Tuesday, May 23, 2017

నేను లేని నిజమైన నే ఎక్కడ ?

అర్థం కాని మాటలు ఎందుకు నాచే కన్నీళ్ళు పెట్టిస్తాయి.
అక్కరే లేని అనుభవాలు ఎందుకు జ్ఞాపకాలై వెంటాడుతాయి..
ఏ దూరం తగ్గించని దారులు..
ఏ గమ్యం చేర్చని దూరాలు..
ఎందుకు నేను ఇంకా ఇంకిపోతున్నా..
నాలోకే.. లేని నా లోకే..

గట్టు ఆవలి సంగతులు ఎందుకు
నన్ను పలకరించవు ?
నేను లేని కలల్లాగ..
నేను చెప్పని గతం లాగ..

నిన్ను నన్నూ.. అందరినీ..
అంతాన్నీ.. ఇముడ్చుకున్న శూన్యం ఎక్కడ ?
నేను లోని నే ఎక్కడ ?
నేను లేని నిజమైన నే ఎక్కడ ?

Friday, May 5, 2017

"ఐ"

(శ్రీ శ్రీ "ఐ" చదివిన ఆవేశంలో..)

గుండె వెలుతుర్లో జ్ఞాపకాలు పోగేస్తూ..
వంతెన లేని తీరాలను ఊహల్లో దాటేస్తూ.
ఇంతటి అంతటి విశ్వంలో ఓ అణువునై.. పరమాణువునై..
ఆ నాలోనే ఓ విశ్వాన్ని మోస్తూ.
ఐ.
నిన్నతో ఆగక.. నేటితో అలవక..
రేపుని తెలీని క్షణాలతో నిర్మిస్తూ..
నిరీక్షిస్తూ.
ఐ.