Saturday, January 9, 2016

నేను, నేను శైలజ..


చాలా యేళ్ళ క్రితం నిన్నే పెళ్ళాడుతా చిత్రం చూసి, ఇదేం అంత గొప్ప సినిమా కాదే అని నిట్టూరుస్తుంటే, నలుగురూ మొత్తబోయారు. అప్పట్లో అదో కళా ఖండం మరి. ఓ సాయంత్రం కాఫీ తాగుతూ, ఆ చిత్రం గురించి నాలానే ఫీల్ అయిన మా శారద పిన్ని ఏం తేల్చారంటే, మనలోనే లోపముంది అని.. జనాలకి అలా తీస్తేనే నచ్చుతున్నాయనీ..మరి అందరూ అలా నచ్చుకుని మెచ్చుకున్న చిత్రం, నాకు మాదిరిగానే రుచించడాన్ని నేను నచ్చుకోలేకపోయాను. ఏంచేస్తాం. 

ఇన్నేళ్ళ తరువాత సరిగ్గా మళ్ళీ అలానే అనిపించింది నేను శైలజ చూసాక..బోలుడంత వ్యయ ప్రయాసలకు ఓర్చి.. చెన్నై మహా నగరానికంటే మహాబలిపురానికే కాస్త దగ్గరగా అనిపించే మాయాజాల్ లో సినిమా చూస్తే, ఏముంది దాంట్లో.. నాకైతే ఏమీ కనిపించలేదు. మనసంతా నువ్వే సినిమాలోంచి మనసు తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. చెత్తలా ఉంది అనను.. కానీ మరీ గొప్పగా చెప్పుకోడానికి మాత్రం ఏమీ లేదు. చూసి వారమే అయ్యింది కానీ, గుర్తుకు తెచ్చుకుందామంటే ఏ సన్నివేశం గుర్తు రావడం లేదు, రామ్ తనవంతు బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ తప్ప. 

ఆ మధ్య వచ్చిన సోలో, ఖచ్చితం గా ఇంతకంటే మెరుగైన సినిమా.  ఇంత పాజిటివ్ గా (TV5 మినహా) టాక్ రావడానికి కారణాలు ఏమిటో మరి తెలియలేదు. వెబ్ సైట్ల సమీక్షల క్రింద కామెంట్స్ చూస్తే, నేనూ అదే సినిమా చూసానా, లేక చెన్నై లో వేరే సరుకు ఏమైనా వదిలారా అనిపిస్తోంది. ఎంత తెలుగు సినిమాలు నాసిరకం గా ఉంటున్నా, మరీ మన అంచనాలు ఇంత క్రిందకి దిగిపోయాయా. ? మమ్మల్ని చూడ్డానికి చెన్నై వచ్చిన పాపానికి మాతో పాటు సినిమా చూసిన మా అన్నయ్యకి ఫోన్ చేసి నా గోడు వెళ్ళబోసుకుంటే.. తను తేల్చిందీ మళ్ళీ అదే.. మనదే తప్పు అని.. ఇప్పుడు ట్రెండు, బెండు ఇదేనని. 

ప్రస్తుత తెలుగు సినిమాలు చూసి అందరిలాగే హ్యాపీ గా ఎంజాయ్ చెయ్యడానికి ఎవరైనా ట్రైనింగులు వగైరాలు ఏమైనా ఇస్తున్నారేమో కనుక్కోవాలి.. లేకపోతే ఇంకా బేషుగ్గా పాత సినిమాలనే కొత్త టీవీ లో చూసుకుని మురిసిపోవాలి.

3 comments:

  1. Many of recent films are made for Volvo bus usage.These movies can be watched along with sleep or can be skipped fully. Except 2 songs by DSP I did not find anything interesting

    ReplyDelete
  2. ఎంతసేపూ వెర్రిప్రేమ, గంగవెర్రులెత్తినట్లు పిచ్చిగంతులు, దోసకాయ సాహిత్యంతో పెడబొబ్బలు పెట్టే పాటలు- పనికిమాలిన సినిమాలు తీస్తున్నారు.

    ReplyDelete
  3. We watched the movie with family and we all liked the movie. The best thing it doesn't have any volgur comedy or too much bloody violence.. Its running successfully here in USA..

    ReplyDelete