Tuesday, December 1, 2015

సుకుమారి 21F

మొన్న వారాంతంలో సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే ఇచ్చి నిర్మింప చేసిన కుమారి 21F చూసాను. ఈ మధ్య కాలం లో ఇంత డివైడడ్ టాక్ ఎక్కడా వినలేదు. కొందరు ఓహో సూపర్ అంటే, మరికొందరు చీ, థూ అని.

సినిమా కి పెద్దగా అంచనాలతో వెళ్ళలేదు నేను. ఇంటెర్వల్ ఫీలింగ్ అయితే, ఏముంది ఈ సినిమా లో ఓ నాలుగు పెద్దల సన్నివేశాలు తప్ప అనిపించింది. కానీ చివర్లో కొన్ని సీన్లు బానే వచ్చాయి. ఏదో చెప్పాలనుకున్నాడు అని మాత్రం అనిపించింది. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడే ఒక ఇంప్రెషన్ ని మిగులుస్తాయి, మరికొన్ని ఇంటికొచ్చాక.. ఇంకొన్ని మళ్ళీ మళ్ళీ చూసాక.. కానీ ఈ సినిమా విషయం లో నేను ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాను, చూసి నాలుగు రోజులు అవుతున్నా, బావుందా లేదా అని తేల్చుకోలేని స్థితి.

వాళ్ళు తీద్దామనుకున్నది, ముఖ్యం గా సుకుమార్ బుర్రలో ఉన్నది, స్క్రీన్ మీదకు చాలా మటుకు వచ్చిందనే చెప్పాలి. దీనికి కొంత మనం దర్శకుడిని, మరియు కేమెరా మాన్ రత్నవేలు ని అభినందించాలి. కథ ఆ మధ్య వచ్చిన ఫ్రెంచ్ సినిమా (Lila dit ça) కి కాపీ లానే ఉంది. హక్కులు తీసుకుని వాడుకుంటే ఇంకా బావుండేది. ఈ విషయం లో మనకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ, కొన్ని కథలు చిన్న నిడివితోనే బావుంటాయి. మరీ సాగదీస్తే అనవసరపు విషయం ఎక్కువ అయ్యి, అసలు మరుగున పడుతుంది. ఈ చిత్రం విషయం లో కూడా కొంత ఆ ప్రభావం కనిపిస్తుంది. “A” సర్టిఫికేట్ కోసమే తపన పడి కొన్ని సన్నివేశాలు తీసారేమో అనిపించింది. మెచ్చుకోదగ్గ అంశం, కథలో అవకాశం ఉన్నా అసభ్యతకు తావు ఇవ్వలేదు. ద్వంద్వార్ధాలు లేవు, అన్నీ డైరెక్ట్ మాటలే.

హీరోయిన్ పాత్రనే నమ్ముకున్న సినిమా ఇది. మిగతా రోల్స్ కేవలం పేరుకే. హీబా పటేల్ తన పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి. డబ్బింగ్, లిప్ సింక్ వగైరాలు కొంచం మెరుగ్గా ఉండి ఉంటే ఇంకా బావుండేదేమో. హీరో రాజ్ తరుణ్ తో పెద్ద ఇబ్బందేం లేదు. ముఖ్యమైన సంభాషణల్లో అరవకుండా, మాట్లాడ్డం నేర్చుకుంటే మనకు సులువు గా ఉంటుంది.

గుర్తించదగ్గ మరో అంశం, నెగిటివ్ కారెక్టర్ వేసిన నోయెల్ ది. తన పరిధిలో బాగా నటించాడు. కొన్ని మాటలు, చేతలు కొత్తగా ఉన్నాయి.

ఈ సినిమా ని సుకుమారే దర్శకత్వం వహించి వుంటే ఇంకా మెరుగైన ఫలితం వచ్చేదేమో. ఒక ఆబ్స్ ట్రాక్ట్ పెయింటింగ్ ని బాగా దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తోంది నాకు ఇప్పుడు. దూరం నుంచి చూస్తే నచ్చేదేమో.. లేక అది మామోలు పెయింటింగ్ అయితే అర్థం అయ్యేదేమో..

సినిమా చెత్తలా లేకుంటే చాలు నెత్తి మీద పెట్టుకునే పరిస్థితి లో ఉన్నాం కనుక, ఈ చిత్రం విజయం సాధించడం లో ఆశ్చర్యం ఏమీ లేదు.

No comments:

Post a Comment