చు అని. మరీ లోతుల్లోకి వెళ్ళకుండా క్లుప్తం గా చెప్పుకుంటే, ట్యూరింగ్ ఏమన్నాడంటే, ఏ రోజు అయితే ఒక మనిషి తను నేరుగా చూడకుండా చేస్తున్న రెండు సంభాషణల్లో, ఏది కంప్యూటర్ తో, ఏది మనిషితో అని నిర్ధారణకు రాలేకపోతాడో, ఆ రోజు మనం ఆ కంప్యూటర్ ని తెలివైంది అని ప్రకటించచ్చు అన్నాడు. అంటే ఒక యంత్రం మనిషిలా పూర్తిగా ఇమిటేట్ చెయ్యగల్గిన నాడు అన్నమాట. (దీన్నే ఇమిటేషన్ గేం అని కూడా అంటారు) ఈ పరీక్ష ట్యూరింగ్ టెస్ట్ గా స్థిరపడింది.

యంత్రం తెలివి గురించి మరోసారి చర్చిద్దాం కానీ, ఇప్పుడు చాలా వెబ్ సైట్స్ కి వచ్చిన చిక్కు సరిగ్గా ఇలాంటిదే, తమ సైట్ ను వాడుతున్నది మనుషులా లేక, ఆటోమేటెడ్ ప్రోగ్రాం లా అని. ఈ వ్యత్యాసం వెబ్ సైట్లకు ముఖ్యమైనది. ఎందుకంటే  ఆటోమేటెడ్ ప్రోగ్రాం ల వల్ల వచ్చే తలనొప్పులు అనేకం. అందుకని సరిగ్గా మనం చెప్పుకున్న ట్యూరింగ్ టెస్ట్ కి ఆపోజిట్ టెస్ట్ ను వెబ్ సైట్లు వాడతాయి. అంటే ఒక మనిషి నేను యంత్రాన్ని కాదు మహా ప్రభో అని నిరూపించుకోవడం. ఇందుకు గానూ, మనిషికే తేలిక అయినవి, యంత్రాలకు సంక్లిష్టమైన ప్రశ్నలు పోర్టల్స్ లో పెట్టడం మనం చూస్తున్నాం. దీనికి వాడుక పేరు CAPTCHA (Completely Automated Public Turing test to tell Computers and Humans Apart).


వెబ్ లో పలు విధాలైన CAPTCHA లను చూసాను కానీ, మన IRCTC సైట్ లో వాడే అంత భయంకరమైనవి, మానావాతీతమైనవి ఎక్కడా చూడలేదు. ఏ తత్కాల్ టికెట్టు బుక్ చేద్దామనో, లేక ఆఖరి నిమషంలో టికెట్టు ప్రింట్ తీసుకుందామనో సైటు ఓపెన్ చేస్తే, ఒరేయ్ అబ్బాయి నువ్వు మనిషివా లేక యంత్రనివా నిరూపించికో అని ఒక దిక్కుమాలిన బొమ్మ వదుల్తుంది, అందులో అక్షరాలు రకరకాల విన్యాసాలు చేస్తూ, శ్రీనూ వైట్ల కధలా, అర్థం అయ్యీ, అవ్వకా మన బుర్ర ని ఫుల్ గా కంఫ్యూజన్ లో పడేస్తాయి. ఇందులో ఇందులో మనకో అదనపు సౌకర్యం CAPTCHA లు కేస్ సెన్సిటివ్ కూడాను. రెండు కేసుల్లోనూ ఒకేలా ఏడిచే అక్షరాలు వస్తే ఇంక మన బ్రతుకు బస్టాండే, కాదు కాదు ప్లాట్ ఫామే. నాకు తెలిసి, నేను మనిషినే అయినా, వాళ్ళ దృష్టిలో మానవమాత్రుడిగా రుజువు చేసుకునే అవకాశం ఉన్న బొమ్మ వచ్చే వరకూ, రిఫ్రెష్ కొట్టడం తప్ప మనకి మరో గత్యంతరం లేదు. ఈ లోగా మీ ఆవిడ ఫోన్ లో, ఏమండీ టికెట్టు బుక్ చేసారా లేదా అని నిలదీస్తే, ఇంక మీ పరిస్థితి ఆస్ట్రేలియా వాడికి కూడా వద్దే వద్దు.

ఏ హ్యాకర్ గాడో, లేక వాడి కజినో, ఏవో ప్రోగ్రాంస్ తో మన అతివిలువైన IRCTC సైట్ ని పాడుచేస్తారనే భయం ఉంటే ఉండచ్చు, నేను కాదనను, కానీ అందుకని ప్రతీ యూజర్ ని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకూ సమంజసం ?. రేపో మాపో ఈ-టికెట్టు కొన్నవాళ్ళు మనుషులే అని రైలు ప్రయాణం లో కూడా నిరూపించుకోమంటారేమో, నాకు తెలిసి యంత్రాలు టాయిలెట్లను వాడవు మరి.

రైళ్ళను ఉద్ధరిస్తామంటున్న, మోడీ గారో, లేక ఫలనా మంత్రి గారో ఓ సారి ఆన్-లైన్ లో తత్కాల్ టికెట్టు కొని తరిస్తే మన అవస్థ తెలుస్తుంది. లేక వాళ్ళు మనుషులు కాదని అయినా తేలిపోతుంది. ;-)

మచ్చుకు మీరు నొచ్చుకునే IRCTC CAPTRCHA లు కొన్ని..

 

1 comment:

  1. chala bavundi bhaskaru garu , mee style vyangyam to kudina hasyam .

    ReplyDelete